Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 20


    "వర్షానికీ వరదకీ సూచన్లు వున్నాయి. చాపక్రింద ప్రవహించే నీటి ప్రమాదం మునిగేవరకూ తెలీదు."

    అంతలో తలుపు చప్పుడయింది. ప్రవల్లిక లోపలికి వచ్చింది. అలసిపోయి వున్నట్టు కనిపించిందామె. విహారి మనసులో ఏదో తెలియని ఆప్యాయత కలిగింది. ఎంతో దగ్గిరగా అనిపించింది. బహుశా అతను చేసుకున్న అపార్ధంవల్ల కావొచ్చు.

    వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలనుకుంటున్నారని గ్రహించి అతడు లేచాడు. బయటకు వెళ్ళబోతూ "ఒక్కప్రశ్న అడగవచ్చా" అన్నాడు.

    ప్రవల్లిక, ఆయన అతడివైపు చూశారు.

    "నన్నెందుకు పిలిపించారు? ఇదంతా నాకెందుకు చెప్పారు?"

    ఆయన వెంటనే సమాధానం చెప్పలేదు. తర్వాత నెమ్మదిగా అన్నారు. "నా ఒక్కగానొక్క కొడుకు కెనడాలో ఇంజనీరింగు చదివేవాడు. టెర్రరిస్టులకు కెనడా నెలవు. వాళ్ళ మీటింగ్ లో బాహాటంగా, ఎదిరించినవాడు అతడొక్కడే. సామాన్యులెప్పుడూ భయపడతారు. మనసులోది బయటకు చెప్పరు. కొంతమంది మాత్రమే తమకు సంబంధం లేకపోయినా నిజాయితీగా ఎదురు తిరుగుతారు. అధర్మాన్ని వ్యతిరేకిస్తారు. నా కొడుకు అలాగే ప్రాణాలు వదిలాడు. నీలో అతడి పోలికలు కనపడ్డాయి. అందుకే పిలిపించాను."

    అతడు ప్రవల్లిక వైపు చూశాడు. అతడినే చూస్తూన్న ఆమె కళ్ళు తిప్పుకుంది. అతడు బయటకు వచ్చాడు.

    బయట వెన్నెల పిండారబోసినట్టు వుంది. కారిడార్ లో నిలబడ్డాడు. అయిదు నిముషాల తరువాత ప్రవల్లిక బయటకు వచ్చింది. ఇద్దరూ కార్ల దగ్గరికి నడుస్తూండగా "అయామ్ సారీ" అన్నాడు.

    ఆమె చిరునవ్వుతో అతడివైపు చూసింది.

    అతడు కాసింత సిగ్గుతో "నాకు బాగా కోపం వచ్చింది. నిజం చెప్పాలంటే అక్కడే తందామన్నంత ఉక్రోషం కూడా కలిగింది" అన్నాడు. ఆమె ఫకాలున నవ్వేసింది. దాంతో అతడికి అప్పటివరకూ వున్న టెన్షన్ పోయినట్టు కనిపించింది.

    ఆమె కారు ఎక్కబోతుంటే "జరిగిందంతా మర్చిపోతారు కదూ" అన్నాడు.

    ఆమె అప్రయత్నంగా అతడి చేతిమీద చెయ్యివేసి- "ఏం జరిగిందనిప్పుడు? హాయిగా నిద్రపొండి. స్వీట్ డ్రీమ్స్" అంది.

    అతడలాగే నిలబడి వున్నాడు.

    ఆమె తాలూకు ఇంటిమేట్ పరిమళం అతన్నింకా వదల్లేదు. ఇంటిమేట్ సెంటు పేరు కాదు. ఇంటిమేట్ అంటే దగ్గిరతనం. తన ఆలోచన తనకే గిల్టీగా అనిపించింది. పెళ్ళి నిశ్చయమైన అమ్మాయి గురించి అటువంటి ఆలోచన రావటం...


                       *    *    *


    ఆ మరుసటిరోజు 4.50కి అతడికి ఫోన్ వచ్చింది.

    "హల్లో"

    "నేను"

    "నేనంటే"

    "నిన్న ఫోన్ చేసిన అమ్మాయిని..."

    "ఓ నువ్వా-"

    "ఏమిటి? గుర్తుపట్టేశారా?"

    "నిన్న కలిశాంగా"

    "కరెక్ట్"

    "నిన్న నీకు భయం వేసిందనుకుంటాను."

    "కొద్దిగా కాదు, బాగా-"

    "ఎందుకు నీకంత భయం?"

    "అందులో సగం నటనే- అది తెలుసుకోలేక పైకి కనబడేదంతా నిజమని మీలాటి అర్భకులు నమ్మేస్తూ వుంటారు."

    "ఏమిటి? అర్భకులా!"

