Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 19


    చివరకు రిక్షా ఆమెయింటికి చేరింది. క్రిందికి దిగబోతూ ఆమె ఏమనుకుందో, అతని చుబుకాన్ని పట్టుకొని పైకెత్తుతూ "ఏమండీ, జరిగిన దానికి బాధపడుతున్నారా?" అంది.
    నిర్జీవంగా వున్న ముఖాన్ని ఆమెనుండి విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూ లేదన్నట్లు ఒక అయోమయమైన సౌంజ్ఞ చేశాడు.
    ఆమె రిక్షా దిగింది. ఒకక్షణం అతనిముఖంకేసి చూసి "శేఖరంగారికి... మరిచిపోకండేం" అంటూ గుమ్మం ఎక్కి దగ్గరగా వేసివున్న తలుపుల్ని తోసి లోపలకు వెళ్ళిపోయింది.
                          7
    న్నట్లుండి జగతిలో తనకు తెలియని స్త్రీ గోచరించసాగింది. ఈరకమైన జగతిని అతను జన్మించిన దాదిగా యింతవరకూ చూడలేదు. తెల్లవారుఝామునే నిద్రలేస్తోంది. తలారా స్నానమాచరిస్తుంది. ఈమధ్య సూర్య నమస్కారాలు ప్రారంభించింది ఉదయించే బాలభానుడిని సందర్శిస్తూ. భానుడి లేతకిరణాలు మీద పడుతూండగా, ధవళవస్త్రం ధరించి, భూమిని తాకేట్టువుంటే శిరోజాలు విరబోసుకుంది. నుదుటన కుంకుమ రక్తంలా మెరుస్తుండగా, పాలరాతివంటి ఆమెదేహం నీరెండలో మిలమిలలాడుతూండగా, మృదుగంభీరమైన కంఠంతో మంత్రాలు చదువుతూ ఆమె సూర్య నమస్కారాలు ఆచరిస్తూవుంటే ఆ దృశ్యం చూడటానికి అతని రెండుకళ్ళూ సరిపోయేవికావు.
    కొన్నాళ్ళక్రితం అతనికీ భక్తి పుట్టుకువచ్చింది సూర్యభగవానుడిమీద. కాని తాను చేస్తూండగా నలుగురూ చూస్తారనీ, వ్యాఖ్యానించుకుంటారనీ సిగ్గూ, సంకోచం. చొక్కాలేకుండా అందరి ఎదుటా నిలబడటం యిష్టంలేదు. అందుకని గదిలో దూరి కిటికీలోంచి సూర్యుడ్ని సందర్శిస్తూ చేసేవాడు. అసలు ఏకాగ్రత కుదిరేదికాదు. గదిలో తలుపులు బిడాయించుకుని, ఒక్క కిటికీమాత్రం తెరిచివుంచి సూర్యనమస్కారాలు చేసే విచిత్రజీవి యీ భూమ్మీద తాను ఒక్కడేనాన్న భావం కృంగదీస్తూ ఉండేది. తను చేసేపనిలో తనకే నమ్మకముండేదికాదు. అసలు సూర్యుడు ఒక గోళంకదా. గ్రహాలలాగా, భూమిలాగానే శాస్త్రప్రకారం మంటలతో నిండివున్న ఒక ప్రదేశంకూడా అదికూడా, పూజించటమేమిటి అన్న మీమాంస ఉదయించేది. అతనినాలుక మంత్రాలు ఉచ్చరిస్తున్నా, అతని శరీరం కదలికలు జరిగిస్తున్నా, చేస్తున్నంత సేపూ యీ తర్జన భర్జనే. పైగా ఈ ఆలోచన మిగతా సమయాల్లో వచ్చేదికాదు. అసలు యీ విషయం గురించి గుర్తే వుండేదికాదు. సరిగ్గా సూర్యనమస్కారాలు ప్రారంభించటానికి పూనుకున్నప్పుడు ఉత్పన్నమయ్యేది. అవి కొనసాగినంత సేపూ అదే సంఘర్షణ. ఈ మానసిక సంక్షోభంతో అలిసి-సొలిసి అతనికి నీరసం కూడా వచ్చేది.  
