Previous Page Next Page 
దశావతారాలు పేజి 19


    వెఱ్ఱి బాగులవాడి పెళ్ళానికి, చీరలు, జాకిట్లూ, నగలూ, పువ్వులు, ఎందుకని దూరం ఆలోచించి అవేవీ ఆవిడ దరిదాపులకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి...అంతా కారులో వెళుతున్నప్పుడు మాత్రం ఆవిడనుకూడా తీసికెళ్ళేవారు! మరి, ఆడపడుచుల పిల్లలకు మూతులూ, ముక్కులూ, తుడవటానికి ఎవరో ఒకరు కావద్దూ?!
    కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టిన నేను ఆవిడ పరిస్థితి చూసి నిర్ఘాంతపోయాను. అన్నిటికంటె ఆవిడ ముఖం మీది చెక్కుచెదరని చిరునవ్వు నన్ను ఆశ్చర్యపరిచేది! ఆవిడను చూసి నేను బాధపడుతున్నాను. నా మాత్రం కూడా ఆవిడకు బాధగా లేదా?
    ఆవిడను ఎలాగైనా చదివించాలని వూనుకున్నాను, సాధించగలిగాను. ఆవిడ మెట్రిక్ పాసయింది. కనిపించిన పుస్తకమంతా చదవసాగింది.
    కానీ పెదవులమీది చిరునవ్వు మాత్రం మాయమయింది. బాధను లోలోపల బిగించుకున్నట్లు పెదవులు లోపలకు ముడుచుకున్నాయి.
    అమాయకంగా చూసేకళ్ళు ఆరాటంగా శూన్యంలో ఏదో వెతుక్కోసాగాయి.
    నాలోనూ ఆరాటం రగిలింది, ఈవిడ మా నాన్న ఈవిడ సుఖంగా బ్రతుకుతోంటే లేనిపోని సంఘర్షణ ప్రవేశపెట్టానా?
    ఇదివరకు పూవులు ఎవరెనా ఇస్తే ఇచ్చిందే చాలని ఆశగా పెట్టుకొనే జ్ఞాన పూలు పెట్టుకోవటమే మానేసింది. పెళ్ళిళ్ళకూ పేరంటాలకూ అరువుచీరలతో ఆనందంగా వెళ్ళే వ్యక్తి పంతం పట్టినట్లు పాత చీరలతోనే తయారయేది !
    బ్రతుకుమీద కసితో తనను తనే హింసించుకొంటూన్న ఆ దురదృష్టవంతురాలిని చూసి నా మనసు విలవిల లాడేది! కానీ, నేను మాత్రం ఏం చెయ్యగలను? వివాహం పేరిట ఆవిడ చిక్కుకున్న విష వలయంలోంచి బయట పడెయ్యటం ఎవరితరం? దురదృష్టమో, అదృష్టమో కాని జ్ఞానకు పిల్లలు కూడా లేరు!
    అందరి పిల్లలనూ తన పిల్లలుగా చూసి పెంచి పెద్ద చేసిన జ్ఞాన తనకు పిల్లలు లేరని ఏనాడూ బాధపడలేదు!
    మొదటిసారిగా తనకు సంతానం లేనందుకు జ్ఞాన క్షోభించే అవసరం మా మరిది కల్పించాడు !
    బ్రతుకులో మూడు వంతులు నిస్సారంగా గడిచిపోయింది. ఆస్తి పంపకాల విషయం వచ్చింది.
    "వదినను పిల్లలు లేరు! అన్నయ్య తదనంతరం ఆ ఆస్తి మళ్ళీ మాకేరావాలి! కావాలంటే వదినను అర ఎకరమో, ఒక ఎకరమో ఇవ్వండి!"
    అని ఉదారంగా ప్రకటించాడు మా మరిది...
    జ్ఞాన గుండె గుభిలుమంది! చివరికిదా తన బ్రతుకు!
    "పిల్లలు లేకపోతే ఏమయ్యా! ఎవరినైనా పెంచుకుంటుంది" జ్ఞాన తరుపున ఎవరో అన్నారు.
    "ఎవరినో ఎందుకు పెంచుకోవాలి! మా నాన్నగారి ఆస్తి ఎవరికో పోనిస్తానా? కావాలంటే మా పిల్లల్లో ఒకడిని పెంచుకోమను!"
    పట్టుబట్టాడు మా మరిది!
    లీల తనకున్న ఇద్దరు కొడుకుల్లో ఒకణ్ని వదులుకుంటుందా? ఆ పిల్లవాడికి మాత్రం లీల తన తల్లీ అనీ, - జ్ఞాన పెద్దమ్మ అని తెలియదా ? ఈ దత్తత జ్ఞానంకు జరగదలసిన చివరి అన్యాయం__ఆస్తి దక్కనీయక పోవటానికి తప్ప మరెందుకు?
