ఆఖరి పోరాటం
__ యండమూరి వీరేంద్రనాథ్
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.
ఆరో అంతస్థు.
మిగతా ఆఫీసుకీ దానికీ తేడా వుంది.
ఆఫీసంతా అందరూ తిరగవచ్చు. కానీ ఆ అంతస్థు మాత్రం ఉన్నతాధికారులకీ, సి.బి.ఐ. ఆఫీసర్లకీ మాత్రమే పరిమితం. పూర్తి ఎయిర్ కండిషన్ చేయబడ్డ విశాలమైన ఆ వరండాలో గోడలకి కంప్యూటరైజ్డ్ ఇనుప బీరువాలు తాపడం చేయబడి వున్నాయి. ఒక్కొక్క ఆఫీసర్ కి ఒక్కొక్కకోడ్ నెంబరు ఇవ్వబడుతుంది. అది మాత్రమే వారికి సంబంధించిన బీరువా తెరుస్తుంది. తమ పరిశోధన తాలూకు రిపోర్ట్ లన్నీ వాళ్ళు అందులో దాచుకుంటారు. వాటిని వెల్లడి చేయవలసిన అవసరం వారికి లేదు.
లిఫ్ట్ ఆరో అంతస్థులో ఆగింది.
డిప్యూటీ కమీషనర్ ఆఫ్ సి.బి.ఐ. బయటకు రాగానే దాని తలుపులు మూసుకుపోయాయి. ముఖద్వారం దగ్గిర గార్డు సెల్యూట్ చేశాడు. దాన్ని స్వీకరించి, లోపలికి అడుగు పెట్టగానే గార్డు తలుపు మూశాడు.
లోపల బాగా చలిగా వుంది. పొడవాటి గది. బ్యాంకులో లాకర్ల మాదిరి ఇనుప బీరువాలు .... తనకి సంబంధించిన 'అర' దగ్గిర నిలబడి, డిప్యూటీ కమీషనర్ మూడు బటన్స్ నొక్కగానే కంప్యూటర్ తన పని ప్రారంభించింది.
"786...."
"క్యాచ్ వర్డ్ ప్లీజ్...." కంప్యూటర్ అడిగింది.
"బంగాళాఖాతం."
"లోతెంత?"
"76184 అడుగులు."
కంప్యూటర్ సంతృప్తి చెందినట్లు- తలుపు తెరుచుకుంది. అందులో వుంది....
"రెడ్ ఫైల్."
దేశాన్ని దోచేసే అత్యంత క్లిష్టమయిన కేసుల్లో- అతి దారుణమైన మేధావంతులయిన నరరూప రాక్షసుల కోసం మాత్రమే వాడే ఫైల్!!!
దాదాపు రెండు సంవత్సరాలు ఒంటరిగా పరిశోధించి మూడో కంటికి తెలియకుండా ఎన్నో విషయాలు శోధించి ఒక్కొక్క పేజీ చొప్పున నిర్మించుకుంటూ వచ్చిన ఫైల్!!
ఆ రోజు దాని విషయాలు అందరికీ వెల్లడి చేయబడతాయి. సి.బి.ఐ. ఆఫీసర్లందరూ అలర్ట్ చేయబడతారు.
నాలుగో అంతస్థులో మరో పదినిమిషాల్లో జరగబోయే మీటింగ్ లో తను వెల్లడిచేయబోయే విషయాలు బాంబుల్లా పేలబోతూందని డిప్యూటీ కమీషనర్ కి తెలుసు. దేశ ప్రజలు ఎంతో గౌరవప్రదంగా చూసుకునే ఒక వ్యక్తి గురించి రెండు సంవత్సరాలుగా, అదే జీవిత లక్ష్యంగా నిర్మించుకుంటూ వచ్చిన ఫైల్.
దాని వివరాలు ఈ రోజు మీటింగ్ లో వెల్లడి చేయబడతాయి.
* * *
"డియర్ ఫ్రెండ్స్....."
డిప్యూటీ కమీషనర్ చెప్పడం ప్రారంభించినా, ఆఫీసర్లింకా షాక్ నుంచి తేరుకోలేదు. డి.సి. చేతుల్లో వున్న ఎర్ర ఫైల్ ని చూసినప్పుడే కలకలం రేగింది.
డిపార్ట్ మెంటులో నాలుగైదు కన్నా ఎక్కువ రెడ్ ఫైల్స్ లేవు. క్రైమ్ స్థాయిని బట్టి నీలం, పసుపు, నలుపు..... ఇలా ఫైళ్ళు ఏర్పాటు చేస్తారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్టులకీ, స్మగ్లర్లకీ మాత్రమే రెడ్ ఫైల్ ఉపయోగించటం జరుగుతుంది. అయినా దేశం మొత్తంమీద అలాంటి క్రిమినల్స్ నలుగురైదుగురే వున్నారు. ఇద్దరు లాకప్ లో, ఒకడు పంజాబ్ లో, మరొకడు స్వీడన్ లో.
