Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 20


    వారం రోజులయింది శాంతి ఊరువెళ్ళి. వాళ్ళ అమ్మకు సీరియస్ గా ఉందని టెలిగ్రాం వచ్చింది. ఆరోజు నుంచీ తనను మళ్ళీ ఒంటరితనం ఆవహించింది.
    అదే ఆఫీస్, అదే జనం, అదే బస్ లు, అదే కార్నర్ సీట్ అదే జీవితం, ఇల్లు మాత్రం కొత్తది.
    సావిత్రి కాఫీ తాగింది.
    హోటల్ నుండి బయటికొచ్చి జనంలో కలిసిపోయిందామె.
    గేటు తెరుచుకుని ఇంట్లోకి నడిచింది. బాలకృష్ణ ఇంటిముందు మెట్టుమీద కూర్చుని ఏదో పత్రిక చదువుతున్నాడు. సావిత్రి తాళం తీసి ఇంట్లోకి అడుగుపెట్టింది. రెండు ఉత్తరాలు పడి ఉన్నాయ్ కింద. బ్యాగ్ మంచంమీద పడేసి ఆత్రుతగా ఉత్తరాలు అందుకుంది.
    డార్లింగ్,
    సారీ, ఆలస్యంగా ఉత్తరం రాస్తున్నాను. మా అమ్మ పరిస్థితి ఇప్పుడు కొంత మెరుగయింది. కానీ ఓ సమస్య వచ్చిపడింది. నన్ను పెళ్ళిచేసుకోమని బలవంతం చేస్తుంది. ఈ ఎరేంజ్ డ్ మ్యారేజెస్ నాకు ఇష్టంలేదని నీతో చెప్పాను కదా! తను చనిపోయేలోగా నా పెళ్ళి చూడాలని ఉందట_ అమ్మకు. ఏం చేయటానికీ తోచడం లేదు. వాళ్ళు చూసి చేసే సంబంధమయితే ఏదొకటి దొరుకుతుంది. కానీ ఇప్పటికిప్పుడు ఎవర్నయినా అర్జంటుగా లవ్ చేసి పెళ్ళి చేసుకోవటం కుదరదు కదా! ఏం జరుగుతుందో తెలీదు. ఒకవేళ పెళ్ళివాళ్ళు కోరిన విధంగా చేసుకుంటే వుద్యోగంలో కంటిన్యూ వచ్చో లేదో తెలీదు. ఏదేమయినా మరో నెలరోజులవరకు ఇక్కడే ఉంటున్నాను. అమ్మ నన్ను వదలడం లేదు. ఆమె చనిపోతే నేను జీవితాంతం పెళ్ళి లేకుండా ఉండిపోతానని భయం. నేను హైద్రాబాద్ వదిలే ముందురోజు మనిద్దరం టాంక్ బండ్ మీద కూర్చుని మాట్లాడుకున్న విషయం గుర్తున్నాయా?
    వీలయినంత త్వరలో నా సలహా పాటించు. మీవాళ్ళు నీ గురించి శ్రద్ధ తీసుకోరు. నీ జీవితం నువ్వే మలుచుకోవాలి. ఎంతకాలం మనం జంటగా ఉంటాము? ఏదో ఒకరోజు ఎవరో ఒక పార్టనర్ ని వెతుక్కోవలసిందే కదా_ఆలస్యమయితే చాలా మిస్సవాల్సి వస్తుంది లైఫ్ లో__
    వెంటనే జవాబు రాయ్.
                                                                  నీ శాంతి.
    తండ్రి ఉత్తరం కూడా చదివిందామె.
    అంతా మామూలే__
    డబ్బు కావాలి! తనూ అమ్మా సౌత్ ఇండియా టూర్ వెళ్ళాలనుకుంటున్నారట. తనకు రిటైర్ మెంటు డబ్బు కొంత వచ్చింది కాబట్టి_మరికొంత ఆమె సహాయం చేస్తే_ ఉత్తరం చింపి అవతల పారేసింది సావిత్రి.
    హఠాత్తుగా ఆకలి వేయసాగింది. ఉదయం వంట చేయలేదు. దాంతో పస్తు. వంట చేయడం ప్రారంభించిందామె.
    భోజనం చేసి డాబామీదకొచ్చి కూర్చుంది. వెన్నెల నెమ్మదిగా అలుముకుంటోంది. రోజూ రాత్రుళ్ళు తనూ శాంతా అక్కడ కూర్చుని చాలాసేపు మాట్లాడుకుంటూ గడిపేవాళ్ళు. బాల్యం నాటి సరదాలూ, సంఘటనలూ, ప్రేమ కలాపాలూ ఒకటేమిటి అనవసరం అన్న విషయాలు లేవు. ఇంచుమించుగా ఇద్దరి జీవితాలూ ఒకటిగానే గడిచాయి ఇంతవరకూ. ఆ మాటకొస్తే ఏ ఆడపిల్ల జీవితమయినా పెళ్ళయ్యేవరకూ ఒకటిగానే వుంటుందేమో. అయినా శాంతి తనకంటే ధైర్యస్తురాలు! తనకంటే తెలివిగలది.

