"రెండో అపరాధమేమిటి?" అన్నాడు సత్యజిత్ ఉదాసీనంగా.
"మా ఇంటి దగ్గరికి రావడం, నువ్వు ఎట్టి పరిస్థితులలోనూ మా ఇంటి ఛాయలకి రాకూడదని చెప్పాను. అలా చేస్తే పెద్ద సెక్యూరిటీ రిస్కు. ఇలాంటి చిన్న చిన్న విషయాలలోనే పెద్ద పెద్ద రహస్యాలు ఎప్పుడూ బయటపడిపోయేది."
"నేను మామూలు పరిస్థితులలో వచ్చేవాడిని కాను, కానీ మా చెల్లెలు మీ ఇంట్లోకి వెళ్ళింది, చాలా అనుమానాస్పదమైన పరిస్థితులలో."
"ఎలా తెలుసు నీకు?"
అతని ప్రశ్నకు సమాధానంలాగా, "భౌభౌ" అని చిన్నగా మొరుగు వినబడింది.
ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. కుక్కపిల్ల స్క్వీకీ, వెనక సీట్లో కూర్చుని వుంది.
"ఇది స్క్వీకీ: మా చెల్లెలి పెంపుడు కుక్క: నేను ఇంటికెళ్ళేసరికి వినీల లేదు. తలుపులు బార్లా తెరిచి వున్నాయి. స్టౌ మీద వంటకాలు మాడిపోయి వున్నాయి. అప్పుడు స్క్వీకీ వచ్చి అరుస్తూ నన్ను లాక్కెళ్ళడం మొదలెట్టింది. దాన్ని అనుసరించి వచ్చాను. అది తిన్నగా మీ ఇంటి దగ్గరికి దారి తీసింది." అన్నాడు సత్యజిత్.
"ఐసీ:" అన్నాడు ప్రతాప్ ఏమీ తెలియనట్లు. "అయితే ఆమె సంగతి నాకు వదిలెయ్ నేనిప్పుడు ఇంటికి వెళతాను. నీ చెల్లెలకి ఏ హానీ జరగకుండా చూసే పూచీ నాది. బట్, ఫర్ హెవెన్స్ సేక్, ఇంకెప్పుడూ మా ఇంటి దగ్గరికి రావద్దు అలా జరిగితే, నేను ఇన్నాళ్ళు ఎంతో జాగ్రత్తగా కాపాడుకు వస్తున్న నా పిచ్చివాడి ఐడెంటిటీ బయటపడిపోయే ఆస్కారం ఉంది. సత్యజిత్: ట్రీట్ దిస్ యాజ్ యాన్ ఆర్డర్:"
"యస్సర్:" అన్నాడు సత్యజిత్.
"కానీ, నా చెల్లెలు వినీలకు ఏదన్నా జరిగితే నేను భరించలేను. ఇన్నాళ్ళనుంచి నేను బతికింది వినీల కోసం: నా చెల్లెలు లేకపోతే నా బతుకుకి అర్థంలేదు. తనని పెంచి పెద్దచేసి, పెళ్ళిచేసి పంపాలనే ఆరాటంతోనే నేను అన్నిరకాల పనులూ చేశాను. ఇన్నాళ్ళకి, వినీలకి తగిన సంబంధం ఒకటి చూశాను. నేను శ్రమపడి కూడబెట్టిన డబ్బంతా పెట్టి, నా చెల్లెలుకి వచ్చే నెలలో ఘనంగా పెళ్ళి చేద్దామనుకున్నాను. అలాంటిది, ఇవాళ వినీల..." అతని గొంతు గాద్గదికమయింది.
ఆప్యాయంగా అతడి భుజాలమీద చెయ్యేశాడు ప్రతాప్.
"సత్యజిత్: సోదరప్రేమ అంటే ఎలా ఉంటుందో నీకే కాదు, నాకూ బాగా తెలుసు. నీకు ఉన్నట్లే నాకూ ఒక చెల్లెలు ఉన్నదనీ, అప్సర అంటే నాకు అంతులేని అభిమానమనీ మర్చిపోకు." అన్నాడు.
తర్వాత, నిర్జనంగా, చీకటిగా ఉన్న ఒక ప్రదేశంలో కారు ఆపి, దిగి వెళ్ళిపోయాడు ప్రతాప్.
