దేశం కన్నా కుటుంబం గొప్పది అయినప్పుడు వాళ్ళనేది సబబే కావచ్చు. కుటుంబం కన్నా, సమాజం కన్నా, దేశం చాలా గొప్పది. ఆ విధంగా ఆలోచిస్తే ఆ కుటుంబం ఎనిమిది మంది సోమరిపోతుల్ని దాచి పెట్టి దేశానికి చాలా నష్టం కలిగిస్తోంది. కేవలం ఆ కుటుంబంలో పుట్టడమేగా ఆ ఎనిమిది మంది సభ్యుల అర్హత. వేరే ఎనిమిది మంది మనుష్యులకు పని చేయకున్నా పరమాన్నం పెట్టగలరా....? లేదు. రక్త సంబంధం ఆధారంగా ఎనిమిది మంది అడ్డగాడిదల్ని, వారి బరువును ఈదేశంపై ఆ కుటుంబం మోపుతోంది. ఇద్దరితో పాటు ఆ ఎనిమిది మంది శ్రమిస్తే ఎన్ని యూనిట్స్ ఉత్పత్తి అవుతాయి? 80 యూనిట్స్ ఉత్పత్తి అవుతాయి. అవునా...? ఆ కుటుంబం చేస్తున్న తప్పు మూలంగా ఎనభై యూనిట్స్ జాతీయ ఉత్పత్తిలో కలవకుండా పోతున్నాయిగా?
ఇది ఒక కుటుంబం... ఒకరోజు సంగతి. దేశం మొత్తం మీద చూస్తే ఎన్ని లక్షల కుటుంబాలు వున్నాయి? ఎన్ని కోట్ల మంది సోమరులున్నారు....? వాళ్ళంతా శ్రమిస్తే ప్రణాళికా సంఘం కుంతి నడకనడుస్తుందా? లోటుబడ్జెట్స్ ఎదురవుతాయా....? పేదరికం అదృశ్యం కాదా....? రక్త సంబంధం.... ప్రేమ పాశం.... డేమ్ సెంటిమెంట్స్.... పనిచేయని వాళ్ళను ఇంట్లోంచి తరిమి వేయాలి.... ఇలా అంటే.... అబ్బో వీడికొక్కడికేరా దేశభక్తి.... మాకు లేదా అని విరుచుకుపడతారు.
ఏది ఏమైనా మై డీడ్స్ అండ్ డ్రీమ్స్....నా ఆశలు, ఆశయాలు, ఆశాభావం ఎప్పటికైనా నిజం కాకపోవు...." విమల్ తనలో రేగిన భావోద్వేగాన్ని అణుచుకుంటూ నడకలో వేగం పెంచాడు.
క్రాంతి పరుగులాంటి నడకతో విమల్ ని అందుకునే ప్రయత్నంలో నిమగ్నమయింది.
* * * * *
మేఖల, అభిరామ్ పేపర్ లో వున్న అడ్రస్ ప్రకారం వెళ్ళి రెండు ఎకరాల విస్తీర్ణం మధ్య నిర్మించిన ఒక పురాతన బంగ్లా మెయిన్ గేట్ ముందు ఆగారు.
గేట్ దగ్గరున్న ఘూర్కా వచ్చి "ఎవరు కావాలి? ఎవరు మీరు" అని అడగడంతో పేపర్ లో వున్న క్లాసిఫైడ్ ఏడ్ ని చూపించింది.
ఘూర్కా అర్ధమైనట్లు తల పంకించి తన కేబిన్ లోకి వెళ్ళి లోపలికి ఫోన్ చేసి ఏదో మాట్లాడి తిరిగి మేఖల, అభిరామ్ వున్న దగ్గరకు వచ్చి లోపలకు వెళ్ళవచ్చు అని మెయిన్ గేట్ కే వున్న చిన్న గేట్ ని ఓపెన్ చేసాడు.
ఇద్దరూ గేట్ దాటి లోపలకు అడుగుపెట్టి చుట్టూ చూసి మెయిన్ బిల్డింగ్ కేసి నడకసాగించారు. దాదాపు మూడు నిమిషాలు నడిచి మెయిన్ బిల్డింగ్ ని చేరుకున్నారు.