ఇంత కాలానికి మళ్ళీ మరొక ఫైల్..... ఎవరా వ్యక్తి?
1
ఆఫ్రికా దేశపు అరుదైన, అత్యంత ప్రతిష్ఠాకరమైన ఆల్ మండ్ జింక చర్మానికి, చైనా దేశపు కళాకారులు అల్లిన లేసుల ముఖమల్ బట్టమీద పరివేష్టితుడై కూర్చుని వున్నారు అనంతానంతస్వామి. గోపురాకారంలో పదిహేను అడుగుల ఎత్తున ఆ విశాలమయిన హాలులో ప్రతి గోడా ఒక అద్దంలా మెరుస్తూంది. జింక చర్మపు చివర్ల అమర్చిన రత్నాలు గాలికి నెమ్మదిగా కదులుతున్నాయి. ఎదురుగా వున్న బెల్జియం అద్దంలో ఆ గది శోభ ద్విగుణీకృతమవుతోంది. దక్షిణ భారతదేశపు శిల్పులు ఎంతో ఏకాగ్రతతో చెక్కిన శిల్పాలు ఆ గది స్థంభపు గోడలకి కొత్తవన్నె తెస్తున్నాయి. స్వామి కూర్చున్న మండపు పైభాగంలో వున్న జపనీస్ షాండ్లియర్ రకరకాల కాంతుల్ని విరజిమ్ముతూంది. ప్రాచీన రోమన్ సాంప్రదాయపు పాత్రల్లో సుగంధ ద్రవ్యాలు ఎక్కువ వున్నాయి.
మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలూ ఆ గదికి తమ అంశనిచ్చాయి.
ఒక కాలు ముందుకు చాచి, ఒక కాలు మడిచి, ఒక చెయ్యి వొళ్ళో పెట్టుకుని ఠీవిగా, కళ్ళు సగం మూసి కూర్చుని వున్నాడు ఆయన.
ఒక అంగన నెమలి పించంతో ప్రశస్తమయిన మైసూరు గంధాన్ని ఆయన భుజాలకి రాస్తోంది. మరొక లలన ఆయన కనుబొమ్మల్ని దిద్దుతోంది. ఒక నితంబిని పళ్ళెంలో కాళ్ళుపెట్టి కడుగుతోంది. మరొక అన్నులమిన్న వింజామర వీస్తోంది.
అయిదు నిమిషాల్లో సేవ పూర్తయింది. ఆయన లేచాడు. ఆజానుబాహుడు, అరవింద దళాక్షుడు. ఆయన నడుస్తూంటే అంగనలు నమ్రతగా పక్కకి తప్పుకున్నారు. విశాలమయిన కారిడార్స్ లో నడుస్తూంటే సేవకులు వినయంగా తలవంచారు. కారిడార్ చివర పెద్ద హాలు. ఆయన ఆ హాలులోకి ప్రవేశించగానే, ప్రపంచపు వివిధ ప్రాంతాల్నుంచీ వచ్చిన భక్తులు, విదేశీయులు ఒక్కసారిగా పెద్ద పెట్టున "అనంతానంతస్వామికి జై" అని ముక్తకంఠంతో అరిచారు.
* * *
"అనంతానంతస్వామిని మీరెప్పుడయినా చూశారా?" డిప్యూటీ కమీషనర్ అడిగిన ప్రశ్నలకి అధికారులందరూ మొహమొహాలు చూసుకున్నారు.
"...అవును. ఈ ఫైలు ఆయన గురించే."
ఆనకట్ట తెగి నదీ ప్రవాహం తోసుకు వచ్చినట్టు ఆ గదిలో కలవరం చెలరేగింది. సి.బి.ఐ. ఆఫీసర్లన్న విషయం కూడా తాత్కాలికంగా మర్చిపోయి, వారిలో వారు మాట్లాడుకోసాగారు. డి.సి. స్వరం కొనసాగింది.
