గ్రాండ్ మాస్టర్
- కొమ్మనాపల్లి గణపతిరావు
కెవ్వుమనలేదా తల్లి...
రోషంగా తాకిన కెరటం ఉక్రోషంగా వెనక్కి వెళ్ళిపోయింది.
భూతాల్లా హోరుమంటూ పైబడుతున్న కెరటాలు... అదీ అపరాత్రివేళ...
అయినా కలత చెందడంలేదా వృద్ధురాలు...
సముద్రపు ఒడ్డున నిలబడి దూరంగా నక్షత్రాల ఆకాశం నీటిని కలుస్తున్న సరళరేఖలోకి కళ్ళు చిట్లించి మరీచూస్తూంది.
"రాలుగాయి పిల్లడు ఈ రోజూ రాడేమో" అలసటగా అనుకుంది...
వాడి పేరేమిటమ్మా...
బ్రహ్మాండాన్ని తొట్టెగా నాలుగు వేదాల్ని గొలుసులుగా అమర్చి గోరుముద్దలు తినిపిస్తూ పాటలు పాడింది... ఎవరమ్మా ఎవరు...
అచ్యుతానందుడా... ముకుందుడా...
ఏడేడు సముద్రాలుదాటి ఎప్పటికయినా తిరిగి వస్తాడనుకున్న కొడుకు ఈరోజూ రాకపోయేసరికి ఎంతకోపం ముంచుకొచ్చిందని...
చిరిగిన చీర పీలికలమధ్య చిక్కిన శరీరం నిస్త్రాణంగా కంపించింది.
తెలిసింది యిదొక్కటే అన్నట్టు ఏడుపు గొంతుతో కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఇప్పటిది కాదీ నిరీక్షణ!
ఈ తల్లి కథ ప్రపంచం యెప్పుడో మరిచిపోయినా... మరిచిపోలేని ప్రత్యక్షసాక్షులు పద్దెనిమిది సంవత్సరాల సుదీర్ఘ కాలంతో ఆ తల్లిని ఇలాగే చూస్తున్న సముద్రం!
ఆ పిచ్చితల్లి కన్నీటితో రోజూ తడిసే అక్కడి ఇసుక రేణువులు...!
సమయం : రాత్రి పదిగంటలు
దేశం : స్పెయిన్
నగరం : బార్సిలోనా
మధ్యధరా సముద్రంలో బార్సిలోనా నగరానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో లంగరు వేయబడిన షిప్ "నబాడా" డెక్ పై కాళ్ళని స్విమ్మింగ్ పూల్లో - తలని నగ్నంగా వున్న ఓ అమ్మాయి ఒడిలోవుంచి ఉత్సాహంగా ఓ పత్రికా విలేఖరికి ఇంటర్వ్యూ యిస్తున్నాడు షిప్పింగ్ టైకూన్ ఫ్రాంకో.
ఫ్రాంకోకి అలాంటి ఓడలు చాలా ఉన్నాయి. కాని "నబాడా" లోనే ఎక్కువగా గడుపుతుంటాడు. నలభై అయిదేళ్ళ ఫ్రాంకో స్పెయిన్ దేశంలో మొదటి ముగ్గురు కోటీశ్వరుల్లో ఒకడుగా చాలా ప్రతిష్ట కలవాడు... అతనికి సొంతంగా ఓ దీవి ఉంది. ఆ దీవిలో రహస్యంగా సాగే చాలా వ్యాపారాలున్నాయి. అంతకుమించి సొంత సేనవుంది... అక్కడ నిరంతరం అతడికి రక్షణ అందిస్తూ ఉంటుంది.
"మిష్టర్ ఫ్రాంకో" విలేఖరి అడిగాడు 'ఇప్పటిదాకా మీ వ్యాపారాల గురించి చాలా ముఖ్య వివరాలని తెలియజేశారు. అయితే ప్రభుత్వ వర్గాలలో మీమీద ఓ అభియోగం ఉంది."
"ఏమిటది" సమీపంలో కూర్చున్న ఓ యువతి పొట్టపై వేళ్ళతో రాస్తూ అడిగాడు. "నా దీవిలో పసివాళ్ళని బానిసలుగా ఉపయోగించి పనులు చేయించుకోవడమే కదూ."