                      *    *    *    *

    మర్నాడు ఆఫీస్ నుంచి యింటికొచ్చేసరికి జరిగిందా సంఘటన.
    ఆ యువకుడు బాలకృష్ణతో మాట్లాడుతున్నాడు.
    అతనిని చూస్తూనే విపరీతమయిన ఆకర్షణకు గురయింది తను. చాలా అందంగా, అందాన్ని మించిన ఆకర్షణలో కనిపించాడు. అతి కష్టంమీద చూపులు మరల్చుకుని ఇంట్లోకెళుతుంటే బాలకృష్ణ పలుకరించాడు.
    "ఇవ్వాళ ఆలస్యంగా వచ్చారే?"
    "ఆఫీస్ లో పార్టీ జరిగిందండీ! జూనియర్ ఇంజనీర్ ఒకాయనకు ట్రాన్స్ ఫర్ అయింది__సెండాఫ్ ఇచ్చాము_"
    "ఏ ఆఫీసండీ మీది?" అడిగాడా యువకుడు.
    అతను డైరక్టుగా పలుకరిస్తాడని ఊహించలేకపోవడం వల్ల ఓ క్షణం ఆలస్యంగా జవాబు చెప్పింది.
    "అన్నట్లు ఇతనిని నీకు పరిచయం చేయనేలేదు కదూ? శంకర్! మా ఫ్రెండ్ రామకృష్ణ కొడుకు. మంచి డిసిప్లేర్. ఉద్యోగం వేటలో వచ్చాడిక్కడికి!
    "ఈ అమ్మాయి పేరు సావిత్రోయ్. ఈమె గురించి చెప్పాను కదా. మంచి రచయిత్రి అవబోతూంది త్వరలో.
    అతను చిరునవ్వుతో నమస్కరించాడు.
    తను ప్రతి నమస్కారం చేసింది. కొద్దిక్షణాలను యిద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. అప్పుడే ఆ కొద్దిరోజుల్లోనే అతని రూపం తన మనసంతా నిండిపోయింది.
    "నేను బి.కామ్ చదివానండీ. ఎక్కడయినా ఉద్యోగాలు వున్నట్లు తెలిస్తే దయచేసి నాతో చెప్పండి. నాకు స్పోర్ట్స్ ఎడిషనల్ క్వాలిఫికేషన్! స్పోర్ట్సు ఇష్టమ్ ఫరమ్స్ అయితే తప్పక తీసుకుంటారు..."
    అన్నాడతను లేచి నిలబడి.
    "ఓ తప్పకుండా చెపుతాను"
    "ఈ సందులోనే ఆ ఎలక్ట్రిక్ పోల్ పక్కన ఇల్లుంటే ముందుగది అద్దెకు ఇప్పించాను చెప్పాడు బాలకృష్ణ.
    "నేను రోజూ సాయం తాలు బాలకృష్ణగారి దగ్గరకొస్తూనే ఉంటానులెండి! మీకేమయినా ఉద్యోగం గురించి తెలిస్తే బాలకృష్ణగార్కి చెప్పండి__ఆ తర్వాత నేనే మిమ్మల్ని కల్సుకుంటాను."
    "అలాగేనండి__"
    తను యింట్లోకొచ్చేసింది...స్నానం ముగించి మా పని చూసుకొని డాబామీద కెళుతూ అతనింకా అక్కడ ఉండటం గమనించింది. అతను తనవంకే చూడటం, తప్పుకోబోయి మళ్ళీ చూడటం తనకు ఆనందం కలిగించింది...

 Previous Page Next Page