భయంతో అందరి గొంతులు తడారిపోయాయి.
కాళ్ళలో సన్నని ఒణుకు ఆరంభమయింది. ఆ ఎస్.ఐ.ని తిట్టుకుంటూనే సేప్టీకాచ్ ని ఆన్ లోకి తెచ్చుకున్నారు.
గుండెలనిండా ఊపిరి తీసుకుని మలుపు తిరుగుతుండగా సడెన్ గా కుక్క అరుపు వినిపించింది.
ఆపైన ఆకాశంలో కాగడాలు ఒకటి, రెండు, పది, వంద చూస్తుండగానే ఆ లోయ కాంతిని నింపుకుంది.
ఊహించని ఆ హఠాత్ పరిణామానికి పోలీసులు నివ్వెరపోయారు. అంటే తమ రాక వాళ్ళకు తెలిసిపోయి సిద్ధంగా వున్నారన్నమాట. ఆ ఆలోచన ఒక్కసారి అందరిలో వచ్చింది. ఆపైన ఒక్కరికి అడుగు ముందుకు పడలేదు.
క్షణాల్లో ఒకరికొకరు సైగ చేసుకొని వెనుతిరిగి పరుగెత్తడం ప్రారంభించారు ప్రాణ భయంతో.
స్థాణువై పోయిన ఎస్.ఐ. వొకింతసేపటికి తేరుకొని నిట్టూర్చుతూ వెనుదిరిగాడు.
* * * *
డివిజనల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, శర్మ ఎక్కిన జీప్ శరవేగముతో కరంజికేర్ ట్యాంక్ బండ్ రోడ్ లోంచి లలితమహల్ రోడ్ లోకి ప్రవేశించి చాముండిబెట్ట చౌరాస్తాలో ఎడంవేపునున్న ఒక పురాతన బంగ్లా ఆవరణలోకి ప్రవేశించి సడెన్ బ్రేక్ తో ఆగింది.
మరికొద్ది క్షణాలకు ఎస్.పి. రంజిత్ ముందున్నాడు శర్మ. అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటలు.
"ఏమిటి శర్మ! ఏమిటి హడావుడి?" రంజిత్ ఏదో ఫైల్ చూస్తూ ఒక్కక్షణం తలపైకెత్తి అడిగాడు.
"ఫిఫ్టీలాక్స్ వర్తాఫ్ సాండల్ వుడ్ నిన్న రాత్రి తమిళనాడులోని ధర్మపురికి దగ్గరలో వున్న పెన్నగరామ్ దగ్గర చేతులు మారిందట. అరగంట క్రితమే నాకు ఫోన్ వచ్చింది. ఆ వెంటనే అక్షింతలు మా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటరాఫ్ ఫారెస్ట్ నుండే ఆ అక్షింతలు.
లక్కీగా లారీ డ్రైవర్ తమిళనాడు ఫారెస్ట్ విభాగానికి చెందినా ఒక ఫారెస్ట్ రేంజర్ చేతుల్లో పడ్డాడట. అతనిమీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే చెప్పాడట. ఆ సరుకు కౌదల్లి నుంచి ఆలమ్ బడి మీదుగా హొగెనకర్ ఫాల్స్ ప్రాంతంలో కావేరీనదిని దాటి అక్కడకు వచ్చిందని, అంతకుమించి అతనికేం తెలీదట. మనం వెంటనే రంగంలోకి దిగిపోవాలి రంజిత్. లేదంటే వీరూ కోట్లకు కోట్లు ఖరీదుచేసే గంధం చెక్కను మరింతగా దోచుకోవచ్చు" గుక్కతిప్పుకోకుండా ఏకబిగిన చెప్పాడు శర్మ.
"మనం వచ్చినట్లు వాడికి తెలుసుండదు. లేదంటే అంత ధైర్యంగా సరుకు తరలించడు. ఇలా ఊరికే టెన్షన్ పడిపోతే మనం మన విధి నిర్వహణలో తప్పటడుగు వేసే ప్రమాదముంది" అంటూ రంజిత్ టీపాయ్ మీదున్న రిమోట్ బెల్ ని ప్రెస్ చేశాడు ఎంతో నిబ్బరంతో.
