వాసుదేవ శతకము
---సుమతి సారంగపూర్కర్
ప్రార్థన
విఘ్నములనునావి విఘ్నేశ దొలగించి
అభయమిచ్చినన్నె యాదుకోవ
మోదుకలనుజేసి ముదముగా నర్పించి
వేడుచుంటినేను వేగరావ.
వీణచేతబట్టి విద్యమాకొసగియు
వాసికెక్కినావు వాణిగాను
శ్వేతవస్త్రధారి చేయుచుంటిని నేను
బుద్ధితోడ నీకు పూజలెన్నొ
రేడులకును ఱేడు లింబాద్రి నరసింహ
వేల్పుగాను మాకు వెలసినావు
మొక్కి వేడుచుంటి పెక్కుదీవెనలిచ్చి
కావరావమమ్ము కరివరదుడ.
పొత్తమందు నాకు జిత్తము కలిగేల
విలువ దెలిపి నీవు పెంచినావు
నేడు నిలిచెనవియె నిజమైన మిత్రులై
వందనాలు తండ్రి వాసుదేవ. 1
పంచవలెను విద్య బదిమందికెప్పుడు
దాచవలదు దాన్ని ధనములాగ
నీవు దెలిపినపుడి నీకు విలువనిచ్చు
వందనాలు తండ్రి వాసుదేవ. 2
నెమలి నాట్యమెంతో నిచ్చునానందము
జారుజలముచూచి జనులుమెచ్చు
కళలు వున్నవారు గంటికెపుడుమిన్నె
వందనాలు తండ్రి వాసుదేవ. 3
గడ్డిపరకపొందె ఘనమైన స్థానము
చేసె సాయమెంతో జిన్నియుడుత
చిన్నవియని నెపుడు జిన్నచూపు తగదు
వందనాలు తండ్రి వాసుదేవ. 4
ఆడునాటలందు నద్భుతమ్ములుయెన్నొ
కనులతోడ నీవు గాంచవచ్చు
ఆటలాగెబతుకు నాడుకోవాలిరా
వందనాలు తండ్రి వాసుదేవ. 5
మాటలెపుడు కూడ తూటలాప్రేలకు
పంచదారవోలె బలుకవలెను
మంచి పలుకెగదర మహిలోన నిలిచేది
వందనాలు తండ్రి వాసుదేవ. 6
వెలుతురెవరునిచ్చె వేడినెవరునిచ్చె
నిప్పు నీరు నిధుల నెవరునిచ్చె
ఇచ్చువాడె గదర యీశుండు జగతిలో
వందనాలు తండ్రి వాసుదేవ. 7
పెద్దవారిమాట బేర్మితోవిన్నను
పేరు తెచ్చుకొంద్రు పిల్లలెపుడు
హితము కోరువారె హితులు నీకును బిడ్డ
వందనాలు తండ్రి వాసుదేవ. 8
పడతి తిలకమెట్టి పతిక్షేమమేకోరు
పతికి మారురూపె పడతిబొట్టు
పసుపు కుంకుమేగ పడతికోరునెపుడు
వందనాలు తండ్రి వాసుదేవ. 9
చెదరిపోదునెపుడు చిన్ననాటితలపు
తలచుకున్న తనువు పులకరించు
మనకు తీపిగుర్తు మన బాల్యమె గదర
వందనాలు తండ్రి వాసుదేవ. 10
తరువు నీడజేర దనువుకెంతో హాయి
మురిసిపోవుతాను ముదముతోడ
వృక్షజాతెగదర రక్షించు జగతిని
వందనాలు తండ్రి వాసుదేవ. 11
నల్లనేలెయయిన తెల్లబంగారమ్ము
పసిడి పంటలిచ్చె పైరులొన్నొ
మేలుజూడవలెను మేనిరంగులుకాదు
వందనాలు తండ్రి వాసుదేవ. 12
పరవశించవలెను బండువెన్నెల జూసి
పట్టుకొనుట కొరకు బరుగులేల
కోరవలదునీవు దీరని కోర్కెలు
వందనాలు తండ్రి వాసుదేవ. 13
తల్లిదండ్రియన్న ధరణిలో దైవాలు
వారికొరకు పరువు విరులబాట
మనసుపెట్టి వినర నీమాట
వందనాలు తండ్రి వాసుదేవ. 14
పరవశించి నీవు పాడవలెను పాట
రాగమదియెవచ్చు రమ్యముగను
సాధ్యపడనిదంటు సంసారమునలేదు
వందనాలు తండ్రి వాసుదేవ. 15
కాలిముల్లుచూసి కంట నీరుగారు
పలుకు విన్న గుండె బరువు పెరుగు
బాదననుభవించ బంధమవుసరంబ?
వందనాలు తండ్రి వాసుదేవ. 16