అతడి మనసు డోలాయమానంగా వుంది. ప్రవల్లిక సామీప్యం అతడికెంతో హాయినిస్తుంది. ముఖ్యమంత్రి ఛాంబర్ నుంచి బయటకొస్తూ ఆమె కనబర్చిన హుందాతనం, అతడికి- ఆమె తనకెంతో దగ్గర అన్న భావాన్ని కలుగచేసింది.
ఆ గ్రేస్ సాధారణంగా ఎవరికోగానీ వుండదు. ఆమెను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు అంతే! అతడి ఆలోచనలు అంతవరకూ వచ్చి ఆగిపోయాయి. ప్రతీసారీ ఆమెకి కాబోయే వరుడు గుర్తొస్తాడు. బలవంతంగా ఆలోచనలు మళ్ళించుకుంటాడు.
ఈసారి సునాదమాల గుర్తొస్తుంది, స్టేజీమీద ఆమెని చూసి, మొదటి చూపులోనే ఆమె అద్భుతమైన అందానికి ముగ్ధుడయ్యాడు. తరువాత ఆమె పిరికితనం, నేరుకు చూసి సరదాగా ఏడిపించేవాడే తప్ప ప్రత్యేకమైన అభిప్రాయంగానీ, ప్రేమగానీ ఏమీ ఏర్పర్చుకోలేదు. కానీ వరుసగా ఆమెనుంచి ఫోన్ కాల్స్ వచ్చి ఆమె తెలివితేటలు అన్యాపదేశంగా తెలుస్తూ ఉండడంతో, ఆమె అంటే అభిమానం, "నిన్ను ప్రేమిస్తున్నాను" అని ఆమె ద్వారా చెప్పించాలన్న పట్టుదల ఎక్కువయ్యాయి.
ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దర్ని ప్రేమించగలడా అంటే... రచయితలు, పవిత్ర సంఘ సభ్యులు, సామాజిక ప్రవర్తనా పరిరక్షకులు 'లేదు లేదు అసంభవం' అని నొక్కి వక్కాణిస్తారేమోగానీ, మనసు నియమనిబద్ధముల కతీతము కదా. అది కోతి లాంటిది. 'ఇద్దర్ని ఒకేసారి ప్రేమించే స్థితి నాకెప్పుడూ రాలేదు' అని ఎవరయినా అంటే, వారిని ఈర్ష్యతో చూసే స్టేజి కొచ్చాడు విహారి. అతడు సంస్కారవంతుడు కాబట్టి ప్రవల్లిక పట్ల ప్రేమని కూడా తనలోనే నొక్కెయ్యటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ లోపులో సునాదమాల క్రమ క్రమంగా అతడి హృదయాన్ని ఆక్రమించుకుంటోంది.
ఏది ఏమైనా ఆ రోజు అతడు బార్ లో ఒంటరిగా కూర్చోటానికి కారణం ఆ ఇద్దరమ్మాయిలే.
బిల్ పే చేస్తూన్న విహారి దృష్టి ఒక విదేశీయుడి మీద పడింది. అతడు పూర్తిగా పశ్చిమ దేశాలకి సంబంధించినవాడూ కాదు, ఇటు రష్యా, చైనాలకి సంబంధించినవాడూ కాదు, క్రాస్ బ్రీడులా వున్నాడు. అతడిని వింతగా గమనించి కళ్ళు తిప్పుకోబోతూండగా మరోవ్యక్తి వచ్చి అతనితో మాట్లాడటం గమనించాడు.
ఆ వ్యక్తిని చూసి విహారి అదిరిపడ్డాడు.
అడవిలోకి తమని తీసుకెళ్ళిన టెర్రరిస్టుల్లో ఒకడు.
తను కనపడకుండా, స్తంభం చాటునుంచి వాళ్ళ మాటలు వినటానికి ప్రయత్నించాడు. మాటల సందర్భంగా ఆ విదేశీయుడి పేరు వినపడింది.
అది మరొక షాకు! అతడి పేరు.
రామోన్ హర్సాసే!!
విహారికి పేపర్ నాలెడ్జి వుంది. తూర్పు ద్వీపాల్లో తిరుగుబాటు లేవదీస్తూన్న కల్నల్- ఇక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్ బార్లో... అతి సామాన్యుడిగా.....
