ఆరోజు తనను ఒంటరితనం అంతగా బాధించ దెందుకనో!
మర్నాడు ఆఫీస్ కెళ్ళేప్పుడు అతని గది దగ్గరకొచ్చేసరికి తనకు తెలీకుండానే అడుగులు నెమ్మదయినాయి... చూపులు అతని కోసమే వెతకసాగినాయి. ఇలా చాలా ఎక్కువసార్లు జరిగింది. సాధారణంగా తనే మగాళ్ళను ఆకర్షించేది గానీ తననెవరూ ఇంతగా ఆకర్షించలేదు.
సంధ్య వాళ్ళన్నయ్య నవీన్ మొదటిసారి తనను ఆకర్షించాడు. కాలేజీలో చదువుతుందీ తనప్పుడు. అతను బాడీ బిల్డర్. కండలు తిరిగిన శరీరం, ఎత్తుగా ఉబికిఉన్న ఛాతీ ఇవన్నీ తనను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రెండోరోజు మళ్ళీ ఏదో వంక పెట్టుకుని సంధ్య ఇంటికెళ్ళి అతనిని చూచేవరకూ తన మనసూరుకోలేదు.
కానీ అతని కప్పటికే ఓ ప్రియురాలు ఉందని సంధ్య ద్వారా తెలిశాక తను మనసుకి కళ్ళెం వేసింది.
ఇంత కాలానికి ఇప్పుడు ఇతను అంతగా ఆకర్షించాడు తనను.
హఠాత్తుగా ఆమె అడుగులు తడబడినాయి.
అతను గది గడపలోకొచ్చి నిలబడి చూసి చిరునవ్వు నవ్వాడు.
"గుడ్ మాణింగ్ మేడమ్! ఆఫీస్ కి బయలుదేరున్నారు."
"అవునండీ!"
"ఇవాళ నుంచే వంట చేయటం నేర్చుకుంటుంన్నానండీ! నేననుకున్నంత తేలిక కాదు."
అతనితో మాట్లాడాలంటే__అదే రోడ్డుమీద తనకు సిగ్గుగా వుంది. అప్పటికే ఓ యువతి కిటికీలో నుంచి తామందిరినీ పరీక్షగా చూస్తోంది.
తను నవ్వేసి జవాబివ్వకుండా ముందుకి నడిచింది.
ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి అప్రయత్నంగా తన కళ్ళు బాలకృష్ణ కూర్చునేచోట వెతికినారు.
అతను అక్కడే వున్నాడు.
తనను చూసి "గుడీవినింగండీ..." అన్నాడు నవ్వుతూ.
"గుడీవినింగ్" అనేసి తను లోపలకు నడిచింది.
వారం రోజులు పలుకరింపులతో చిరునవ్వులతో గడచిపోయినాయి. ఆ వారం రోజులూ తను ఆఫీస్ కనిపించే ప్రతి న్యూస్ పేపరూ వెదికింది...అతని కోసం ఏమయినా ఉద్యోగాలు కనిపిస్తాయేమోనని!
చివరకు దొరికింది ఓ ప్రకటన.
అది కట్ చేసుకుని ఆ రోజు సాయంత్రం ఆరుకిచ్చింది.
"చాలా థాంక్సండీ...నాకోసం మీరు ఇంత ఇంట్రస్ట్ తీసుకుంటున్నారు..." అన్నాడతను.
ఆ తరువాత అదే కార్యక్రమం అయిపోయింది. తను పేపర్ కటింగ్ లన్నీ తీసుకెళ్ళి అతనికివ్వటం అతను అప్లయ్ చేసి తనకు చెప్పటం__
క్రమేపీ తనకు జీవితం మీద మళ్ళీ ఆసక్తి మొదలయింది. అతని గురించిన ఆలోచనలు ఎక్కువవుతున్నాయి.
లోలోపల__ఆశలు మొలకెత్తినాయి__
వంటరితనం అదివరకులా బాధించటం లేదు.
ఆరోజు ఆఫీస్ కెళ్ళడానికి రడీ అవుతుంటే "ఏవండీ" అంటూ పిలవటం వినిపించింది.
అతని గొంతుని అతనివేపు చూడకుండా గుర్తుపెట్టింది తను.
"మీరా! రండి!" అంది ఆనందం అణచుకుంటూ.
అతను లోపలికొచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
"ఓ చిన్న సహాయం చేస్తారేమోనని..."
"చెప్పండి...ఏమిటది?"