"..... ప్రధానమంత్రి దేశంలో ఏదైనా ఆనకట్టకి శంఖుస్థాపన చెయ్యాలంటే దానికి ముహూర్తం ఆయన పెట్టాలి. ముఖ్యమంత్రి గుళ్ళో విగ్రహ స్థానం మారుస్తే దానికి ఆయన పూజచేయాలి. హస్త సాముద్రికంలో ఆయనంత గొప్పవారు లేరని అధికార పక్షమూ, ప్రతిపక్షమూ ఏకగ్రీవంగా అంగీకరిస్తాయి. ఆయన ఎవరిచెయ్యి అయినా చూసి, "నువ్వో నాలుగు రోజుల్లో చచ్చిపోతావు" అని చెప్తే, వారు మరణించడం ఖాయం. చిత్రమేమిటంటే, ఈ మరణించడం అనేది జ్వరంవల్లా, ఆక్సిడెంట్ వల్లా కాదు. ఆక్సిడెంట్ లాటి హత్యవల్లో, అత్యాచారం వల్లో జరుగుతుంది. ఇంత గొప్పగా ఆయన మరణాన్ని శాసించగలడు. గత రెండు సంవత్సరాల్లోనూ దాదాపు అరవై మందికి ఆయన సాముద్రికం చెప్పాడు. ఆ అరై మందీ మరణించారు. మరణాన్ని ఆ విధంగా ఆయన శాసిస్తాడు. చనిపోయిన అరవై మందిలో యాభైమందికి రాజకీయాల్తో సంబంధం వుంది. మత్తు పానీయాలూ, గంజాయి, మార్జువానా, స్త్రీలు, బంగారం, స్మగ్లింగ్ - వీటన్నిటిలో ఏది లాభసాటి వ్యాపారం? ఊహు. ఇవేమీ కాదు. అన్నిటికన్నా మంచి వ్యాపారం రాజకీయం!!! ఎలాగో ఒకలా ఒక వ్యక్తిని మంత్రిని చెయ్యి! పది శాతం కమీషన్ అడుగు, అయిదు సంవత్సరాల్లో కోటి రూపాయలదాకా వస్తుంది. ఆ కోటిలో మళ్ళీ పదిశాతం ఖర్చుపెడితే- ఒక స్థానం ఖాళీ చేయించడానికి ఒక మంత్రిని లంచగొండి అని నిరూపించి రాజీనామా చేయించవచ్చు. ప్రతిపక్షం మీటింగ్ లో బాంబులు పెట్టి ఇద్దరు ముగ్గుర్ని చంపి, అది అధికార పక్షమే చేసిందని ప్రజల్లో భ్రాంతి కలిగించవచ్చు- అనంతానంతస్వామి టెక్నిక్ ఇదే-"
గదిలో అధికారులు విస్తుబోయి వింటున్నారు. అంగవైకల్య బాలానందం ట్రస్టు, వృద్ధ జనోపకార సంఘం, దీనజనోద్ధరణ సమాఖ్య, వితంతు రక్షణ పరిషత్ లాంటి ఎన్నో సంస్థలకి, దాదాపు నాలుగువందల కోట్ల ధనానికి ఆయన అధికారి. అలాంటి వ్యక్తి మీద సి.బి.ఐ....
డి.సి. స్వరం తిరిగి వినిపించింది.
"హిందువులు స్వతహాగా సహనశీలురు. ఆ గుణమే వారిలో లేకపోతే దేశం ఇలా వుండేది కాదు. దేశపు మైనారిటీ వర్గాల్లో సుస్థిరతా భావం తగ్గేకొద్దీ అలజడి పెరుగుతుంది. సరీగ్గా ఈ పాయింట్ నే పట్టుకున్నాడు అనంతానంతస్వామి. అయితే ఇదంతా ఎంతో సిస్టమాటిక్ గా ఎవరికీ అనుమానం రాకుండా చేసాడు. దాదాపు ఇరవై సంవత్సరాల కృషి వుంది దీని వెనక.
మతం ఆయన ఆయుధం! వెపన్!!!
రాజకీయం ఆయన ఆట! గేమ్!!!
ఆయన విమానం దిగుతూ వుంటే వందమంది పూర్ణకుంభాలతో నిలబడి వుంటారు. విదేశాలకు వెళ్తే విదేశాంగ మంత్రి వీడ్కోలు ఇస్తాడు.
ఇంత మహోన్నతమయిన వ్యక్తి మత పరిరక్షకుడు, రాజకీయాధినేతా, నిర్ణయ నిర్దేశకుడు అయిన అనంతానంతస్వామి యొక్క చీకటికోణాన్ని నేను రెండు సంవత్సరాలుగా శోధించాను. చాపక్రింద నీరులా వలపన్ని ప్రతిచర్యనీ భూతద్దంలో చూసి రికార్డు చేసాను. ఆ కాగితాలన్నీ ఈ ఫైల్ లో వున్నాయి. అయితే అతడిమీద యాక్షన్ తీసుకునేటంత రుజువు ఏదీ నాకు లభించలేదు" ఆమె ఆగింది.
"ఈ రోజు సాయంత్రం అలాంటి రుజువు ఒకటి లభించబోతూంది-"
ఆఫీసర్లందరూ ఉత్సుకతతో ముందుకి వంగారు. ఆ గదిలో సూది పడితే వినపడేటంత నిశ్శబ్దం ఆవరించింది.
