బంధువులు, స్నేహితులూ ఎవరూ దొరక్కపోతే ఆరోజు శాంతను, సావిత్రినీ కూర్చోబెట్టి తను ఎంతమంది అమ్మాయిలను రచయిత్రులుగా చేసిందీ, వారినెంత ఉన్నత స్థితికి తీసుకొచ్చిందీ చెప్తుండేవాడు.
"మీ ఇద్దరూ కూడా రచయిత్రులవాలని ఉంటే చెప్పండి. వెరీ ఈజీ" అన్నాడతను ఓ రోజు.
"ఎలా?" ఆశ్చర్యంగా అడిగింది శాంత. "నేను పది కథల వరకూ రాసి పత్రికలకు పంపించానుగానీ ఎవరూ వేసుకోలేదు."
"రచయిత్రులవ్వాలంటే అలా కథలు రాసి పంపకూడదు. కథలతో పాటు మనమూ వెళ్ళాలి.
"ఎందుకు?"
"ఎడిటర్ని కలుసుకోవాలి. అయినా ఈ గొడవలన్నీ మీకెందుకు? మీరు అయిదు వందలు ఖర్చు చేయండి. ఠకీమని రచయిత్రి చేసే బాధ్యత నాది."
"అయిదు వందలెందుకు?"
"ఇన్వెస్ట్ మెంట్! తరువాత బోలెడు ఇన్ కమ్."
"మీరేం చేస్తారా డబ్బుతో?"
"అది మీకనవసరం. మీ పేరు పాతికవారాలపాటు పబ్లిసిటీ ఇచ్చి అప్పుడు కథ వేస్తారు. ఆ పత్రికమీద మీ ముఖచిత్రం కూడా వేయిస్తాను. ఎడిటర్ మావాడే. మేమిద్దరం మొదటినుంచీ బాగా క్లోజ్."
"సరేలెండి అలోచించి చెప్తాం" నవ్వాపుకుంటూ అంది సావిత్రి. ఇద్దరూ వచ్చేస్తుంటే బాలకృష్ణ...
"ఏమండోయ్ సావిత్రిగారూ మీరయినా సరే...అయిదువందల కోసం చూసుకోకండి" అంటూ వెనుకే వచ్చాడు.
"సరేలెండి! జీతం వచ్చాక..." అబద్ధమాడేసింది.
ఆ కొద్దిరోజులు ఎలా గడిచిపోయిందో తనకే తెలీదు. ఎప్పుడయినా శ్రీరామ్ గుర్తుకొచ్చినా వెంటనే ఆ జ్ఞాపకాలను చెరిపేసేందుకు శాంతితో కబుర్లలోకి దిగిపోయేది. క్రమేపీ అతనిని పూర్తిగా మరచిపోతున్న తరుణంలో తిరిగి కనిపించాడతను.
ఆఫీసునుంచి వస్తుంటే కోఠీలో ఎదురుగా వచ్చేశాడు. ఇద్దరికీ పలుకరించుకోవటం తప్ప గత్యంతరం లేకపోయింది.
అతనే ముందు పలకరించాడు.
"హలో బాగున్నారా?"
"ఊ!"
"అదే ఇంట్లో ఉంటున్నారా?"
"ఇంకో ఇంటికి మారాను."
"ఆరోజు మీతో చెప్పి వెళ్దామనుకున్నాను. కానీ"
"ఎలాగయినా ఒకటే నాకు."
కొద్దిక్షణాలు నిశ్శబ్దం. వెళ్ళిపోవడానికి సిద్ధమయింది సావిత్రి.
"జరిగిందానికి అయామ్ రియల్లీ సారీ."
"తప్పు నాదే అని నేననుకుంటున్నాను."
"మనిద్దరిదీ ఉందేమో."
"మీదెలా ఉంటుంది. మీక్కావలసింది లభించినప్పుడు మీకు నచ్చిన విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఉంది. అదీగాక మీరు మగాళ్ళు. ఆడదాని విషయంలోనే మగాడి ఆధిక్యత, బలహీనత రెండూ బయటపడేది."
అతని ముఖం పాలిపోయింది.
"మనం ఇంక ఆ విషయం వదిలేయటం మంచిదనుకుంటాను."
"మీరే ప్రారంభించారు."
కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయినయ్.
"తర్వాత మిమ్మల్ని కలుసుకుందామని ప్రయత్నించాను. కానీ తీరిక లేక..."
"నేను మీకోసం ఎదురుచూడలేదు?"
"చూడరని తెలుసు__అయినా__తర్వాత నాకు ట్రాన్స్ ఫర్ అయింది. ప్రస్తుతం విజయనగరంలో ఉంటున్నాను..."
"... ... ..."
"మీకు కనీసం ఉత్తరమయినా రాద్దామనుకున్నాను. కానీ..."
"... ... ..."
ఆమె మౌనం అతనికి భయం కలిగిస్తోంది. కాంషన్ నెస్! తనదే తప్పని భావన.
"నేను వెళుతున్నాను..." ఓ అడుగు వేసిందామె.
అతను చప్పున మాట్లాడాడు.
"పోనీ, కాఫీ తాగుదామంటారా? యాజ్ ఫ్రెండ్స్."
"ఫ్రెండ్ షిప్ అంటే కాఫీ తాగటం కాదు."
ఆమె వెళ్ళిపోయింది.
కొద్దిక్షణాలు అక్కడే నిలబడిపోయాడతను.
సావిత్రి హోటల్లో కూర్చుంది.
మళ్ళీ అదే కార్నర్ సీట్! ఖాళీగా తనను ఆహ్వానిస్తూ__
చెవిలో నెమ్మదిగా, విషాదంగా_రహస్యంగా మళ్ళీ అదే పాట.
"ఇన్ ఖారీదునియామె కోయీభి హమా నహువా"
కిటికీలోనుంచి చూసిందామె.
ఆ జనప్రవాహంలో ఠీవిగా, అందంగా నడిచి వెళ్ళిపోతున్నాడు శ్రీరామ్. అతనివంకే చూస్తూంటే కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్.
అతని రూపం మసగ్గా అయిపోయింది.
కన్నీరు తుడుచుకుని బేరర్ తీసుకొచ్చిన కాఫీ తాగింది.