Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 20


    అతనికానందం కలిగింది. "ఓయ్! నీపని అయిందా మిష్టర్. ఇదేం మంజులత వ్యవహారమనుకున్నావా? మా అక్క! ఆఁ. మా అక్క."
    మృత్యుంజయరావుకు నిద్రవస్తోంది. అతనికళ్ళల్లో మాలతి మెదిలింది. నాటకం దగ్గరలో పడింది. నాలుగురోజుల్లో వుంది. రానురానూ ఆమెనటన రంగులు తీర్చుకుని సానపట్టిన వజ్రంలా ప్రకాశిస్తోంది. ఆమెతండ్రి పశుపతి రిహార్సల్సుకు వస్తున్నాడు. అక్కడున్న మనుషులెవరికీ నాటకకళగురించి తెలియదని ఆయన దృఢవిశ్వాసం. తరచు సోమయాజులకూ, ఆయనకూ వాగ్వివాదం జరుగుతోంది. మీకు తెలియదంటే మీకు తెలియదని అరుచుకుంటున్నారు. మధ్యలో తురంగరావు కలగజేసుకోకపోతే "నీకు తెలీదు నువ్వూరుకో. కుర్రాడివి" అని పశుపతిగారు మందలించారు. అతను పాపం, మళ్ళీ నోరెత్తడానికి సాహసించలేదు.
    ఒకసారి మాలతి అడిగింది. "మీ అక్కగారు వచ్చారటగా, చాలా యింటరెస్టింగ్ పర్సనాలిటీ అని విన్నాను. చూపించరూ ఒకసారి"
    "అలాగే. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను."
    "అన్నట్లు తలుపు వేశానా?" ఒకసారి లేచి గడియ చూసివచ్చి పడుకున్నాడు.
                         8
    నాటక ప్రదర్శన బాగానే జరిగింది. టిక్కెట్లుకూడా వూళ్ళో ప్రజలకు బాగానే అంటగట్టారు. ఊరి చైర్మన్ గార్ని అధ్యక్షునిగా ఆహ్వానించారు. తురంగరావు అతని డప్పు స్నేహితుడయిన ముకుందాన్ని ఏలూరునుండి ఆహ్వానించాడు వక్తక్రింద. అతను పక్కా స్టేజ్ స్పీకర్ క్రింద తయారయాడీమధ్య. చిన్నచిన్న సభల్లో రెండుమూడు సన్మానాలుకూడా చేయించుకున్నాడు. ఉపన్యసించేటప్పుడు చేతులు తెగ ఊపుతాడు గాలిలో. అటు వొంగుతాడు. ఇటు వొంగుతాడు. కాకినాడ కళలకు నిలయమన్నాడు. ఈనాడు తూర్పు పశ్చిమాల సంగమం ఇక్కడ ఏర్పడింది అన్నాడు. అంటే తను పశ్చిమ గోదావరిజిల్లాకు చెందినవాడిననీ, తురంగరావు తూర్పు గోదావరిజిల్లాకు చెందినవాడనీ తామిరువురూ యిక్కడ తారసిల్లామనీ అతని తాత్పర్యం.
    మొత్తంమీద సభా, సభానంతరం నాటకం జయప్రదంగా జరిగిపోయాయి.
    పశుపతిగారు ప్రేక్షకుల్లో కూర్చుని ముందుకూర్చున్న చైర్మన్ గారితో "కథానాయిక వేషం వేస్తున్న పిల్ల మా అమ్మాయి" అన్నాడు సగర్వంగా.
    "ఓహో! అలానా. చాలా బాగా చేస్తోంది. మంచి చురుకైనపిల్ల. మంచి భవిష్యత్తు వుంది" అన్నాడు చైర్మన్ గారు తల వూపుతూ.
    "భవిష్యత్తంటే నాటకాలపిల్లగా తయారవటమేగా."
    చైర్మన్ గారి గొంతున పచ్చివెలక్కాయ పడినట్లయింది.
    "అసలు నాకు కళ అంటే చాలా అభిమానమండీ. మా అమ్మాయినికూడా చిన్నప్పటినుంచీ అన్ని కళ్ళల్లో పాల్గొనేటట్లుగా అభిరుచి కలిగించాను. కాని అదే ఇప్పుడు పెద్ద అభ్యంతరమైందేమోనని బాధపడుతున్నాను. మన సమాజం, వ్యవస్థా వ్యక్తిగత అభిరుచుల్ని బట్టి విలువల్ని నిర్ణయించలేదు. మా అమ్మాయి జీవితం సుఖంగా గడపటానికి యిదో అడ్డంకి అయితే నాకింతకంటే శాపమే ముంటుంది?" అన్నారు పశుపతిగారు గంభీరంగా.
    చైర్మన్ గారు అవునవునంటూ తల ఊపారు.
                     *    *    *
    నాటకం అయిపోయాక మాలతి గ్రీన్ రూంలో కుర్చీలో చతికిలబడి నిట్టూరుస్తూ "హమ్మయ్య. నా బాధ్యత తీరిపోయింది బాబూ! ఇంకెప్పుడూ యీ జంఝాటంలో దిగను" అంది.
