Previous Page Next Page 
వైరం పేజి 20


    ఆ పాత పాట తనకి తెలుసు.
    'తుమ్ కో కిసీకె జాన్ కో
    జాతా హువ దేఖా?
    ఓ దేఖో ముఝ్ సే రూఠ్ కర్,
    మెరే జాన్ జా రహీ హై..."
    'ఎవరి ప్రాణం అన్నా వెళ్ళిపోతూ ఉండగా నువ్వు చూశావా? అదిగో చూడు! నామీద అలిగిన నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోతోంది.'
    తన ప్రాణానికి ప్రాణమైన అరుణ అలా ఆరోజున తనని వదిలి వెళ్ళిపోయిన రోజుని, తన ప్రాణాలు పోయేరోజుదాకా మరవగలడా?
    సర్! ఇటీజ్ టైం ఫర్ యువర్ ఫ్లయిట్!" అంటున్నాడు ఎయిర్ లైన్స్ అఫీషియల్ సుందర్ మళ్ళీ.
    అప్పుడు అర్థం అయింది సూరజ్ కి - సుందర్ చెబుతున్నది ఏమిటో?
    ఫ్లయిట్ టూ హైదరాబాద్!
    అరుణ దగ్గరికి!
    'ఫ్లయిట్ రెడీ!' అని చెప్పిన సుందర్, సూరజ్ కి ఆ క్షణం కేవలం ఒక దేవదూతలాగే కనబడ్డాడు.
    "థాంక్యూ! థాంక్యూ సో మచ్!" అన్నాడు సూరజ్ ఎగ్జయిటెడ్ గా.
    ఉత్సాహంగా లేచి నిలబడుతూ "థాంక్స్ ఏ లాట్! థంక్స్ ఎగెయిన్!" అన్నాడు మళ్ళీ అనవసరంగా.
    సూరజ్ వైపు చిత్రంగా చూశాడు సుందర్.
    ఒక్కసారిగా వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది సూరజ్ కి.
    ఇంకేముందీ!
    పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అయితే హైదరాబాద్ కి గంటలోపే ప్రయాణం!
    చిన్న ఎయిర్ క్రాఫ్ట్ అయితే, దాదాపుగా గంటన్నర పట్టవచ్చును.
    "ఏ ఎయిర్ లైన్ లో బుక్ చేశారు?" అన్నాడు సూరజ్ ఆత్రంగా. ఆ వెంటనే అడిగాడు.
    "ఏ ఎయిర్ క్రాఫ్ట్?"
    ఫలాని ఎయిర్ లైన్ అని చెప్పి, 'ఎ.టి.ఆర్ 500 అన్నాడు సుందర్.'
    అంటే, గంటన్నర ప్రయాణం తప్పదన్నమాట! ఈలోగా ఈ హోటల్ నుంచి ఎయిర్ పోర్టుకి వెళ్ళడం, ఎయిర్ పోర్టులో బ్యాగేజి చెక్ సెక్యూరిటీ చెక్ - హైదరాబాద్ లో లాండ్ అయ్యాక అరుణ ఇల్లు చేరడానికి ఇంకో అరగంట - మొత్తం మూడు గంటలపైగానే పట్టవచ్చునేమో! మనసుకి రెక్కలు ఉన్నట్లు మనిషికి కూడా రెక్కలు ఉంటే ఎంత బావుండును!
    సూరజ్ ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు సుందర్.
    ఆ ఫ్రాంక్ ఫర్ట్ ఫ్లయిట్ చెన్నయ్ కి తిరిగివచ్చేసి, ప్రయాణీకులందరూ ఈ హోటల్ కి వచ్చినప్పటినుంచీ కూడా -
    ఇతను... పేరు సూరజ్ కదా...ఇతను మాత్రం నార్మల్ గా లేడు.
    అంతవరకూ ష్యూర్!
    కాస్త కనిపెట్టి ఉండమని ఫ్లయిట్ క్రూతో చెప్పాలి.
    సూరజ్ భోజనం కూడా చేసినట్లుగా లేడని అర్థం అయింది సుందర్ కి.
    "మీరు ఏమీ తిన్నట్లే కనబడటం లేదు. ఫ్లయిట్ లో స్నాక్స్ ఎట్లాగూ వుంటాయిగానీ ఈలోగా...."
    "కాస్త కాఫీ చాలు!" అన్నాడు సూరజ్.
    "థాంక్స్ ఏ లాట్!" అన్నాడు మళ్ళీ.
    హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు తను అరుణ దగ్గరకి!
    సూరజ్ లగేజ్ ని కిందికి తేవడంలో సాయం చేశాడు సుందర్.
    వాళ్ళు లాబీలోకి వచ్చేసరికి కాఫీ రెడీగా వుంది.
    తాగాడు సూరజ్.
    బయటికి వచ్చి కారు ఎక్కారు.
    కారు ఎయిర్ పోర్టువైపు పరిగెత్తింది.
    ఎయిర్ పోర్టులో - బాగేజ్ చెక్ దాకా సాయంగానే ఉన్నాడు సుందర్.
    ఆ తర్వాత నెమ్మదిగా ఎయిర్ లైన్స్ వాళ్ళ క్రూతో చెప్పాడు.
    "అతని మెంటల్ మేకప్ నార్మల్ గా ఉన్నట్లు అనిపించడం లేదు. కాస్త కనిపెట్టి వుండండి" అని.
    'అలాగే' అన్నట్లుగా తల వూపింది ఓ అమ్మాయి, సెక్యూరిటీ చెక్ కి వెళ్తున్న సూరజ్ వైపు చూస్తూ.
