Previous Page Next Page 
రక్తచందనం పేజి 19


    మరికొద్ది క్షణాలకి పొదల్లోంచి బయటకు వచ్చాడు 'వీరూ' ఒంటరిగా.
    అందరూ కన్నార్పకుండా వీరూకేసి చూస్తూ తలలు వంచి లేపారు. అది వాళ్ళు తమలోని గౌరవాభిమానాల్ని వ్యక్తంచేసే విధానం.
    ఐదడుగుల పదంగుళాల ఎత్తులో, సన్నగా, దృఢంగా వున్నాడు వీరూ. కాకీ ఫాంట్, పైన ఫుల్ హేండ్స్ కాకీ సఫారీ కోట్, ఆ కోట్ పైన బెత్తెడు మందంలో నడుముకి బెల్ట్, ఛాతీ మీదుగా ఎడమ భుజం నుంచి కుడివేపుకి నడుందాకా సాగిన తూటాల బెల్ట్, ఎడంవేపు భుజం మీంచి వెనుకవేపుకి వేలాడుతూ ఒక గన్, కాళ్ళకు మిలటరీ షూస్, నడుముకి వేలాడుతున్న కైజారు, కుడివేపు భుజానికి వేలాడుతున్న ఒక ప్లాస్టిక్ బ్యాగ్ సడన్ గా ఎవరన్నా చూస్తే ఒక డి.ఎస్.పి. స్పెషల్ ఎసైన్ మెంట్ మీద వన్ మేన్ ఆర్మీగా వచ్చినట్లు అనిపిస్తుంది పోలీస్ ఆఫీసర్ డ్రస్ లో వీరూ.
    చిన్న చిన్న కళ్ళు....అవి చురుగ్గా పరిసరాల్ని నిశితంగా గమనిస్తున్నట్లుంటాయి. పల్చటి బుగ్గలు, వెడల్పాటి నుదురు, షార్ప్ నోస్, సమ్మర్ క్రాఫ్.
    నలభై వేల ఎకరాల అడవిని శాసిస్తున్న అడవిరాజు, జంగిల్ కా షేర్. అతని మనస్సునిండా అనుక్షణం సవాలక్ష ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. అవేమిటన్నది ఎవరికీ తెలీదు. తెలుసుకోవాలనే సాహసం కూడా ఎవ్వరూ చేయలేదు. అసాధ్యాన్ని సాధ్యం చేయటం అతనికి సరదా. క్రూరమృగాలతో ఆడుకుంటాడు. అటవీ, పోలీసుశాఖల సిబ్బందిని ఆట పట్టిస్తుంటాడు. వాళ్ళు ఎత్తు వేసేలోపు నాలుగు ఎత్తులు వేసి అందనంత దూరానికి అదృశ్యమైపోయి వారిని వెర్రిబాగులవాళ్ళను చేయటం మరీ సరదా.
    అందర్నీ నమ్మినట్లే కనిపిస్తాడు. ఎవర్నీ నమ్మడు.
    వీరూని ఆ గూడెం కోయ ప్రజలు చూడక అప్పటికి సరీగ్గా సంవత్సరమయింది. అతన్ని చూడగానే అక్కడున్న అందరిలో ఆనందోద్వేగం ఉప్పొంగింది. ఒకింత భయంతో ఒడలు గగుర్పొడిచాయి.
    మారానాయక్ చెయ్యెత్తి గాల్లో ఊపాడు. అప్పటివరకు ఆ లోయలో పర్చుకున్న నిశ్శబ్దం, నీరవం ఒక్కసారి బ్రద్దలయింది.
    టెర్రర్ కి, మృత్యువుకి, ప్రమాదానికి మారుపేరయిన వీరూ ఒక్కో అడుగే వేస్తూ వస్తున్నాడు.
    డముకులు, మద్దెళ్ళు, బూరలు, బ్యాండు ఒక్కసారి మోగాయి లయబద్దంగా.
