Previous Page Next Page 
జనవరి 5 పేజి 20

 

      ఆమెకు తెలిసిందల్లా ఆమె తండ్రి నడిపే చిన్న షాప్.
   
    "టర్నోవర్ లక్షల్లో ఉంటుందేమో....?" అంది తనలో తానే అనుకున్నట్లుగా.
   
    "భలేదానివే....లక్షలు కాదు....కోట్లలో ఉంటుంది" అన్నాడు అభిరామ్ మెల్లగా.
   
    మేఖల ప్రింటెడ్ కాటన్ షర్ట్స్ అమ్మే కౌంటర్ దగ్గరకు వెళ్ళి అభిరామ్ ని చూపిస్తూ "షర్ట్స్ చూపించండి" అంది.
   
    కౌంటర్ లోని సేల్స్ మన్ అభిరామ్ కేసి చూసి "హేండ్ సమ్...." అని మెచ్చుకొని ఓపెన్ అల్మారాలో ఉన్న షర్ట్స్ తీసి, కౌంటర్ మీద పెట్టి, తన సహజ ధోరణిలో వాటి కలర్స్ గురించి, మెటీరియల్ గురించి ఆపకుండా చెప్పుకు పోసాగాడు.
   
    అతను చెప్పేది వినకుండా తనకు నచ్చిన నాలుగు రకాల షర్ట్స్ ను ఎన్నిక చేసుకుని వాటి ధరలెంతని అడిగింది మేఖల.
   
    "ఇది తొంభై.... ఇది నూట ఐదు.... ఇది నూట నలభై.... ఇది ఎయిటీ" అన్నాడు చకచకా.
   
    చూడటానికవి చాలా మామూలుగా వున్నాయి.
   
    అంత రేటు పెట్టడం దండగేమో అనిపించింది.
   
    "చూస్తే మామూలుగా ఉన్నాయి. అంతంత ధరలా...? ఎన్నాళ్లుంటాయి?"
   
    ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది మేఖల.
   
    కౌంటర్ లోని వ్యక్తి నవ్వాడు.
   
    "చూడండమ్మా... ఈ షాప్ కొచ్చే కష్టమర్స్ ఎవరూ మేం చెప్పే ధరల్ని సమీక్షించరు, మరో ధర చెప్పమని అడగరు. అడగటం తప్పని, అడగకూడదని నా ఉద్దేశం కాదు. ఇప్పుడు జనాలకు కావాల్సింది పది కాలాలపాటు మన్నికగా ఉండే దుస్తులు కాదు- పది రోజులపాటు డాబుసరిగా ఫ్యాషనబుల్ గా కనిపించే క్రేజీ దుస్తులు నిజానికవి మీరన్నట్లు నేను చెప్పినంత ఖరీదయిన దుస్తులు కావు...." అన్నాడు అనుభవంతో పండిన నుదుటి గీతల్ని రుద్దుకుంటూ.
   
    "మరి.... మరీ షాప్ ఇంత బిజీగా ఎలా వుంది?" మేఖల యేదో ఆలోచిస్తూ అడిగింది.
   
    "ఇప్పుడు కష్టమర్స్ కి కావాల్సింది మెంటల్ సేటిస్ఫేక్షన్ - అది ఈ షాప్ సంపాదించుకున్న ఇమేజ్, గుడ్ విల్ అందించగలుగుతుంది. అందుకే ఫలానా షాప్ లో కొన్నామన్న తృప్తితో పదిరోజులు తొడిగి అవతల పడేస్తారు...."
   
    "ఒక వస్తువేదైనా కొంటే ఎక్కువ రోజులు ఉపయోగపడాలి గదా....? ఇలా కొని ఎలా పడేయటం శుద్ద దండగ కదా?"
   
    "దండగని ఎవరనుకుంటారు? మీరన్నది మిగతా వస్తువుల విషయంలో అయితే నిజమే. కాని ఫ్యాషనబుల్ గూడ్స్ విషయంలో తక్కువ కాలం పనిచేసే వాటికే యిప్పుడు ప్రాముఖ్యం. ఒక్క షార్ట్ చిరిగిపోకుండా నాలుగేండ్లు మన్నికగా ఉందనుకోండి. ఈ జెనరేషన్ బోర్ ఫీలవకుండా అంతకాలం దాన్ని ఉపయోగిస్తుందనా మీ అభిప్రాయం...? ఎక్కువకలం పనిచేస్తే వాళ్ళకు చిరాకు. అది ఎంత కాలానికీ చిరగదు. చిరగందే తమ పేరెంట్స్ కొత్తవి కొనరు. పారేస్తే ఊరుకోరు - కొనాలని చింపితే ఇంట్లో పెద్దలు ఫైరౌతారు. యూరోపియన్ ఫ్యాషన్స్  వరల్డ్ పుణ్యమా అని ఆరు నెలలకో ఫ్యాషన్, మూడు నెలలకో డిజైన్ వచ్చిపడుతున్నాయి.
   
