Previous Page Next Page 
ఆక్రోశం పేజి 19


    అందుకే వాళ్ళకి అనుకూలంగానే తను స్పందించటం ప్రారంభించింది.

 

    ఆమెలో వస్తున్న మార్పు అచ్యుతమునికి ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోంది.


                                                   *    *    *    *


    బొంబాయి.

 

    జుహూ బీచ్ ఏరియాలోని శివసాగర్ ఎస్టేట్ రోడ్డు.

 

    అతి విలాసవంతమైన ఆ ప్రాంతంలో బీచ్ రోడ్డుకు కుడిప్రక్కన చాక్ లెట్ కలర్లో వుందా భవనం.

 

    నిలువెత్తు గోడల మధ్య పెద్ద ఇనపగేటు, అటూ ఇటూ తిరుగుతున్న గూర్ఖా.

 

    గేటుకి మెయిన్ బిల్డింగ్ కి మధ్య అందమైన గార్డెన్, పోర్టికో...

 

    బిల్డింగ్ వెనక స్విమ్మింగ్ ఫూల్, ఆ బిల్డింగ్ కి నాలుగువైపులా ఇరవై నాలుగుగంటలూ గస్తీ తిరిగే గార్డ్సు...

 

    పర్మిషన్ లేకుండా ఎవరూ ఆ బిల్డింగ్ లోకి వెళ్ళడానికి గానీ, రావడానికిగానీ వీల్లేదు.

 

    ప్రస్తుతం...

 

    ఆ బిల్డింగ్ లోని స్విమ్మింగ్ ఫూల్లో అరగంటనుంచి ఈదులాడుతుంది నిశాంత.

 

    "వచ్చెయ్ బేబీ! స్విమ్మింగ్ టైమైపోయింది. నీకోసం టీచర్ వెయిట్ చేస్తోంది... రా..." ఒడ్డున నిలబడిన ఆయా ఎలిజబెత్ అరుస్తోంది.

 

    విసుక్కుంటూ ఒడ్డుకొచ్చింది నిశాంత.

 

    "నువ్వెప్పుడూ ఇంతే... ఈదుకోనివ్వవ్... ఆడుకోనివ్వట్... ఇప్పుడు... నేనా ఇంగ్లీషు నేర్చుకోపోతే ఏం?" టర్కీ టవల్లో తన వంటిని తుడుస్తున్న ఎలిజబెత్ వైపు చూస్తూ అంది నిశాంత అసహనంగా.

 

    "షెడ్యూలు ప్రకారం నీ చేత పనులు చేయించడం ఇట్స్ మై డ్యూటీ... అదే నా జాబ్" నవ్వుతూ నైటీ తొడుగుతూ అంది ఎలిజబెత్.

 

    "అయితే నీ జాబ్ కి టూ డేస్ లీవ్ పెట్టు."

 

    "నాకు లీవ్స్ వుండవు బేబీ!" లోనికి తీసికెళ్తూ అంది ఎలిజబెత్.

 

    అప్పటికే నిశాంత కోసం హాల్లో కూర్చుని ఎదురుచూస్తోంది ఇంగ్లీష్ టీచర్.

 

    "గుడ్ ఈవెనింగ్ టీచర్!" విష్ చేసింది నిశాంత.

 

    "యూ ఆర్ ఫైవ్ మినిట్స్ లేట్" ఇంగ్లీష్ టీచర్ అంది.

 

    "నో మేడమ్... యువర్ టైమీజ్ రాంగ్... అయామ్ ఆల్వేస్ పంక్చువల్... సీ మై వాచ్..." చేతి వాచీని టీచర్ కి చూపించింది నిశాంత.

 

    కరెక్టుగా అయిదు గంటలైంది.

 

    "సారీ బేబీ!" తన చేతి వాచీలోని ముల్లును వెనక్కి తిప్పుకుంటూ అంది ఇంగ్లీష్ టీచర్.


                                                     *    *    *    *


    "కృపానంద దేశ్ ముఖ్ సిటీలోనే వున్నాడు కదూ" అడిగాడు అచ్యుతముని.

 

    "అవును" వెంటనే జవాబిచ్చాడు జనమేజయరావు.

 

    తలపంకించాడు సాలోచనగా అచ్యుతముని.

 

    "నిశాంత ఎలా వుంది?" సడన్ గా అడిగాడు అచ్యుతముని.