క్షణాల్లో అక్కడికొక కానిస్టేబుల్ వచ్చాడు. "ఏర్పాట్లు చెయ్" అన్నాడు రంజిత్ తాపీగా.
మరు నిమిషానికి వారిముందు మిలటరీ రమ్ బాటిల్, గ్లాసులు, ఐస్ క్యూబ్స్, సోడాలు, సిగరెట్ ప్యాకెట్స్, చిప్స్, చికెన్ పకోడా వచ్చాయి.
శర్మ తాగడని తరువాత తెలుసుకున్న రంజిత్ రెండు గోల్డ్ కాయిన్ ఏపిల్ జ్యూస్ తెప్పించాడు.
రంజిత్ ఒక పెగ్గు తీసుకొనేసరికి అరగంటయిపోయింది. "ఆ....ఇప్పుడు చెప్పు.... వాడి ఆట ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు. కేవలం నలభైమంది అనుచరుల అండతో, ప్రాణభయంతో, గంటకో మకాం మారుస్తూ, స్మగ్లింగ్ చేస్తున్న ఆ వీరూ దగ్గర వున్న ఏకైక ఆయుధం, అడవి అతనికి కొట్టిన పిండి కావటమే.
వీరూ ఈజ్ కౌంటింగ్ ఈజ్ లాస్ట్ డేస్....ప్రధానంగా ఇప్పుడతను చేస్తున్న స్మగ్లింగ్ గంధం చెక్క, గతంలో ఏనుగు దంతాలు, అంతేగా? ఎనీథింగ్ ఎల్స్?" కళ్ళు ఎర్రబడుతుండగా అన్నాడు రంజిత్.
ఆ బంగ్లా ఒకప్పుడు ముమ్మడి కృష్ణరాజు వడియార్ చాముండి బెట్టకి వెళ్ళేప్పుడు స్నానాదికారాలు పూర్తిచేసుకొని శుచిగా వెళ్ళేందుకు కట్టించుకున్నది.
అది కాలగమనంలో మైసూర్ పోలీస్ డిపార్ట్ మెంట్ పరమయింది. దాన్నే ప్రస్తుతం రంజిత్ కి కేటాయించటం జరిగింది.
బంగ్లా నిశ్శబ్దంగా వుంది. విశాలమైన ఆవరణలో పూలతోట మధ్యనున్న ఆ బంగ్లా కూడా ఎంతో విశాలమైందే. అందులో రంజిత్, అతనికి చాకిరీ చేసేందుకు నలుగురు కానిస్టేబుల్స్ మాత్రమే వుంటారు.
"అంతే....అంతే" రంజిత్ నిబ్బరానికి ఒకింత ఆశ్చర్యపోతూ అన్నాడు శర్మ.
రంజిత్ మరోసారి గ్లాసు నింపుకున్నాడు.
"అంతే_అంటావేమిటి? గంజాయి, మొసలి చర్మాలు, ఎర్రచందనం, ఇతర జంతువుల చర్మాలు కూడా స్మగుల్డ్ చేస్తున్నాడట"
శర్మ చిన్నగా నవ్వాడు.
"యూజ్ లెస్ ఫెలోస్ సృష్టించిన గాలి వార్తలవి. నేను ఫైల్స్ అన్నీ క్షుణ్ణంగా స్టడీ చేశాను. ఈ డివిజన్ కి రాకముందు కూడా మా డ్యూటీలో భాగంగా ఇక్కడి విషయాల గురించి ఫాలో అవుతుండేవాడ్ని. అతను కేవలం ఏనుగు దంతాల్ని, గంధం చెక్కల్ని మాత్రమే స్మగుల్డ్ చేశాడు, చేస్తున్నాడు. ఇక్కడ మరో విషయాన్ని క్లియర్ చేయాలి.