    ఫ్యాషన్స్ అనుకరణకు త్వరగా ప్రభావితమయ్యే నేటి యువతీ యువకులు ఒక ఫ్యాషన్ ని పట్టుకొని ఎన్నాళ్ళు ఊగిసలాడతారు? మిగతా వినియోగ వస్తువులను ఏ ఏజ్ గ్రూప్ వారు కొన్నా, ఫ్యాషనబుల్ గూడ్స్ ని కొనేది మాత్రం యువతీ యువకులే.... వీళ్ళకు శ్రమ విలువ తెలీదు.
   
    డబ్బు విలువ అంతకంటే తెలీదు. ప్రతి యువకుడు తన సహచరుల్లోకెల్లా తనే డాబుసరిగా కనిపించాలని అనుకుంటాడు.
   
    ప్రతి యువతీ మిగతా యువతులకన్నా ఎగ్జోటిక్ గా కనిపించాలని అనుకోవటం చాల సహజమైపోయింది. ఇప్పుడు చెప్పమ్మా.... ఈ వ్యాపారంలో కష్టమర్స్ ధరల గురించి వర్రీ అవుతారా? మన్నిక గురించి మనసు పెట్టి ఆలోచిస్తారా?..."
   
    ఆ వ్యాపారంలో పండిపోయినట్లు అతను చెప్పుకుపోతుంటే తొలిసారి ఆమెలో కొత్త ఆలోచనలు ఊపిరి పోసుకోసాగాయి.
   
                    *    *    *    *    *
   
    "Theenagers trying to run away from home on short or long tours is a symptom of their in-Quisitiveness. Such to urs, if properly conceived, pay rich divinends sooner or latir."
   
    "పట్టుదలకి పంతాలకి పోయి తల్లిదండ్రులతో విభేదించి, ఆత్మాభిమాన సంరక్షణ కోసం ఆనంత దూరాలకు వెళ్ళి, అందనంత ఎత్తులకు ఎదిగిన వాళ్ళు ఎందరో వున్నారు. మనకీ ఆ రోజు తప్పక వస్తుంది తమ్ముడూ....
   
    In the process of fulfiling the un finished task of the parents, one may develop in to an entrepreneur.
   
    మన ఫాదర్ ఏ విషయాల్లో అయితే అసంతృప్తి చెందాడో, ఏమి సాధించలేక మిగిలిపోయారో, అసలేమి సాధించాలని ఆశపడ్డారో, ఎక్కడ ఏ స్టేజీలో అపజయాన్ని ఎదుర్కొన్నారో ఒక్కసారి మనం ఆలోచిస్తే చాలు...."
   
    "నాకేమీ తెలీదు. నన్నేమీ అభిప్రాయాలు అడగవద్దు. ఫలానా పని అని చెప్పి అది చేయమంటే చేస్తాను. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు...." అభిరామ్ తన మెడపై వున్న మఫ్లర్ మడతను సరిచేసుకుంటూ అన్నాడు.
   
    మేఖల అభిరామ్ వైపు చూసి నవ్వింది.
   
    అతని ప్రవర్తనలో మొండితనం, మూర్ఖత్వం కనిపిస్తున్నాయి మేఖలకు. వాటిపట్ల ఒక్కోసారి ఆమె చిరాకు పడినా, ఎక్కువసార్లు నవ్వుకుంటుంది. అభిరామ్ లో తొంగిచూసే మంకుతనమంటే ఆమెకు ముచ్చటేస్తుంది.
   
    మేఖల ఆ రోజు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ని తిరగేస్తూ ఏదో ఆలోచించ సాగింది.
   
