అతను కదలలేదు. క్షణం ఆమె కళ్ళలోకి సూటిగా చూసేడు. ఆమె వెన్నునుంచి సన్నగా చలిపాకింది. "వద్దు" అని అనబోయింది. "ఒక్క నిమిషం తెచ్చిస్తాను" అని అతడు బయటకు వెళ్ళాడు.
ఆమె చప్పున రిజిష్టరు చూసింది.
అవధుల పేర్లు -వచ్చిన టైమ్..... ఇచ్చిన కానుకలు.- అన్నీ వ్రాసి వున్నాయి.
ఆమె తొందర తొందరగా పేర్లు చూడసాగింది.
ఆమెకి టెన్షన్ ఎక్కువైంది. తను స్వయంగా పెన్ తో తన పేరు వ్రాసింది. రూ.216/- అని కూడా వ్రాసింది. ఈ రోజే.... ఈ రోజే.
ఏమైంది ఆ పేరు? ఆమె నుదుటి మీద చెమట పడుతూంది. చెయ్యి వణుకుతూంది. ఒకవైపు చక్రవర్తి వచ్చేస్తాడేమో నని భయం..... ఆమె గబగబ పేజీలు వెనక్కి తిప్పింది. అంతకు ముందురోజు...... దాని క్రితం రోజు.....వరుసగా వ్రాసివున్న పేర్లు..ఇచ్చిన విరాళాలు.
తన పేరు లేదు.
అంతలో తలుపు దగ్గర చప్పుడయింది. చక్రవర్తి గ్లాసుతో వస్తున్నాడు. ఆమ పెన్ తీసుకుని పేరు వ్రాసింది. టైమ్ వేస్తూ వుంటే....
"ఎన్నో పుణ్యకార్యాలు ఇక్కడ జరుగుతూ వుంటాయి. అందుకని భక్తులు విరాళాలు వేస్తారు" వెనక నుంచి చక్రవర్తి కంఠం మందంగా వినిపించింది. ఆమె వెనుదిరగకుండానే తన పేరు కెదురుగా రూ.216. అని వేసింది. వేస్తూ ఓరగా అతడి మొహంలో కలిగే మార్పులకోసం చూసింది.
చాలా చిత్రంగా అతడి మొహంలో ఏ మార్పూ లేదు. "రండి దేవి ప్రసాదం తీసుకొందురుగానీ" అన్నాడు.
ఆమె నిటారుగా నిలబడి "నేను దేవిని ప్రశ్న అడుగుదామని వచ్చాను" అన్నది.
"ఇంకొంచెం విరాళం ఇవ్వవలసి వుంటుంది. దేవి సమయం చాలా విలువైంది."
అప్పుడొచ్చింది ఆమెకు జ్ఞాపకం........ తనుహుండీలో వేసిన వుంగరం సంగతి చక్రవర్తి గమనిస్తున్నాడన్న విషయం కూడా పట్టించుకోకుండా చప్పున ఎడమ చెయ్యి ఎత్తి చూసుకుంది.
అరచేతి పైన,
నాలుగో వేలికి బిగుతుగా -
తళతళా మెరుస్తూంది -
తండ్రి నతకి నాలుగేళ్ళ క్రితం బహుమతిగా ఇచ్చిన వజ్రపుటుంగరం.
*************
"ఇదంతా జరిగింది -నిజంగా జరిగింది -మీరు నమ్మాలి" అంది తులసి. ఆమె కంఠంలో వాళ్ళని నమ్మించాలన్న ప్రయత్నం తాలూకు అలసట బాగా కనిపిస్తూంది.
"రిలాక్సవు తొందరపడకు" అన్నాడు పండిత్. ఆమె తల అడ్డంగా విదిలిస్తూ దాదాపు ఏడుపు కంఠంతో "మీరంతా నన్నెందుకు నమ్మరు?" అని అడిగింది.
"సైన్సు నమ్మదు కాబట్టి" అన్నాడు జయదేవ్ -కుర్చీలో వెనక్కి వాలి.
తన కెదురుగా వున్న ఇద్దరూ రెండు వేరు వేరు రంగాల్లో ప్రఖ్యాతి చెందిన ప్రొఫెసర్లు. తనేమో ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి కాని అమ్మాయి. నీళ్ళు నిండిన కళ్ళతో ఆమె నిస్సహాయంగా వాళ్ళవైపు చూసింది. ఆమెని అనునయిస్తున్నట్టు పండిత్ అన్నాడు.
"మాటలు పుర్రెలోంచి వస్తున్నట్టు నువ్వే చెప్పావు. ఇంకెక్కడా స్పీకర్లు లేవనీ, నీవే దాన్ని స్వయంగా పరీక్షించావ్ అంటున్నావ్. పుర్రెబల్లకీ వైరు కనెక్షన్ ఏదీలేదు. మరి పుర్రెలోంచి ఎలా వచ్చినయ్. పుర్రె గాలికి లేచిందంటే ఏ అయస్కాంతమో పెట్టి, పుర్రెలో ఇనుపముక్క తాపడం చేసి, గాలిలో నాట్యం చేయించారనుకోవచ్చు, కనీ దానిలోంచి మాటలు రావడానికి సైన్సు రీజనింగ్ చెప్పదే......"