    సెక్యూరిటీ చెక్ లోకి వెళ్ళడానికి లైన్ లో నిలబడి వున్నారు పాసింజర్స్.
    ఒకళ్ళ తరవాత ఒకళ్ళుగా లోపలికి వెళ్తున్నారు.
    తన టిక్కెట్టు చేతిలో పట్టుకుని అసహనంగా నిలబడి ఉన్నాడు సూరజ్.
    విమాన ప్రయాణం చేస్తున్న ప్రతిసారీ కూడా సెక్యూరిటీ చెక్ దగ్గర చాలా చిన్నతనంగానే ఫీలవుతాడు తను.
    అఫ్ కోర్స్! టెర్రరిస్టులతో పొంచివున్న ప్రమాదాల వలనా, హైజాక్ రిస్కు వలనా సెక్యూరిటీ చెక్ తప్పదు. ఎవరు ఎట్లాంటి వాళ్ళో ఎవరూ చెప్పలేని రోజులివి.
    అయినా సరే -
    మెటల్ డిటెక్టర్ ని దాటి వెళ్ళడం, అంతకుముందే పర్సూ, పెన్నూ, పాకెట్ కూంబ్ లతో సహా అన్నీ తీసి ఒక ప్లాస్టిక్ ట్రేలో పెట్టి వాళ్ళకి ఇవ్వడం, ఆ ట్రే హాండ్ బాగేజ్ తోబాటు అవన్నీ ఎక్స్ రే మిషన్ కింద నుంచి వెళ్ళి అవతలవైపుకి రావడం - సెక్యూరిటీ చెక్ లో ఉన్న పోలీసులు ఆపాదమస్తకం తడిమి చూడడం - ఒక్కొక్కసారి షూస్ కూడా విప్పి చూపించమనడం -
    ఆ మధ్యన అమెరికా వెళ్ళినప్పుడు అప్పటి మన ఇండియన్ డిఫెన్సు మినిస్టర్ జార్జి ఫెర్నాండెజ్ బట్టలన్నీ ఊడదీసి మరీ చెక్ చేశారు కదా!
    సెక్యూరిటీ చెక్ ముగించుకుని, టిక్కెట్టుమీద స్టాంపు వేయించుకుని లోపలికి వెళ్ళాక, విమానం ఎక్కబోయేముందు మళ్ళీ ఇంకోసారి హాండ్ బాగేజ్ నీ ఓపెన్ చేసి చెక్ చేయడం -
    చాలా చిన్నతనంగానే అనిపిస్తుంది.
    కానీ తప్పదు గదా!
    తప్పు కూడా కాదు.
    అయినా సరే!
    తనలాంటి వాళ్ళకి ఏ ప్రాబ్లెమూ ఉండదనుకో!
    సూరజ్ వంతు వచ్చింది.
    టిక్కెట్టు పోలీసు అధికారికి ఇచ్చాడు.
    ఒకసారి టిక్కెట్ వైపు చూసిన పోలీసు, వెంటనే సూరజ్ మొహంలోకి చూశాడు.
    "మిస్టర్ సూరజ్?"
    "యస్"
    "మీరు పక్కకి నిలబడండి"
    "ఎందుకు?"
    "తెలుస్తుంది."
    ఆందోళనగా చూస్తూ పక్కకి జరిగాడు సూరజ్.
    మరుక్షణంలో ఇంకో కానిస్టేబుల్ అతనిపక్కన నిలబడ్డాడు.
    "నాతో రండి" అన్నాడు బయటికి దారితీస్తూ.
    లాంజ్ లోకి రాగానే అక్కడ ఇంకొందరు పోలీసులు కనబడ్డారు. వాళ్ళతోబాటుగా ఒక డాక్టరు.
    అక్కడ నుంచి విఐపీ లాంజ్ లోకి తీసుకువెళ్ళారు సూరజ్ ని. అతనికేమీ అర్థం కావడం లేదు.
    "ఏమిటిదంతా?" అన్నాడు అసహనంగా.
    "సారీ మిస్టర్ సూరజ్! మీకు తెలియడంలేదు గానీ - యూ ఆర్ సిక్ - మీ ఆరోగ్యం సరిగా లేదు"
    "నాకేమీ కాలేడు. నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి."
    అతను అలా అంటూ ఉండగానే, ఇద్దరు కానిస్టేబుల్స్ సూరజ్ ని కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. డాక్టరు అతనికి ఒక ఇంజెక్షను ఇచ్చాడు.
    "జస్ట్ ఏ సెడేటివ్! మీకు టెన్షన్ తగ్గడానికి - అంతే!" అన్నాడు డాక్టర్.
    "ఫ్లయిట్ కి టైం..." అంటున్నాడు సూరజ్. అతని మాట తడబడింది.
    అంతలోనే అతనికి మగత కమ్మినట్లయింది. కళ్ళు మూతలు పడిపోయాయి.
    "మళ్ళీ కళ్ళు తెరిచేసరికి వుండాల్సిన చోటే వుంటావు సూరజ్!" అన్నాడు డాక్టరు అదోలా నవ్వుతూ.

                                     *    *    *    *

    "సరిగ్గా టైంకే వచ్చేశారు సర్! ఇంగ్లీషు పంక్చువాలిటీ మరి! ఇండియన్ పంక్చువాలిటీ కాదు" అన్నాడు జానీ.
    "నీ మెసేజ్ అందిందిగా!" అన్నాడు అభిరాం నవ్వుతూ. మళ్ళీ అన్నాడు.

 Previous Page Next Page