Previous Page Next Page 
గ్రాండ్ మాస్టర్ పేజి 2


    "యూ...

 

    "షా..." చీకటిలో నిలబడి వికృతంగా నవ్వుతున్నాడు ఆజానుబాహుడయిన షా. "నీ కొడుకు అక్కడ గుట్టపై స్పృహతప్పి పడివున్నాడు మిష్టర్ ఫ్రాంకో... నా పనిని సులభసాధ్యం చేశాడు."

 

    షా చేతిలోని స్టెన్ గన్ ఏ క్షణంలో అయినా నిప్పులు గక్కేట్టుంది.

 

    ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఓ మృత్యువు, యింత త్వరగా ఇలా ప్రత్యక్షమవడం వూహించని వేలఖరి వేగంగా కదలబోతుంటే "స్టాప్ దేర్" మృదువుగా అన్నాడు షా "ఇదీ నువ్వు రాసుకోవాలి."

 

    కంపించిపోతున్నాడు ఫ్రాంకో.

 

    "నువ్వు పన్నెండోవాడివి మిస్టర్ ఫ్రాంకో. యిక నిన్ను ఏ శక్తి కాపాడలేదు."

 

    హఠాత్తుగా కెవ్వుమన్న యువతులు కకావికలయ్యారు.

 

    దూరంగా రెండు హెలికాప్టర్లు వేగంగా ఓడవైపు దూసుకువస్తుంటే గమనించిన 'షా' ఆలస్యం చేయలేదు.

 

    సముద్రగర్భం ప్రతిధ్వనించిపోయింది.

 

    ఏభై అడుగుల దూరంనుండి 'S' ఆకారంలో ఫ్రాంకో గుండెల్లోకి బుల్లెట్స్ చొచ్చుకుపోయాయి. కేకలు! ఆర్తనాదాలు! ఫ్రాంకో అనుచరుల తూటాలు షాని సమీపిస్తుండగా రెప్పపాటులో సముద్రంలోకి దూకాడు... వేగం ఒడుపు... మేఘాలమాటున మెరుపులా దూసుకుపోతున్నాడు.

 

    హెలికాప్టర్ల పైనుంచి వేట మొదలయింది.

 

    ఓడపైనుంచి జంక్స్ తోబాటు నీటిలోకి దుమికిన ఫ్రాంకో అనుచరులు చీకటిలో షా కోసం గాలింపు ప్రారంభించారు.

 

    ఒక రక్షణవ్యవస్థని ఛేదించుకుని యింత సాహసంతో తనపని ముగించుకుని వెళ్ళిన 'షా' శక్తిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు విలేఖరి.

 

    స్పెయిన్ దేశంలో అత్యంత ప్రముఖుడిగా ప్రభుత్వాన్ని, ప్రజల్ని పిడికిలి బిగించి సాధికారంతో శాసించిన ఫ్రాంకో కథ ముగిసిపోయింది.


                                                          *  *  *


    దేశం     : ఫ్రాన్స్


 
    నగరం     : పారిస్

 

    సమయం     : సాయంకాలం అయిదుగంటలు.

 

    పారిస్ ఈఫిల్ టవర్ కి మూడుమైళ్ళ దూరంలో ఇంటర్ పోల్ బిల్డింగ్ సెంట్ క్లౌడ్ నాలుగో అంతస్తులో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబడింది.

 

    ఆ సమావేశంలో ఇరవైరెండు దేశాలకి చెందినా ఇంటర్ పోల్ ఏజెంట్స్ ఉన్నారు. ఇరవై అయిదుదేశాల సభ్యత్వంగల ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్ పోల్) సెక్రట్రీ జనరల్ ఆ సమావేశాన్ని నిర్వహిస్తున్న సూచనగా అక్కడ తెరపై ఓ స్లయిడ్ ప్రదర్శించబడింది.

 

    స్లయిడ్ లోని వ్యక్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 

    పేరు     : షా...

 

    ఎత్తు     : ఆరడుగుల ఒక అంగుళం.

 

    బరువు     : రెండువందల అయిదు పౌండ్లు.

 

    వయసు     : ఇరవై ఏడు సంవత్సరాలు.

 

    నేరం     : వివిధ దేశాలకి చెందిన పన్నెండుమంది కోటీశ్వరుల హత్య.

 

    జాతీయత     : తెలీదు.

 

    "జాకాల్... మేడ్ డాగ్..." ఆవేశంగా అరిచాడు సెక్రెట్రీ జనరల్ నెపోటే.

