"నన్ను పిలిచారా?"
"ఆహా దారినపోయ్యే దాసరిదాన్ని"
"ఇంకేం? రాలేదా అది"
కోపంగా "చాల్లే చమత్కారంమూడుసార్లు పిలిస్తే పలక్క పోగా మళ్ళీ ......." అతను పూర్తిచేయనేలేదు.
"నన్ను మూడు పర్యాయాలుపిలిచారా? భలేగా వుందండి ఇది. .....నిన్నే......యిదానన్ను పిలిచే పద్దతి. ఇంతకు ముందెన్ని మార్లు చెప్పాను మీకు. పిలవదలచుకుంటే శ్రీదూ అనండి.లేదా ఏదో గ్లాసోగిన్నో చప్పుడు చెయ్యండి, వస్తాను."
"చీ! చీ!"
"మళ్ళీ మీకే కోపం"
అతనేమీ రెట్టించలేదు. అన్నం వడ్డించింది. అతను కలుపుకుంటుంటే చారు వేసింది.
కోపంగా మింగేట్టు చూశాడు.
"ముందు భోంచేయండి. తర్వత నన్ను మ్రింగుదురు గాని......ఈ రోజు శనివారం కాదు.....మధ్యాహ్నం యింటికి వచ్చి నపుడు మళ్ళీ భోంచేద్దురుగాని. మోతాదు మించకుండా రోజుకి మూడు నాలుమార్లు తింటుంటే పిల్లల్లా చలాకీగా వుంటారట మొన్నో పత్రికలో వ్రాశేరు."
ఇదీ ఒక రకం శిక్షేననుకుని చారు కలుపుకుని గబగబా తినేశాడు.
మళ్ళీ అన్నం......పెరుగు.
ఎలాగో భోజనం అయిందనిపించాడు. మరో పది నిమిషాల తర్వాత అతను టాయిలెట్ సమానుండే అల్మారా వద్ద నిలబడి దేన్నో వెతుక్కోసాగాడు.
అతని వెనకే నిలబడి కుతూహలంగా చూడ సాగింది శ్రీదేవి అతన్ని బాగా గమనిస్తూ.
ఆ కావాల్సిందేదో దొరక్క అన్నీ చెడామడా కలిపేయ్యసాగాడు. ఇహ వుంటే అన్నీ తను మళ్ళీ సర్దుకోవటానికి వారంరోజులు పడుతుందని ప్రశ్నించింది..."ఏం కావాలి?"
"కాస్ట్రాయిల్"
"తలకి పూసుకుంటారా?"
"అవును"
వెంటనే ఓ సీసా వెలికితీసి తన చేతిలో కాస్త వంచుకుని అతన్ని మరో చేత్తోఓ కుర్చీలో కూర్చోపెట్టి రెండు చేతులతో రుద్దుకుని అతనితలకి పట్టిస్తోంటే అన్నాడు ఉత్సాహంగా!
"నీ చేతికి కళ్ళున్నాయే శ్రీ......చూడు ఎంత త్వరగా"
అతని మాట పూర్తికాకముందే అంది కఠినంగా......"కాని మీ మనసుకే కళ్ళులేవు, ఎవరైనా అడిగితే యివటంలో వున్న అనందం, అడిగి తీసుకోవటంలో అందుకోవటంలో వున్న అనందం --మీ కెన్ని సార్లు చెప్పినా తెలీదు. ఊరికే అన్నీ అమర్చితే మీకేమి తెలియదు. చివరికి మీ దృష్టిలో నేనో దాసీదాన్ని అవుతానేతప్ప మరింకేమి కాను."
ఏమి జవాబు చెప్పలేదు. ఏం చెప్పినా ఏం చేసినా ఇహ యిప్పుడు ఫలితం వ్యతిరేకమే.
మౌనంగా డ్రెస్సింగ్ పూర్తి చేసుకుని అతను బయటికి వచ్చేసరికి రెడీగా సైకిల్ కనిపించింది. సంతోషంతో స్టాండ్ తీసేసి ముందుకి త్రోసుకుని వెళ్ళి గేట్ దాటి ఎక్కి వెళ్ళిపోయాడు.
