ఆరోజు ఉదయం అతను ఆఫీస్ కొచ్చేసరికి తన రూమ్ లో ప్రముఖ రచయిత దీప్ చంద్ కూర్చుని వున్నాడు.
"హల్లో మైడియర్ దీప్ చంద్!" ఆనందంగా పలుకరించాడు భవానీశంకర్. "నిన్నింత ప్రొద్దున్నే చూడటం చాలా ఆనందంగా వుంది డియర్! మీ సీరియల్ అద్భుతంగా వుందని ఉత్తరాల వర్షం కురుస్తోంది డియర్! త్వరలో అది సైక్లోన్ గా కూడా మారవచ్చని నా అనుమానం" దీప్ చంద్ లో ఉత్సాహం కనిపించింది.
"అప్పుడే ఏమయింది? వచ్చేవారం సీరియల్లో బ్రహ్మాండమయిన మలుపు లాక్కొస్తున్నాను. అది చదివారంటే పాఠకులకు పిచ్చెక్కిపోతుంది."
"ఏమిటా మలుపు బ్రదర్?"
"ఎప్పుడూ దేముడిని పూజిస్తూ, భర్తను ఆరాధిస్తూ, భర్త పాదాలు రోజూ కళ్ళకద్దుకుంటూ గడిపే మహాలక్ష్మి పాత్ర వుంది చూడు! ఆ మహాలక్ష్మి హఠాత్తుగా సెక్స్ మానియాక్ అయిపోతుంది... కనపడ్డవాడినల్లా పడగ్గదిలోకి లాక్కెళ్ళిపోతుంది."
"ఒండర్ ఫుల్ బ్రదర్! తెలుగు సాహితీరంగంలో నీ నవల ఆ మహాలక్ష్మి పాత్ర చిరకాలం నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అది సరేగానీ యింత పెందలాడే 'ఆంధ్ర దీపిక' ఆఫీస్ కి రావడంలోగల ఆంతర్యమేమిటి బ్రదర్?"
దీప్ చంద్ మొఖంలోకి నీడ వచ్చేసింది.
"ఇవాళ నిద్ర లేవగానే ఓ మాజీ మంత్రిగారి మొఖం చూశాను" విచారంగా అన్నాడతను.
"మాజీ మంత్రి మొఖమా?"
"అవును."
"ఎవరా మాజీమంత్రి ఫ్రెండ్?"
"అప్పల్రాజు."
"కానీ మాజీ మంత్రుల మొఖాలు పొద్దున్నే చూడటం అపశకునమని నేనెక్కడా వినలేదే?"
"ఐ హేట్ దట్ ఫెలో!" ద్వేషంతో అన్నాడు దీప్ చంద్.
"ఎందుకని?"
"వాడు ఎన్టీఆర్ ఫాన్ అట! ఎంత దారుణమో చూడు!"
"అందులో దారుణమేముంది బ్రదర్? ఎవరిష్టం వారిది. మనది డెమోక్రసీ."
"కానీ నేను ఎన్టీఆర్ ద్వేషిని."
"ఓ! అర్ధమయింది. ఫండమెండల్ డిఫరెన్స్."
"ఎగ్జాక్ట్ లీ."
"కానీ అతను అంత పొద్దున్నే నీకు తన మొఖం ఎందుకు చూపించినట్లు?"
"ఆ మధ్య తన ఆత్మకథ రాయటానికి_ ఓ రచయిత కావాలని పేపరులో ప్రకటించాడు. నెలరోజులు తంటాలుపడితే పాతికవేల రూపాయలు వస్తాయికదా అని అప్లయ్ చేశాను. ఇవాళ నన్ను వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోవటానికి వచ్చాడు. రేపట్నుంచే ఆ వర్క్ మొదలుపెట్టాలట కానీ ఆ పక్షితో పావుగంట మాట్లాడేసరికి ఇంక జన్మలో వాడి మొఖం చూడకూడదని నిర్ణయించుకున్నాను."
"తొందరపాటు నిర్ణయం బ్రదర్! మాజీ మంత్రులు మళ్ళీ ఏదొకరోజు మంత్రి అవకా తప్పదు. మనం వాళ్ళ మొఖాలు న్యూస్ పేపర్స్ లో చూడకా తప్పదు.
దీప్ చంద్ ఓ క్షణం ఆలోచించాడు.
"అఫ్ కోర్స్. నీ పాయింట్ కరక్టే. ఇప్పుడు ఓ పెద్ద సమస్య వచ్చిపడింది గురూ!"
"ఏమిటది బ్రదర్! త్వరగా బయటపెట్టు. రచయితల సమస్యలు తీర్చటానికే ఎడిటర్లున్నారు."
"సాయంత్రం నేను ఆ అప్పల్రాజు బసచేస్తున్న హోటల్ ఎమరాల్డ్ కొస్తున్నాననీ, అక్కడినుంచీ వాళ్ళ ఊరికి ప్రయాణం అవ్వచ్చనీ ప్రామిస్ చేశాను. కానీ నేను అసలు వాడికి వర్క్ చేయగూడదని నిశ్చయించుకున్నాను కాబట్టి_ ఇంకో రచయితను వెతుక్కోమని నువ్వు వెళ్ళి వాడికి చెప్పాలి."