    అందరూ రెప్పవేయటంకూడా మర్చిపోయి వీరూకేసి చూస్తున్నారు.
    తనకిస్తున్న ఆ ఘనస్వాగతానికి వీరూ కళ్ళు కృతజ్ఞతా భావంతో మెరిశాయి.
    క్షణకాలం తన పొడవైన మీసాల మీదకు చేతిని పోనిచ్చాడు. మీసాల్ని మృదువుగా నిమురుకున్నాడు. అతనికోసం సిద్ధంచేసిన శ్రీచందన సింహాసనం మీద అతన్ని మారానాయక్ కూర్చుండబెట్టాడు.
    సంబరం మొదలయింది. నాట్యం ఆరంభమైంది.
    కేకలతో, జనపదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. అడవి తల్లిని, కొండదేవరని, వీరూని పాటల ద్వారా పొగుడుతున్నారు. కుప్పి, జీలుగుకల్లు, విప్పసారాయి, వెదురుసారా, అరటిసారా వరదలై ప్రవహించింది.
    నెగడ్లపై మండుతున్న గొర్రెలు, మేకల సహ్రీరాలు చీలికలై పోయాయి. నోరూరించే వంటకాలు అదృశ్యమైపోసాగాయి. మారానాయక్ ఏవేవో తెచ్చి వీరూ ముందు పెడుతున్నాడు. కొద్దిసేపటికవి గుట్టలా అయిపోయాయి.
    కరియా, వేలాయుధం, మిగతా అనుచరులు వెర్రెత్తిపోయారు. తాగుతున్నారు, తింటున్నారు, జనపదాలు పాడుతున్నారు.
    ఎప్పుడు వచ్చారో, ఎటునుంచి వచ్చారో తెలీదుకాని నలుగురు సాయుధులు వీరూకి నలువేపులా నిలుచున్నారు. భైరవీ నాలిక చాచి, కోరలు బయటపెట్టి వీరూ చుట్టూ అప్రమత్తంగా పహరా కాస్తోంది.
    దగ్గరలో వున్న ఎత్తయిన యూకలిప్టస్ చెట్టు చివరి అంచుమీద కూర్చున్న తంబి ఆ గూడేనికి ఆనుకొని వున్న అటవీ పరిసరాలమీద దృష్టిని నిలిపి చూస్తోంది.
    క్రమంగా కాలం కరిగిపోతోంది. అందరికి మత్తు తలకెక్కి పోయింది.
    వీరూ చూస్తుండగానే మారానాయక్ కాల్చిన ఒక చిన్న సైజు దుప్పిని అమాంతం తినేశాడు. ఒక బుంగ కుప్పి తాగి కృతజ్ఞతగా వీరూ వైపు చూశాడు.
    వీరూ భైరవీవేపు చూశాడు. ఆ పైన అక్కడున్న దుప్పి మాంసాన్ని అందుకొని తినబోతుండగా భైరవీ చెంగున వీరూ ముందుకి దూకి వీరూ చేతిలోని మాంసాన్ని అమాంతం తన కోరలతో లాగేసుకుంది.
    వీరూ భైరవీ వేపు ఒకింత అసహనంగా చూశాడు.
    భైరవీ దాన్ని లెక్కచేయనట్లుగా ఆ మాంసాన్ని కొంత తిన్నది. మరికొద్దిసేపు వీరూకి మాంసానికి మధ్య అడ్డంగా నించుండిపోయింది.
    దాని స్వామి భక్తికి ఆ దృశ్యాన్ని చూస్తున్న అందరూ దిగ్ర్భాంతికి గురయ్యారు.
    కొద్దినిమిషాలు గడిచాయి. భైరవీ అక్కడినుంచి తప్పుకొని పహరా కాయసాగింది.
    వీరూ నవ్వుకొని దుప్పిమాంసం వున్న బుట్టని దగ్గరకు లాక్కున్నాడు.
    అంతలో కొంతమంది కోయ యువకులు వీరూ వద్దకు వచ్చి తమతో కలిసి డాన్స్ చేయమని కోరారు.
