ఒక నిముషం తటపటాయించి మూడో అన్నయ్యగదిలో అడుగుపెట్టింది.
అప్పుడే చీకట్లు విచ్చుకుంటున్నాయి. అనసూయమ్మగారు నిద్రలేచి వంటింట్లో పని మొదలుపెట్టింది. బయటనుంచి పాలవాళ్ళు, పనివాళ్ళు రావటం మొదలయింది.
లోపల కడుగుపెడుతున్న గిరిజ గుమ్మందగ్గరే కొయ్యబారి నిలబడి పోయింది.
అనంతమూర్తి, మీనాక్షి మంచంమీద గాఢాలింగనంలో వున్నారు. గిరిజకు కాళ్ళక్రింద భూమి కదిలినట్టయింది. తల భూమిలోకి కృంగిపోయినట్లయింది. ఎలాగో చైతన్యంలోకి వచ్చి గిరుక్కున వెనుదిరిగి, మెట్లెక్కి గబగబా పైకి పోయింది.
ఆమె గుండె గబగబా కొట్టుకుంటోంది. అదిరే శరీరంతో మంచంమీద కూర్చుని 'ఏమిటిది?' అనుకుంటోంది.
ఎంత యాంత్రిక వాతావరణంలోనైనా మనిషి తన రక్తమాంసాలనే జ్ఞాపకం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ చాలా సందర్భాలలో కృతకృత్యుడౌతూ వుంటాడు. అలా అనడం కొందరిపట్ల వరం కావచ్చు. సంవత్సరాల తరబడి ఒకరినొకరు తిట్టుకుంటూ, మానసికంగా హింసించుకుంటూ గడిపే భార్యాభర్తలు సఫలీకృతంగానే కాపురం చేసినట్లు పరిగణించడానికి యీ రక్తమాంసాలే కారణం కావచ్చు ఈ రక్త మాంసాల బలం మనిషి వ్యక్తిత్వంకన్నా, మనసు కన్నా, అభిరుచులకన్నా గొప్పది.
పదినిముషాలకి తేరుకుని బయటకి వచ్చింది. అదే సమయానికి ప్రక్క గది తలుపులు తెరుచుకుని సుందరం బయటకు వచ్చాడు.
అనుకోకుండా లేస్తూనే ఆమెను చూడగానే అతనిముఖం వికసించింది.
"గుడ్ మార్నింగ్ డార్లింగ్" అన్నాడు.
కొంచెంగా వణికినట్లయి ఆమె తలయెత్తి అతని ముఖంలోకి చూసింది. ఈ వ్యక్తి తనకు పుట్టినదాదిగా సన్నిహితుడు. ఇప్పుడు మరింత దగ్గరకు వచ్చినవాడు. మున్ముందు జీవితాన్ని మరింతగా ఆక్రమించుకోబోతున్నవాడు.
నిన్న సినిమాహాల్లో ఆ అమ్మాయి అన్నమాటలు గుర్తొచ్చాయి.
తమ యిరువురిలో ప్రవహిస్తోన్న రక్తం ఎన్ని తరాలనుండీ ఒక్కటిగా, ఒకేనదిగా కలిసే ఉపనదుల్లాగా, అక్కడికక్కడే సర్దుకుపోతూ, కొత్తరక్తాలకు చోటివ్వకుండా ప్రవహిస్తోందో!
"బావా!" అంది అప్రయత్నంగా కాని అప్పుడామెకు బావలాకూడా కనిపించలేదు.
"బేబీ!" అని అతను అనురాగంగా పిలుస్తూ దగ్గరగా వచ్చాడు.
"బావా! నువ్వు నన్నెందుకు పెళ్ళి చేసుకున్నావు?" అని అడగాలనుకుంది.
కాని అతను యిదేమీ గమనించే స్థితిలో లేడు. అతని చేతివ్రేళ్ళు ఆమెను తనలో ఇరికించుకోవాలని తహతహలాడుతున్నాయి.
"బేబీ!" అంటూ మరింత దగ్గరగా జరగబోయాడు.
హఠాత్తుగా ఆమె స్పృహలోకి వచ్చినట్లయింది. ఒక్కసారి తలని విదిలించి అతన్ని తప్పించుకుని మెరుపులా క్రిందికి వెళ్ళిపోయింది.