    అసలు భగవంతుడు ఉన్నాడా అన్న పెద్దప్రశ్నే ఎదురయేది అతనికి. వున్నాడన్న నమ్మకమూ లేదు, లేడన్న నిస్సంకోచమూ లేదు. ఒకరోజు వున్నాడనిపిస్తుంది. మరోరోజు లేడనిపిస్తుంది. అర్ధరాత్రి మెలకువ వచ్చి భయంతో శరీరం గగుర్పొడిస్తే వున్నాడు, ఆఫీసులో నలుగురిమధ్యా కూర్చుంటే లేడు. ఒక్కోసారి ఎవరైనా గట్టి నాస్తికుడ్ని చూస్తే, ఓహో! వీడెంత మొనగాడురా అనిపిస్తుంది. మళ్ళీ విభూతి, రుద్రాక్షలు ధరించి, శ్రీచూర్ణం దిద్దుకుని బ్రహ్మతేజస్సు ఉట్టిపడే భక్తుడెవరైనా ఏ దేవాలయం దరిదాపుల్లోనో దృగ్గోచరమైతే- ఆహా! ఈయనెంత మహానుభావుడురా అనిపిస్తుంది.
    కాని జగతిలాంటి స్త్రీ శుచియై, స్నాతయై, కరాలు ముకుళించి, ఆ కాంతి]లో, కాంతుల్తో తన మనోహరరూపం ద్విగుణీకృతమౌతుండగా, భూమిపై వెలసిన దివ్యాంగనలా కనబడుతూవుంటే ఆమె చిత్తశుద్ధికి, ఏకాగ్రతకు అతను విస్మయచిత్తుడవుతూ వుండేవాడు.
    "మంచిపని అయినా చెడ్డవాళ్ళచేతనే నిర్వర్తించబడుతుంది. నాలాంటి పిరికివాళ్ళు ఏపని చేయటానికైనా తగరు" అని ఆక్రోశించాడు.
    "రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
    పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం" 
    అని ఆమె మృదుస్వరంతో, గంభీర ఉచ్ఛారణతో ఆదిత్యహృదయం పఠిస్తూ వుంటే అతని హృదయం పాదాలమ్రోల దాసోహమంది. చాటుగా కళ్ళు తుడుచుకునేవాడు.
                     *    *    *
    జగతే ప్రార్ధన ముగించాక కాఫీ తయారుచేసేది. మృత్యుంజయరావు ఈమధ్య వంటసామాను పట్టుకొచ్చాడు. జగతి వచ్చీరాని వంటకూడా మొదలుపెట్టింది. ఇంటావిడకూ, ఆమెకూ జోస్తీ ఎక్కువయింది కాబట్టి చాలాభాగం కూరలూ, పచ్చళ్ళూ ఆవిడే పంపిస్తూవుండేది. జగతి ఒక రహస్యం కనిపెట్టింది. ఇంటావిడతో ఏ విషయాన్ని గురించయినా సరే వాదించకుండా ఆవిడన్నదానికి ఔనంటే ఆవిడ ఉబ్బితబ్బిబ్బయి యిల్లంతా దోచిపెడుతుంది. ఈ కీలకాన్ని ఆమె తెలివిగా ఉపయోగించుకుంటోంది. జగతి స్వంతజీవితాన్ని గురించి ఆమె ఏమి అడిగిందో, ఈమె ఏమి సమాధానం చెప్పిందో మృత్యుంజయరావుకు తెలీదు.
    ఒక కనుచీకటివేళ మృత్యుంజయరావు సందులోంచి నడిచి పెరట్లోకి వెడుతూంటే యింటావిడ ఎదురొచ్చింది. ఓ మృదుసుగంధం అతనివైపు వీచి ఆనందపరవశుడ్ని చేసింది. అది సేమ్తూ, నైట్ క్వీన్ కలిసి వ్యాపింపచేసిన సౌరభం. అతను చకితుడై వెనుదిరిగి చూశాడు. చీకట్లో యింటావిడ రూపం లీలగా గోచరించింది. సిగలో తురుముకున్న పువ్వులు తెల్లగా మెరిశాయి.
    ఆ రాత్రి జగతి యీ విషయం ప్రస్తావిస్తూ "ఆవిడ ముస్తాబై నడుస్తూండగా నువ్వెదురొచ్చావటగా. ఆవిడ సిగ్గుపడి చచ్చిందిరా. 'అతనేమన్నా అనుకున్నా'డే మోనని మహాయిదయిపోతోంది. ఫర్వాలేదులెండి మావాడికి యిలాంటివి పట్టవు' అని ఊరడించాను" అంది.