    కొద్ది సేపటికి క్లాసి ఫైడ్ ఏడ్స్ వున్న పై పేజీలో ఓ మూలగా, ఏ మాత్రం ప్రాముఖ్యత లేని దానిలా ప్రచురింపబడిన చిన్న ఏడ్ మేఖలను ఆకర్షించింది. తెలివిగల వాళ్ళకోసం ఏడ్ ఇచ్చేప్పుడు పేపర్ లో ఎక్కువ స్థలం కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం దండగ కదా? అన్న మకుటంతో వున్నా ఆ ఏడ్ క్రింద 21 వ శతాబ్దపు ప్రపంచ ఆర్ధిక భవితవ్యం పై ఏ మాత్రం అవగాహన వున్న వాళ్ళయినా ఏం చేయాలో మేం చెప్పక్కర్లే దనుకుంటాను...." దాని క్రింద ఓ అడ్రస్ వుంది.
   
    ఆమెకు ఏడ్ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.
   
    ఆ ఏడ్ ని అభిరామ్ కి చూపించింది.
   
    అతను దాన్ని చదివి "ఎవరో పిచ్చివాడు ఇచ్చుంటాడు. లేకుంటే ఆ ఏడ్ ఎందుకిచ్చినట్లు...?" అన్నాడు దాన్ని తేలిగ్గా తీసుకుంటూ అభిరామ్ తీసుకున్నంత తేలిగ్గా ఆమె తీసుకోలేకపోయింది.
   
    "పద వెళదాం" అంది మేఖల ఆ పేపర్ ని మడిచి చేతిలో ఉంచుకుంటూ.
   
    "ఎక్కడికి?" అభిరామ్ ఆశ్చర్యపోతూ అడిగాడు.
   
    "ఆ ప్రకటనలో వున్న అడ్రస్సుకి."
   
    "మనల్ని పిచ్చివాళ్ళ కింద జమకడతారు."
   
    "అది పిచ్చివాళ్ళు చేసే పని మేధావులెప్పుడూ పిచ్చివాళ్ళలానే కనబడతారు. ఇంతకీ వస్తున్నావా...?" అంది.
   
    అభిరామ్ లేచాడు.
   
    మరో నిముషానికి ఇద్దరూ రోడ్ మీద నడుస్తున్నారు.
   
                                        *    *    *    *    *
   
    "ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే సగటు భారతీయుడి బ్రతుకు ఎంత దుర్భరమయిపోతుందో....? ఇండియాలో కేవలం 26 శాతమే మానవ శక్తి వినియోగంలోకి వస్తోందట అంటే ఎన్నికోట్ల మంది సోమరులై జీవిస్తున్నారు?"
   
    విమల్ రోడ్డంట నడుస్తూ అన్నాడు.
   
    "అంటే.... 74 శాతం మంది ప్రజలు ఏ పనీ చేయకుండా బ్రతికేస్తున్నారా?" క్రాంతి ఆశ్చర్యపోతూ అంది.
   
    "ఏ పనీ ఎందుకు చేయరు...? చేస్తారు. తల్లిదండ్రుల్ని, తోడ బుట్టిన వాళ్ళను బెదిరించుకు బ్రతుకుతుంటారు. మరీ బాగోదేమోనని అప్పుడప్పుడు అటు పుల్ల తీసి ఇటు పెడుతుంటారు."
   
    "అది ఎవరి తప్పంటావ్" క్రాంతికి ఏవేవో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎక్కువ.
   
    "తప్పు ఎవరిదయినా, సోమరిపోతుల్ని  కూడా శ్రమ జీవులతో పాటు సమానంగా గౌరవించే వ్యవస్థను, ప్రేమించి, క్షమించే కుటుంబ సభ్యుల్ని వెలివేస్తే తప్ప దేశం బాగుపడదు. ఒక కుటుంబంలో పదిమంది సభ్యులుంటే అందులో ఇద్దరు పనిచేస్తే రోజుకు ఇరవై యూనిట్స్ ఉత్పత్తి చేయగలరనుకుందాం. ఆ ఇరవై యూనిట్స్ అమ్మటం ద్వారా వచ్చే ఆదాయంతో పది మంది సభ్యులు కంఫర్టబుల్ గానే బ్రతకవచ్చు. ఆ కుటుంబంలోని సభ్యులు అనుకుంటారు. మా బాధలేవో మేం పడుతున్నాం అని. మరొకరి దగ్గరకు వెళ్ళి చెయ్యి చాపకుండానే గౌరవంగా బ్రతుకుతున్నాం అని గర్వంగా చెప్పుకుంటారు.

 Previous Page Next Page