Previous Page Next Page 
దశావతారాలు పేజి 21


                             న్యాయ సూత్రం


    పేరు పొందిన న్యాయవాది ప్రభాకరరావు. అతడు చేపట్టిన కేసు సాధారణంగా ఓడిపోవటం అంటూ ఉండదని ప్రతీతి.
    ఆరోజు చాలా విచిత్రమైన కేసు విచారణ జరుగుతోంది. రూపుదాల్చిన శోకదేవతలా...ఒక్కసారి ముఖం చూడగానే గుండెలు కరిగేటంత దయనీయంగా ఒక స్త్రీమూర్తి బోనులో నిలబడి ఉంది. ఆవిడమీద మోపబడిన నేరం, పదేళ్ళ ఆడపిల్లను ఎత్తుకుపోయిందని. సాధారణంగా ఆడపిల్లలను ఎత్తుకుపోయేవాళ్ళను చూస్తే ఎవరికీ సానుభూతి కలగదు. కానీ, ఆనాడు కోర్టు హాలులో ఉన్న అందరికళ్ళూ ఆవిడపట్ల సానుభూతిని కురుపిస్తున్నాయి. కారణం, ఆ పిల్ల ఎవరో కాదు. ఆవిడ సొంతకూతురు... బోనులో నిలబడిన ఆవిడ ముఖంలో కనిపించే సౌమ్యత, నిండుదనం. ఒకానొక పెద్దింటిలక్షణం ఆ సానుభూతిని మరింత చిక్కబరుస్తున్నాయి.
    వారి తరపున వాదించడానికి లేచిన ప్రభాకరరావు ఒక్కసారి హాలంతా కలయచూసాడు. అందరి కళ్ళల్లోనూ ప్రతిఫలిస్తోన్న ఒకే ఒక భావాన్ని పసిగట్టాడు. తనలో తను నవ్వుకున్నాడు. వక్తృత్వంకూడా ఒక కళ... ఇప్పుడు...కొన్ని నిమిషాల్లో... ఆ కళ్ళలోని భావాల్ని తారుమారు చెయ్యగలడు తను...
    "మిలార్డ్ ..." ప్రభాకరరావు కంఠం గంభీరంగా ఆ హాలులో ప్రతిధ్వనించింది. ఆ కంఠంలో ఆ ఆకర్షణకు అన్ని కళ్ళూ అటు తిరిగాయి.
    "ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా ఈ కాలంలోనే కాదు... ఏ కాలంలో అయినా...మానవ సమాజంలో వివాహ వ్యవస్థకొక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నెన్ని మార్పులు  వచ్చినా ఆ వ్యవస్థ మాత్రం చెక్కు చెదరలేదు. ఎందుకంటే మానవాభ్యుదయానికది అవసరం నోరెరుగని పసిపాపలు...జ్ఞానం రాని అమాయకులు. తల్లి ఆలనలో, తండ్రి పాలనలో తమ వ్యక్తిత్వానికి రూపురేఖలు దిద్దుకోవాలి. అలా రూపొందటం__సమాజానికెంతో అవసరం. అందుకే ఈ వివాహ వ్యవస్థకీ విశిష్టస్థానం. అందులోనూ ప్రత్యేకించి మన దేశంలో వివాహాన్ని ఆధ్యాత్మికానుబంధంగా... జన్మ జన్మాంతర సంబంధం గావించుకుంటున్నారు. వాది రామారావు వివాహబంధాన్ని పరమ పవిత్రంగా ఎంచుకొనే వ్యక్తి. ఆ కారణంగానే తన భార్య విలసిత..." ఆ పేరు పలుకుతూ ఒక్క క్షణం ఆగిపోయాడు ప్రభాకరరావు. అప్రయత్నంగా ప్రతివాదివంక చూసాడు. ఒక్క క్షణం ఆవిడ కళ్ళు ప్రభాకరరావు కళ్ళతో కలుసుకున్నాయి. ఏదో తెలియని కలవరం మనసును క్రమ్ముకుంది. చూపులు మరల్చుకున్నాడు. తనను తను హెచ్చరించుకున్నాడు. మళ్ళీ గొంతు సవరించుకున్నాడు. అంతా కనురెప్ప పాటులో...
    అంచేత...తన భార్య విలసిత తననుండి విడిపోతానని అన్నప్పుడు సహించలేకపోయారు. ఎన్నో విధాలా బ్రతిమాలుకున్నారు. కానీ విలసితగారికి...వ్యక్తిగతమైన కొన్ని ప్రత్యేక కారణాలవల్ల భర్తతో కలిసి ఉండటం ఇష్టంలేకపోయింది. చేసేదిలేక రామారావుగారు ఆవిడకు విడాకులిచ్చేసారు. కాని తన కుమార్తె సుధను మాత్రం ఆవిడకు అప్పగించలేకపోయారు. తాను ఎంతో గాడంగా ప్రేమించిన ఇల్లాలికి దూరమైన ఆయన కనీసం కూతుర్ని చూసుకునైనా ఊరట పొందాలనుకున్నారు. తన కూతురి జీవితం తల్లి జీవితంలా క్షణికోద్రేకాలకు లోనయి గాడి తప్పకుండా చక్కని క్రమశిక్షణలో పెంచాలనుకున్నారు, లోగడ కోర్టు సుధను తండ్రికే అప్పగించింది.  