ఎర్రచందనం వేరు, చందనం వేరు. ఎర్రచందనం నుంచి ఎలాంటి వాసనా రాదు. షామోసిన్ లాంటి సంగీత వాయిద్య పరికరాల తయారీకి దాన్ని ఉపయోగిస్తారు. దాన్ని బ్లేడ్ మందంతో కూడా కట్ చేసేందుకు వీలవుతుంది. అంత పల్చగా తయారయిన ఎర్రచందనం చెక్క ధ్వని తరంగాలకు కూడా రెపరెపలాడిపోతుంది, టెలిఫోన్ తయారీలో ఉపయోగించే డయాఫ్రమ్ లా ఇది ఉపయోగపడుతుంది. అఫ్ కోర్స్ ఇదీ విలువైనదే. రెడ్ కలర్, బ్రౌన్ కలర్ కలిసిన ముదురు ఎరుపు రంగులో దృఢంగా వుంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుజిల్లా పాలకొండ, శేషాచలం, కడప, కర్నూలు అడవుల్లో అది బాగా లభ్యమవుతుంది. వేరెక్కడా లభ్యం కాదు.
ఒక దశాబ్దం క్రితం వరకు స్మగ్లర్స్, ఆంధ్రప్రదేశ్ అఫారేస్ట్ డిపార్ట్ మెంట్ కి చెందిన ఉద్యోగుల సహకారంతో జపాన్ కి ఎర్రచందనాన్ని ఎగుమతిచేసి కోట్లు గడించారు. ఆపైన ఆ కుంభకోణం బయటపడి పెద్ద సంచలనాన్ని కూడా సృష్టించింది.
ట్రాపికల్ డ్రై ఫారెస్ట్స్ లో ఎర్రచందనం ఎక్కువగా లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అడవులపై కురిసే వర్షపాతం చాలా తక్కువ.
అణుశక్తివలన ఉద్భవించే రేడియో ధార్మిక శక్తి నుంచి ఎర్రచందనం కొంతమేరకు రక్షించగలదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.
చందనం వేరు.
దక్షిణ ఆసియాలో మాత్రమే లభించే ఈ గంధం చెక్క ఆర్నమెంటల్ కార్వింగ్ కి, కేబినెట్ వర్క్ కి కూడా ఉపయోగపడుతుంది. ఇది డెలికేట్ గా వుంటుంది. దానినుంచి తీసే సాండల్ వుడ్ ఆయిల్ షేల్ ఎల్లోయిష్ గా వుంటుంది. మంచి సుగంధాన్ని వెదజల్లుతుంది.
ఫెర్ ఫ్యూమ్స్, సోప్స్ తయారీలో దీన్ని ఉపయోగిస్తారు.
కర్ణాటక, తమిళనాడు అడవుల్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో తప్ప మరెక్కడా ఇది లభించదు. అడపాదడపా వేరే అడవుల్లో లభించినా దాన్నుంచి అంతగా ఆయిల్ రాదు. వచ్చినా అంత నాణ్యమైంది కాదు.
అందుకే దానికంత విలువ. కర్ణాటక ప్రజలు దాన్ని రాజవృక్షంగా భావిస్తారు. పండగల్లో, పబ్బాల్లో, పూజాపునస్కారాల్లో దాన్ని బాగా ఉపయోగిస్తారు. స్త్రీలు గంధం చెక్కని అరగదీసి, వచ్చిన గంధాన్ని కంఠానికి రాసుకుంటారు. భగవంతుడికి ఫల, పుష్పాలతోపాటు గంధాన్ని సమర్పిస్తారు. బీరువాల్లో, పెట్టెల్లో గంధపు చేక్కల్ని సువాసన వెదజల్లటం కోసం పెట్టుకుంటారు. షుగర్ కంప్లైంట్స్, బ్లెడ్ ప్రెషర్ పేషెంట్స్ కి ఒకింత ఉపయోగపడుతుందంటారు.
కాండం ద్వారా సుగంధాన్ని వెదజల్లే వృక్షం ఇదొక్కటే. పచ్చిగా వున్నప్పుడు సుగంధం రాదు. ఎండుతుండగా సుగంధాన్ని వెదజల్లటం ప్రారంభిస్తుంది. పూలిష్ థింగ్ ఏమిటంటే ఎర్రచందనం_చందనం ఒకటే అని ఎడ్యుకేట్స్ కూడా అనుకోవటం.