Previous Page Next Page 
రక్తచందనం పేజి 20


    ఒకింతసేపటికి సంబరం సద్దుమణిగింది.
    చూస్తుండగానే ఆ లోయ గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోయింది. వీరూతో కలిపి కేవలం ఒక డజనుమందే సమరానికి సిద్ధంగా వున్నారు.
    చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం.
    వెలిగించి చాలాసేపు కావటంతో దివిటీలు కొడిగట్టే దశకొచ్చేశాయి. బాగా తాగి, తిని, నృత్యం చేసి, అలసిపోయి శవాల్లా పడిపోయి వున్న వాళ్ళను చూసి ఒక నిట్టూర్పు విడిచాడు వీరూ.
    అంతలో నిశ్శబ్దాన్ని చీలుస్తూ భయానకంగా అరిచింది తీతువు. వెళ్ళిన అనుచరుడు పరిగెత్తుకుంటూ రావటాన్ని చూశారంతా. పరిసరాల్లో ఉద్విగ్నత.
    "పోలీసులేమో...." ఒకరన్నారు అనుమానంగా.
    "పోలీసులే. రావటానికి అరగంట పట్టవచ్చు. మిగిలివున్న కాగడాల్ని ఆర్పేయండి" అన్నాడు వీరూ గంభీరంగా.
    అందరూ చకచక ఆ పనిలో నిమగ్నమయిపోయారు.
    "పోలీసులొచ్చేస్తున్నారు చాలామంది ఉండవచ్చు. తప్పుకోవటమా, తాడో పేడో తేల్చుకోవటమా?" పరిగెత్తుకుంటూ వచ్చిన అనుచరుడన్నాడు భయాందోళనలతో.
    కొద్ది క్షణాలు నిశ్శబ్దం.
    "ఒక్కొక్కరు డజను దివిటీలను తీసుకొని చెట్లు ఎక్కండి. ఆ దివిటీలను ఒక్కొక్క కొమ్మకు ఒకటి చొప్పున కట్టేయండి. సరీగ్గా భైరవీ అరవగానే చకచకా వాటిని వెలిగించండి" అంటూ వీరూ తన భుజానికి వేలాడుతున్న మేగ్నమ్_500 రైఫిల్ ని ఒకసారి తడిమి చూసుకున్నాడు.
    "మీరు ఊఁ....అంటే పిట్టల్లా కాల్చి పడేస్తాం యజమానరే" వీరూకి కాపలాగా వున్న నలుగురిలో ఒకరయిన ముత్తప్ప" అన్నాడు.
    వీరూ నవ్వాడు.  
    "ప్రతి సంవత్సరం ఈ రోజు ఈ గూడెంలో సంబరం జరుగుతుందని పోలీసులకు తెలుసు. అలా అని మనకు తెలుసు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. మన రక్షణ మనం చేసుకోవాలి. నేర్పుగా తప్పించుకోగల అవకాశం వున్నప్పుడు ఘర్షణకు దిగటం ఎవరికీ క్షేమం కాదు" అన్నాడు వీరూ స్థిరంగా.
    మెషిన్స్ కన్నా వేగంగా వాళ్ళు ఒక పాక దగ్గరకు వెళ్ళి ఆ గూడెం ప్రజలు స్టాక్ చేసుకున్న దివిటీలను అందుకొని తలా వొక దిక్కుకు సాగిపోయారు.