 

    స్లయిడ్ అంతర్ధానమైంది.

 

    ఏజెంట్స్ అంతా ఉత్కంఠగా చూస్తున్నారు.

 

    "ప్రపంచదేశాల నేరవ్యవస్థలకి సింహస్వప్నంగా నిలిచిన హంతకుడు మిస్టర్ షా. నిరాఘాటంగా తన హత్యలు కొనసాగించుకుంటూ ఇంతకాలం విజయాన్ని తనపరం చేసుకున్నా... మన అసమర్థతకి ప్రశ్నగా ఇన్ని సంవత్సరాలు మనకి ఇబ్బంది కలిగించినా ఇప్పుడు మన ట్రాప్ లో చిక్కుకోబోతున్నాడు."

 

    అందరూ అలర్టయ్యారు.

 

    "అసలు యీ అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది అందుకే డియర్ ఫ్రెండ్స్. యస్... నిజానికి సుమారు పన్నెండుమంది అతి ముఖ్యులయిన వ్యక్తుల్ని అంతంచేసిన 'షా' ఒక వ్యక్తికాదు. అసాధారణ శక్తి. ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థలపై కత్తిగట్టిన నరరూప రాక్షసుడు. అతి పటిష్టమైన మూడు ఖండాల పోలీసు బలగపు మేధస్సుకి ఇన్నాళ్ళూ ప్రశ్నగా నిలిచినా, చట్టంకన్నా బలవంతుడు కాదు... కాలేడు. యూనో... ఆరునెలల నా కృషి ఫలించింది. అతని దారుణాలకి మోటివ్ తెలియకపోయినా అతడికి సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలు దక్షిణ అమెరికాకి చెందిన మన ఏజెంట్స్ నాకు పదినిముషాల క్రితమే రెడ్ నోటీస్ ద్వారా పంపించారు. అది మీకు తెలియచెప్పాలనే ఈ సమావేశం ఏర్పాటు చేసింది."

 

    ఏభై ఆరేళ్ళ నెపోటే అతిముఖ్య సమాచారాన్ని వుంచే ఎరుపు చదరం గుర్తుగల కవర్ తెరిచాడు.

 

    "నేర వ్యవస్థ చదరంగపు గళ్ళపై సార్వభౌముడిలా దూసుకుపోయిన షాకి చెక్ చెప్పే అతిముఖ్యమైన ఓ అంశం" క్షణం ఆగేడు "Mr.SHAW HAS BONUL"

 

    ఉద్విగ్నంగా చూసారంతా."

 

    సుమారు అయిదువేల దాకా అయిదక్షరాల కాంబినేషన్స్ ని కోడ్ వర్డ్స్ గా వుపయోగించే ఇంటర్ పోల్ పరిభాషలో BONUL అంటే భార్య.

 

    "షా బ్రహ్మచారికాదు. అతడికో భార్యవుంది. ఆమెపేరు లూసీ. కెనడాలో పాప్ సింగర్. ఏడేళ్ళక్రితం భార్యాభర్తలయ్యారు. నెలక్రితం దాకా ఆరేళ్ళ పాపవుండేది. ఆమె పేరు జూలీ."

 

    "ఆ పాప ఇప్పుడేమైంది" అడిగాడో ఏజెంట్.

 

    "ఒక నేరస్థుడికి మరో నేరస్థుడు శత్రువు అవడం ఆశ్చర్యంకాదు. కాబట్టి జూలీ నెలక్రితం కిడ్నాప్ చేయబడింది. అయినా లూసీ పోలీసులకి తెలియచేయలేదు."

 

    "కారణం..."

 

    "చేసేస్థితిలో ఆమె లేదుకాబట్టి. యస్... షా భార్య లూసీ ఇప్పుడు బ్లడ్ కాన్సర్ తో తన చివరిదశలో ఉంది. రేపు అంటే జనవరి పదహారు. "లూసీ, షా"ల పెళ్ళిరోజు. షాకి ఈ ప్రపంచంలో వున్న సెంటిమెంటల్ ఏంకర్ లూసీ కాబట్టి తప్పకుండా కెనడా మాంట్రియల్ నగరంలో వున్న ఆమెని కలుసుకుంటాడు... కలుసుకోబోతున్నాడు... మరో నేరవ్యవస్థకి చెందిన ఇన్ ఫార్మర్ ద్వారా మన ఏజెంట్ సాధించిన వివరాలివి."

 

    ఆ గదిలో గాలి స్థంభించిపోయింది.

 Previous Page Next Page