"ఈ ఉద్యోగానికి అప్లయ్ చేద్దామంటే గెజిటడ్ ఆఫీసర్ సర్టిఫికేషన్ కావాలంటున్నారు...నాకేమో ఇక్కడ తెలిసిన వాళ్ళెవరూ లేరు. బాలకృష్ణగారినడిగితే తనకు ఎడిటర్లూ, రచయిత్రులూ తప్పితే ఇంకెవరూ తెలీదన్నారు."
తను ఓ క్షణం ఆలోచించింది.
తనకు తెలిసిన గెజిటెడ్ ఆఫీసర్స్ ఒకరిద్దరు ఉన్నారు గానీ...వాళ్ళ దగ్గర కెప్పుడూ అప్లికేషన్స్ కెళ్ళలేదు... ఇప్పుడు ప్రయత్నిస్తే...
అవును! అతని కోసం అడిగితే తప్పేముంది?
అతని చూపులు...తన కళ్ళల్లోకి__ప్రశ్నల బాణం వదులుతూంటే ఆలోచించుకునేంత వ్యవధి కూడా లేదు.
"ఒకవేళ కుదరదనుకుంటే పోనీండి..." అన్నాడతను.
"ప్రయత్నిస్తాను...ఇటివ్వండి __ తెలిసిన అందరూ ఉన్నారుగానీ...వాళ్ళెంతవరకూ ఒబ్లయిజ్ చేస్తారో చూద్దాం__"
అతను అప్లికేషన్ ఆమెకిచ్చాడు.
"సారీ మేడమ్__మీకు శ్రమ ఇస్తున్నాను."
"ఇటిజ్ ప్లెజర్..." అప్రయత్నంగా అనేసింది.
"థాంక్యూ__"
అతను వెళ్ళిపోయాడు.
ఆఫీసు చేరుకున్నాక ఆత్రుతగా అతని సర్టిఫికెట్లు తీసి చూసింది. డిగ్రీ పూర్తిచేశాడతను. మార్కులు యావరేజ్ మార్కులు. కాండక్ట్ సాటిస్ ఫాక్టరీ! శంకర్. స్పోర్ట్సు అండ్ గేమ్స్ సర్టిఫికెట్లు రెండూ_ ఇంటర్ కాలేజియే ట్ లో హాకీ రన్నర్స్ అప్, వాలీబాల్ లో కామెంట్రీ రిప్రజెంట్ చేశాడు! అవన్నీ చూస్తుంటే నవ్వు వచ్చింది సావిత్రికి. బహుశా ఈపాటికి ఆ ఆటలన్నీ మర్చిపోకుండా ఉంటాడు. రెండేళ్ళయింది అతను కాలేజీ వదిలి.
ఆ తరువాత పాపం కాలేజ్ స్పోర్ట్సు మాస్టర్ ఉద్యోగం వెతికే స్పోర్ట్సులో పడిపోయి వుంటాడు. ఈ విషయంలో తను అదృష్టవంతురాలు. ఎక్కువ రోజులు బాధపడకుండానే ఉద్యోగం దొరికింది. అయితే ఈ గెజిటెడ్ ఆఫీసర్ల సంతకాల కోసం నిరుద్యోగులు పడే బాధ తనకూ అనుభవమే! అందుకే అతను అడిగేసరికి కాదనలేకపోయింది. మధ్యాహ్నం వాటన్నిటి మీదా సంతకాలు తీసుకొని తన పర్సనల్ సొరుగులో ఉంచింది. సాయంత్రం అతను తనకోసం ఇంటి దగ్గరే నుంచుని ఎదురు చూస్తుంటాడేమో! 'థాంక్స్' అని ఊరుకుంటాడా, లేక ఇంకేమయినా మాట్లాడతాడా! మధ్యాహ్నమంతా అతని గురించే ఆలోచనలు...! తను వద్దనుకున్నా ముసురుతూనే వున్నాయని. సాయంత్రం అనుకోకుండా తనకి పని ఎక్కువయిపోయింది. అప్పటికప్పుడు తయారుచేసి సంతకాలు తీసుకోవాల్సిన 'మోస్ట్ వాంటెడ్' ఫైల్స్ రెండు తన టేబుల్ మీద కొచ్చినయ్. వాటికోసం అయిదు దాటినా తమ సెక్షన్ ఆఫీసరూ, హెడ్ క్లర్కూ, అంత ఎదురుచూస్తూ కూర్చున్నారు. వాటిని వదిలించుకొని ఆఫీసునుంచి బయటపడేసరికి అయిదున్నర దాటిపోయింది టైమ్. బయటకొచ్చి బస్ ఎక్కాకగానీ అతని అప్లికేషన్ సంగతి గుర్తుకురాలేదు. వాటిని టేబుల్ సొరుగులోనే మర్చిపోయి వచ్చేసింది.