Previous Page Next Page 
గ్రాండ్ మాస్టర్ పేజి 3


    "మాంట్రియల్ లోని కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ని అలర్టు చేయడమేగాక మీరు అయిదుగురు ఏజెంట్స్ అక్కడ  ఆపరేషన్ పర్యవేక్షించడానికి ఈ రాత్రికి బయలుదేరుతున్నారు..."

 

    వివిధ దేశాలకి చెందిన ఏజెంట్స్ ఆసక్తిగా విన్నారంతా.

 

    "షా ఏ దేశస్థుడో తెలిసిందా"

 

    "యా... ఇట్స్ షాకింగ్ న్యూస్" నెపోటే సాలోచనగా అన్నాడు. "అతను ఆసియాఖండానికి చెందినవాడు. ఇంకా వివరంగా చెప్పాలీ అంటే భారతీయుడు."

 

    "వ్వాట్" భారతదేశానికి చెందిన ఓ ఏజెంట్ అప్రతిభుడయ్యాడు. "మాదేశం వాడా"

 

    "యస్... షా యీజిండియన్. అంతేకాదు..."

 

    ఒకపక్క కెనడా దేశపు పోలీసు బ్యూరోకి 'షా" ఆగమనానికి సంబంధించిన అత్యవసరమైన సమాచారం XD కేబుల్ ద్వారా ట్రాన్స్ మిట్ చేయబడుతుంటే...

 

    నెపోటో నెమ్మదిగా చెప్పాడు. "షా భారతీయుడయినా అతడి మాతృభాష హిందీకాదు."

 

    "మరి...

 

    "ఓ ప్రాంతీయభాష... తెలుగు..."

 

    ఇండియాకి చెందిన ఏజెంట్ రాంసింగ్ ఆశ్చర్యంగా చూస్తుండగానే అన్నాడు నెపోటే.

 

    "అతని అసలు పేరు SHAW కాదు... SRI HARSHA శ్రీహర్ష..."


                                                          *  *  *


    కెనడా దేశంలో మాంట్రియల్ నగరం.

 

    దట్టంగా మంచు కురుస్తున్న రాత్రి పదిగంటలవేళ.

 

    సెంట్ లారెన్స్ కు సమీపంలోని జాకెన్ కార్డియర్ బ్రిడ్జికి ఆనుకుని వున్న ఓ బ్రిక్ హవుస్ లో...

 

    షా గుండెలపై తలానించి శాశ్వతంకాని క్షణాలను లెక్కపెట్టుకుంటూ గడుపుతోంది లూసీ.

 

    "ఏమిటి ఆలోచిస్తున్నారు" స్వచ్చమైన ఇంగ్లీషులో అడిగింది. రోమన్ కేథలిక్ అయిన లూసీ ఇంగ్లీషుతోబాటు ఫ్రెంచి భాషకూడా అనర్గళంగా మాటాడగలదు. కాని షాతో ఇంగ్లీషు మాట్లాడడాన్నే ఎక్కువగా ఇష్టపడుతుంది. "జూలీ గుర్తుకొస్తుందా..."

 

    జవాబు చెప్పలేదు షా.

 

    మెలికలు తిరిగిన స్పాంజ్ ఐరన్ విగ్రహంలా మగతనంతో కనిపించే షా 'లేడీస్ మేన్'గా అనిపిస్తాడే తప్ప క్రిమినల్ గా, అదీ ఓ కానీబాల్ లా వ్యవహరించగల క్రూరుడిగా ఎవరూ ఊహించలేరు.

 

    ఎప్పుడో ఏడేళ్ళక్రితం తన జీవితంలో పొయిటిక్ గా అడుగుపెట్టిన ఓ అందమైన అబ్బాయి తనపై అంత ఆధిపత్యం చూపించగలడనిగాని, ఆ తర్వాత ఇలాంటి స్థితికి చేరుకుంటాడనిగాని వూహించని లూసీ నిన్నమొన్నటిదాకా అతడందించిన ప్రేమఫలంతో చాలా హాయిగా గడిపేసింది.