                                                 *    *    *    *


    కీచురాళ్ళ రొద తప్ప అడవంతా గాఢసుషుప్తిలో వుంది. దాదాపు యాభైమంది పోలీసులు ఒక యస్.ఐ. ఆధ్వర్యంలో ఉత్తరదిశలో ఉన్న దింపా గూడేనికేసి వడివడిగా సాగివస్తున్నారు. వాళ్ళ చేతుల్లో 307 రైఫిల్స్ స్టెన్ గన్స్ వున్నాయి.
    వాళ్ళ కాళ్ళక్రింద పడిన ఎండుటాకులు, పుల్లలు టపటపమని నలిగిపోతున్నాయి. ఆ శబ్దానికి చిన్న చిన్న జంతువులు భయంగా పరుగులు తీస్తున్నాయి.
    ఎత్తుగా ఎదిగిన చెట్ల చాటునుంచి కేరియన్ ఏనిమల్స్ (కుళ్ళిన మాంసాన్ని తిని బ్రతికే చిన్న జంతువులు) సాగిపోతున్న పోలీసుల్ని, వొకరి చేతిలో వున్న పవర్ ఫుల్ టార్చ్ లైట్ ని చూసి పొదల్లోకి జరుగుతున్నాయి.
    "మనం దుస్సాహసం చేస్తున్నామేమో" వొకరన్నారు పరిసరాల్ని చూసి భయపడిపోతూ.
    "ఇప్పుడక్కడ చిరుతపులే వుంటే మన గతేమిటి?"
    (చిరుతపులంటే అతని దృష్టిలో వీరూ అని అర్థం. పోలీసులు వీరూని అలాగే సంబోధిస్తుంటారు)
    "రెండు గంటల క్రితం మనం తిన్నవే ఆఖరి నూకలవుతాయి"
    "ఈ అడవిలో వున్న గూడేలు, పల్లె ప్రజలు వీరూ ద్వారా రక్షణ పొందుతున్నారు. మెరుగయిన సౌకర్యాల్ని స్వంతం చేసుకుంటున్నారు.
    అంతేకాదు తన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళను నిర్దాక్షిణ్యంగా చంపిపడేస్తాడని కూడా వారికి తెలుసు. అలాంటప్పుడు దింపాగూడెం ప్రజలెలా సహకరిస్తారు?"
    "ఇతరులెవరన్నా దింపాగూడెం రాకాసి లోయలోకి వెళితే మరిక తిరిగి రావటం వుండదని కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. పైగా వాళ్ళ భాష మనకి తెలీదు. ఏమిటో....మన బ్రతుకులు....రక్షణ కల్పించవలసిన మనమే మన రక్షణ కోసం భయపడవలసి వస్తోంది"
    ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమని లీడ్ చేస్తున్న ఎస్.ఐ.కి వినపడేలా అన్నారు.
    వేగంగా వెళ్తున్న ఆ ఎస్.ఐ. ఒక్క క్షణం ఆగిపోయాడు.
    మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీరూ ఎక్కడా ఏ గూడెంలోను రెండు గంటలకి మించి వుండడు. ఎవర్నీ, ఏ పరిసరాల్నీ నమ్మడు. ఈ గూడెంలో సంబరం ఐదు గంటలకి ఆరంభమవుతుంది. ఎనిమిది గంటలకల్లా చిత్తుగా తాగి, సుష్టుగా తిని పడిపోతారట. సో....వీరూ ఈపాటికి వచ్చి వెళ్ళిపోయుంటాడు" ఎస్.ఐ. మాటలకు అడ్డు తగులుతూ ఒకరన్నారు.
    "మరి మనం వెళ్ళి ప్రయోజనం....?"
    "వీరూ తాగకపోయినా అతని అనుచరులు తాగుతారట, బాగా తింటారట సరీగ్గా 24 గంటల క్రితం వరకు వాళ్ళు సాండిల్ ఉడ్ ని లోడ్ చేసే పనిలో నిమగ్నమయి వున్నారని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.
    సో....బాగా అలసిన స్థితిలో దింపాగూడేనికి వస్తారు. బాగా తాగుతారు, తింటారు. ఆపైన వళ్ళుపై తెలీకుండా పడిపోతారు. వాళ్ళలో ఒకర్ని మనం పట్టుకోగలిగినా చాలు. నిజానికి ఆ ఉద్దేశంతోటే మనం బయలుదేరింది. ఇకపై మాట్లాడకండి గూడెం దగ్గరికి వచ్చేశాం" అని ఎస్.ఐ. తిరిగి నడక సాగించాడు.
    అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలు.
    మరికొంతదూరం ప్రయాణించిన పోలీసులు ఎస్.ఐ. సంజ్ఞ మేరకు ఆగిపోయారు.
    చెవులు రిక్కించారు. కీచురాళ్ళ రొద తప్ప ఏ శబ్దం రావడంలేదు. ఎస్.ఐ. ఒకర్ని చెట్టు ఎక్కి చూడమన్నాడు. ఒక కానిస్టేబుల్ పక్కనే వున్న తునిసి చెట్టు ఎక్కాడు.
    కనుచూపుమేర అనేది ఆ గాఢాంధకారంలో అర్థంలేని పదం "ఏమన్నా కనిపిస్తుందా? ఐమీన్ కాగడాల వెలుగు?"
    ఎస్.ఐ. తల పైకెత్తి ప్రశ్నించాడు.
    "లేదు సార్" అన్నాడు చెట్టుపైనున్న పోలీస్.
    "బాగా చూడు....ఉత్తర దిక్కుకేసి చూడు. క్రిందకేసి చూడు. మన ఎదురుగావున్న లోయలోనే దింపాగూడెం వుంది. కాగడాల వెలుగేదీ కనిపించటంలేదా?"
    "లేదు సార్?"
    "పరికించి చూడు. ఇంకొంచెం పైకెక్కు. దింపాగూడెం కొండల మధ్య వుండటంతో మూడు, నాలుగు గంటలకే చీకటిపడిపోతుంది. అప్పుడు వెలిగించిన కాగడాలు ఇప్పటికి బలహీనమైపోయుండవచ్చు" ఎస్.ఐ. తిరిగి అరిచాడు.
    "లేదు సార్....పిసరంత వెలుగు కూడా కనిపించటంలేదు" అన్నాడు చెట్టుమీదున్న పోలీస్ ఒణికిపోతూ.
    ఎస్.ఐ. ఆశ్చర్యపోయాడు ముందు. తేరుకొని చురుగ్గా ఆలోచించాడు.
    "ఉత్సాహంగా, ధైర్యంగా కదలండి. కాగడాలు కూడా పూర్తిగా ఆరిపోయాయంటే సంబరం ఎర్లీగా ఆరంభమయి వుంటుంది లేదా నిన్న మొన్న ఇటువేపు వర్షం కురిసి కాగడాలు తడిసిపోయన్నా వుండాలి. కమాన్....క్విక్...." ఎస్.ఐ. వారిలో ధైర్యాన్ని, లాజిక్ ని నూరిపోస్తూ ముందుకు కదిలాడు.
    మరో ఐదు నిమిషాలు ప్రయాణించాక చిన్న గుట్ట మలుపు వద్ద చేరుకున్నారు. ఆ గుట్టని చుట్టేసి వెళితే దింపాగూడెం ఆరంభమవుతుంది.

 Previous Page Next Page