కాగితమ్ముపైన కదలసాగె కలము
మదిలొ తలపుకిచ్చె మంచిరూపు
భావముంటెచాలు పద్యమదియెవచ్చు
వందనాలు తండ్రి వాసుదేవ. 17
అప్పుజేసి నీవు నాస్తులు బొందిన
అధికభారమయ్యి హానిగలుగు
తగదు నీకునాశ తగ్గించు గొప్పలు
వందనాలు తండ్రి వాసుదేవ. 18
తరువు కెవరుదెల్పె దనువివ్వమనుచును
కోకిలమ్మకెవరు గూతనేర్పె
మంచిపనులు జేయ మనసుంటెజాలదా!
వందనాలు తండ్రి వాసుదేవ. 19
సూటుబూటువేసి చూడచక్కగనుండె
విద్యగలిగివాడు విర్రవీగె
చదువు సొగసుకన్న సంస్కారమేమిన్న
వందనాలు తండ్రి వాసుదేవ. 20
జలముతోటె బతుకు జగతినందుమనకు
నీరు లేకపోతే నీవులేవు
నీటివిలువ తెలిసి వాటినొడిసిపట్టు
వందనాలు తండ్రి వాసుదేవ. 21
మంచితలపుతోడ మంచి మాటాడిన
చేదుగానుతోచి చెరుపు మైత్రి
సత్యవాక్కులెపుడు సంతృప్తినీయవు
వందనాలు తండ్రి వాసుదేవ. 22
చేయిచేయి కలిపి జేయు చెలిమినీవు
దానివిలువ నిలుపు ధరణియందు
వెలసెగదరమైత్రి వెలలేనియాస్తియై
వందనాలు తండ్రి వాసుదేవ. 23
చిన్నదనుచు చెలిమ జింతించదెన్నడు
తోడుకొలది మనకు తోయమూరు
సాయమివ్వగలుగు సంకల్పమేమిన్న
వందనాలు తండ్రి వాసుదేవ. 24
కాలచక్రమందు కనిపించు మార్పులు
ఒప్పవలెను నీవు వోర్పుతోడ
అలలు అలసిపోవె! అంబుధియందున
వందనాలు తండ్రి వాసుదేవ. 25
వెర్రివాన్నిజూసి వెక్కిరించు మనకు
అతని విలువయేల యర్ధమవును
అతనిమదియె గదర యపకార మెరుగదు
వందనాలు తండ్రి వాసుదేవ. 26
చేయు మంచిపనిని కాయమున్నవరకు
దానిఫలము గూర్చి దలచబోకు
నీకునిచ్చున్వియె నిత్యమానందాలు
వందనాలు తండ్రి వాసుదేవ. 27
అతియు నెన్నడైన హానిజేయునుగాని
మంచి ఫలములెపుడు మనకుతేదు
వలదు ఆశనతియు వస్తువేదియుగాని
వందనాలు తండ్రి వాసుదేవ. 28
జీవితంబు తనది శేషవాటితో పోల్చి
బాధపడెడి బతుకు బతుకుటేల ?
ఉన్నవాటినెపుడు మిన్నగా దలచురా
వందనాలు తండ్రి వాసుదేవ. 29
కారుచీకటేల గాంచము నేమియు
కొంత వెలుతురున్న యెంతొనండ
వెలుగువంటియాశ విడువబోకుమెపుడు
వందనాలు తండ్రి వాసుదేవ. 30
అతిథి వచ్చినపుడు నాదరించుచు నీవు
చేయవలెను నెంతో సేవనెపుడు
మనిషిలోనె గదర మాధవుండుగలడు
వందనాలు తండ్రి వాసుదేవ. 31
గంగలో మునిగిన గాని గంగాధర
మనసులో మలినము మానుతుంద
ఎదుటి మనిషిలోని యీశుని గొలువరా !
వందనాలు తండ్రి వాసుదేవ. 32
విద్య కీర్తినిచ్చి విశ్వమందు నిలుపు
విద్యలేకపోతే విలువలేదు
విద్య తెచ్చుగదర విజయమ్ము మనలకు
వందనాలు తండ్రి వాసుదేవ. 33
మంచిమాట నీవు మనసుపెట్టి వినుము
విన్ననీకు గలుగు విజయమెపుడు
ధనముకన్న మిన్న ధరణిలో పలుకేర !
వందనాలు తండ్రి వాసుదేవ. 34
ప్రాణిహితమెకోరు ప్రకృతంతయుగూడ
నష్టపరచి నీవు కష్టపడకు
కాచుటకును వనము కదలరా! ముందుకు
వందనాలు తండ్రి వాసుదేవ. 35
వాదులాడవలదు నాదియనుచు నీవు
వెళ్ళునపుడునేది వెంటరాదు
ఉన్నవాళ్ళు పరుల యున్నతిగోరురా !
వందనాలు తండ్రి వాసుదేవ. 36