    వైకుంఠం యీమాట విన్నాడు. "అదేమిటండీ అలా అంటారు? మీవంటి బ్రహ్మాండమైన నటి యిలా నిస్పృహ వహిస్తే రంగస్థలంసంగతి ఏంకాను?" అని అద్దంలో చూసుకుంటూ రంగుమీసాలు చెరిపేసుకుంటున్నాడు.
    "బ్రహ్మాండం... వల్లకాడు. నన్నిలా సామాన్యంగా బ్రతకనీయండి మీ అందరి మాటకూ ఎదురాడలేక వప్పుకున్నాను. చెబుతున్నాగా. యిహ స్టేజి ఎక్కటం యిదే ఆఖరిసారి అని నిర్ణయించుకున్నాను."
    శేఖరం అంతవరకూ ఎవరో స్నేహితులతో మాట్లాడి అక్కడికి హడావుడిగా వచ్చాడు. మనిషి ఉత్సాహంతో వూగిపోతున్నాడు. "అమోఘంగా నటించారండీ మాలతిగారూ. మిమ్మల్ని, మీ అభినయంచూసి మా మాలతిగారేనా అనుకున్నాను. ఊపిపారేశారనుకోండి" అతని ఉద్రేకం చూస్తూంటే ఆమె భుజాలు పట్టుకుని కుదిపేస్తాడేమోనన్న భయం కలిగింది మృత్యుంజయరావుకు. అతను దూరంగా నిలబడి ఆలోచిస్తున్నాడు.
    "మీరు చాలా బాగా నటించారండీ!" అని జవాబిచ్చింది ఆమె చిరునవ్వుతో.
    "మీరు ఫార్మాలిటీకి అంటున్నారు."
    "కాదు. నిజమేనండీ మహాశయా!"
    మృత్యుంజయరావు చెవులు రిక్కించి వింటున్నాడు.
    "నా పర్యవేక్షణ ఎలా వుందో చెప్పరేమర్రా?" అంటూ సోమయాజులు హడావుడి చేస్తూ వచ్చాడు.
    "బ్రహ్మాండం, అమోఘం" అని అరిచారు సభ్యులు.
    అంతా ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. హర్షధ్వనులు చేస్తున్నారు. గ్రీన్ రూమంతా కోలాహలంగా వుంది. బట్టలు మార్చేసుకుంటున్నారు. రంగులు చెరిపేసుకుంటున్నారు. కేరింతలు కొడుతున్నారు. మృత్యుంజయరావు ఒక్కడే వంటరిగా నిలబడి అందర్నీ గమనిస్తున్నాడు. అతని ఉనికి పట్టించుకున్నవారు లేరు.
    మరునాడు మాలతిని చూడటానికి అతనికి చాలా బిడియంగా అనిపించింది. ఇన్నాళ్ళూ ఆమె తన పరిధిలోనే వున్నదనీ, ఆ పరిధిని దాటి అవతలకు వెళ్ళి తనని విస్మృతిలో పడవేసేటంతటి కాఠిన్యం ఆమెకు లేదనీ ఓ అభిప్రాయం వుండేది. కాని నిన్నటితో ఆ భ్రమ తొలగిపోయినట్లయింది. ఆమె ముఖంవంక చూడలేక తల ఎత్తకుండా తనపని చేసుకుంటున్నాడు.
    కాని కొంతసేపటికి ఆమే వచ్చి అతన్ని చిరునవ్వుతో పలకరించింది. "నిన్న మీరు కనబడనేలేదేమండీ?"
    అతను ముఖం పైకి ఎత్తాడు. ఎంత అమాయకంగా, నిర్మలంగా చూస్తోంది తనవంక.
    క్షణంలో అతను పసిపిల్లాడిలా అయిపోయాడు. "నిన్న గ్రీన్ రూంనుండి చివర్న బయటకు వెళ్ళిన వ్యక్తిని నేనే. మీరు నన్ను చూడకుండా ముందే వెళ్ళిపోయారు" అన్నాడు. అతని కంఠం జీరపోయింది.
    మాలతి ముఖంలోకూడా బాధ కనిపించింది. "ఆయామ్ సారీ, హడావుడిలో మీకు చెబుదామనికూడా మరిచిపోయాను. రాత్రి ఆ విషయమే తలుచుకుని చాలా బాధపడ్డాను" అంది తల వొంచుకుని.
    ఆఫీసులోని మిగతా వ్యక్తులంతా తమవంక చూడటం అతను కనిపెట్టాడు. అతనికి సంతోషం కలిగింది. తమని గమనిస్తున్నవారిలో శేఖరంకూడా వున్నాడు. వాడికంతే కావాలి శాస్తి, బాగా చూడనీ.
    ఆమె బాధపడటం అతను భరించలేక "అబ్బే! ఎందుకండీ అలా వర్రీ అవుతారు? మీరసలే చాలా అలసిపోయి వున్నారు. మరిచిపోవటంలో అసహజమేమీ లేదు" అన్నాడు మృదువుగా.