    "నిజంగా నాకు ముచ్చటేసింది" అన్నాడతను. ఈమధ్య అక్కగారితో కలిసి జీవిస్తూండటంవల్ల యిటువంటి మాటలు మాట్లాడటానికి కొంచెం చనువుకూడా ఏర్పడింది.
    ఆమె ఒకక్షణం మెదలకుండా వూరుకుని "ఆవిడ చాలా రసికురాలురోయ్ ఆ మాటకొస్తే వాళ్ళిద్దరూ రసికులే" అంది. ఒకవిధమైన హర్షం కంఠంలో ధ్వనిస్తూండగా.
    "ఆయన, పాపం గుండెజబ్బుమనిషి."
    "ఇప్పుడు. ఒకప్పుడు పెద్దాపురంలో వుండేవారట. ఆరోజుల్లో దీనికి రెట్టింపు ఆస్తిపాస్తులుండేవట. అసలీవిడ రెండోభార్య అన్నమాట. రెండోభార్య లెప్పుడూ అందంగా వుంటారు, నువ్వు గమనించినావో లేదో. మొదటి కళత్రం పోతే చిలకమ్మగార్ని చేసుకున్నాట్ట. అయితే అప్పటికే ఆయన రసికాగ్రేసరుడు సాయంత్రమవగానే స్నానం గీనం చేసి, ఠింగురంగా అని ముస్తాబై, బట్టలకు సెంటు పులుముకుని భోగంవీధిని పడేవాడట. ఈవిడ అందమంతా అడవిగాచిన వెన్నెల అయిపోతూండేది. అయితే యీవిడ్ని వీలు చూసుకుని మురిపిస్తూ వుండేవాడటలే. అప్పట్లో యీవిడ అత్తగారు బ్రతికివుండేదట. "వొసేయ్, కోడలుపిల్లా! నువ్విలా మెత్తగా వూరుకుంటే వాడు మితిమీరు తున్నాడు. వాడు చెడతిరిగి అర్థరాత్రి యింటికి చేరినప్పుడు, అరచి గీపెట్టినా తలుపుతీయకు" అని బోధించేదిట. ఈవిడ అలాగే అని పడుకుని, ఆయన అడుగుల సవ్వడి వినీవినగానే తటాలున లేచి తలుపుతీసేదట. 'నాదీ మంచి వయసు. కోరికలు వుండవా? అందుకని నా స్వార్థంకోసం తలుపు తీసేదాన్ని' అంటుందామె" అన్నది జగతి.
    మృత్యుంజయరావు పడుకుని ఆసక్తిగా వింటున్నాడు. బయట చినుకులు పడుతున్నాయి. చిరుగాలి తరంగాలు కిటికీగుండా లోపలకు ప్రవేశించి మృదువుగా సోకుతున్నాయి. ఈ ఆహ్లాదపూర్వక వాతావరణంలో అక్కా తమ్ముళ్ళయిన యిరువురు వ్యక్తులు ఓ గదిలో పడుకుని యితరుల అంతరంగిక విషయాలు ముచ్చటించుకోవటం అతనికి ఉల్లాసం కలిగించింది.  
    జగతి కంఠంవరకూ దుప్పటి లాక్కుని యింకా చెప్పసాగింది. "ఇంకా చాలా రహస్యాలు కనిపెట్టాను. ఆయన గుండెజబ్బు మనిషికదా, సాధ్యమైనంత వరకూ ప్రాపంచిక సుఖాలకు దూరంగా వుందామని తాపత్రయపడతాడు. అసలు వాళ్లిద్దరూ ఓ గదిలో పడుకోరు. ఆవిడ పిల్లాడ్ని వేసుకుని ముందుహాల్లో పడుకుంటుంది. ఒక్కోరోజు హఠాత్తుగా వాళ్లు ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఏర్పాటు కళ్ళతో చేసుకుంటారో, మాటలతో చేసుకుంటారో నాకైతే తెలీదు. ఆరోజు సాయంత్రం ఆవిడ అభ్యంగన స్నానమాచరిస్తుంది. సెంటు పూసుకుంటుంది. సిగలో పువ్వులు తురుముతుంది. కనుచీకటి పడేవేళ అయినప్పట్నుంచి గదిలో అగరొత్తులు ఝూమ్మని వెలుగుతుంటాయి. సెంటు అత్తరూ సరేసరి. పాపం పిల్లాడికి ఆరోజు ఒంటరిపడకే శరణ్యం" అని కిలకిల నవ్వింది.