    లక్షణంగా మంత్ర ఘోషలతో దత్తత తంతు పూర్తయింది. జ్ఞాన మనసులో ఏముందో పైకేమీ అనలేదు. ఆ తంతంతా ముగిసి పదిరోజులయినా కాలేదు! ఈ కబురు!
    లీల గుండె పగిలేలా ఏడుస్తోంది. లీలను దగ్గిరకు తీసుకుని ఓదార్చాను.
    "బాధపడకు, జ్ఞాన సంగతి మనకు తెలుసు. అంత రాక్షసంగా ఉండలేదు." అన్నాను.
    "ఏమోనండీ అక్కయ్యగారికి మా మీద కోపంగా ఉంది__" అంది బేలగా...
    "కోపం రావటం అసహజమా ?"
    మాట్లాడింది లీల అయినా మా మరిది ముఖంచూస్తూ సమాధానం చెప్పాను.
    మరిది ముఖం తిప్పుకున్నాడు. లీల కళ్ళు తుడుచుకుంది. అవి వెంటనే నిండుకున్నాయి.
    "బెంగ పెట్టుకోకు! జ్ఞాన సంగతి మనకు తెలియదా? రెండు రోజుల్లోనే తప్పకుండా ఉత్తరం వ్రాస్తుంది. వెళ్ళి అన్ని సంగతులూ మాట్లాడుకోవచ్చు." అని వచ్చేసాను.
    రెండు రోజులు__వారంరోజులు__పదిహేనురోజులు__నెలరోజులు గడిచిపోయాయి.
    జ్ఞాన జాడ తెలీలేదు. అసలే సన్నగా ఉండే లీల చీపురు పుల్లలా అయిపోయింది.
    లీల ఏమయిపోతుందోనని భయం వేసింది నాకు. మొట్టమొదటిసారిగా జ్ఞానమీద కోపంకూడా వచ్చింది.
    లీలా వాళ్ళ పనిమనిషి వగర్చుకుంటూ వచ్చింది. "అమ్మగారు మిమ్మల్ని అర్జంటుగా రమ్మంటున్నారు__" అంది.
    హడలిపోయాను. ఉన్నదాన్ని ఉన్నట్లు బయలుదేరాను.
    లీల నేలమీదపడి దొర్లి దొర్లి ఏడుస్తోంది, ఎవరో అపరిచిత వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉన్నాడు.
    నన్ను చూడగానే "అక్కయ్యా మన రాజు..." అంటూ బావురుమంది లీల ?
    "ఏమయింది ? త్వరగా చెప్పు..."
    లీల వెక్కి వెక్కి ఏడుస్తోందేగాని చెప్పలేకపోతోంది.
    ఆ అపరిచిత వ్యక్తి చెప్పాడు.
    "రాజు అవసాన దశలో ఉన్నాడమ్మా! చివరి చూపులందుకోవాలంటే మిమ్మల్ని అర్జంటుగా రమ్మన్నారు జ్ఞానగారు.
    లీల మళ్ళీ ఘొల్లుమంది!
    "అంత ఎలా ముంచుకొచ్చింది? అసలేం జబ్బు?"
    నాకు ఏడుపొస్తున్నా ఎలాగో అడిగాను ...
    "ఏం చెప్పమంటారమ్మా! ముందు జ్వరం వచ్చింది. మందా! మాకా! అలా గాలికి వదిలేసింది. ఎక్కువైంది. టైఫాయిడ్ లోకి దింపింది. అప్పటికీ డాక్టర్ ను పిలవలేదు! "దత్తు చేసుకున్నంత మాత్రాన వాడు నా కొడుకవుతాడా? ఎలా పోతేం నాకేం? అంది. మేం ఆస్పిటల్లో చేర్పిస్తామన్నా వీలులేదంది. చివరికిప్పుడు...మీరు త్వరగా బయలుదేరాలి!..."
    నిర్ఘాంతపోయాను! జ్ఞాన ఇలా తయారయిందా? నేను ఆమెకు కలిగించిన విజ్ఞానం ఇందుకు దారితీసిందా?
    లీల కుమిలిపోతోంది. ఆవిడను ఓదార్చటం ఎవరికీ సాధ్యం కావటంలేదు.
    "అలా ఏడుస్తూ కూచుంటే ఏం లాభం ? లే! లేచి బయలుదేరు!"
    అన్నాడు మా మరిది దుఃఖంతో పూడుకుపోయిన గొంతుకతో...

 Previous Page Next Page