    "మరి లేకపోతే? మీకన్నా అదేదో నవల్లో హీరోయే నయం. ముక్కూ మొహం తెలియని అమ్మాయిని పట్టుకున్నాడు. నేను మాత్రం వరుసగా ఫోన్ లు చెయ్యను. మాగ్జిమమ్ మరొక్కసారి-"

    "ఫోన్ లో ఇలా చెలరేగిపోతావ్. ఎదురుపడితే అలా వణికిపోతావ్ ఎందుకు?"

    "ఎదురుగా చెప్పలేనంత భయం వుంటేనే ఇలా ఫోన్ లలో చెప్తారు మహానుభావా!"

    "నువ్వు చెప్పలేదు నేనే చెప్పాననుకో. అయినా చెయ్యి పట్టుకోగానే వణికిపోతావ్ కదా".

    "దాన్ని వణుకు అనరు. కంపనం అంటారు."

    "మైగాడ్. చెయ్యి పట్టుకుంటేనే స్నానంచేసే అమ్మాయేనా ఇలా మాట్లాడుతుంది?"

    "అమ్మాయిలు స్నానం చెయ్యరని మీకేదో దురభిప్రాయం వున్నట్టుందే" నవ్వు.

    "...స్నానం చేసినమాట నిజమే గానీ, అలా స్నానం చెయ్యటానికి ముందు, మీరు పట్టుకున్న చేతిని 16,832 సార్లు ముద్దు పెట్టుకున్నాను. ప్చ్...ప్చ్...ప్చ్..... ఇలా-"

    విహారి చప్పున లేచి, "నేనిక ఆగలేను. ఇప్పుడే వస్తున్నా" అన్నాడు. అతడిలో ఆవేశం కన్నా-తనని ఇంత ఏడిపిస్తూ, కనిపించినప్పుడు అమాయకత్వం నటించే ఆ అమ్మాయిమీద పీకలవరకూ కోపం వుంది. అటో ఇటో తేల్చేయ్యాలనుకున్నాడు.

    "చూడు బాబూ! చాలా మంది అమ్మాయిలూ మొహానికి వేసుకున్నట్టే మనస్సుకి కూడా మేకప్ వేసుకుంటారు. శోధించాలి సాధించాలి అదియే ధీరగుణం అన్నాడో కవి అందుకే."

    "శోధన లేదు- సాధన లేదు. రేపు చెప్తా నీ పని."

    "రేపటి వరకూ ఎందుకు? ఈ రోజు సరీగ్గా ఆరింటికి ప్రేమ్ నగర్ జంక్షన్ దగ్గిరకొస్తే నలుగురి ముందూ నిజంగా ముద్దిస్తా."

    విహారి అదిరిపడి- "అంత ధైర్యం వుందా" అన్నాడు.

    "వచ్చి చూడు తెలుస్తుంది. అన్నట్టు నన్ను గుర్తుపట్టగలవో లేదో- కేవలం రెండు నిముషాలే ఉంటా. పోతే వైట్ డ్రెస్ లో వుంటాను." ఫోన్ కట్ అయింది.

    "ఏ డ్రెస్సూ లేకపోయినా గుర్తుపట్టగలను" ఫోన్ కసిగా పెట్టేసేడు.

    .................

    ఆ సాయంత్రం ఆరుకి అతడు ప్రేమ్ నగర్ జంక్షన్ లో టంఛనుగా వెయిట్ చేశాడు.

    రోడ్డు రష్ గా వుంది.

    సునాదమాల రెండు నిముషాలపాటే వుంటానంది. ఆ టైమ్ చాలు. అతడు నాలుగువైపులా చూస్తూ రెడీగా వున్నాడు. రోడ్డుమీద ఆడవాళ్ళు ఎక్కువలేరు. గుడిగంటలు మ్రోగుతున్నాయి, దూరంగా చర్చి కనపడుతూంది. కాన్వెంట్ లోంచి పిల్లలు ఎన్.సి.సి. ముగించుకుని వస్తున్నారు. మరోపక్క నర్స్ క్వార్టర్స్ వున్నాయి. చర్చిలోంచి నన్స్ కనపడుతున్నారు.

    అతడు నిటారుగా అయ్యాడు.

    గుళ్ళోంచి బామ్మలు కూడా తెల్లచీరల్లో వస్తున్నారు.  

    రెండు నిముషాల్లో అక్కడంతా తెల్లదనం పరుచుకున్నట్టు అనిపించింది. అతడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. పదమూడేళ్ళ ఎన్.సి.సి. అమ్మాయిల్నుంచి అరవయ్యేళ్ల ముసలివాళ్ళ వరకూ అందరూ తెలుపే.

    ఆ గుంపులో.

    అతడి తీక్షణమైన కళ్ళు గుర్తుపట్టాయి. తెల్లచీరలో వస్తోంది... అయితే వస్తున్నది- సునాదమాల కాదు.

    బామ్మ!

    చేత్తో కొబ్బరి ముక్కలు పట్టుకు వస్తోంది.