"యస్. అఫ్ కోర్స్."
"ఐ లవిట్. నా వ్యాపారాలకి అలాంటి బానిసలు కావాలి."
"ఇది పత్రికలో ప్రచురించొచ్చా...?"
"అభ్యంతరం లేదు. ఎందుకంటే యిక్కడ ప్రభుత్వం నడిచేది నా చెప్పుచేతల్లో కాబట్టి" గర్వంగా అన్నాడు.
"హాయ్ డాడ్" చీకటి ఆకాశంలోనుంచి ఓ కేక వినిపించడంతో విలేఖరి ఉలిక్కిపడ్డాడు.
"నా వారసుడు" సుమారు వందడుగుల ఎత్తులో పక్షిలా హేంగ్ గ్లయిడర్ లో ఎగురుతున్న కొడుకును చూస్తూ చేతినూపేడు. గ్లయిడర్ తూర్పు దిక్కువేపు సాగిపోతూంది.
అరనిముషం గ్లయిడర్ కేసి చూసిన విలేఖరి అడిగాడు "ప్రభుత్వం మీది కావచ్చు. కాని అలా పసిపిల్లల్ని పనులకుపయోగించుకోవడం దారుణం కదూ."
"ఎవడా అనేది".
"షా..."
కొద్దిగా ఉలిక్కిపడిన ఫ్రాంకో వెనువెంటనే తేరుకున్నాడు. "వాడికేమిటి సంబంధం?"
"వివిధ దేశాలలో యిప్పటిదాకా పదకొండుమంది మీ స్థాయి కోటీశ్వరుల్ని అసాసినేట్ చేసి చంపిన షా ఓ పత్రిక్కి రహస్యంగా ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం మీకు తెలిసే ఉంటుంది."
ప్రస్తుతం పదకొండు దేశాలు అంతర్జాతీయ డెత్ వారెంట్ తో గాలిస్తున్న హంతకుడు 'షా' గురించి ప్రసక్తి తీసుకురావడం నచ్చలేదు ఫ్రాంకోకి. "వార్ని వేటాడటానికి అప్పుడే మేం ఏర్పాట్లు చేశాం."
"ఎలా"
"ఐరోపా దేశాలకి చెందిన మాఫియా సిండికేట్ కి సుమారు రెండున్నర కోట్ల డాలర్లని ఖర్చు చేస్తున్నాం."
"అంటే మీరు ప్రమాదాన్ని ఎక్స్ పెక్ట్ చేయడం లేదా...?"
ఫకాలున నవ్వాడు ఫ్రాంకో. "నన్ను చేరుకోవడం అంత సులభంకాదు. వందలకొద్దీ సాయుధులయిన నా అనుచరులు... ఆకాశంలో నిరంతరం నాకు రక్షణగా తిరిగే హెలికాప్టర్స్. షా కనిపించగానే శరీరాన్ని తూట్లు చేసి చంపుతాయి."
మెడిటేరియన్ సీ పైనుంచి వీస్తున్న గాలి ఎందుకో ఆహ్లాదంగా లేదు. దక్షిణదిక్కు నుంచి వస్తున్న హెలికాప్టర్ అరనిముషంలో షిప్ డెక్ పైనుంచి ఉత్తరంవైపు సాగిపోయింది.
"మీ లక్ష్యం?..." అడిగాడు విలేఖరి ముగింపుగా.
"ఇప్పటికే చాలా సాధించాను. ఇక మిగిలింది..."
"చెప్పండి."
"షాని కడతేర్చడం" మరోసారి నవ్వాడు ఫ్రాంకో "ఈ దేశంలో తిరుగులేని సార్వభౌముడిగా నేను నిలబడడం."
అదిగో అప్పుడు డెక్ పైకి వచ్చి వాలింది హేంగ్ గ్లయిడర్.
నగ్నంగా వున్న యువతుల మధ్యనుంచి లేచిన ఫ్రాంకో గ్లయిడర్ కేసి చూస్తూ కొడుకుని పలకరించబోయి ఎందుకో ఆగాడు. అదీ అరక్షణమే... హఠాత్తుగా అక్కడ గాలి స్థంభించిపోయింది.