    మృత్యుంజయరావుకు సిగ్గేసింది. అక్కలో రెండు జగతులున్నారనుకున్నాడు ఛీ. ఆడవాళ్ళిలా మాట్లాడతారా అనుకున్నాడు.
    "అయితే యీవేళ ఆవిడ అలంకరించుకుంది. ఓహో!" అనుకున్నాడు.
    జగతి వాళ్ళ కుటుంబవిషయాలు యింకా ముచ్చటించసాగింది. "ఆవిడకేమో తమ్ముడికొడుకుని పెంచుకుందామని ఆరాటం. ఆయనకేమో యీవిడ వైపు వాళ్ళు అంటేనే గిట్టదు. దీన్నిగురించి తరచు తర్జన భర్జనలు పడుతూంటారు."
    కాసేపున్నాక జగతి నిద్రపోయింది. ఆమె యీరోజు యిటువంటి విషయాలగురించి మాట్లాడటం అతనికి విస్మయాన్నే కలిగించింది. ఎందుకంటే ఒక్కరోజుకూడా విడవకుండా ఎంతో శ్రద్ధాభక్తులతో ఆమె ఆశ్రమానికి వెడుతోంది. భాష్యానికి వెడదామని మొదట ప్రేరేపించిన చిలకమ్మగారు క్రమంగా వెళ్ళటం మానేశారు. అక్కడ ఎక్కడ్నుంచి తెచ్చుకుంటున్నదోగాని వేదాంత విషయాలకు సంబంధించిన పుస్తకాలు తెచ్చుకుని రోజూ పఠిస్తున్నది. చాలాసార్లు గంటల తరబడి గంభీరంగా ఆలోచిస్తూ మౌనముద్రలో వుంటున్నది. స్వామివారి గురించి తరచు చర్చిస్తూ వుంటుంది. ఎందుకనో యీనాడు యితరులకోసం స్థాయి దిగివచ్చి, కావాలని మాట్లాడినట్లు మాట్లాడింది. ఆశ్చర్యాన్ని సృష్టించటం ఆమెకు సరదా ఏమో!
    "నువ్విక్కడ వున్నట్లు అమ్మకు ఉత్తరం వ్రాస్తాను" అన్నాడు ఒకసారి.
    "వద్దు" అంది కఠినంగా. "నాకు బుద్ధిపుడితే నేనే ఎప్పుడన్నావెళ్ళి చూస్తాను. నా గురించి ఎవరికీ ఉత్తరాలు రాయకు."
    అతను మళ్ళీ ఆ ప్రమేయం తలపెట్టలేదు.
    తనతో అవసరం వుండి శేఖరం రెండుమూడుసార్లు గదికి వచ్చాడు. తను తప్పనిసరిగా అక్కను పరిచయం చేశాడు. అతన్తో ఆమె నవ్వుతూనే మామూలుగా మాట్లాడింది. శేఖరం అనాలోచితంగా లభ్యమయ్యే అటువంటి అవకాశాలను సులభంగా త్రోసిపుచ్చడని తెలుసు. అందుకే అతను భయపడ్డాడు. శేఖరం తమ యింటికి రావటాన్ని విసుక్కున్నాడు. కాని ఆమె మనసు ఎక్కువగా స్వామివారి మఠాన్నిగురించే తప్ప యితరవిషయాన్ని పట్టించుకోకపోవటం అతనికి సంతృప్తి కలిగించింది. తర్వాత ఒకసారి జగతే అంది. "మీ స్నేహితుడు శేఖరం నువ్వు లేని సమయంలో వచ్చాడ్రా. అనవసరమైన సంభాషణ మొదలుపెట్టాడు. తనో పెద్దహీరో అనుకున్నట్లున్నాడు. ప్రగల్భాలు కొడుతున్నాడు. అధికప్రసంగాలు చాలించి బయటికి దయచేయమన్నాను. నాగురించి తెలీదు. తల్చుకుంటే ఇలాంటి వాళ్ళను కాలితో నేలరాచి పారేస్తాను."

 Previous Page Next Page