అప్పటికే అక్కడ ఓ వ్యక్తి చేతిలో ఫైల్ తో వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నట్లుగా కనిపించాడు. వీళ్ళు దగ్గరకు వెళ్ళగానే మాస్టర్ ఈజ్ వెయిటింగ్ అంటూ బంగ్లాలోకి దారి తీశాడు.
ఆ బంగ్లా వాస్తుకళను బట్టి దానికో వంద సంవత్సరాల వయస్సు వుంటుందని ఊహించింది మేఖల. చుట్టూ చక్కని గార్డెన్.. గార్డెన్ మధ్య కోటలాంటి బంగ్లాలో ఈస్తటిక్ సెన్స్ తో అమర్చిన కళాత్మకమయిన వస్తువులు.... కొద్ది క్షణాలు చాలా థ్రిల్లింగ్ గా ఫీలయ్యింది మేఖల.
ఆ వ్యక్తి వెనుకే నడుస్తూ ఆ బంగ్లా మధ్య హాల్లోకి చేరుకున్నారు.
"మాస్టర్ వస్తారు. మీరు కూర్చోండి" అని అతను మెట్ల మీదుగా పైకెళ్ళి పోయాడు.
బంగ్లా అంతా నిశ్శబ్దంగా వుంది.
ఎయిర్ కండీషన్ చానెల్స్ లోంచి వస్తున్న చల్లటి సెంటెడ్ ఎయిర్ వార్ని సేద తీర్చింది.
ఐదు నిమిషాలు గడిచిపోయాయి.
ఎవరూ వస్తున్న అలికిడి లేదు.
అ పరిస్థితి మేఖల ఆలోచన్లలోపడితే, అభిరామ్ అనుమానించ సాగాడు.
మరికొద్ది క్షణాలకి మెట్లమీద చప్పుడవటంతో ఇద్దరూ ఒకేసారి పైకి చూశారు.
తమను బంగ్లాలోకి తీసుకు వచ్చిన వ్యక్తి ఒంటరిగా దిగివస్తూ కనిపించాడు.
ఈసారి మేఖల, అభిరామ్ ఇద్దరూ ఒకింత అసహనానికి గురయ్యారు.
ఏదో అడుగుదామని మేఖల ప్రయత్నిస్తుండగా వెనక నుంచి మాటలు వినిపించాయి.
"మీరు తెలివిగల వాళ్ళమనా మీ ఉద్దేశం....?" అంటూ.
ఇద్దరూ ఒకేసారి వెనక్కి తిరిగి చూశారు.
ఓ వృద్దుడు తమకు పదడుగుల దూరంలో నించుని తమకేసే చూస్తూ కనిపించాడు.
తెల్లగా ముగ్గు బుట్టలా వున్న పొడవాటి జుత్తు.
విశాలమైన నుదురు.
చిన్న చిన్న కళ్ళు - వయో భారంతో లోతు కెళ్ళిపోయినట్లున్న కళ్ళలో విచిత్రమైన కాంతి.
చిక్కిపోయిన బుగ్గలు.
మరలా అక్కడి నుంచే ప్రారంభమైన పొడవాటి గడ్డం.... అదీ తెల్లగా పండిపోయి వుంది.
జుత్తు అంతగా పెరిగినా దానిలో ఒక క్రమపద్దతి కనిపించింది. పొడవాటి గోల్డు కలర్ లాల్చీ, ఆపైన వేస్ట్ కోట్..... క్రింద పిజమా....కాళ్ళకు కాన్పూర్ చెప్పులు.
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రముఖ ఇండియన్ పెయింటర్ ఎమ్.ఎఫ్. హుస్సేన్ లా వున్నాడు.
ఆయన్ని చూస్తూ మేఖల ఓ అపురూపమయిన అనుభూతికి గురయ్యింది.
లంకంత ఆ బంగ్లాలో ఆ వృద్దుడేనా ఉండేది-? ఏమాశించి పేపర్ లో ఆ ప్రకటన వేయించాడు-? మేఖల కుతూహలంగా ఆయన కేసి చూడసాగింది.
నా ప్రశ్నకు సమాధానం ఇంకా ఇవ్వలేదు అన్నాడాయన. మాట్లాడుతున్నప్పుడు విచిత్రంగా కదిలాడే ఆయన గడ్డం వేపే చూస్తున్నాడు అభిరామ్.
