Previous Page Next Page 
తులసి పేజి 19

    "కానీ" అంటూ ఏదో చెప్పబోయింది.
   
    దానికి అడ్డు తగుల్తూ "అంతకన్నా ముఖ్య విషయం - ప్రశ్న చూడకుండానే సమాధానం చెప్పడం" అన్నాడు జయదేవ్.

    "ఆఁ అదొకటి" అన్నాడు పండిత్.

    "గదిలో అద్దాలు గాని రిఫ్లెక్టర్ గానీ లేదని నువ్వే అన్నావు, మూల కూర్చుని వ్రాసిన ప్రశ్న ఆమెకు ఎలా తెలిసింది."

    తులసి మాట్లాడలేదు.

    "ఇదంతా నీ భ్రమ" అంతే తను చెప్పవలసింది అంతే అన్నట్టు సిగరెట్టు వెలిగించుకున్నాడు పండిత్.

    "కానీ ఆ దేవి అందరి ప్రశ్నలకి అలాగే సమాధానం చెప్తుందట."

    "హెలూసినేషన్" అన్నాడు.

    "అంటే?"

    "సైకిల్ సెల్ఫ్ నిర్వచనం ప్రకారం చూస్తున్నట్టూ, వింటున్నట్టు, భ్రాంతి ఆ కుర్చీలో కూర్చుని, కళ్ళు మూసుకుని నువ్వు భవిష్యత్తులోకి వెళ్ళిపోయావు. నీలో అంతర్గతంగా వాళ్ళ పట్ల భయం వుంది. అదే పుర్రె రూపంలో నీకు  కనపడింది. చలిగాలిలో కూరుకుపోతున్నానన్న భావం కూడా అదే. నిజానికి మొదటిసారి నువ్వు లోపలికి వెళ్ళనే లేదు. రిజిష్టర్ లో నీ పేరు లేకపోవడానికి, నీ చేతికి ఉంగరం అలాగే వుండడానికి కారణం అదే" అన్నాడు జయదేవ్.

    చాలాసేపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు వుండిపోయారు.
   
    ఆమె లేచి "వెళ్ళొస్తాను" అంది.

    "నన్ను దిగబెట్టమంటావా"

    "వద్దు అంకుల్, థాంక్స్"

    ఆమె అన్యమనస్కంగా డ్రైవ్ చెయ్యసాగింది. ఎన్నో ఆలోచనలు, తను భ్రాంతితో వుండవచ్చు -నిజమే - కానీ అంతమంది తమతమ ప్రశ్నలకు సమాధానం ఎలా పొందగలుగుతున్నారు? ఏమో.... నిజమే నేమో..... మానవాతీత శక్తి వుందేమో....  అదే జయదేవ్ అంకుల్ చెప్పినట్టు "మాన్ హిప్నాటిక్ ట్రాన్స్" ఏమో సిద్ధేశ్వరీదేవి నిజంగా దైవోపాసకురాలు ఏమో. లేకపోతే ఒక్క ఆధారము కూడా లేకుండా ఎలా వుంటుంది?

    ఆమె ఇంటికి వెళ్ళి కూడా అదే ఆలోచనలో వుంది. తల్లికి కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు. శారద, కూతురు అన్యమనస్కంగా వుండడాన్ని గమనించలేదు.

    రాత్రి బాగా పొద్దు పోయింది. తన గదిలో పడుకుని ఆలోచించ సాగింది తులసి. ప్రొద్దున జరిగిన సంఘటన కళ్ళకు కట్టినట్టుగా వుంది. పుర్రె గాలిలోకి ఎగరటం తన ప్రశ్నకు సమాధానం చెప్పడం

    ఇదంతా భ్రమ ఎలా అవుతుంది? భ్రమ కాదని ఎలా వీళ్లని నమ్మించటం?.....ఆమె జరిగిందంతా మననం చేసుకోసాగింది.

    రెండొందల పదహారు అంకె వెయ్యడం -ఉంగరం హుండీలో వెయ్యడం - లోపలికి వెళ్ళటం తన నోట్ బుక్ లో కాగితం చింపటం.

    అకస్మాత్తుగా ఆమె ఆలోచన అక్కడ ఆగిపోయింది. తన నోట్ బుక్ లో కాగితం అవును అది నిరూపిస్తుంది.

    ఆమె ఒక్క ఉదుటున లేచి పుస్తకాల డ్రాయర్ దగ్గరికి పరుగెత్తింది! ఆ రోజు కొత్తగా కొన్న నలభై పేజీల నోట్ పుస్తకాల్లోంచి ఒక సరికొత్త నోట్ బుక్ తీసి పేజీలు లెక్కపెట్టింది. నలభై పేజీలున్నాయి. సిద్ధేశ్వరీ ఆలయంలో తను మధ్యపేజీ చింపిన పుస్తకం తీసింది. తీస్తూ వుంటే ఆమె మొహం టెన్షన్ తో ఎర్రబడింది. వణుకుతున్న చేతుల్తో పేజీలు లెక్క పెట్టడం పూర్తి చేసింది. ముప్పై ఆరున్నాయి.

                                           *************

 Previous Page Next Page