వేడిగలిగినపుడు వేదనెంతోజెంది
చల్లగాలికోరు జనులుతామె
నరకివేస్తె తరుల నష్టమెంతో గలుగు
వందనాలు తండ్రి వాసుదేవ. 37
ధనము మిన్నయనుచు జనత దలచసాగె
గుర్తుతగ్గి నిలచె గుణమునేడు
ఇలలోనెపుడుకూడ నిలుచు గుణమెగదా !
వందనాలు తండ్రి వాసుదేవ. 38
చేతిలోన వేణు జెంగల్వబూదండ
నెత్తిమీదగలదు నెమలిపించె
నల్లనయ్య నీకు నవనీతమునుదెత్తు
వందనాలు తండ్రి వాసుదేవ. 39
పిచ్చుకమ్మ వచ్చు పిలువకున్ననుగాని
ఇంటిచూరులోనె యిల్లుగట్టు
ముద్దుగొలుపుదాని ముచ్చట్లుజూసిన
వందనాలు తండ్రి వాసుదేవ. 40
ఇలను కాచువాడు యీశ్వరుండెగదర
విర్రవీగెవేల వెర్రినాన్న!
భయము, భక్తి గలిగి బాధ్యతతోమెల్లు
వందనాలు తండ్రి వాసుదేవ. 41
అంబరమున వెలిగె యాకాశదీపాలు
విన్నపాలుజేసె వినుము తండ్రి !
మువ్వగోపిలోల ముద్దగారావయ్య !
వందనాలు తండ్రి వాసుదేవ. 42
చమురుచేతవెలుగు చక్కనీ దివ్వెలు
మనిషి వెలిగిపోవు మాటవలన
పరుషపదము లెపుడు బలుకరాదుర నీవు
వందనాలు తండ్రి వాసుదేవ. 43
వయసు మళ్ళివారు పనులుజేయనులేక
ఆదరించుమనుచు నడిగినపుడు
చేయుసాయమెపుడు చీదరించదగదు
వందనాలు తండ్రి వాసుదేవ. 44
పేదజనులబాధ వినిపించదెప్పుడు
ధనికవారిమెప్పు దలుచుటేల
భేదభావమెపుడు బేరీజువేయకు
వందనాలు తండ్రి వాసుదేవ. 45
ధనముపొంది నీవు దాచిన ఫలమేమి
పంచవలెను మంచి పనులకెపుడు
పరుల మేలుకోరు పరమాత్మమెచ్చురా
వందనాలు తండ్రి వాసుదేవ. 46
పంకమందె వెలయు పంజకమెప్పుడు
మలినమంటకుండ మరులుగొలుపు
పద్మమోలె నీవు బరిడవిల్లవలెను
వందనాలు తండ్రి వాసుదేవ. 47
కాయకష్టమంత కాసులకొరకేగ
చేయువారిపట్ల చిన్నచూపు
జూడవలదు నీవు చూపించు దయనెంతో
వందనాలు తండ్రి వాసుదేవ. 48
విజయమొందదలచి వెర్రినాన్నా నీవు
అసలు దలచవలదు నడ్డదారి
సాధనమ్ముజేయ సాధ్యపడనిదేది ?
వందనాలు తండ్రి వాసుదేవ. 49
ముద్దుజేసె నిన్ను మురిసిబోయి యశోద
మన్నుమీదయేల మనసుగలిగె
విందు భోజనంబు వినయముతోనీడ
వందనాలు తండ్రి వాసుదేవ. 50
పండు వెన్నెలెంతో బంచు వెలుగుతాను
తారతమ్యమెపుడు దలచకుండ
జనులహితమేగోరు జగతిలోనీవునూ
వందనాలు తండ్రి వాసుదేవ. 51
ఉదయనడక మనకు నుల్లాసమిచ్చును
నడకనెపుడు నీవు నాపరాదు
నడకతోనె బతుకు నందనవనమురా ...
వందనాలు తండ్రి వాసుదేవ. 52