Previous Page Next Page 
ఒకే రక్తం ఒకే మనుషులు పేజి 20


    
    ఒక్కక్షణంపాటు చెంపలు ఎర్రబడినట్లుగా అయి, అంతలోనే నల్లబడి పోయాయి.
    
    కష్టంమీద నిట్టూర్పు ఆపుకుని అంది. "జీవితంలోకి ప్రవేశిస్తున్నావన్న మాట."
    
    "అది పదహార్రోజుల క్రిందటే జరిగింది. ఇప్పుడు మరింత... మరింత...గాఢంగా" గిరిజ ఫక్కుమని నవ్వేసింది.
    
    కొన్ని నవ్వులు ఏడుపుకంటే విషాదంగా వుంటాయి. ఎర్రబడ్డ గిరిజకళ్ళు నవ్వినప్పుడు మెరుపులా వెలిగిన తెల్లటి పళ్ళు, వాటిలో గుండెల్ని కోసే విషాదమే గోచరించింది.
    
    గిరిజ ఎందుకు బాధపడుతుందో ఆమెకు అర్ధంకాలేదు. కారణం అడిగితే జవాబు వెంటనే రాదుగాని, తరిచి అడిగితే ఏమి వినాల్సివస్తుందోనని భయంగా వుంది.
    
    "గిరిజా! నే చదువు మానేస్తున్నాను" అంది టాపిక్ మారుస్తూ.
    
    "ఎందుకు?"
    
    "చదవాలనిపించటంలేదు. ఏ పని చెయ్యబోయినా ఏదో బాధగా శూన్యంలా వుంది. వెనకటి ఉత్సాహం వుండటంలేదు."
    
    "సరూ! భలే ఆశ్చర్యంకదూ?"
    
    ఈ ధోరణికి సరోజ ఉల్కిక్కిపడి, మళ్ళీ అంతలోనే సర్దుకుంది.
    
    "జీవితంలో కొన్నిరోజులు సరదాగా, అల్లరిగా గడిచిపోతాయి. ఏ చీకూ చింతా, దేన్నిగురించీ ఆలోచించాల్సిన అవసరం వుండదు. హఠాత్తుగా చిన్న మలుపు తిరుగుతుంది. అవటానికి చిన్నమలుపే కాని జీవిత గమనమే మారిపోయినట్లవుతుంది. మొయ్యలేనంత బరువుగా, దుర్భరంగా ఫీలవుతాం"
    
    ఎంతబాగా చెప్పింది అని నివ్వెరపోయింది సరోజ. జీవితాన్ని ఎంత చక్కగా స్టడీ చేసింది? తనకూ అంతే మునుపు ఏ దిగులూ, వేదనా వుండేది కాదు. ఇప్పుడు నిరంతరం గుండెల్లో ఏదో బరువు పెట్టినట్లుగా వుంటుంది. నిద్రపోతూంటే వున్నట్టుండి ఉలికిపడి లేస్తూ వుంటుంది. ఎంతమంది మధ్య వున్నా పిచ్చి ఒంటరితనం, భోరున ఏడ్చెయ్యాలని వుంటుంది.
    
    "కదూ!" అంది గిరిజ మళ్ళీ.
    
    "నాకంటే నువ్వు ఎదిగావు."
    
    "నేను బయటపడుతున్నాను. నువ్వు పడటంలేదు."
    
    "గిరిజా!"
    
    "అవును సరూ! నా మనస్తత్వం నాకే చిత్రంగా వుంది. ముందు ముందు నాకు నేను అర్ధమవుతానేమోగాని- ఇప్పుడంతా పిచ్చిపిచ్చిగా, గజిబిజిగా వుంది."
    
    స్నేహితురాళ్లిద్దరూ కాసేపలానే మాట్లాడుకున్నారు. సరోజ వెళ్ళటానికి లేచేసరికి గిరిజ సాగనంపటానికన్నట్లుగా మెట్లవరకు వచ్చింది.
    
    ఆమె వెనుదిరిగి గదిలోకి వెళుతూండగా ఎక్కడ్నుంచో విశ్వం వూడిపడ్డాడు.
    
    "అత్తయ్యా!"
    
    గిరిజ ఆగి "ఏరా?' అంది.
    
    "మరే! ఒక సంగతి అడగనా?"
    
    వాడికళ్ళలో సకోచం చూసేసరికి ఏదో పెద్దప్రశ్న అడగబోతున్నట్లు బోధపడిందామెకు.
    
    "ఏమిట్రా?"
    
    "మరే! నీకీవేళ కార్యమంటగదా?"
    
    ఒక్కసారిగా కోపమూ వచ్చింది. అంతలో నవ్వూ వచ్చింది.
    
    "అవునయితే?" అంది సీరియస్ గా వుండటానికి ప్రయత్నిస్తూ.
    
    "అహ! ఏంలేదు" అని కొంచెం దగ్గరకొచ్చి గొంతు తగ్గించి "కార్యమంటే ఏమిటత్తయ్యా?" అనడిగాడు రహస్యం అడుగుతూన్నట్లు.
    
    "ఓరి భడవా!" అనుకుంది గిరిజ లోలోపల.
    
    బయటకు మాత్రం కోపం నటిస్తూ "తప్పు! అలాంటి మాటలు మాట్లాడకూడదు. వెళ్ళిక్కడ్నుంచీ" అని గద్దించింది.
    
    విశ్వం ఆమెవంక ఒకసారి బెదురుగా చూసి అక్కడ్నించి జారుకున్నాడు.
    
    ఆమె కొన్ని క్షణాలపాటు అక్కడే నిలబడింది. విస్సిగాడ్ని గురించి ఆలోచించింది. ఈ పిల్లాడు పుట్టినప్పటినుంచీ వెర్రిబాగులవాడే. అసలు చాలా కాలం మాటలూ, నడకా రాలేదు. తర్వాత మెల్లగా వచ్చాయిగాని వెర్రితనం మాత్రం పోలేదు.
    
    ఆలోచించగా- తమ వంశంలో అవలక్షణాలున్న వాళ్ళు చాలామందే వున్నట్లు స్ఫురించింది గిరిజకు. విస్సిగాడి సంగతి సరే! రెండో అన్నయ్య రెండో కూతురికి ఒకవిధమైన చర్మవ్యాధి వుంది. వళ్ళంతా మచ్చలు మచ్చలుగా వుంటుంది. ఎంతోమంది డాక్టర్లకి చూపించారు. చివరకు అది శాశ్వతంగా వుండేదేగాని తగ్గేదికాదని తేల్చారు. తమ చుట్టాలలో దగ్గర బంధువులోకరికి ఒక కాలూ చెయ్యీ పక్షవాతం. అది చిన్నప్పట్నుంచీ చెబుతుంటారు. ఇంకో పిల్లవాడికి మెదడు సరిగ్గా ఎదగలేదు. సెరిబ్రల్ ఫాల్స్ అన్నారు.
    
    ఎందుకో యిలాంటి వికారపు జబ్బులు తమ వంశంలోనే ఎక్కువగా వున్నాయా అనిపించింది. ఈ ఆలోచన ఎందుకొచ్చిందో తెలీదు.
    
    కొన్నాళ్ళకి విస్సిగాడు పెద్దవాడౌతాడు. తమ బంధువుల్లోనే ఏ పిల్లనో చూసి వాడికిచ్చి పెళ్ళిచేస్తారు. వాడికి పిల్లలు పుడతారు.
    
    తనకు పుట్టిన ఏ పిల్లనో, వాడి పిల్లాడికిచ్చి...

 Previous Page Next Page