Previous Page Next Page 
తులసి పేజి 20

    ఆ రాత్రి ఆమె డైరీలో ఇలా వ్రాసుకుంది.

    "ఈ విషయాన్ని అంకుల్ తోగానీ, మాస్టారుతోగానీ చెప్పినా వాళ్ళు నమ్మరు నేనే కనుక్కోవాలి. దానికోసం ఎంతకాలమైనా ఆగాలి. రెండు నెలల్లో దేవి పూజ జరుగుతుంది. ఈ హడావుడిలో లోపలికి ప్రవేశించాలి. ఆ రహస్యాన్ని శోధించాలి.నాకేదైనా జరిగినా ఈ డైరీయే వాళ్ళని అరెస్టు చేయించాలి. అప్పుడు ఒక మోసగాళ్ళ ముఠా నుంచి ప్రజల్ని రక్షించానన్న తృప్తి అయినా నా ఆత్మకు మిగులుతుంది

    డైరీ వ్రాయడం పూర్తి చేసి ఆమె నిశ్చింతగా నిద్రపోయింది.

                                               7

    రాత్రి ఒంటి గంట అయింది.

    కంపార్టుమెంట్ లో అందరూ నిద్రబోతున్నారు. రైలు నెమ్మదిగా వెళుతోంది. తెరచి వున్న కిటికీలంచి బైట చీకటి కాటుకలా వుంది.

    అతడు పుల్లల కట్ట తీసేడు కణుపులు లెక్క పెట్టేడు.

    పదమూడు వున్నాయి.

    అంటే పదమూడు రోజులు.

    ఇంకో పదమూడు రోజుల్లో కాష్మోరా నిద్రలేస్తాడు. ఆ తర్వాత వారానికి తులసి మరణం.

    రైలు చీకట్లో ఆగింది. ఊరులేదు. అంతా చీకటి. చెరుకు కోసిన భూములు -కీచురాళ్ళు శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా వుంది.

    గెడ్డం కిటికీకి ఆన్చుకుని శూన్యంలోకి చూస్తున్నాడు దార్కా.

    ఆ చీకట్లో ఆ విశాలమైన పొలాల్లోకి చూస్తూ వుంటే అతని బాల్యం గుర్తుకు వచ్చింది. బిస్తా తన గ్రామస్తులు. - గురువైన విషాచి -అతడు తన మీద పెట్టుకున్న నమ్మకం - తన ప్రతిజ్ఞ -ఐదేళ్ళు కష్టపడి నేర్చుకున్న మంత్ర విద్య -కఠోరమైన నియమాలూ -వర్షానికి తడు్సతూ -చలికి వణుకుతూ -అర్ధరాత్రి మానవ కంకణాల మధ్య - టపటపా పేలిపోయే కపాలాల మధ్య -జీవితాన్ని తపస్సుగా మార్చుకుని -శ్రమిస్తూ తపిస్తూ -

    తను సాధించిందేమిటి?

    ఏమీ లేదు.

    చాలా చిన్న ప్రతిజ్ఞ

    ముగ్గుర్ని చంపడం. అది చెయ్యలేక పోతున్నాడు.

    తన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న తన గురువు కోరికని నెరవేర్చలేక పోతున్నాడు.

    మబ్బుల చాటునుంచి చంద్రుడు బైటకొచ్చాడు. రైల్వే ట్రాక్ పక్కనే వున్న గుంటలో నీరు తళతళ మెరుస్తూంది.

    కిటికీ చెక్క మీద తల పెట్టుకుని "క్షమించు విషాచి, నేను ఓడిపోతున్నాను. నన్ను క్షమించు" పదేపదే అనుకొన్నాడు. కళ్ళ వెంట నీరు కారటం మొదలు పెట్టింది.

 Previous Page Next Page