వెళుతున్న ప్రతాప్ వైపే చూస్తూ ఉండిపోయాడు సత్యజిత్.
అంత కలవరంలోనూ అతనికి ప్రతాప్ అంటే అడ్మిరేషన్ కలిగింది.
మారువేషాలు వేయడంలో ఎంత ఘటికుడితను? క్షణాల్లో ముఖకవళికలతో సహా మొత్తం మార్చి పారేయగలడు. రియల్లీ ఫాంటాస్టిక్:
ప్రతాప్ మారువేషాలు చూడని వాళ్ళు ఆ సంగతి విన్నా నమ్మరేమో కూడా:
ప్రతాప్ కి విషయం చెప్పేశాడు గనక, ఇంక తన చెల్లెలు వినీల విషయంలో నిర్భయంగా ఉండవచ్చు తను.
ఇంతకీ వినీల బాబూజీ ఇంటికి ఎందుకు వెళ్ళిందీ?
ఆలోచనతో అతని భృకుటి ముడిపడింది. కొద్దిక్షణాల తర్వాత, స్క్వీకీ అరుపుతో ఆలోచనల్లో నుంచి బయటపడి, దాన్ని ఒళ్ళోకి తీసుకుని బుజ్జగించి, కారు ముందుకు పోనిచ్చాడు సత్యజిత్.
* * * *
మార్నింగ్ ఫ్లయిట్ లో పారడైట్ సిటీ చేరుకున్నాడు మెగా ఇండస్ట్రియలిస్టు బాబూ రాజేంద్రప్రసాద్. అతనికి మల్టీ నేషనల్ కంపెనీ, చాలా దేశాల్లో B&P కంపెనీకి బ్రాంచిలు ఉన్నాయి.
B&P కంపెనీనే కాక దానికి అనుబంధంగా చాలా కంపెనీలు స్థాపించాడు బాబూజీ. తన ప్రత్యర్థుల తాలూకు మరికొన్ని కంపెనీలని నయానా భయానా కొనేశాడు.
ఇండియాలో వ్యవహారాలన్నీ తనే స్వయంగా చూసుకుంటాడు. బాబూజీ. అతని బిజినెస్ మరో పెద్ద కేంద్రం హాంగ్ కాంగ్.
హాంగ్ కాంగ్ లో ఉంటుంది అతని కూతురు అప్సర. అక్కడి బిజినెస్ అంతా ఆమె చూసుకుంటుంది.
వెస్టర్న్ కంట్రీస్ లో తన వ్యవహారాలన్నీ కొన్నాళ్ళపాటు తన కొడుకు ప్రతాప్ చూశాడు.
తర్వాత అతనికి మతి చలించింది.
ఇప్పుడు వెస్టర్న్, ఈస్టర్న్ వ్యవహారాలన్నీ కూడా కూతురు అప్సర, కొడుకూ కూతురూ కూడా తనే అయి చూస్తోంది.
తన కంపెనీలోని టాప్ పొజిషన్స్ లో తనకి రక్తసంబంధీకులనీ, చాలా సన్నిహితులనీ తప్ప మరెవరినీ నియమించడు బాబూజీ.
అతను బొత్తిగా చదువుకోలేదు. ఇంత పెద్దవాడయిన తర్వాత యిప్పటికి కూడబలుక్కుని అక్షరాలు చదవడం, సంతకం పెట్టడం నేర్చుకున్నాడు బాబూజీ చిన్నప్పుడు తిండికి లేక మలమలమాడిన మనిషనీ, కడుపు చేత్తో పట్టుకొని జీవనోపాధికోసం బర్మా వెళ్ళాడనీ చాలామందికి తెలియదు. బర్మాలో బాగా కష్టపడ్డాడు బాబూజీ.. వళ్ళొంచి విశ్వాసంగా పనిచేయటంవల్ల యజమానుల మన్నన లభించింది. అతన్ని పెద్దపోస్ట్ లో వేశారు. చదువు రాకపోయినా వ్యాపారం అనే జూదంలో విశ్వాసం అనేది ట్రంప్ కార్డ్ లాంటిద ని తెలుసు బాబూజీకి.