"నేనా?"
"అవును! వాడి మొఖం చూడటం కూడా నాకిష్టంలేదు. ప్రతి మాటకూ ముందు ఎన్టీఆర్ ని పొగిడేవాడితో ఎలా మాట్లాడడం?"
"చాలా కష్టం."
"ఎంతసేపూ రెండ్రూపాయలకు కిలోబియ్యం, విధవలకు పెన్షన్, ఉచిత మధ్యాహ్న భోజనం, కౌన్సిల్ రద్దు అంటూ ఒకటే మోత! ఇడియట్."
"హారిబుల్!"
"అవన్నీ కేవలం ఎలక్షన్ గిమిక్స్ అని తెలీనివాడి ఆత్మకథ నేనెందుకు రాయాలి?"
"ఛస్తే రాయకూడదు."
"అందుకే రాయటంలేదు."
"సూపర్బ్ డెసిషన్."
"ఇంక నేను వెళ్తాను గురూ! సాయంత్రం నాలుగులోపల వాడితో చెప్పేస్తావ్ కదూ?"
"షూర్ బ్రదర్."
"లేకపోతే వాడు మళ్ళీ నా రూమ్ కొస్తాడు. నేను మళ్ళీ వాడి మొఖం చూడాల్సి వస్తుంది."
"చాలా భయంకరమయిన పరిస్థితి."
"వాడికి చెప్పెయ్ గురూ! లక్షరూపాయలిచ్చినా వాడి ఆత్మకథ రాయననెప్పుడు. అన్నట్టు వాడు హోటల్ ఎమరాల్డ్ లో రూమ్ నెంబర్ 314లో ఉన్నాడు."
"ఓ.కే."
దీప్ చంద్ వెళ్ళిపోయాడు.
మరికాసేపట్లో భవానీశంకర్ కి సాంబమూర్తి నుంచి కబురొచ్చింది. అతని రూమ్ కి చేరుకున్నాడతను.
"హలో అంకుల్! మీ సన్మానం అద్భుతంగా జరిగిందని పేపర్లో చదివాను."
"థాంక్ యూ_ అది సరేగానీ..."
"ఇప్పుడే సన్మానం చేసినందుగ్గాను వాళ్ళకు మీరేమయినా ప్రత్యుపకారం చేయాలా అంకుల్. ఎందుకడుగుతున్నానంటే_ చాలా పత్రికల్లో ఈ పద్ధతి చాలా ఫేమస్ అని తెలిసింది."
"అఫ్ కోర్స్. ఆ సన్మాన సంఘం అధ్యక్షుడు 'నా పెరూ యాత్ర' మన వీక్లీలో సీరియల్ గా వేయాలి" అన్నాడు సాంబమూర్తి.
"పెరూ యాత్రా?"
"అవును! ఆ మధ్యన పెరూ అనే దేశం వెళ్ళాడట ఏదో పనిమీద. ఆ విశేషాలు పాతిక వారాలపాటు సీరియల్ గా వేస్తే బావుంటుంది కానీ ఎవరికీ ఆసక్తి కలిగించని ఆ ఆర్టికల్ ఎందుకు వేస్తున్నారని మన ప్రొప్రయిటర్ అడిగితే ఏం చెప్పాలా అని..."
"ఏం ఫర్వాలేదంకుల్_ లాగించేద్దాం. పెరూ అనే దేశం గురించి తెలుగు పాఠకులు తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నట్లు. ముందు ఓ వంద దొంగ ఉత్తరాలు ప్రచురిద్దాం! తరువాత పాఠకుల కోరిక మేరకు మన వారపత్రిక ఎంతో కృషిచేసి ఫలానా సన్మానసంఘం అధ్యక్షుడు జరిపిన 'పెరూయాత్ర'ను సీరియల్ గా ప్రచురించబోతున్నామని ప్రకటిస్తే."
సాంబమూర్తి భవానీశంకర్ వంక విచారంగా చూశాడు.
"నువ్వు నిజంగా జీనియస్ వి భవానీ! అయామ్ ప్రౌడాఫ్ యూ! అది సరేగానీ..."
"మీ సన్మానం ఫోటోలకింద కాప్షన్ ఏమిటో తెలుసా అంకుల్? ఈ సన్మానం సాంబమూర్తిది కాదు. తెలుగు పాఠకులది! ఎలా వుందకుల్?"
"అద్భుతం. థాంక్యూ_ అది సరేగానీ... నిన్ను ప్రొప్రయిటర్ గారు ఇంతకుముందే డిస్మిస్ చేశారు భవానీ" విచారంగా అన్నాడతను.
భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు.
"డిస్మిస్ చేశారా?"
"అవును. మన వీక్లీ కవర్ మీద ఆ అమ్మాయి ఎవరిదో ఫోటో. ఆమె పర్మిషన్ లేకుండా వేశావుట. ఆ అమ్మాయి శరత్ బాబు అనే ఓ మాజీ ఎడిటర్ తో కంప్లెయింట్ చేయించింది."