    అతనున్న సీటుదగ్గరకు వచ్చి ఎక్కువసేపు నిలబడి మాట్లాడటం బాగుండదని భావించి "లీజర్ అవర్ లో మీరు నాతో కాఫీ తీసుకోవాలి. తప్పకుండా వస్తారుగా" అని అతని జవాబుకోసం ఎదురుచూడకుండానే తన సీటులోకి వెళ్ళిపోయింది.
    ఈరోజు చాలా దివ్యమైనరోజుగా, ఈ ప్రపంచమంతా నందనవనంగా కనిపించింది అతనికా క్షణంలో.
    "ఓ పువ్వులా మీరంతా విరబూయండి" అని మనసారా వాంఛించాడు.
    "ఓ కోకిలా! నువ్వు గానం చెయ్యి. మయూరమా! పురివిప్పి నాట్యమాడు. సంపెంగాయా! నీ సౌరభాన్ని వెదజల్లు!"
    'కాని' అతననుకున్నాడు. "నేను మంచివాడ్ని, చెడ్డపనులు చేయను, కనీసం చెడుకోరికలు కోరను."
    తను యిన్నాళ్ళూ యాంత్రికంగా పనిచేస్తున్న లోకల్ ఫండ్ ఆడిట్ ఆఫీసు ఓ గొప్ప ఆఫీసులా, తను గొప్ప ఉద్యోగస్థుడిలా కనబడ్డాడు.
    మిగతా సమయమంతా అతనికి చాలా ఉల్లాసంగా గడిచింది.
    ఒంటిగంట అవగానే ఉద్యోగాస్థులంతా లేచి క్యాంటిన్ వైపు వెళ్ళారు. మృత్యుంజయరావు మెల్లిగా లేచి మాలతి సీటుదగ్గరకు వెళ్ళాడు.
    "కూర్చోండి" అన్నదామె ఆదరపూర్వకంగా.
    అతను కూర్చున్నాక అంతకుముందే తెప్పించిన రెండుగాజు గ్లాసుల్లో తను తెచ్చుకున్న ఫ్లాస్క్ లోంచి కాఫీపోసింది. "తీసుకోండి" అని మృదుస్వరంతో.
    అతనికేం మాట్లాడాలో తెలియక మౌనంగా కాఫీ త్రాగుతున్నాడు.
    మాలతి అతనివంక చూస్తూ, "ఈ మధ్య మీరు రోజూ యింటివరకూ వచ్చి సాగనంపటం అలవాటయింది కదూ! నిన్న మీరులేకుండా నాన్నగారితో వెడితే అదోలా అనిపించింది" అన్నది.
    అతని మనసు ఉన్మిళితమైంది. ఓ అమర్షభావం రక్తంలో ప్రతి అణువులోనూ అంకురించింది. ఏమీ మాట్లాడలేకపోయాడు.
    "నా నటనని గురించి అందరూ చెప్పారు. మీరేం మాట్లాడరేం?"
    "మీరు నటించలేదు" అన్నాడు.
    "అదేమిటి?" ఆమె తెల్లబోతూ చూసింది.
    "పాత్రలో జీవించారు" తన మాటలు తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
    ఆమె ముఖంలో ఓ కాంతిరేఖ మెరిసి, అదృశ్యమైంది.
    "అంతేకాదు, ఇంకో విషయంకూడా చెబుతాను. అసలది వొట్టి చెత్త నాటకం- మీరు నటించటంవల్లే రక్తి కట్టింది."
    "ఆఁ ఆఁ, ఆపండి. ఇదిమాత్రం అతిశయోక్తే."
    "ఏమీకాదు. నాకు అలంకారాలుకూడా వచ్చునా ఏమిటి?" తనీరోజు చాలా బాగా మాట్లాడుతున్నాడు.
    తర్వాత కొంతసేపటికి మాలతి, జగతిగురించి అడిగింది. "మీ అక్కగార్ని చూపిస్తానన్నారు, ఎప్పుడు?"
    "మీ యిష్టం. కాని ఆమె సాయంత్రాలు యింట్లో వుండదు. విద్యాధరస్వామి అని, యీ మధ్య మఠంలో భాష్యం చెబుతున్నాడు. రోజూ ఆయన ఉపన్యాసం వినటానికి వెడుతుంది. ప్రొద్దుటిపూట మీరు ఆఫీసుకు పోయేముందు అటువైపు వస్తే, కాసేపు మాట్లాడి ఆఫీసుకు వెళ్ళిపోవచ్చు."
    "మీ యిల్లు ఎక్కడో నాకు తెలీదుగా."
    "నేను మీ యింటికివచ్చి మిమ్మల్ని తీసుకువెడతాను."
    "ఎందుకులెండి మీకు శ్రమ! గుర్తులు చెప్పండి కనుక్కోగలను. కాకినాడలో పుట్టి పెరిగాను. ఆ మాత్రం తెలుసుకోలేనా ఏమిటి?"
    అతను వివరంగా గుర్తులు చెప్పాడు. "ఆ పసుపురంగు డాబా కదూ! అటువైపు చాలాసార్లు వెళ్ళాను. ఎటొచ్చీ మీరందులో వుంటున్నారని తెలీదంతే."    

 Previous Page Next Page