సముద్రపు ఒడ్డున నిశాంత అస్పష్టంగా కనిపించేటంతవరకూ అలా ఎందుకో చూస్తూ వుండిపోయాడాయన.
ఆమెను మళ్ళీ చూడడానికి ముందుకు పరిగెత్తాడాయన.
నిశాంత కన్పించలేదు.
ఎప్పుడూ బీచ్ లో అరగంటసేపు మాత్రమే జాగింగ్ చేసే ఆయన మరో పదిహేను నిమిషాలసేపు తన ప్రోగ్రామ్ ని పెంచడం ఆశ్చర్యంగా వుంది సెక్యూరిటీ గార్డ్సుకి.
సరిగ్గా-
ఆరు నలభై అయిదు నిమిషాలకు వ్యాన్ ఎక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడాయన.
అప్పటికే బీచ్ రోడ్డుమీద ట్రాఫిక్ పెరిగింది.
ఎందుకో ఆయన కళ్ళు నిశాంత కోసం వెతికాయి మరోసారి.
* * * *
మర్నాడు...
సరిగ్గా అయిదు యాభై అయిదు నిమిషాలైంది.
బీచ్ ఒడ్డున ఇసకలో కూర్చుని చుట్టూ చూస్తున్నాడు దేశ్ ముఖ్.
ఆ అమ్మాయి ఎక్కడా కన్పించలేదు.
ఎందుకో జాగింగ్ చేయాలనిపించలేదు ఆయనకీ.
ఆరూ పది నిమిషాలు, ఇరవై నిమిషాలు, ముప్పై నిమిషాలు, నలభై నిమిషాలు, నలభై అయిదు నిమిషాలు.
జాగింగ్ కి వచ్చిన బాస్ ఎందుకలా కూర్చుండిపోయాడో అర్ధంకాని సెక్యూరిటీ గార్డులు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం ప్రారంభించారు.
నెమ్మదిగా లేచి నుంచున్నాడాయన.
కదులుతున్న అలలు, రాత్రి మంచులో తడిసిన మెత్తని ఇసక, అతని కళ్ళు ఆ అమ్మాయిని వెతుకుతున్నాయి.
నెమ్మదిగా వచ్చి వ్యాన్ ఎక్కాడాయన.
ఇగ్నీషన్ కీ తిప్పి, గేర్ మార్చబోతూ తలెత్తి చూసిన ఆయనకి రోడ్డు మీద పరుగెత్తికొస్తున్న నిశాంతను చూడగానే ఏం చేయాలో అర్ధం కాలేదు ఒక్కక్షణం.
"హలో... యంగ్ మేన్... హౌ ఆర్యూ... టుడే ఐయామ్ లేట్- సారీ..." సీయూ... టుమారో."
నవ్వుతూ విష్ చేసి ముందుకు పరుగెడుతోంది నిశాంత.
సెక్యూరిటీ గార్డులవైపు చికాగ్గా చూసి, గేరు మార్చాడాయన.
* * * *
మూడో రోజు-
ఉదయం సరిగ్గా ఆరుగంటలు.
సిమెంట్ రోడ్డు మీద వ్యాన్ పరుగెడుతోంది. వ్యాన్ లో కూర్చున్న దేశ్ ముఖ్ చూపులుకూడా పరుగెడుతున్నాయి.
"హలో... యంగ్ మేన్... హౌ ఆర్యూ" ఆ టీనేజ్ గర్ల్ పిలిచినా పిలుపుని మరిచిపోలేకపోతున్నాడు ఆయన.
ఇసక దిబ్బ మీద కూర్చుని సముద్రపు అలలు వైపుచూస్తున్న ఆయన-
"హలో... స్మార్ట్... హౌ ఆర్యూ?"
ఆ పిలుపుకి తల పక్కకు తిప్పి చూశాడు. ఎప్పుడొచ్చిందో ఏమో చేతికి అందేటంత దూరంలో నిశాంత.
జాగింగ్ డ్రస్ లో బంగారు బొమ్మలా వున్న ఆ అమ్మాయి కళ్ళవైపే చూస్తున్నాడాయన.
"నీ పేరు" అడిగాడాయన.
జవాబు చెప్పలేదు నిశాంత.
"మీ ఇల్లెక్కడ?"
నవ్వింది కానీ జవాబు చెప్పలేదు.
"ఏం మాటలు రావా?"
"మాటలు రావా అని అడిగితే నాకు కోపం వచ్చి నేను చెప్తాననా? చెప్పను" బుంగమూతి పెడుతూ అంది నిశాంత.
"మరెలా చెప్తావ్?"
ఒక్కక్షణం ఆలోచించింది నిశాంత.
"నేనో ప్రశ్న వేస్తాను... మీరు జవాబు వెంటనే చెప్పాలి. మీరు వెంటనే జవాబు చెప్తే, నేను వెంటనే నా పేరు చెప్తాను. అలాగేనా?" కళ్ళు చిత్రంగా తిప్పుతూ అంది నిశాంత.
"అడుగు...."
"If we call oranges- oranges, why don't we call bananas- yellows, or apples reds?"
ఇంగ్లీషులో అడిగింది నిశాంత.
రెండు నిమిషాలు, మూడు నిమిషాలు ,ఐదు నిమిషాలు...
"సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది. మీరెళ్ళిపోతారుగదా... మీరెళ్ళండి. రేపు కలిసినప్పుడు చెప్పండి" ఇసకమీద నుంచి లేస్తూ అంది నిశాంత.
"రేపటివరకూ ఎందుకు... ఒక గంటలో చెప్పనూ" నవ్వుతూ అన్నాడాయన.
"అయితే ఏదో టైమ్ లో మీకు ఫోన్ చేస్తాను... చెప్తారా?" పెద్ద కళ్ళను మరింత విశాలంగా చేసుకుంటూ అడిగింది నిశాంత.
"నా ఫోన్ నెంబర్ తెల్సా?" ఆశ్చర్యంగా అడిగాడాయన.
"తెల్సుకుంటాను... అరగంట చాలు" ధీమాగా అంది నిశాంత.
"ఎలా?" సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడాయన.
"ఫోన్లో మీతో మాట్లాడినప్పుడు చెప్తాను" ముందుకు పరిగెత్తింది నిశాంత.
"ఎన్ని గంటలకు ఫోన్ చేస్తావ్" బిగ్గరగా అరిచాడాయన.
"నో టైమ్ బార్..." కేకేసి చెప్పింది తల తిప్పకుండానే.
మరో పదిహేను నిమిషాల తర్వాత ఇస్కాన్ కృష్ణ దేవాలయం వెనక పార్క్ చేసి వున్న మారుతీ కారు దగ్గరకొచ్చింది.
కారు డ్రైవింగ్ సీట్లో ఎలిజబెత్ కూర్చుని వుంది. నిశాంత కారు ఎక్కగానే కారు స్టార్టయ్యింది.
"ఆయన నీతో ఏం మాట్లాడాడు?" అడిగింది ఎలిజబెత్.
చెప్పింది నిశాంత.
ఆయనెదురుగా రెండ్రోజులు జాగింగ్ చేయడం, ఆయన్ని చూసి నవ్వడం, మూడోరోజు తనెవరో ఏంటో తెలియనివ్వకుండా మాట్లాడ మనడం అంతా గమ్మత్తుగా వుంది నిశాంతకు.
"అసలేంటి ఇదంతా? ఇంతకీ ఆయనెవరు?" ఆసక్తిగా అడిగింది నిశాంత.