"అవును.... అందుకే మీ ఏడ్ కి రియాక్ట్ అయ్యాను" మేఖల స్పష్టంగా సమాధానమిచ్చింది.
"ఏ ఉద్దేశ్యంతో యిక్కడికి వచ్చావు?" ఆయన తిరిగి ప్రశ్నించాడు.
"తెలివిగల ఇండియన్స్ ఎందుకొస్తారు? తమ తెలివి తేటలను రుజువు చేసుకొని జెవెఇథమ్లొ స్థిరపడేందుకేగా?"
"నాకు ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది" నిలబడే మాట్లాడుతున్నా వ్రుద్దాప్యపు వణుకు ఏ మాత్రం ఆయనలో కనిపించలేదు.
"చెప్పండి" అంది మేఖల.
"భారతదేశపు యువతి ఆలోచనలెలా వున్నాయని తెలుసుకోవాలని వుంది. అరడజను మందిని ఎన్నుకొని వారికి నేను కొంత పెట్టుబడి అందిస్తాను. వాళ్ళు ఏం సంపాదించుకుంటారో, ఏం సాధిస్తారో, తెల్సుకోవాలని ఉత్సాహపడుతున్నాను. అందుకు వాళ్ళకు కేవలం 365 రోజులు గడువును మాత్రమే యిస్తాను. చివరిరోజు ఆ ఆరుగురిని సమీక్షించి దాని మీద నేనో అభిప్రాయానికి వస్తాను. అంత శ్రమెందుకని మీకనుమానం రావచ్చు. నా అభిప్రాయానికి అపారమైన విలువ ఉంటుంది-అందుకని. అయితే నేను మొదటి స్టేజీలోనే దెబ్బతిన్నాను.
నా ప్రకటన చూసి కొన్ని వందలమందైనా వస్తారని ఆశించి దెబ్బ తిన్నాను. కేవలం నలుగురే నేనిచ్చిన ఏడ్ కి రియాక్ట్ అయ్యారు.
ఆ నలుగురిలో మొదటి ఇద్దరు మీరు చెప్పండి-మీకెంత పెట్టుబడి కావాలి....?"
ఆ వృద్దుడి ఆలోచనకు యిద్దరూ విస్తుపోయారు. అది నిజమో.....అబద్దమో? కలో? వాస్తవమో...అర్ధంకాక ఆ యిద్దరూ తికమక పడిపోయారు.
ఎవరో ఆయన..... ఏ సంబంధంలేని అపరిచితులకు ఎంత పెట్టుబడి అడిగితే అంతిస్తాడా? ఇందులో ఏదయినా మోసం లేదు కదా.... అని అభిరామ్ ఆలోచిస్తే.... కావల్సినంత డబ్బున్న జీనియస్ కి ఇలాంటి ఆలోచనలే వస్తాయేమో? ఏది ఏమైనా ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకుంది మేఖల.
"మేం అడిగినంత యిస్తారా?" ఆమె షార్పుగా రియాక్ట్ అవుతూ అడిగింది.
"కానీ స్థాయిని మరిచి అడిగితే రిక్తహస్తాలతో సమాధానమిస్తాను. నెలకు వందకు పది రూపాయలు వడ్డీ అప్పుగా తీసుకోవలసి వచ్చినప్పుడు తిరిగి ఖచ్చితంగా ఆ అప్పు సంవత్సరానికి తీర్చవలసి వచ్చినప్పుడు ఎంత కావాలనుకుంటారో అంతే అడగండి" అన్నాడతను గంభీరంగా.
"ఇద్దరికి ఒక లక్ష రూపాయలివ్వండి" అంది.
"డన్" అన్నాడు తన మనిషికేసి చూసి.
ఆ వ్యక్తి లోపలికెళ్ళాడు.
"మీ మీద నా మనుష్యుల పర్యవేక్షణ ఉంటుంది. అది మిమ్మల్ని ఇన్ ఫ్లుయెన్స్ చేసేందుకు కాదు. నా ఫీడ్ బేక్ కోసం...
ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తాను" అన్నాడా వృద్దుడు గెడ్డాన్ని నిమురుకుంటూ ఎటో చూస్తూ.