అతడు పక్కనుంచి వెళ్ళి రిసెప్షన్ నుంచి ప్రవల్లికకి ఫోన్ చేశాడు. తమని చంపటానికి ప్రయత్నించి లోయలోకి కూలిపోయిన టెర్రరిస్టు కనపడ్డాడనగానే ఆమె చాలా ఎగ్జయిట్ అయింది. ఆ ఉద్వేగంలో, 'మరోలా జరిగితే ఎలా?' అని ఆలోచించకుండా- "అక్కడే వుండండి వస్తున్నాను" అని, బయల్దేరింది. భయపడ్డంతా జరిగింది.
ఆమె అక్కడికి చేరేలోపు రామోన్ హర్సాసే లేచి, ఆ టెర్రరిస్టుకి షేక్ హాండిచ్చి, బయటకు నడిచాడు. ఇలా జరుగుతుందని అతడు ఊహించలేదు. అతడ్ని అనుసరించాలో, ఇక్కడే వుండాలో తెలియలేదు. రామోన్ హర్సాసేని అనుసరించటానికి నిశ్చయించుకున్నాడు. బయటకెళ్ళి అతడిని ఫాలో అయ్యాడు.
విహారి సామాన్య పౌరుడు. అతడికి పరిశోధనా పద్ధతులు తెలియవు. అదే మరొక సి.బి.ఐ. ఆఫీసరయితే, చేతికి దొరికిన టెర్రరిస్టుని వదిలేవాడు కాదు. హర్సాసేనే వదులుకునేవాడు! తెలియక చేసినా విహారి రామోన్ హర్సాసేని అనుసరించటమే మంచిదయింది.
అతడు వెళ్ళిపోయిన పది నిమిషాలకి ప్రవల్లిక- మఫ్టీలో ఉన్న ఆరేడుగురు సి.బి.ఐ. ఆఫీసర్లతో ఆ బార్ దగ్గిరకొచ్చింది. లోపలున్న వాడిని అరెస్టు చేయటం ఆమె కిష్టంలేదు. అతడి ద్వారా అసలు వ్యక్తిని పట్టుకోవాలని ఆమె ఉద్దేశ్యం, బయట వెయిట్ చేయసాగింది.
గంట తరువాత అతను బయటకొచ్చాడు.
ఆఫీసర్లు నిశ్శబ్దంగా అతడిని వెంటాడారు.
"దీన జన రక్షక సమితి" ఆశ్రమంలో అతడు ప్రవేశించాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఆ ట్రస్టుకి అనంతానంతస్వామి మానేజర్ అని తెలుసు. ఎంతో అవసరం ఉంటే తప్ప ఆ టెర్రరిస్టు ఇక్కడికి రాడు.
తాము వాళ్ళని గుర్తుపట్టగలిగారు కాబట్టి ఆ టెర్రరిస్టులని స్వామి ఈపాటికే కొన్నివేల మైళ్ళ దూరం పంపించేసి ఉంటాడనుకుంది ఆమె. అయినా ఇక్కడే వున్నారంటే, ఏదో వ్యవహారం జరుగుతూందన్నమాట.
ఏమిటది?
ఆమె దాని గురించి ఆలోచించకుండా ఆఫీసర్లకి సూచన్లు ఇచ్చింది.
దాదాపు పది నిమిషాల తరువాత వారికి కావల్సింది దొరికింది.
ఆయుధాల గిడ్డంగి... చిన్నది. లక్ష రెండు లక్షలు విలువలు చేసే ఆయుధాలు ఉంటాయి.
వలయాకారంగా చుట్టుముట్టి - రెండు నిమిషాల్లో దాన్ని వశపర్చుకున్నారు. ప్రతిఘటన ఏమీలేదు. టెర్రరిస్టు తప్పించుకున్నాడు. అయినా ఆమె పెద్దగా విచారించలేదు. స్వామికి వ్యతిరేకంగా సాక్ష్యం దొరికింది. అది చాలు. ఇన్ని సంవత్సరాల శ్రమ ఫలించబోతూంది. ఇన్ని సంవత్సరాల పగ నెరవేరబోతూంది.
ఆమె ఢిల్లీకి ఫోన్ చేసి హోం మినిష్టర్ కి పరిస్థితి వివరించింది. ఆయన ఈ వార్త విని ఎంత కదిలిపోయాడంటే- నిమిషంసేపు మాట్లాడలేదు. "మీరు చెపుతున్నది నిజమేనా?"
"నిజం సర్. ఈ అనుమానం నా కెప్పటినుంచో వుంది. ఇప్పటికి రెడ్ హాండెడ్ గా దొరికాడు."
"అక్కడెవరయినా సర్రెండర్ అయ్యారా?"
"నలుగురైదుగురు బైరాగులు దొరికారు. వారినుంచి నిజం చెప్పించాలి."