    గాడి తప్పిన ఆడదాని జీవితం ఏమవుతుందో అందరికీ తెలిసిందే! తరతరాలుగా చరిత్ర నిరూపిస్తున్న విషయమే "నవ్వుతూ చేసి ఏడుస్తూ అనుభవించాలి" అనే సామెత మనకందరికి తెలిసినదే! ఒకనాడు ఉద్రేకాలకు తననుతాను ఆహుతి చేసుకున్న వ్యక్తి కన్నీళ్ళకు మనము విలువ ఇవ్వలేం! కూతురిపైన ప్రేమ తల్లికి సహజంగా ఉంటుంది కాని ... తన జీవితాన్ని చినిగిపోయిన విస్తరిలా చేజేతులా చేసుకున్న ఈవిడ కూతిరి కేవిధమయిన రక్షణ నియ్యగలదు? చెప్పుకోదగిన ఆస్తిపాస్తులుకాని, చేస్తున్న ఉద్యోగంకాని ఏమీలేని ఈ దశలో తండ్రి దగ్గిర అల్లారుముద్దుగా పెరుగుతోన్న కూతుర్ని తీసుకుపోవటంలో ఈవిడ ఉద్దేశమేమిటీ? ఈవిడ సొంత తల్లి కావచ్చు. అయినా లోగడ కోర్టు రామారావుగారి కప్పగించిన సుధను... ఆ పిల్ల స్కూలుకు వచ్చినపుడు దొంగతనంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించటం కిడ్ నేపింగ్ నేరం క్రిందనే వస్తుంది__"
    ఒక్కసారి ఆగి చుట్టూ కలయజూసాడు ప్రభాకరరావు. సగర్వంగా నవ్వుకున్నాడు. అతడు ఆశించిన ఫలితం వచ్చేసింది. ఇప్పుడు అక్కడున్న వాళ్ళ కళ్ళలో ఆవిడపట్ల సానుభూతిలేదు. ఏదో నిరసన భావమే ఉంది! అవినీతిని ఏమాత్రం సహించని సంఘనీతికి ప్రాతినిధ్యం వహించిన పెద్ద మనుష్యులుపైకి ప్రకటించుకునే కారుకు ధార్మిక డాంబికత ఉంది!
    ఏవేవో గుసగుసలు. అవి స్పష్టీకరిస్తే 'అవునుమరి ఒళ్ళు కొవ్వెక్కి లేచిపోతే ఇలా కాక మరెలా జరుగుతుంది? తను పాడయింది కాక కూతురి బ్రతుకు కూడా పాడుచెయ్యాలనుకుంటోంది.'
    'పాపం ముఖం చూస్తే గుండె తరుక్కుపోతోంది! కానీ అది అంతే! చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ...' ఈ రకంగా ఉంటాయి.
    రామారావుగారి వంక చిరునవ్వుతో చూసాడు ప్రభాకరరావు. ఆయన కళ్ళు మెచ్చికోలుగా నవ్వాయి...
    జడ్జిమెంట్ మరునాటికి వాయిదా పడింది. సందేహం లేదు, ముద్దాయికి శిక్షపడి తీరుతుంది....
    రామారావు వంకా, జడ్జీవంకా, అక్కడి సభికుల వంకా సగర్వంగా చూసిన ప్రభాకరరావు ఒకవైపుకు మాత్రం చూడలేకపోయాడు. అది విలసిత నించున్నవైపు, తన తన పొరపాటునకూడా అటు తిరగకుండా జాగ్రత్తపడుతూ కోర్టు హాలు దాటాడు...
    ఆ సాయంత్రం సోఫాలో కూర్చుని ఏదో మేగజిన్ తిరగేస్తున్న ప్రభాకరరావుకు ఆ పత్రికలో అక్షరాలేమీ కనపడటం లేదు. మనసంతా ఏదో శూన్యంగా తోచసాగింది. తను ఎన్నెన్నో సాధించాడు. లాయర్ గా పేరు ప్రఖ్యాతులు_సంపద_ స్నేహితులు_పరపతి...కానీ తనను పట్టిపీడించే ఈ ఒంటరి తనం నుండి మాత్రం బయట పడలేకపోతున్నాడు.
    విలిసిత... ఆ పేరు... కేవలం పేరు... మానిపోతున్న గాయాన్ని కెలికి సలుపుతోంది...

 Previous Page Next Page