    వీరూ వద్దన్నట్లుగా సంజ్ఞ చేశాడు.
    అయినా వారు వినలేదు. మారాం చేశారు. బ్రతిమిలాడారు. తప్పక వీరూ లేచాడు.
    అప్పటికే వీరు అనుచరులతో సహా అక్కడున్న అందరూ మత్తుగా తూలిపోతున్నారు. ప్రమాదం ముంచుకొచ్చినా గుర్తించలేనంతగా, ఎదుర్కోలేనంగా తూలిపోతున్నారు.
    మరికొద్ది క్షణాల్లో వీరూ డాన్స్ చేయబోతుండగా జరిగిందా సంఘటన.
    యూకలిప్టస్ చెట్టు పైభాగాన కూర్చున్న తంబి సడన్ గా దుముక్కుంటూ వచ్చి వీరూకి అడ్డంగా నిలిచి కిచకిచమని శబ్దం చేసింది.
    సుదూరాన వున్న ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు ఆ విధంగా తెలియజేస్తుంది తంబి.
    తంబి చర్యకు వీరూ ఒక్క క్షణం ఆగిపోయాడు. అప్పటివరకు వీరూకి కాపలాగా వున్న నలుగురు అనుచరులు గన్స్ ని పొజిషన్ లోకి తెచ్చుకొని వీరూకి దగ్గరగా వచ్చి రక్షణ కవచంగా నిలిచారు.
    కోయ యువకులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. క్షణాల్లో ఈటెలతో, బరిసెలతో, బాణాలతో సిద్దమయిపోయారు. దూరంగా వుండి ప్రమాదాన్ని శంకించిన ఒక కోయ యువకుడు మిగతావారికి తెలియపర్చే ప్రయత్నంలో వుండగా వీరూ చటుక్కున రెండంగల్లో అతన్ని సమీపించి కనుసైగతో ఆపాడు. "వాళ్ళ ఆనందాన్ని పాడుచేయకు" అని అనుచరుల వేపు తిరిగాడు.
    "కన్ను పొడుచుకున్నా కానరాని ఈ గాడాంధకారంలో తంబి చూడగలిగేది వెలుతురునే. ఏదో వెలుతురు ఇటుకేసి వస్తుండవచ్చు. ఒకరు వెళ్ళి చూడండి" అన్నాడు నింపాదిగా. ఆ నలుగురిలో ఒకరు గన్ ని పొజిషన్ లోకి తెచ్చుకొని, సేఫ్టీకాచ్ ని ఆన్ లోకి నెట్టి, వడివడిగా దక్షిణ దిక్కుకేసి దూసుకుపోయాడు.
    ఆ గూడెంలోకి ప్రవేశించటానికి దక్షిణ దిశలో వున్న ఏటవాలు కొండ ఒక్కటే ఒకింత అనువయినది. మిగతా మూడు దిక్కులా వున్న కొండలు నిలువుగా, ఎగుడు దిగుడుగా, ముళ్ళపొదలతో నిండి కాలం కూడా పెట్టలేనంత దుర్భేధ్యంగా వుంటాయి.
    పూర్వం రోజుల్లో క్రూరమృగాల నుంచి, ఇతర కోయజాతుల నుంచి రక్షణకోసం ఆ గూడెం పెద్దలు ఆ లోయ ప్రాంతాన్ని కావాలంటే ఎన్నుకొని గూడేన్ని నిర్మించుకున్నారు.
    ఒకవేపు సంబరం....మరోవేపు రానున్న శత్రువులకోసం నిరీక్షణ క్షణాలు నిమిషాలయిపోతున్నాయి.
    సంబరం సందడి క్రమంగా తగ్గిపోతూ నిశ్శబ్దాన్ని ఆహ్వానిస్తోందా లోయ. ఒక్కొక్కరు మత్తుగా తూలుతూ ఒకరుమీద ఒకరు స్పృహ లేకుండా పడిపోతున్నారు.

 Previous Page Next Page