"జాగ్రత్తగా హాండిల్ చేయండి."
ఆమె మనసులోనే ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంది. పొలిటికల్ గా వత్తిడి లేకపోతే ఎంతయినా చెయ్యొచ్చు.
అప్పటికప్పుడు అరెస్ట్ వారెంట్ తయారు చేయించి, స్వయంగా ఆఫీసర్లని తీసుకుని స్వామి దగ్గరికి వెళ్ళింది. అతడి విశాలమయిన భవంతి దీపాలతో అలంకరించబడి వుంది. స్వామి తన భవంతి ముందు ప్రాంగణంలో ఉపన్యసిస్తున్నాడు. మనిషికి కావలసిన ఆధ్యాత్మిక చింతన గురించి ఆయన వివరిస్తున్నాడు. అశేష ప్రజలు భక్తితో వింటున్నారు.
ఆమె సరాసరి స్టేజి దగ్గరకి వెళ్లి అరెస్ట్ వారెంట్ చూపించింది. మరొక ఆఫీసర్ సంకెళ్ళు వేసాడు. జనంలో కలకలం రేగింది. జరిగిందేమిటో వారికి చెప్పడం భావ్యమని భావించి, ఆమె మైకు తీసుకుని, ఆయుధాలు దొరికిన వైనం స్వామి అసలు స్వరూపం అంతా చెప్పింది, ప్రజలు దిగ్భ్రాంతులై విన్నారు. వారు కలలో కూడా వూహించలేని విషయం అది అయినా కూడా తమ ఆరాధ్యదైవం అలా చేశాడంటే నమ్మలేకుండా వున్నారు. ఆ సభలో గాఢమైన నిశ్శబ్దం ఆవరించింది.
స్వామి మొహంలో మార్పులేదు. నిర్వికారంగా చూస్తున్నాడు.
"ఇన్నాళ్ళకి నీ మీద పగ తీర్చుకునే అవకాశం దొరికింది. ఇంకే శక్తీ నిన్ను శిక్షించలేదు-పద" అంది.
"ఇంకో నిమిషంలో వర్జ్యం పోతుంది. అంతవరకూ ఆగగలవా బాలికా" స్వామి అన్నాడు.
"అరెస్టుకి కూడా వర్జ్యం ఏమిటి? నడు?"
"గ్రహాల్ని నిర్లక్ష్యం చేస్తే చింతిస్తావు" అంటూ స్వామి స్టేజి దిగాడు. సరీగ్గా అప్పుడే ఒక ఆకస్మిక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి నలభై సంవత్సరాలు వున్నవాడు. పరుగెత్తుకు వచ్చి స్వామి కాళ్ళమీద పడ్డాడు. "రక్షించండి-స్వామీ రక్షించండి."
"ఏమిటి నాయనా! ఏం జరిగింది?"
"పోలీసులు అరెస్టు చేస్తున్నారు స్వామీ."
"దేనికి?"
"మీ ఆశ్రమంలో పెట్టమని నాకు కొన్ని ఆయుధాలు ఇచ్చారు. అవి అక్కడకు తీసుకెళ్ళి పెట్టకపోతే, ఏదో ఒక నేరం మోపి సంవత్సరాలు తరబడి జైల్లో ఉంచుతామన్నారు."
జనంలో ఒక్కసారిగా కలకలం రేగింది. స్వామి చెయ్యి ఎత్తగానే క్రమంగా ధ్వనులు తగ్గాయి.
"లే నాయనా! మనుషుల్లో పాపం పెరిగినట్టే, ఆ పాపాన్ని అణిచే నెపంతో ఖ్యాతి పెంచుకోవాలని కూడా కొందరు అధికారులు అనుకోవటంలో తప్పులేదు. పరమ పూజ్యమూ, శాంతి వనమూ అయిన ఆశ్రమంలో ఆయుధాలు పెట్టమని, నిష్కళంక చరితుడయిన స్వామిమీద అపనింద వెయ్యమని ప్రోత్సాహించింది ఎవరు?"
ఆ వ్యక్తి అటూ ఇటూ చూశాడు. అతని దృష్టి ప్రవల్లికమీద పడింది.
"ఈమే స్వామీ" అన్నాడు ఒక్కసారిగా.
