ఇంటికి వెళ్ళి దీపం ఆర్పాడో లేదో చూడాలనుకున్నాడు. ఇక మరి ఆలోచనకు తావివ్వకుండా వెనక్కి బయల్దేరాడు.
ఐదు కిలోమీటర్లు నడిచొచ్చి ఇంటికి చేరుకున్నాడు.
ఇంకా చీకట్లు చిక్కగానే వున్నాయి. వూరు వూరంతా కాళ్ళుకడుపులో దాచుకుని నిద్రపోతోంది. వీథి చివర పనిలేని కుక్క అటూ ఇటూ తిరుగుతూ గూర్కా పనిచేస్తోంది.
కంగారు కంగారుగా తలుపు తట్టాడు సూరయ్య.
ఆ శబ్దాలకు సూరమ్మ హడావుడిగా లేచి తలుపు తెరిచింది. ఎదురు భర్త. ఆమె ముఖంలోని ఆశ్చర్యం అంత చీకట్లోనూ మందంగా కనిపించింది సూరయ్యకు.
"ఏమిటండీ ఇలా వచ్చేశారు. పెళ్ళికి వెళ్ళలేదా?" భర్తను వాకిట్లోనే నిలదీసింది.
"లేదే, మార్గమధ్యంలో వుండగా చిన్న అనుమానం బయల్దేరింది. దాంతో తిరిగివచ్చేశాను.
"ఏమిటండీ అది?"
"నేను వెళ్ళేటప్పుడు దీపం ఆర్పానా లేదా? ఒకవేళ అలా దీపం వెలుగుతుంటే కిరసనాయిలు ఎంత వేస్టు! అందుకే దీపం ఆర్పి వెళదామని వచ్చాను."
సూరమ్మకు అంతా అర్థమయింది. కానీ మొగుడు దీపం కథ చూసిగానీ మరోనష్టాన్ని గూర్చి ఆలోచించలేకపోయాడని గ్రహించింది.
'బాగానే వుంది. అయితే అంత దూరం వెళ్ళి తిరిగి వచ్చేశారు, చెప్పులు ఎంత అరిగిపోయుంటాయో ఆలోచించారా? ఆ నష్టాన్ని పూడ్చడం?" అని సూరమ్మ అడిగింది.
"అప్పుడు సూరయ్యగారు ఏమని సమాధానం చెప్పాడో చెప్పమంటావా?" అని అప్పటివరకూ శ్రోతగా వున్న కీర్తి అడగడంతో కథ చెప్పడం మానేసి "చెప్పు" అన్నట్టుగా ఆమె ముఖంలోకి చూశాను.
"అంతట సూరయ్య భార్యవైపు చూసి చిద్విలాసంగా నవ్వి ఇలా అన్నాడు ఓసి పిచ్చిమోహమా, నేను అంత తెలివి తక్కువ వాడిలా కనిపిస్తున్నానా నీకు? వెంటనే నీ అభిప్రాయం మార్చుకో- అలాంటి అనర్ధం జరగకుండా చెప్పుల్ని చేతుల్లోకి తీసుకుని నడిచొచ్చానే వెర్రి మొఖమా" అంటూ నా కథకి అందమైన ముగింపు చెప్పింది కీర్తి. అలా కీర్తి చేతిలో ఘోరంగా దెబ్బతినేశాను. అయితే ఆ అపజయం నాలో కసిని రేపింది. ఎలాగైనా ఆమెను జయించాలి అన్న కోరికను రెట్టింపు చేసింది.
కాటేజీలో వున్నా, మధ్య మధ్యలో దామూ వచ్చి కాఫీ ఇచ్చివెళ్తున్నా, రాత్రికి ఉడ్ లాండ్స్ కి భోజనానికి వెళ్ళినా నేను ఆలోచించింది ఒక్కటే- ఎలాగయినా ఈ రాత్రికి కీర్తిని జయించాలి.
రాత్రి తొమ్మిదయింది.
వరండాలో కుర్చీల్లో కూర్చున్నాం.
గత రెండు రోజులకంటే చలి ఎక్కువైంది. అందుకే కోరిక మరింత వెచ్చనైంది.
ఆకాశంలో అప్పుడే పుట్టిన నెలవంక నీరసంగా వెలుగును లోకం మీద వంచుతోంది.
కీర్తి కుర్చీలో పద్మాసనం వేసుక్కూర్చుని "కానీ మదన్ కథ ప్రారంభించు" అంది.
ఆ మాటలు సవాలు చేస్తున్నట్టున్నాయి నన్ను.
కథ చెప్పడం ప్రారంభించాను.
* * * * *
అదొక చిన్న టౌన్. చుట్టూ చాలా పల్లెలు వుండడం వల్ల అంతకు ముందు గ్రామంగా వున్న ఆ వూరు టౌన్ గా అభివృద్ధి చెందింది. మొత్తం వంద కుటుంబాలుంటాయి. అందరూ వ్యాపారంమీద బతుకుతున్నారు. చిన్న చిన్న దుకాణాలు కాక రెండు బ్రాందీ షాపులు, ఒక టూరింగ్ టాకీస్, హైస్కూల్ వున్నాయి. పోలీస్ స్టేషన్ కావాలని ఆ వూరి ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా పోలీసు స్టేషన్ పెట్టి ప్రశాంతంగా వున్న ఆ వూరిని చెడగొట్టడం ఇష్టంలేని ప్రభుత్వం ఆ విజ్ఞప్తులను ఖాతరు చేయడం లేదు.