 

    ఇప్పుఉద్ జూలీ తన దగ్గర లేకుండా దూరమైనందుక్కాదు.

 

    తనే ఈ ప్రపంచానికి దూరమవుతున్నందుకు కలవరపడుతోంది. ఒకవేళ బ్రతికివున్నా షాని మార్చుకునే శక్తిలేదని ఆమెకు తెలుసు. కాని పోయేదాకా అయినా తన సమీపంలో వుండలేని అతని స్థితికి బాధపడుతూంది.

 

    "ఈరోజుకి సరిగ్గా ఏడేళ్ళు అయింది కదూ" తమ పెళ్ళిరోజుని గుర్తుచేసింది స్వప్నంలోలా... "ఐ లవ్ దిస్"

 

    మెడలో తాళిబొట్టుని గర్వంగా చూసుకుంది.

 

    జన్మతః క్రిస్టియన్ అయినా హైందవ సాంప్రదాయాన్ని చాలా ఇష్టపడే లూసీ కోరి షా చేత కట్టించుకుందది.

 

    "ఏయ్.. మాటాడు..."

 

    లుకేమియాతో పాలిపోయిన ఆమె పెదవులు అతడి చెంపల్ని తాకుతుంటే లాలనగా ఆమె తల నిమిరాడు.

 

    "ఏమిటలా ఆలోచిస్తున్నావ్?"

 

    లూసీకి తెలుసు అతను తనగురించే ఆలోచిస్తున్నాడని. మిలియన్ల డాలర్లను ఖర్చు చేయగలడు తనకోసం. కానీ తను బ్రతకదు.

 

    "పాప గుర్తొస్తోందా...?"

 

    తల అడ్డంగా వూపాడు.

 

    "జూలీ బ్రతికేవుంటుంది కదూ?"

 

    ప్రపంచంలో చాలా శక్తుల్ని గడగడలాడించగలిగే షాలో చిన్న ప్రకంపన.

 

    "ఎవరు కిడ్నాప్ చేసుంటారు?"

 

    "తెలీదు."

 

    "చిత్రం కదూ!"

 

    భావరహితంగా చూసాడు లూసీని.

 

    "చాలామందికి నువ్వు ప్రశ్నవి. నీకు జూలీ ఇప్పుడు ప్రశ్నగా మారిపోయింది." లూసీ కళ్ళలో ఓ నీటిపొర. "పాపపుణ్యాలంటే నాకూ నమ్మకం వుండేది కాదు. కాని మీ పురాణాలను గురించి అప్పుడప్పుడూ నువ్వు చెప్పింది విన్నాక బహుశా మనం చేసిన ఏ పాపమో..."

 

    "స్టాపిట్" అసహనంగా లేవబోయాడు.

 

    "ఇంత జరిగాక కూడా..." ఆ 'ఇంత' పదంలో లూసీ బ్లడ్ కేన్సర్ లో కూడా ధ్వనించింది. "యస్ డాళింగ్... నీది కాదు... మన జీవితాలు యిలా మారడానికి తప్పకుండా..."

 

    "ప్లీజ్ లూసీ. లెట్స్ నాట్ టాక్ ఎబౌట్ ఇట్"

 

    బడలికగా చూసిందామె. "సారీ"

 

    రొప్పుతూ అతని గుండెలపై తలానించింది.

 

    "నీమీద కోపంకాదు డాళింగ్. నేను ఎక్కువకాలం యిక బ్రతకనన్న భయం" నవ్వేసింది దుఃఖాన్ని దిగమింగుకుంటూ.

 

    నిస్త్రాణంగా కళ్ళు మూసుకున్నాడు.

 

    "బహుశా నన్ను నువ్వు ఆఖరిసారి చూడడం యిదేనేమో."

 

    "... ..."

 

    "చచ్చిపోతానుగా"

 

    "నువ్వేకాదు..." చావన్నది అందరికీ తప్పదన్న వేదాంతం అతడి గొంతులో.

 

    "కాని నేను అందరికన్నా ముందు పోతాను. అవునా..."

 Previous Page Next Page