పెరట్లోకి వెళ్ళి ముఖం కడుక్కొని కాఫీ త్రాగటానికి వంటింట్లోకి వెడుతూండగా తల్లీ, యశోదత్తయ్యా మాట్లాడుకుంటూండటం విని గుమ్మంలోనే ఆగిపోయింది.
"మళ్ళీ ఎప్పటికో వాయిదాలు వేసి ఆలస్యమెందుకు వదినా? పదహార్రోజుల పండగనాడే అక్కరకూడా తీర్చేద్దాం."
"దాన్దేముందమ్మా ఇంకా పిల్ల చదువుకుంటోందిగదా అన్న ఆలోచన ఒక్కటేగాని."
"అదేమి వదినా? అక్కర తీరినంతమాత్రాన చదువు మానెయ్యాలనుందా? మాకు బేబీ పరాయిదా? మీకు సుందరం పరాయివాడా? అదొచ్చి అక్కడ చదువుకోవచ్చు లేక ఇద్దరూ ఇక్కడే వుండి చదువుకోవచ్చు."
"అలాగేనమ్మా ఆయన్తోకూడా చెబుతాను. నువ్వు మోజుపడుతూ వున్నట్లు పదహార్రోజుల పండగనాడే ఆ ముచ్చటా తీర్చేద్దాం."
గిరిజకు తల తిరిగినట్లయింది. ఒక్కొక్క సంఘటనా తనమీద ఎలా విరుచుకుపడుతున్నదో, తాను ఎంత బలహీనురాలో అర్ధమయింది వెనక్కి తిరిగి తూలుతున్నట్లుగా ఒక్కొక్క మెట్టూ ఎక్కి పైకి వస్తున్నది.
సగంవరకూ వచ్చాక సుందరం ఎదురుగా వచ్చాడు.
ఏదో జోక్ వేశాడు. ఆమెకు వినిపించలేదు. అతన్ని తప్పించుకుని పైకి వెళ్ళి తన గదిలో దూరి మంచంమీద వాలిపోయి బావురుమని ఏడ్చేసింది.
6
పదహారు రోజుల పండుగ!
ఉదయం నిద్రలేస్తూనే గిరిజకు తలంటిస్నానం పోశారు. ఆ ఇంట్లో ఏం జరిగినా అన్నీ యధావిధిగా జరుగుతాయి. ప్రతి చిన్న సందర్భానికి పదిమంది పోగవుతారు. మంత్రాలూ, తంత్రాలూ తతంగమంతా వుంటుంది.
ప్రొద్దుట్నుంచీ ఏదో పండుగ జరిగినట్లే అనిపిస్తోంది.
సుందరానికి కూడా తలంటిపోశారు. కొత్తబట్టలు కట్టబెట్టారు. అతని ముఖంలో గర్వం, ఆనందం, తృప్తి తొణికిసలాడుతున్నాయి.
పెళ్ళికి వచ్చిన చుట్టాలలో ఇంకా చాలామంది అక్కడే వుండిపోవటంవల్ల బోలెడుమంది జనంతో ఇల్లంతా కళకళ్ళాడుతోంది.
మధ్యాహ్నం సరోజ స్నేహితురాల్ని చూడ్డానికి వచ్చింది. గిరిజ ముఖంలో స్మతోశానికి బదులు ఏడుపురేఖలు చూసి సరోజ విస్మితురాలయింది. ఏదో పోగొట్టుకున్నట్లున్న సరోజని చూసి ఆశ్చర్యపోలేదు.
పైన గదిలో మంచంమీద ఇద్దరూ ప్రక్క ప్రక్కన కూర్చున్నారు.
"సిగ్గులేకుండా ఓ సంగతి చెప్పనా?" అన్నది గిరిజ.
ఆమె మాటలవెనక, స్వరంమాటున ధ్వనించిన వేదన సరోజను చురుక్కుమనిపించింది.
"ఈ వేళ నా కార్యం."
సరోజ ఒక్కసారిగా వణికినట్లయింది. తాను బావను పెళ్ళి చేసుకుంటే ఈవేళ...