"ఇది మీ దృష్టిలో చిన్న విషయంలా కనిపించవచ్చు. అలా ఉచితంగా దానధర్మాలు చేయడం నాకిష్టంలేదు. ముఖం మాడ్చుకుని అన్నది జ్యోతి.
"సారీ జ్యోతీ! ఇది నీ డబ్బుగదా? నీవే నాదానవయినపుడు నీ డబ్బు నా డబ్బేగదాని ధర్మంచేశాను. ఐయాం రియల్లీ సారీ! ఇక ముందు నేను సంపాదించుకోగల్గితే ధర్మం చేస్తాను. లేకుంటే మానేస్తాను. నీ డబ్బు మాత్రం ముట్టను. సంతోషమేనా?"
జ్యోతి మెత్తబడింది. నెమ్మదిగా అతని చెంత చేరింది.
"నా మాటలకు కోపం వచ్చిందా?" గోముగా అతని భుజంమీద చేయి వేసింది.
"కోపమా? దేనికి-" బలవంతాన నవ్వాడు శ్రీకర్.
"అలా ఉచితంగా ధర్మం చేస్తామని తెలిస్తే రోజూ వందలకొద్దిమంది వచ్చి ముంగిట వాల్తారు. యెంతమందికని ఇవ్వగలం చెప్పండి? డబ్బు కాస్త చూసి వాడమన్నారు. ఇందులో నేను తప్పేమన్నాను."
"నీ తప్పేమీ కాదు జ్యోతీ! అలాంటి దేదయినా వుంటే నాదే...అవును నిజంగా నా లోపమే-"
ఆమె మాటలు అతని హృదయాన్ని అమితంగా గాయపరిచాయి.
తొలిసారిగా 'ఇల్లరికం' వచ్చినందుకూ ఆ ఇంట్లో భార్య దృష్టిలో తన విలువేమిటో గుర్తించీ తెగ బాధపడ్డాడు.
ఇప్పుడు బాధపడి ప్రయోజనమేమిటి? అన్నిటికీ సిద్ధమయ్యే జ్యోతికోసం తలవంచాడు. ఇప్పుడు భయపడటం బాధపడటం - అనవసరం అని తనకు తాను సర్దిచెప్పుకున్నాడు శ్రీకర్.
రోజులు గడుస్తున్నాయ్.
శ్రీకర్ ఫ్యాక్టరీకి వెళ్ళి వస్తున్నాడు.
21
రోజులు గడిచేకొద్దీ జ్యోతి అతనికొక సమస్య అయిపోయింది. అతను యెంత సర్దుకుపోదామన్నా ఆమె పడనీయదు. తెగేదాకా లాగాలని చూస్తుంది. మొండితనంతో ప్రతిదానికీ వాదిస్తుంది. భర్త అన్న గౌరవం కూడా లేకుండా తేలిగ్గా, నిర్లక్ష్యంగా మాట్లాడేస్తుంది. జ్యోతి మనస్తత్వం తెలిసిన శ్రీకర్ వీలయినంతవరకూ మౌనంగానే వుండిపోతున్నాడు. ఆమెతో వాదన పెంచుకోడు.
అయినా వారిమధ్య మంటలు_సమస్యలు తలెత్తుతూనే వున్నాయ్.
ఆమెకి తండ్రి గోవర్ధనం సపోర్టు యెక్కువ. తండ్రి మద్దతుతోనే ఆవిడ ఇలా ఇష్టమొచ్చినట్లు స్వేచ్చగా ఫ్రీగా తిరగ్గలుగుతుంది. అసలు ఆమె అలాతయారవడానికి కారణం తండ్రి. ఆయన సంపాదించి ఇచ్చిన డబ్బు!
ఆ రోజు ఆమె స్నేహితురాలు బర్తుడేపార్టీ వుందని వెళ్ళిపోయింది.
శ్రీకర్ కు ఈ విషయం తెలీదు. ఫ్యాక్టరీనుంచి వస్తూ నౌకర్లు ఆ విషయం చెప్పారు. అతనికి ప్రాణం ఉస్సూరంది. ఆవేళ ఇద్దరూ కలిసి ఎగ్జిబిషన్ కు వెళదామనుకున్నారు. అందుకే ఆఫీసులో పని త్వరగా ముగించుకుని బయటపడ్డాడు. తీరా ఇంటికి వస్తే ఆమె పార్టీకి వెళ్ళిపోయింది. ఆ మాట ముందు తనకు చెప్పవచ్చుగా. కనీసం వెళ్ళేముందు ఫోన్ కూడా చేయలేదు. మరి అతనికి బాధ కలగదూ?
శ్రీకర్ టీ త్రాగి తనగదిలో విశ్రాంతి పొందసాగాడు. పుస్తకం చదువుదామని తెరిచాడు. కళ్ళు అక్షరాల్ని చూస్తున్నాయేగానీ, మెదడు ఆమెను గురించే ఆలోచనల్ని రేకెత్తిస్తున్నాయి.
