Previous Page Next Page 
హ్యూమరాలజీ -2 పేజి 19


    "షాప్-" అంటూ ఓ కత్తి అతని పక్కనుంచీ దూసుకుపోతుంది.

 

    "షాప్ షాప్ షాప్" అన్నీ కత్తులే!... ... పిల్లలూ- ఆడాళ్ళు శ్రద్ధగా ఆ కథ వినటం చూసేసరికి మా అందరికి వళ్ళు మండిపోయింది.

 

    "స్టాపిట్!" అరచాడు రంగారెడ్డి.

 

    రాజేశ్వరి భయపడిపోయిందా కేకకు.

 

    "మీ కథ రేపు చెప్దురు గాని- ముందితనిని డిస్పోజ్ చేయనీండి!"

 

    "ఆ కథ పరమషెత్త కథ అనీ అలాంటి షెత్తజ్యోతిలో ప్రచురించవద్దనీ ఆ తరువాత నెలలో ఒక ఉత్తరం ఉత్తరాల శీర్షికలో పడింది గుర్తుందా?" అడిగాడు జనార్ధన్.

 

    "అవును- పోకిరీ వెధవ! ఇడియట్! డాగ్- వాడెవడో- కె.కిషన్ రావు, న్యూనల్లకుంట అని రాశాడు-"

 

    జనార్ధన్ తలవంచుకున్నాడు.

 

    "అది రాషింది నేనే రాజేశ్వరిగారూ. ఆ కే.కిషన్ రావ్ పేరుతో రాసింది నేనే!"

 

    జనమంతా ఉలిక్కిపడ్డారు.

 

    "మీరా?" అంది రాజేశ్వరి.

 

    "అవును- అదే మీకు చేసిన దో- ద్రోహం! షమించాననండి"

 

    "నా కథలను విమర్శించే వాళ్ళను ఛస్తే క్షమించను-" బిగుసుకుపోయిందామె.

 

    ఆ మాటతో జనార్ధన్ భోరున ఏడవటం మొదలుపెట్టాడు. "నాకు నిష్కృతి లేదు. నిష్కృతి లేదు!"

 

    అందరం కలసి ఆమెను పక్కకు తీసుకెళ్ళి బ్రతిమాలాము.

 

    "చూడండి! మీ కథలన్నీ క్లాస్ పాఠకులు మెచ్చుకుంటారు. జనార్ధన్ లాంటి మాస్- మషాలా గాళ్ళు చెత్త అంటే మీకెందుకు! మీవన్నీ 'క్లాసిక్స్' అని మేమంతా ఎప్పట్నుంచో చెప్తున్నాం కదా!" అన్నాడు శాయిరామ్.

 

    "సరే క్షమించాను" అందామె.

 

    వెంటనే అందరం కలసి జనార్ధన్ ని తీసుకెళ్లి వాళ్ళింట్లో మంచం మీద పడేశాము.

 

    "ఏమిటో అన్నయ్యగారూ! ఆ పాడు సినిమాల్లో వేషం కోసం మద్రాస్ వెళ్ళిన దగ్గర్నుంచీ ఈ పాడు మందు అలవాటయింది. రోజూ రాత్రుళ్ళు తాగి ఇంటికొచ్చి నానా గొడవా చేస్తున్నారు-" అంది వాళ్ళావిడ కన్నీళ్ళు తుడుచుకుంటూ.

 

    "అవునన్నా! ఈ మనిషి కూడా గిట్లనే తయారయ్యిండు! సినిమా ఏషాల్డిక్కు కెళ్ళి ఈ చెడ్డ అలవాటు జేస్కొని పైసలన్నీ ఖర్చుచేసి మమ్మల్ని చానా కష్టపెడుతుండు" అంది యాదగిరి భార్య గద్గద స్వరంతో.

