పార్వతమ్మ నిద్రలేచేది. తనకీ నిద్రాభంగం చేశాడని ఆమెకు కోపమొచ్చేదికాదు. విసుగూ అనిపించేదికాదు. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ సంసారయాత్రలో ఆమె భర్తని భరించిందిగానీ, ఎప్పుడూ తిరగబడలేదు. ఇప్పుడిప్పుడే సలహాలిస్తోందిగానీ, స్వతంత్రించి ఏ సందర్భంలోనూ అతనికి వ్యతిరేకంగా నోరు విప్పలేదు.
అంతేకాదు, ఆయనకు లొంగి ఉండటంలో ఆమె తృప్తి అనుభవించేది.
భర్తకి జ్వరమొచ్చి ఏమీ తినలేనిస్థితిలో ఉన్నప్పుడు ఆమె నోటికి కూడా ఏమీ సహించేది కాదు. ఆయనలేచి, మామూలు స్థితికి వచ్చేదాకా ఇంట్లో మిగతావారి తిండి తిప్పలు గురించి కూడా అంతగా పట్టించుకునేదికాదు.
అట్లా నిద్రలేపాక ఇంచుమించు అరగంటసేపు తన మనసులో దొర్లే భావాలు, గత అనుభవాలు, ప్రస్తుతపు ఆలోచనలు, పిల్లలమీద అభిప్రాయాలు, తన అనారోగ్యం వల్లెవేస్తూ ఉండేవాడు. వాటిలో చాలావరకూ పాత విషయాలే ఉండేవి. మనిషికి నలభయిఏళ్ళు నిండాక తరచూ తన ఆనారోగ్యం గురించే ప్రస్తావించే అలవాటు పుట్టుకువస్తుంది. అయినదానికీ కానిదానికీ, సందర్భమున్నా లేకపోయినా తన అనారోగ్యం గురించి మధ్యలో ఇరికించేస్తూ ఉంటాడు.
పార్వతమ్మ విసుగులేకుండా ఆలకిస్తుంది. మధ్యలో ఆయన దాహమని అడిగితే లేచి మంచినీళ్ళు తెచ్చి ఇస్తుంది.
మాట్లాడుతూ మాట్లాడుతూనే ఆయన మళ్ళీ నిద్రలో పడిపోయేవాడు.
రోడ్డుమీద రిక్షాకోసం చూస్తూ చీకట్లో నిలబడ్డ నరసింహంగారు పార్వతమ్మ గురించి ఆలోచిస్తూ తనలో తాను నవ్వుకున్నాడు.
ఈ ఆలోచనలనేవి విచిత్రమైనవి. ఎప్పుడు, ఏ సమయంలో ఎందుకొస్తాయో ఎవరికీ తెలీదు. అసలు మనిషి పొందే అనుభూతి అంతా ఈ ఆలోచనలమీదే ఆధారపడి వుంటుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఒక క్షణంకూడా ఆగకుండా, ఎడతెరిపి లేకుండా, విసుగు విరామం లేకుండా మహాప్రవాహంలా విరుచుకు పడుతుండేవి యీ ఆలోచనలే. డబ్బయి అయిదేళ్ళు సుదీర్ఘ జీవితకాలంలో తాను ఎన్నివేల లక్షల, కోట్ల ఆలోచనలు చేసి వుంటాడు! అయినా విసుగుపుట్టటం లేదు. మధ్యలో ఎన్నిసార్లు ఆలోచనలు స్తంభింప చేయటానికి ప్రయత్నించాడు. ఒక్కక్షణం కూడా సాధ్యం కాలేదు.
ఆ ఆలోచనల్లో తనో కోటీశ్వరుడైపోయేవాడు. ఎంతో ఉన్నతులైపోయేవాడు. ఎంతమందినో కత్తులతో పొడిచేవాడు. ఎన్నో హత్యలు చేసేవాడు. ఎంతమందినో ఆడవాళ్ళను, ముఖ్యంగా పరాయివాళ్ళ భార్యలని అనుభవిస్తూ వుండేవాడు.
ఆఖరికి దేవుడి పటంముందు పూజకు కూర్చున్నప్పుడు కూడా ఏవేవో దరిద్రగొట్టు ఆలోచనలు వస్తూ ఉండేవి.
అసలాలోచిస్తే ఆలోచనలు మనిషి ఊపిరనిపిస్తుంది.
నరసింహంగారికి అటువైపు నుంచి వస్తున్న ఓ రిక్షా కనిపించింది.
"ఇదిగో అబ్బాయ్" అని పిలిచాడు.
రిక్షా అతని నోట్లో ఓ సిగరెట్ వెలుగుతోంది. లిప్తపాటు నరసింహంగారివైపు చూసి, ఏ మాత్రం స్పీడ్ తగ్గించకుండా ఆగకుండా వెళ్ళిపోయాడు.
నరసింహంగారికి కోపమొచ్చింది. రైల్వేస్టేషన్ లో ఆడవాళ్ళతో, పిల్లలతో, సామానుతో ఇళ్ళకు చేరాలని ఆరాటపడుతున్నప్పుడూ, సినిమాహాళ్ళ దగ్గరా, వర్షమొచ్చినప్పుడూ...వీళ్ళెంత క్రూరంగా ప్రవర్తిస్తూ వుంటారో ఆయనకు తెలుసు.