    అతడు ఆవిడ దగ్గిరకి వడివడిగా వెళ్ళాడు.

    "బావున్నావా బాబూ" అంది.

    "బావున్నానండీ. మీ అమ్మాయి బావుందా?"

    "బావుంది నాయనా."

    అతడు కోపాన్ని అణుచుకుంటూ "మీరు ప్రతిరోజు ఈ టైమ్ కి గుడికొస్తారా" అని అడిగాడు.

    "అబ్బో! ఇంతదూరం నేనెక్కడ రాగలను నాయనా! నిన్న జరిగిన దానికి మా మనవరాలు బెదిరిపోయి, దేముడికి మొక్కుకుందట. అది తీర్చటానికి నన్ను పంపింది. కొబ్బరికాయ కొట్టి వస్తున్నాను."

    సునాదమాల తననెంత గొప్పగా ఫూల్ ని చేసిందో అతడికి అర్ధమైంది.

    "రేపు మీ అమ్మాయికి కాలేజీ వుందాండీ?"

    "ఉంది నాయనా! ఏం అలా అడుగుతున్నావు?"

    "అబ్బే, ఏం లేదు వెళ్ళొస్తానండీ."

    అతడు విసురుగా వచ్చి కార్లో కూర్చొని స్టార్టుచేసి వేగంగా అక్కణ్నుంచి పోనిచ్చాడు.

    అతడు పావుగంటసేపు కార్లో కూర్చుని ఇటూ అటూ చూడటాన్నీ- తరువాత గుడివైపు వెళ్ళటాన్ని ప్రవల్లిక దూరంనుంచి చూస్తోంది. అతను ఎవరో ముసలావిడతో మాట్లాడటం గమనించింది. ఎందుకో అర్ధంకాలేదు. అతడు కోపంగా వెళ్ళిపోయాక చేతిలో బైనాక్యులర్స్ పక్కసీట్లో పడేసి, తనలో తను నవ్వుకుంటూ కారు స్టార్టు చేసింది.

    ఆమె తెల్లచీరెలో వుంది.


                       *    *    *


    "నిన్న కట్టుకుంటానన్న చీరె ఈ రోజు కట్టుకున్నావేం?"

    సునాదమాల అదిరిపడి చేతిలో పుస్తకాలు వదిలేసింది. అప్పుడే కాలేజీ వదిలారు. అమ్మాయిలు గుంపుగా వస్తున్నారు.

    "ఈరోజు అటో ఇటో తేల్చుకుందామని వచ్చాను" నిక్కచ్చిగా అన్నాడు. ఆ అమ్మాయి వణికే చేతుల్తో పుస్తకాలు ఏరుకుంటూ "ప్లీజ్... నన్నల్లరి పెట్టకండి" అంది.

    "ఏమిటి అల్లరి పెట్టేది? నువ్వు చాలా గొప్పగా నటించగలవని వప్పుకుంటున్నాను. ముందు మట్టిబుర్ర అనుకున్నాను. కాదని నిరూపించావు. ఇంకా ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట?"

    "చూడండీ! నేనలాటిదాన్ని కాదని చెప్పాను."

    అతడు చేతులు జోడించి, "ఓడిపోయానని వప్పుకుంటున్నాగా" అన్నాడు.

    ఆమె మాట్లాడకుండా నడక సాగించింది.

    "నాకు నిన్న ఇస్తానన్న ముద్దు ఇవ్వకపోతే, ఇక్కడే నడిరోడ్డు మీద పెట్టేసుకుంటాను!"

    ఆమె మేకు దిగ్గొట్టినట్టు ఆగిపోయింది.

    "సారీ. నేనో అనాగరికుణ్ని అనుకుంటున్నట్టున్నావు, నా ఉద్దేశ్యం- ఫోన్ చేస్తూంది నువ్వేనని నాకు తెలిసిపోయినట్టు చెప్పడమే. నా బరువెంతో చెప్పినప్పుడే తెలిసింది."

    ఆమె తెల్లబోయి, "బరువు చెప్పానా" అంది.

    "బరువు చెప్పలేదూ! నీ చేతిని నువ్వు ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నదీ చెప్పలేదూ?"

    ఉన్నట్టుండి ఆ అమ్మాయి ఏడవడం మొదలు పెట్టింది.

    రోడ్డుమీద జనం చుట్టూ మూగారు.


                                                                 11


    కొన్ని కొన్ని సంఘటనలకి లింకులుండవు. ఎక్కడో ప్రారంభమయి, ఎక్కడో పూర్తి అవుతాయి. అలాంటి సంఘటననే ఆ రోజు విహారికి జరిగింది. అతడు సాధారణంగా డ్రింక్ చెయ్యడు. కానీ ఆ రోజు ఎందుకో బార్ కి వెళ్ళాలనిపించింది.

 Previous Page Next Page