"ఇదంతా మీరు చేసిందే! దరిద్రపు ఆస్తికోసం బంగారం లాంటి బిడ్డ బలై పోయాడు!"
రోషంగా కసిరింది లీల!
నాకు తెలిసినంతలో ఆవిడ భర్త మాట కెదురుచెప్పటం అదే మొదటిసారి!
ఇంత దారుణమైన దెబ్బ తగిలాకకాని, ఆమాత్రం భర్తకు నచ్చచెప్పచ్చునని తోచలేదు!
ఆయన చెప్పిన చిరునామానుబట్టి ఎలాగో అందరం జ్ఞాన ఇంటికి చేరుకున్నాం.
ఎలాంటి దృశ్యం చూడవలసి వస్తుందోనని అందరికీ కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి. లీలను పట్టశక్యం కావటంలేదు...
మధ్యగదిలో కూర్చుని తాపీగా సిగ అలంకరించుకుంటోంది జ్ఞాన...
"అక్కయ్యగారూ! రాజు ఏడీ నా రాజును నాకు చూపించండి!"
జ్ఞాన కాళ్ళమీద వాలిపోయింది లీల. ఆ కాళ్ళను నెమ్మదిగా వెనక్కు తీసుకుంది జ్ఞాన.
"కూర్చో! కాఫీ కావాలా?"
అంత నిబ్బరంగా అడుగుతున్న జ్ఞానను చూస్తే ఒళ్ళు మండుకొచ్చింది నాకే!
"నా రాజు! వాడిని చూపించండి ! ఏడీ?"
"ఇంట్లో లేడు! హాస్పిటల్లో ఉన్నాడు. నీ రాజు కాదు నా రాజు!"
"కాదు! కాదు! నీ రాజు కాదు! నా రాజు! నవమాసాలు కన్నాను. ప్రాణాలన్నీ పెట్టుకుని పెంచాను..."
"ఆస్తికోసం నాకు అమ్మావు..."
"కాదు! కాదు! కాదు!"
పిచ్చిదానిలా అరిచింది లీల...
"ఏ హాస్పిటల్ ల్లో చేర్చారో చెప్పండి ముందు. రాజును చూడాలి!"
"నీ రాజు కాదు! నా రాజని వప్పుకో! అప్పుడు చెప్తాను!"
"నా రాజు... నా రాజు..."
ఏడుస్తోంది లీల...
"నీ ఆస్తి నువ్వు తీసేసుకో! నా రాజును నా కిచ్చెయి!"
జ్ఞాన తనకేం పట్టనట్లు లేచి కాఫీలు కలిపి అందరికీ అందించింది.
లీల తన కాఫీ ముట్టుకోలేదు...
"ఏ హాస్పిటల్? ఎక్కడ? ఏవండీ! పదండి! వెళ్ళి ఊళ్ళో ఉన్న హాస్పిటల్స్ అన్నీ చూసివద్దాం! నడవండి..."
భర్తను కుదిపేస్తోంది లీల.
మా మరిది జ్ఞానవంక అనుమానంగా చూస్తున్నాడు. నాకూ అనుమానం కలుగుతోంది.
ఎంతైనా రాజు మరణశయ్యమీద ఉండగా ఇంత నిబ్బరంగా జ్ఞాన ఉండదు! ఉండలేదు.
చేతిలో రకరకాల బొమ్మలు పట్టుకుని శేషశాయితో కలిసి వచ్చాడు రాజు...
మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయాడు...
"అమ్మా! నాన్నగారు! పెద్దమ్మా! అంతా వచ్చారు! ఎప్పుడొచ్చారు?" అన్నాడు సంబరంగా...
అంతలో జ్ఞాన దగ్గిరకి వెళ్ళి తను కొన్న బొమ్మలన్నీ చూపించసాగాడు.
నాకు అంతా అర్ధమయింది.
లీలకు తెరిచిన నోరు తెరిచినట్లే ఉంది!
"నా పని అయిపోయింది. ఈవిడ విషయమంతా వివరించి ఈ కాస్త సాయం చెయ్యమంటే 'సరే!' అన్నాను!" అని కండువా దులిపి భుజంమీద వేసుకుని వెళ్ళిపోయాడు క్రొత్తాయన.
లీల పిచ్చిదానిలా రాజుని దగ్గిరకి లాక్కుని ఊపిరాడకుండా కౌగిలించుకుని ముద్దుపెట్టుకోసాగింది.
రాజు ఉక్కిరిబిక్కిరయి విడిపించుకుని "ఏవిటమ్మా!" అన్నాడు చిరాగ్గా.
"రాజూ! ఇంకెప్పుడూ నన్ను వదిలిపెట్టి ఉండకురా! నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా!"
వాడు చిరాకు పడుతున్నా ఆర్తిగా కౌగిలించుకుని కన్నీళ్ళు పెట్టుకుంది లీల! దుర్భర దుఃఖం గడిచిన తరువాత కలిగిన ఉప్పెనలాంటి ఆనందంలో పొంగిన కన్నీళ్ళు...
"నా అదృష్టం బాగుండి కనీసం మెట్రిక్ పాస్ కాగలిగాను. ఎక్కడ పంతులమ్మ పని చేసినా పొట్టగడవక పోదు! మీ ఆస్థీ వద్దు. మీ బిడ్డావద్దు. తీసికెళ్ళండి!"
మరిదిముఖంలోకి త్రుణీకారంగా చూసి అంది జ్ఞాన...
అందరమూ ఆరోజే బయలుదేరాము. బయలుదేరేముందు జ్ఞాన మెడచుట్టూ చేతులువేసి "నువ్వు రావా పెద్దమ్మా" అన్నాడు రాజు...
చివ్వున కళ్ళలో నీళ్ళు చిమ్మగా చటుక్కున నిగ్రహించుకుని "వస్తానురా! నిన్ను చూడకుండా ఎలా ఉంటాను! అప్పుడప్పుడు వస్తాను." అంది జ్ఞాన...
"బిడ్డల తల్లివి. జ్ఞానకు అన్యాయం జరగనీయకు." అన్నాను లీలతో రహస్యంగా ...
మూర్ఖత్వం వరమా? కాదు! జ్ఞాన పొందిన విజ్ఞానం ఆమెను సంఘర్షణకు లోనుచేసి ఉండవచ్చు! ఆమె మనసు విపరీతంగా మదనపడి ఉండవచ్చు. కానీ ఆ విజ్ఞానమే ఒక మాతృమూర్తి దుఃఖాన్ని చూడలేక తన హక్కు త్యాగం చెయ్యగలిగే శక్తినిచ్చింది.
తనను సర్వనాశనం చెయ్యాలనుకున్నవాడి బిడ్డను అపురూపంగా లాలించి బుజ్జగించే మమత నిచ్చింది.
బాధలతో అయినాసరే! మనిషి మనిషిగా బ్రతకాలి!
తరువాత మా మరిది బావగారి ఆస్తిని వాళ్ళకు స్వాధీనం చేసినట్లు తెలిసింది.
తన పాతివ్రత్యాన్ని కొద్దిగా తలుచుకుని లీల కూడా భర్తతో ఒక్క మంచిపని చేయించ గలిగింది.
ధన్యురాలు జ్ఞాన !
* * *