"........ ఈ రోజు సాయంత్రం రవీంద్ర కళాక్షేత్రంలో ఒక నాటక ప్రదర్శన జరగబోతూంది. ఇందిరాగాంధీ మహిళా కళాకారులు ఈ ప్రోగ్రామ్ ని అనాధ బాలికల సహాయార్ధం ఏర్పాటుచేసేరు. కళాభారతి అన్న సమాజంవారు ఈ ప్రదర్శన ఇస్తూంది, దీనికి అధ్యక్షత వహిస్తున్నది పరిశ్రమల మంత్రి సూర్యారావు. నాకు లభించిన రహస్య సమాచారం ప్రకారం ఆయన్ని అక్కడ హత్య చేయడానికి ప్రయత్నం జరుగుతూంది."
వింటూన్న వాళ్ళు ఆసక్తిగా చూసారు. గుసగుసలు బయల్దేరాయి!
"వారంరోజులక్రితం స్వామి సూర్యారావు చెయ్యి చూస్తూ 'అపాయముంది నాయనా జాగ్రత్త" అని హెచ్చరించడం కాకతాళీయం కావొచ్చు. కానీ ఈ ప్రయత్నం జరుగుతూ వుండగా కనీసం ఒక టెర్రరిస్టునయినా మనం పట్టుకోగలిగితే.... చాలా సమాచారం బయటపడవచ్చు. సర్స్.. ఇంతకాలం ఈ విషయాలన్నీ నా ఒక్కదానికే పరిమితం. ఈ రోజు మీ అందరి సహకారం కావలసి రావడంతో ఇన్నాళ్ళూ నేను సేకరించిన సమాచారాన్ని మీ ముందు వుంచుతున్నాను. ఈ ఫైల్ పూర్తిగా చదవండి. ఈ విషయాలన్నీ అత్యంత రహస్యంగా, గోప్యంగా వుంచాలని మీకు నేను చెప్పనవసరం లేదు. ఈ సాయంత్రం మనం అక్కడికి వెళుతున్నాం. మన కోడ్ కాలర్."
(హత్యా ప్రదేశంలోగానీ, మీటింగుల్లోగానీ ఆఫీసర్లు ఒకర్నొకరు గుర్తుపట్టడానికి ఒక కోడ్ ఏర్పర్చుకుంటారు. ఆ కోడ్ చివరి నిమిషంలో మాత్రమే వెల్లడి చేయబడుతుంది. ఆ రోజు కాలర్ పైకి కాస్త లేవడం గుర్తు.)
"సూర్యారావుగారిని ఈ రోజు ప్రదర్శనకి వెళ్ళడం మానుకొమ్మని సలహా ఇద్దామా?" ఎవరో అడిగారు.
"మనకేదో ఆచూకీ అందగానే మంత్రుల్ని ప్రోగ్రామ్ లు మానుకొమ్మని సలహా ఇస్తే, దేశంలో ఒక్క ప్రముఖుడు కూడా బహిరంగంగా ఇక హాజరవడానికి వీలుండదు. మనం అక్కడ ఆయనకి రక్షితవలయం ఏర్పరచాలి. వాళ్ళని పట్టుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం మరొకటిరాదు. మన శక్తి సామర్ధ్యాలు నిరూపించుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం మరొకటిలేదు బెస్టాఫ్ లక్..."
అందరూ నిశ్శబ్దంగా లేచారు.
అనంతానంతస్వామి చుట్టూ సి.బి.ఐ. వల!
సి.బి.ఐ. చరిత్రలో ఇంత పెద్ద ఆపరేషన్ గతంలో ఎప్పుడూ జరిగి వుండదు.
* * *
అందరి మనసులూ టెన్షన్ తో నిండివున్నాయి.
ఆ విగ్రహాన్ని చూసి ఎవరూ, అది ఒక గదిలోది అనుకోరు. బిర్లామందిర్ అంతర్భాగపు గర్భగుడికన్నా పదిరెట్లు విశాలంగా వుంది. విగ్రహమే ఆరడుగుల పొడవుంది. అనంతానంతస్వామి ఇంట్లో పడగ్గది పక్కనేవున్న పూజా మందిరం అది.
పట్టుపంచె సర్దుకుంటూ అక్కడికి హడావుడిగా ప్రవేశించాడు సి.బి.ఐ. చీఫ్. ఆయన మరో రెండేళ్ళలో రిటైరవ్వబోతున్నాడు. అనంతానంతస్వామిని అపర భగవదవతారంగా చూస్తున్నాడాయన. భగవంతునికి వ్యతిరేకంగా ఎంక్వయిరీనా? అపచారం.....