దుకాణాలలో ఉప్పు, పప్పు కొట్లే ఎక్కువ.
అలాంటి ఒక దుకాణం రాఘవులది.
ఒక్కొక్కరు ఒక్కో విషయం వల్ల ప్రసిద్ధి చెందుతారు. రాఘవులు పరమలోభిగా ఆ వూర్లో ప్రసిద్ధుడు. లాభం అనే మాట లేకుండా అతనువాక్యాన్ని చెప్పలేడు. అతని వ్యాకరణమంతా వడ్డీ అనేపదం చుట్టే తిరుగుతుంటూంది. ప్రతి విషయాన్ని అతను వడ్డీ కోణంలోంచే సందర్శిస్తాడు.
దుకాణంలోకి వచ్చిన వ్యక్తి మాటల సందర్భంలో "కొత్త ఇల్లు కడుతున్నాం బాబూ" అని అంటే "కొత్త ఇల్లు కట్టుకోవడం వల్ల లాభం వుండదు. వడ్డీ గిట్టుబాటు కాదు. మహా అయితే పెళ్ళాం మీద పెట్టిన డబ్బు లాభం ఇవ్వక పోగా నష్టాన్ని తెచ్చి పెడుతుంది" అని ఠక్కున అనేవాడు రాఘవులు.
"ఎందుకంత మాసిపోయిన బట్టలు కట్టుకుంటారు?" అని రాఘవుల్ని బుద్ధిలేక ప్రశ్నిస్తే "పోదురూ! కొత్త బట్టలు దండగ. వడ్డీ నష్టం. శరీరాన్ని దాచుకోవడానికి ఏ బట్టలైతే ఏం?" అని కొట్టిపారేస్తాడు.
అందుకే అతన్ని వడ్డీ రాఘవులు అనేవారు అందరూ.
ఇంతచేసి అతను ఏ అరవయ్యేళ్ళ ముసలివాడనుకుంటే పప్పులో కాలేసినట్టే. అతనికి ముప్పైయేళ్ళు మించవు.
రెండేళ్ల క్రితం ఓ రోజు అతని తల్లిదండ్రులు "రేయ్ రాఘవులూ! పెళ్ళి చేసుకోరా" అనంటే "ఎందుకు వడ్డీ దండగ" ఠక్కున అని వాళ్ళ ముందు నుంచి లేచి వెళ్ళిపోయాడు.
అతని నాన్న వెనకే పరుగెత్తి కెళ్ళి పట్టుకున్నాడు. అతనితో పాటే నడుస్తూ అతని నాన్న ఇలా చెప్పాడు.
"పెళ్ళి చేసుకో రాఘవులూ. పెళ్ళి చేసుకుంటే నష్టం రాదురా. పైపెచ్చు లాభం. ఇంటి పనంతా చేసి చేసి నీకంత వుడకబెట్టి వేయాలంటే ఏ ఆడ ముండకైనా నెలకు ముప్పై రూపాయిలివ్వాలి. అదీ ఆ పిల్ల తెల్లవారి ఒసారొచ్చి, సాయంకాలం మరో మారొచ్చి వెళ్ళిపోతుంది. అదే పెళ్ళామనుకో. నీ ఇంటి దగ్గర కాపలా కుక్కలా ఇరవైనాలుగు గంటలూ పడుంటుంది. జీతం ఇవ్వక్కర్లేదు. ఏదో అంత రెండు పూట్లా తిండి వేస్తే చాలు. నువ్వు ఎలానూ టిఫిన్ చేయవు కాబట్టి ఆ పిల్ల ఒక్కత్తే టిఫిన్ చేసుకుని తినదు. అందువల్ల రెండు పూటలా తిండితోనే సరిపెట్టేయచ్చు. అంతేగాక ప్యాసా ఖర్చు లేకుండా శారీరక సుఖాలూ అనుభవించవచ్చు. ఎంత వెధవ ముండ దగ్గరికెళ్ళినా వచ్చేప్పుడు అయిదో, పదో చేతిలో పెట్టాలి. లేకపోతే మరోసారి రానివ్వదు. కాబట్టి ఆలోచించు."
అంతవరకు మూతపడ్డ అతని కళ్ళు నాన్న హితోపదేశంతో తెరుచుకున్నాయి. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన వారంరోజుల పాటు ఆలోచించాడు. పనిమనిషి కయితే ఎంత ఖర్చవుతుంది? పెళ్ళాంకయితే ఎంత ఖర్చవుతుంది? ఈ విధంగా లెక్కలు కట్టాడు. ఎంత లెక్కలు వేసుకున్నప్పటికీ పెళ్ళామే నయమనిపించింది.
పెళ్ళికి ఒప్పుకుంటున్నట్టు వుత్తరం రాసి పడేశాడు ఇంటికి.
అతని తల్లిదండ్రులు మదనపల్లెలో వుండేవారు. వ్యాపారం రీత్యా రాఘవులు వడమాలపేటలో సెటిలయ్యాడు.