 

    "ఆ పిల్లను మీరిప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు" చెప్పాడు జనమేజయరావు.

 

    "ఇంతవరకూ ఆమెను బయటకు పంపించలేదు కదూ?"

 

    "ఎస్ సర్..."

 

    "రేపట్నించీ నిశాంత ఉదయం ఆరు, ఏడుగంటల మధ్య జుహూ బీచ్ లో జాగింగ్ కు వెళ్తుంది" ఆర్డర్ జారీ చేశాడు అచ్యుతముని.

 

    ఎందుకని ఎదురుప్రశ్న వేయలేదు జనమేజయరావు.


                              *    *    *    *


    సరిగ్గా ఉదయం ఆరుగంటలు.

 

    జుహూ బీచ్ చల్లగా, ప్రశాంతంగా వుంది. సముద్రం ప్రశాంతంగా నీలాకాశంగా వుంది.

 

    విశాలమైన బీచ్ సిమెంట్ రోడ్డు మీద అరవై కిలోమీటర్ల స్పీడుతో మారుతీ జిప్సీ వ్యాన్ దూసుకుపోతోంది.

 

    ఆ వ్యాన్...

 

    ఆ వ్యాన్ డ్రైవింగ్ సీట్లో దేశ్ ముఖ్ కూర్చున్నాడు. స్నఫ్ కలర్ టీ షర్ట్. నిక్కర్, కళ్ళజోడు, స్పోర్ట్స్ షూస్...

 

    సడన్ గా ఆగింది వ్యాన్. వ్యాన్ లోంచి దిగిన అరవై రెండేళ్ళ దేశ్ ముఖ్ రోడ్డుమీద నుంచి, సముద్రపు ఒడ్డున వున్న ఇసుకలోకి నడవటం ప్రారంభించాడు.

 

    మరో రెండు నిమిషాల తర్వాత...

 

    వ్యాన్ వెనకకొచ్చి ఆగింది సిమెంట్ కలర్ జీప్.

 

    ఆ జీప్ లోంచి నలుగురు సాయుధులైన బాడీగార్డులు దిగారు.

 

    ఇరవై అడుగుల దూరంవరకూ నడిచి వెళ్ళిన దేశ్ ముఖ్ నెమ్మదిగా పరిగెత్తడం ప్రారంభించాడు.

 

    దూరంగా ఇస్కాన్ కృష్ణదేవాలయంలోంచి భక్తులు మ్రోగిస్తున్న గంటల ధ్వని విచిత్రంగా గాలి తెరల్లో కలిసి ప్రతిధ్వనిస్తోంది.

 

    సముద్రంలోని అలలు ఒకదానిమీద ఒకటి పడి నెమ్మదిగా కదులుతున్నాయి.

 

    పావుగంట గడిచింది.

 

    తడి ఇసక మీద పరుగెడుతున్న అతను తనకి ఎదురుగా పరిగెత్తుకొస్తున్న నిశాంతను చూసి ఒఅక్కక్షణం కంగారుపడ్డాడు.

 

    బిజినెస్ రైవల్ గ్రూప్స్... ఏ రూపంలో ఎక్కడ దెబ్బతీస్తారో తెలీదు. అందుకే దేశ్ ముఖ్ లాంటి వ్యక్తులు ఇరవైనాలుగు గంటలూ అప్రమత్తంగా వుంటారు.  

 

    ముఖ్యంగా దేశ్ ముఖ్!

 

    అప్రయత్నంగా అతని చెయ్యి నిక్కర్ పాకెట్లో వున్న పిస్టల్ మీద పడింది.

 

    ఎదురుగా-

 

    వస్తున్న ఆ అమ్మాయి ముఖంలోకి మరోసారి చూశాడతను.

 

    అదే సమయంలో-

 

    అతని ముఖంలోకి ఆ అమ్మాయి చూసింది.

 

    నవ్వింది నిశాంత!

 

    అమాయకమైన ముఖం ఆ ముఖంలో అమాయకమైన నవ్వు.

 

    "గుడ్ మార్నింగ్" విష్ చేస్తూ ముందుకెళ్ళిపోయింది నిశాంత.

 

    ఆగిపోయాడు అతను.

 

    తనను దాటి ముందుకు వెళ్ళిపోతున్న నిశాంత వైపు చూస్తున్నాడాయన.

 Previous Page Next Page