వెనువెంటనే తేరుకుని "నేను మీ అభిమానిని" అంది.
"చెప్పండి."
అతడి గొంతులో పులకింత లేదు. ఇలాంటి పోన్ సంభాషణలు అభిమానులతో సామాన్యమే అన్నంత ధీమా వినిపించింది.
"మీ నవల 'మెరుపు' చదివాను."
క్షణం విరామం తర్వాత మళ్లీ అందామె "దాని గురించి మీతో మాట్లాడాలనిపించింది."
"ప్లీజ్!" సభ్యతగా ప్రోత్సహించాడు.
"మీ భాష బాగుంటుంది."
"థ్యాంక్స్!"
"కానీ బావుకత్వం వున్నవాళ్లకి తప్ప అర్దంకాదు."
"మీకున్నందుకు ధన్యుడ్ని."
ఆమెకి చెమటలు పట్టేస్తున్నాయి.
మరీ ఇంత క్లుప్తంగా, ముక్తసరిగా జవాబు చెబుతాడేం?
కాస్త ఎక్కువగా మాట్లాడొచ్చుగా.
తను రచయితనన్న గర్వమా?
"లిటరేచర్ పర్పస్ ఏమిటో చెబుతారా?" అని అడిగింది. ఆ క్షణములో ప్రసక్తిని ఎలా పొడిగించాలో తెలీనట్టుగా.
"మీరు జర్నలిస్టా?"
"కాదే" విస్మయంగా అడిగింది "ఎందుకలా అడిగారు?"
"మరేం లేదు. మీ ప్రశ్నలు ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా అనిపించింది తప్పనా రచన గురించి మాట్లాడుతున్నట్టుగా లేదు."
"ఓ. కె!" ఆమె ఉక్రోషంగా అంది "ఇంటర్వ్యూ చేస్తున్నాననే అనుకొని నా ప్రశ్నకు జవాబు చెప్పండి. సాహిత్యం లక్ష్యమేమిటి?"
"మీ చేత చదివించడం, అలా నేను డబ్బు సంపాదించడం."
ఆమెకీ జవాబు నచ్చలేదు. "అంటే మీరు డబ్బు కోసమే రచనా వ్యాసంగాన్ని చేపట్టారా?"
"మరేం ... డబ్బు కోసం కొందరు ఆటోలు నడుపుతారు, మరికొందరు ఉద్యోగాలు చేస్తుంటారు. అలాగే నేను రచనా వ్యాసంగాన్ని ప్రారంభించాను."
"అంటే డబ్బు కోసం ఏ చెత్తయినా రాసి పాఠకుల మీదికి విసరొచ్చంటారు?"
"అంటే నేను చెత్త రాస్తున్నట్టు మీరు ఫీలయినట్టేగా?"
నిర్విణ్ణురాలైంది. "అదికాదు....."
"మరి చెత్తని తెలిసీ నాకెందుకు ఫోన్ చేశారు?"
"మీ రచనలోని ప్లస్ పాయింట్స్ చెప్పాను ఇందాకనే."
"మరి ఆ ప్లస్ పాయింట్స్ మీకెలా ఉపయోగపడిందీ చెప్పాక సాహిత్యం, దాని లక్ష్యం అంటూ పత్రికా విలేఖరిలా అడుగుతారేం?"
"మీరు మీ రచనలంత సౌమ్యులు కారనుకుంటాను?" ఆమెకి ఇబ్బందిగా వుంది తేజతో మాట్లాడుతుంటే. "మీరు రచయితలా కాక పక్కా బిజినెస్ మెన్ లా మాట్లాడుతున్నారు."
"లేదు రచనా వ్యాసంగం నా బిజినెస్ అని చెప్పాను."
"అంటే డబ్బుకోసం పుంఖాను పుంఖాలుగా రాసేయడం....."
"రాయగలిగే శక్తి వున్నప్పుడు రాయడం తప్పుకాదుగా?"
"పాఠకులు చదవాలిగా?"
"చదవకపోతే నాకింత డిమేండ్ వుండేది కాదు, మీరు నాకు ఫోన్ చేసేవారు కాదు."
ఆమె మౌనంగా వుండిపోయింది.
ధర్మతేజ సీరియస్ గానే మాట్లాడుతున్నాడా లేక తనతో జోక్ చేస్తున్నాడా? నవలపై అతడి ఫోటోల్ని బట్టి మనిషి కాస్త సాత్వికుడిలా అనిపించాడు కానీ ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నాడేం?
ముఖాముకీగా వుండి మాట్లాడితే అతడి మొహంలో భావాల్ని పసిగట్టి అతడి మునసేమిటీ అన్నది అర్దం చేసుకునేదే, గానీ ఇది ఫోనయిపోయింది.
'చదవకపోతే నాకింత డిమేండ్ ఎలా వుండేది?'
ఎంత గర్వంగా జవాబు చెప్పాడు?
నిజానికి తను ఫోన్ చేసింది అతడి మాటలతో ఊరట చెందటానికి, ఓ అభిమానిగా అతని ఆలోచనల్ని పంచుకోటానికి కానీ ఇదేమిటి తొలి పరిచయమే ఇంత పేలవంగా వుంది.
"అంటే మీరు చాలా గొప్ప రచయితనన్నది మీ నమ్మకం అనుకుంటాను?"
"అయినా కాకపోయినా కనీసం నాకు నేను అలా నమ్మాలి లేకపోతే రాయలేను" అంతలోనే సబ్మిసివ్ గా మాట్లాడతాడేం?
"ఇది అణకువ కాదు మేడమ్! ఆత్మవిశ్వాసం. అది లేకపోతే అర అంగుళమైనా ముందుకు సాగలేంగా"
"ఈ జవాబు నచ్చింది."
"రక్షించారు."
"ఇంతసేపూ మీరేదో ఆపదలో వున్నట్టు ఇదేమిటి?"
"మీకు కోపం రప్పించగలిగానుగా."
అంటే....
తనను రెచ్చగొట్టాలనే అలా మాట్లాడాడా?
తనెవరో, ఏమిటో ఖచ్చితంగా తెలియకుండా ఎందుకిలాంటి ప్రయత్నము చేశాడు?
తనతోనే ఇలా మాట్లాడాడా? లేక అభిమానులు అందరితోనూ ఇలానే మాట్లాడుతుంటాడా?
"నా పేరు ఆర్తి"
"బాగుంది."
"పేరా?"
"మీ కంఠం కూడా."
" చిత్రం చూశారా!" కానీ నేను మిడిల్ ఏజ్డ్ లేడీని."
"సో వాట్! లతామంగేష్కర్ కూడా ఏజ్డ్. కానీ ఏంత స్వీట్ వాయిసో మీకు తెలుసుగా?"