"జ్యోతి అందమైనది. ఆ మాట ఎవరూ కాదనలేరు. ఆ అందంచూసే తను తలవంచాడు. ఫలితం? ఇల్లరికం రావడంతో తన వ్యక్తిత్వం హరించుకుపోయింది. మిగిలిన ఆ కాస్త అభిమానాన్ని జ్యోతి నశింపచేస్తుంది.
మొదట్లో యిలా వుండేదిగాదు. రోజురోజుకూ ఆమె ధోరణి విపరీతంగా మారుతోంది. యెంతకని భరించడం? తన మాటన్నా, తనన్నా గౌరవంలేదు. ఎక్కడకు వెళ్ళినా యేం చేసినా తనకు చెప్పదు. అతనితో చెప్పేదేమిటన్నట్లు తనను గడ్డిపరకలా తూలనాడుతుంది.
ఎన్నాళ్ళిలా? జీవితాంతం భరించాలా? అలా ఆలోచిస్తుంటే శ్రీకర్ హృదయం బరువెక్కింది! వేడి నిట్టూర్పు వదిలాడు.
చాలాసేపు అలా గడిపాడు. పది దాటుతుండగా జ్యోతి వచ్చింది. వస్తూనే భర్తను చూసి నవ్వుతూ "సారీ అండీ! రాణి భర్తుడే అట.
ఉదయం ఫోనుచేసి చెప్పింది తప్పకుండా రమ్మని. మీతో చెప్పడం మరిచాను" అన్నది.
శ్రీకర్ మాట్లాడలేదు. ముభావంగా వుండిపోయాడు.
చెప్పకుండా వెళ్ళినందుకు భర్త కోపంగా వున్నాడని గ్రహించి మరేం మాట్లాడకుండా వెళ్ళి డ్రస్ మార్చుకుని వచ్చింది. అలసటగా మంచంమీద వాలిపోయింది.
పదినిముషాలు యిద్దరిమధ్యా నిశ్శబ్దం ఆవరించింది.
చివరకు అతనే అన్నాడు
"లే...ఆకలిగా వుంది భోజనం చేద్దాం -"
కలతనిద్రలోవున్న ఆమె "నేను తినేశాను మీరు వెళ్ళి తినండి" అని కళ్ళు మూసుకుంది. అంతవరకూ అదిమిపట్టిన అతని కోపం ఆ మాటకు ఆ నిర్లక్ష్య వైఖరికి రెచ్చిపోయింది. అతను కట్టలు త్రెంచుకుంటున్న ఆవేశాన్ని బలవంతాన నిగ్రహించుకున్నాడు.
"నీ మటుకు నీవు ఎక్కడో మెక్కివస్తే సరిపోతుందా?"
"ఏమిటి గొడవ. వెళ్ళి తినండి ఎవరు వద్దన్నారు .నౌకరు వడ్డిస్తాడు" చిరాగ్గా అన్నది ఆమె. నిద్ర పాడవుతున్నందుకు ఆమెకు కోపంగా వున్నది.
"ఇవ్వాళ నీవు వడ్డిస్తేనే తింటాను."
"నావల్ల కాదు నిద్రొస్తోంది నన్ను విసిగించకండి" అని ఆ వేపు తిరిగింది.
శ్రీకర్ కి వళ్ళు మండిపోయింది.
"నీవు అసలు ఆడదానివేనా? భర్త ఆకలి అని నోరుతెరిచి అడిగితే నౌకరు వడ్డిస్తాడు పొమ్మంటావా? నీది హృదయమా? పాషాణమా?"
ఆమె చివ్వున తలెత్తి ఇటు తిరిగింది.
"ఏమిటి మీ నస! నాకు నిద్ర వస్తుందంటే వినరే?"
"నాకంటే నీకు నిద్ర ఎక్కువనా?" పళ్ళు కొరికాడు శ్రీకర్.
"నేను లక్షాధికారి బిడ్డనన్న సంగతి మరచిపోతున్నారు. ఇంతమంది నౌకర్లను పెట్టుకుని నేను మీకు భోజనం వడ్డించడమేమిటి? నేను వడ్డించను" ఖండితంగా చెప్పేసింది ఆమె. శ్రీకర్ ఆమెవేపు నిరసనగా చూశాడు.
"అదే నీ అహం! ఏనాడో నీ అహం నిన్ను నిలువునా కాల్చేస్తుంది జ్యోతీ. మనిషికంత పొగరు పనికిరాదు. నీవెంత లక్షాధికారి బిడ్డవైనా నా భార్యవన్న సంగతి మర్చిపోకు."
"ఏం బెదిరిస్తున్నారా? శాపం పెడుతున్నారా?"
"మర్యాదగా లేచి భోజనం వడ్డించమంటున్నాను _"