 

    "అంతేకాదు! వీళ్ళిద్దరూ కలసి మా ఆయన్తో కూడా బలవంతంగా తాగించారు మొన్న అలా తాగుతే గానీ సినిమా రచయితలవలేరు అని ఎవరో చెప్పారట!" అంది చంద్రకాంత్ ఛటోపాధ్యాయ్ భార్య అతనివంక కోపంగా చూస్తూ.

 

    "ఆ మాట నిజమేలేవే! చాలామంది రచయితలు ఇంతకుముందే చెప్పారు నాకు" చిరాగ్గా అన్నాడు చంద్రకాంత్.

 

    "అవును గురూ! వీళ్ళిద్దరూ మద్రాస్ లో ఆ వెధవ సినిమాల్లో ఒక్క వేషం వేశారో లేదో తెగఫోజు కొడుతూ రోజూ బార్ కెళ్తున్నారు" అన్నాడు రంగారెడ్డి.

 

    "వీళ్ళ సంగతి రేపు ఆలోచిద్దాంలెండి" అన్నాన్నేను నిద్రను ఇంకా సర్వనాశనం చేసుకోవటం ఇష్టం లేక.

 

    "కాదు- ఇప్పుడే తేలాలి!" అంది పార్వతీదేవి ఖండితంగా. "మొన్న వంటింట్లో మావారు వంటలో నాకు సాయం చేస్తూ అన్నం వారుస్తూంటే కిటికీలోనుంచి చూసి పాటపాడారు ఇద్దరూ!" అందామె కసిగా.

 

    "పాటేమిటి? ఏమని పాడారు? అడిగాడు శాయిరామ్ కుతూహలంగా.

 

    అందమయిన జీవితమూ- అద్దాల సౌధమూ

 

    వంటచేస్తూ బ్రతికితే వడలిపోవును

 

    మందుకొట్టి తిరుగుతే ధన్యమైపోవును అని పాడారు. ఆ పాట విన్న తరువాతే మా ఆయన మందు కొట్టటం నేర్చుకున్నాడు-"

 

    ఆ పాటలోని సాహిత్యం వినగానే ఆడాళ్ళందరికీ వళ్ళు మండిపోయింది.

 

    "అయితే ఇప్పుడే తేల్చాల్సిందే" అంది సావిత్రమ్మ కూడా! పరిస్థితి చేయిదాటి పోతుందని గ్రహించి రంగారెడ్డి కల్పించుకున్నాడు.

 

    "ఆ విషయం నిజమేగానీ- వాళ్ళిద్దరూ మందు ప్రభావంలో ఉన్నప్పుడు మన మాటేం వింటారు? వచ్చే ఆదివారం మీటింగ్ పెట్టుకుందాం!"

 

    శాయిరామ్ ఆనందంతో పొంగిపోయాడు.

 

    "సోదరీసోదరీ మణులారా! అనుకోకుండా తలెత్తిన ఈ తాగుడు సమస్య గురించి వచ్చే ఆదివారం మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. కనుక.." అంటూ జనం ఇళ్ళల్లోకి వడివడిగా వెళ్ళిపోవటం గమనించి ఉపన్యాసం ఆపేశాడు.

 

    మర్నాడు పొద్దున్నే అందరం కలసి జనార్ధన్ నీ యాదగిరినీ పిలిచి రాత్రి గొడవ గురించి కదిపాము.

 

    సినిమా ఆర్టిస్టులం కదా! మాకు మందు చాలా అవసరం బ్రదర్! రాత్రింబవళ్ళు షూటింగుల కెళ్ళటం, విశ్రాంతి ఉండక పోవటం, లైట్స్ వేడిలో నిలబడటం- మా లైఫ్ ఎవరికి తెలుస్తుంది? ఎందుకు మందుకొడుతున్నామో ఎవరర్ధం చేసుకుంటారు? అన్నాడు జనార్ధన్ శూన్యంలోకి చూస్తూ.

 

    "అవును గురూ! మందుకొడితే గానీ కెమెరా ముందు నిలబడడానికి కాదు" అన్నాడు యాదగిరి.