కానీ అతని సంతోషానికి గుర్తుగా ఫలితంగా ఓ చిరునవ్వో ఓ థ్యాంక్సో ఆశించిన అర్ధాంగి వేడి నిట్టుర్పు అతనికి వినిపించలేదు.
ఆ వెళ్ళిన వెళ్ళడం సాయంకాలం అయిదింటికి వచ్చాడు మాధవ్.
అప్పుడే సిలోన్ లో పాటలువిని రేడియో కట్టేసి బయటికి వస్తోంది శ్రీదేవి.
హడావుడిగా ఆమె దగ్గరికివస్తూ అన్నాడు. "త్వరగా తయారవ్ శ్రీదూ-- సినిమాకి వెళదాం"
మధ్యాహ్నానికి భోజనానికి రాకపోవడంతో సాయంకాలం రాగానే ఉసూరుమంటూ ఆకలితో వస్తాడని ఉప్మా చేసింది. వేడి వేడి ఉప్మా తీసుకువచ్చి టేబిల్ పై పెట్టింది.
"ఆ టేబిల్ పై టిఫిన్ పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాను. అయినా నీకు గుర్తుండదు శ్రీదూ?"
ప్రేమగా అతని వేపు చూస్తూ అంది "పోనీలెండి టిఫిన్ తీసుకోండి ముందు."
"అక్కర్లేదు శ్రీ.....కేంటిన్ లో బలవంతంగా తినవలసి వచ్చింది.
గారముగా చూస్తూ అంది ....."దయచేసినాపై కోపాన్ని మళ్ళీ చూపుదురుగానీ ముందిదికానీవండి, వేడి వేడిగా జీడిపప్పు, శనపప్పుతో నిమ్మరసం పిండి సన్నగా తరిగిన మిర్చి--ఓహ్ ఎంత బావుందని!"
"ఏం? రుచి చూశావా?" కొంటిగా అడిగాడు.
"ఛా! నేనంత దుర్మార్గురాలినికాదు, పాపం ఉదయమనగా కాస్త తినిపోయారు మీరు, అలాంటి భర్తని విడిచేసి ముందుగానే తినే దుర్మార్గురాలి ననుకున్నారామీరు?"
"థాంక్స్, అయినా నాకక్కరలేదు. నిజం, నేను మాధవ్ ఆఫీస్ కేంటిన్ లో తినోచ్చాను. నీవేయిద్దరి భాగం తినేయ్-త్వరగా - నీవు తయారయ్యో సరికి ఓ అరగంట ఎలాగూ పడుతుంది. ఆరింటికి కంతా వెళ్ళిపోవచ్చు సరేనా? ఇహ తీసెయ్ దీన్ని"
కోపం రాజుకుంటోంది. అయినా శాంతంగా అడిగింది మళ్ళీ "అయితే తీసుకోరా?"
"ఉహూ"
"నిజం?"
చిరాగ్గా అన్నాడు "వద్దంటేకోపడతావేం? నీకు నాపై బోల్డు ప్రేముందని తెలుసులే"
ఉప్మా ప్లేటు తీసుకుని వెళుతూ అంది "నిజమే లెండి. నేను కోపం ఎందుకుపడతాను- నా కెందుకుంటుంది మీ పై ప్రేమ! మీకే"
గరంగా అన్నాడు "నిజంగా ప్రేమా నాకేవుంటుంది. నాలా నీవు నన్ను ప్రేమించాలేవు. నీవు నన్ను ప్రేమించలేవు."
"నిజమే లేండి, నాకేం తెలుసు ప్రేమంటే, ఇహ మీ దగ్గరే నేర్చుకుంటాను, నేర్పుతారా?"
మండిపడుతూ అన్నాడు చాల్లే నీ చమత్కారాలు నీవునూ, త్వరగా తయారవు"
"ఎక్కడికి?"
"ఇంతకు ముందే చెప్పానా, సినిమాకని? నీ అభిమాన నటుడి సినిమా--"
"నేను రాను, మీరూ వెళ్ళొద్దు"
"ఏం? ఎందుకు? రాణిగారి అజ్ఞా?"