ఒక ఉప్పెనవచ్చి ఢీకొన్నట్టు అయింది ప్రవల్లికని. స్వామి తాలూకు ఎత్తులు ఇంత వేగంగా, అనూహ్యంగా వుంటాయని వూహించలేదు. తోటి ఆఫీసర్లుకూడా విస్తుబోయారు. తమ కళ్ళముందే బైరాగులు గజగజా వణుకుతూ పరుగెత్తి పట్టుబడటం చూశారు. అయినా ఇప్పుడు వాళ్ళు కూడా ఎదురు తిరిగుతారు. తమకేం తెలీదంటారు. కేవలం స్వామిని నొటోరియస్ గా చేయడానికి సి.బి.ఐ. చేసిన చర్యగా దీన్ని పత్రికలు వ్రాస్తాయి. పత్రికలు స్వామి చెప్పిన మాటలు వినక తప్పదు. దీంతో, చూస్తూ చూస్తూ ఏ ప్రభుత్వం ప్రజలనుంచి దూరమవడానికి సిద్ధపడుతుంది? డిపార్టుమెంట్ మీద చర్య తీసుకోక తప్పదు.
స్వామి అన్నాడు- "ప్రజలు శాంతి స్వరూపులు. భగవత్ స్వరూపాలు. వారు ఉద్రేకం చెందితే నువ్వెక్కడ వుంటావో తెలుసుకో! బాలికా, నేను క్షమించినా ప్రజలు క్షమించరు నిన్ను" అంటూ ఇన్ డైరెక్టుగా ఏం చెయ్యాలో ప్రజలకు చెప్పాడు. ఆవేశం ఆనకట్ట దాటటానికి ఒక గొడ్డలిపోటు చాలు, జనం విరుచుకు పడ్డారు.
ఎవరో అరటిపండు విసిరారు. మరొకరు బత్తాయిపండు. ఇంకెవరో మరింత ముందుకొచ్చి చెప్పు విసిరారు. క్షణంలో అక్కడంతా తొక్కిసలాట. వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినవాడు జనంలో కలిసిపోయాడు. ఆఫీసర్లు నిస్సహాయంగా ఉండక తప్పలేదు. అంతా క్షణాల్లో జరిగిపోయింది.
స్టేజిక్రింద. పై మెట్టుమీద ఆమె పడివుంది. ఆమె చెంపకి చెప్పు తాలూకు ఒక మేకు గుచ్చుకుని బుగ్గమీద రక్తం కారుతోంది. ఒక అరటిపండు తాలూకు గుజ్జు ఆమె జుట్టుకి వికృతంగా అంటుకుని ఉంది. బలంగా తగిలిన బత్తాయి కాయవల్ల నుదురు ఎర్రబడింది.
జనం ఆమెని చంపేసేవారే. ఉద్రేకం కట్టలు తెంచుకోగా స్టేజివేపుకు వస్తున్నారు. అంతలో స్వామి రెండు చేతులూ పైకెత్తి "ప్రజలారా, ఇది శాంతివనం. ఇక్కడ ఆవేశానికి చోటులేదు" అన్నాడు. ప్రజలు మంత్రముగ్దుల్లా వెనక్కి తగ్గారు. ఈ లోపులో ఆఫీసర్లు పరిస్థితిని కంట్రోలుకి తీసుకుని జనాన్ని బయటకు పంపసాగారు.
స్టేజీమీద స్వామీ, మెట్లమీద నిస్సహాయంగా పడివున్న ప్రవల్లిక- ఇద్దరే మిగిలారు. ఆమె ముడుచుకుని పడివుంది. సగం స్పృహలో లేదు. సగం తెలుస్తూంది.
స్వామి ముందుకొచ్చాడు.
అతడి నీడ పొడుగ్గా ఆమెమీద పడుతూంది. బయట జనం కలకలం లీలగా వినిపిస్తూంది. దాన్ని డామినేట్ చేస్తూ అతడి నవ్వు తరంగాల్ని స్పృశించింది.
"నేను చెప్పానా ప్రవల్లికా- కాశ్మీరు నుంచీ కన్యాకుమారి వరకూ విస్తరించిన భవంతి నాది దాని నీడల్లో ఆశ్రయం పొందమని! నువ్వు వినలేదు. నా మొదటి స్తంభమయిన రాజకీయం-సూర్యారావు-నువ్వు హోం మినిస్టర్ కి ఫోన్ చేసినప్పుడు అక్కడే వున్నాడు. క్షణాల్లో వార్త మాకు తెలిసింది, నారెండో స్తంభమయిన తెలివి- లాయర్ పరమేశ్వరం ఢిల్లీ నుంచి ఏం చెయ్యాలో చెప్పాడు. నా మూడో స్తంభం- రామ్ లాల్ మిగతా ఏర్పాట్లు గావించాడు. ఫలితం...? ఇదే- నువ్వున్న స్థితే!"