 

    "రెండు నిమిషాల వేషం వేశారో లేదో బోడి ఫోజులు! ఆ ఒక్క సినిమా కూడా విజయవాడలో ఊరిబయట హాల్లో ఒకే ఒక్క షో ఆడింది-" అన్నాడు గోపాల్రావ్.

 

    జనార్ధన్ ఉక్రోషంగా లేచి నిలబడ్డాడు. "అలా అబద్ధాలు మాట్లాడకండి! రెండో రోజు కూడా మాణింగ్ షో వేశారట."

 

    "అయినా రాత్రి పెగ్ నెంబర్ త్రీ కొట్టాం కాబట్టి కొంచెం సరదాగా కాలనీ అంతా తిరిగాము గానీ- పెగ్ నెంబర్ టూ వరకూ అయితే ఏమీ గొడవుండదు-" అన్నాడు యాదగిరి.

 

    "మేము రోజూ తాగేది కూడా లేదు- మనసు బాగోనప్పుడే" అన్నాడు జనార్ధన్.

 

    ఆ రాత్రి సరిగ్గా పన్నెండికి మళ్ళా కేకలు వినిపించినయ్. కాలనీ వాళ్ళంతా కిటికీలోనుంచే టార్చ్ లైట్లు ఫోకస్ చేసి చోద్యం చూడసాగారు.
        


    "నా కొడుకులు! ఒకేఒక్క మాణింగ్ షో ఆడిందంట! థూ దొంగ నాయాళ్ళు" అరిచాడు జనార్ధన్.

 

    "సాలేగాళ్ళన్నా ఆళ్ళందరూ! రెండోరోజు మాణింగ్ షోలో మన యాక్షన్ కి ఇద్దరు తప్పట్లు కొట్టిన్రట! ఆ సంగతెవళ్ళన్న చెప్తరేమో చూడు-"

 

    ఆ తరువాత ఇద్దరూ పాట మొదలుపెట్టారు "జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా! సినిమా ఫీల్డు కెళ్ళినోడికి ఎదురులేదురా- ఎదురు లేదురా"

 

    మర్నాడు పొద్దున్నే మళ్ళీ వాళ్ళిద్దరినీ బయటకు పిల్చాము. "ఎప్పుడో మనసు బాగోనప్పుడే తాగుతామన్నారు కదా నిన్న" అడిగాడు రంగారెడ్డి కోపంగా.

 

    "నిన్న మళ్ళీ మనసు పాడయిపోయిందన్నా" అన్నాడు జనార్ధన్ విచారంగా.

 

    "ఎందుకని?"


    
    "మా ప్రొడ్యూసర్ సెకండ్ పిక్చర్ లో మళ్ళీ మమ్మల్ని బుక్ చేసుకుంటానన్జెప్పి- మోసం చేశాడు"

 

    "అంటే ఇంకెవరినయినా వేసుకున్నాడా?"

 

    "కాదు గురూ! అసలు సెకండ్ పిక్చరే తీయకుండా ఎగ్గొట్టాడు!"

 

    "బాస్టర్డ్! బ్రీచ్ ఆఫ్ ప్రామిస్" అన్నాడు యాదగిరి కోపంగా

 

    "అంటే ఇవాళ మీ వల్ల ఏ గొడవా ఉండదని గ్యారంటీ ఇస్తారు! అంతేనా?"

 

    "సెంట్ పర్సెంట్" అన్నాడు జనార్ధన్.

 

    ఆ రోజు రాత్రి హఠాత్తుగా మళ్ళీ బయట కేకలు వినిపించినయ్. అది యాదగిరి గొంతని తెలుస్తూనే ఉంది. వెంటనే బయటకు పరుగెత్తారందరూ! అప్పటికే మిగతా చాలా మంది ఇళ్ళల్లోనుంచి బయటికొస్తూ కనిపించారు ఆ గొడవకి.

 Previous Page Next Page