Previous Page Next Page 
అభయారణ్యం పేజి 18


    బార్బేరియన్స్.... హిపోక్రిట్స్!

    "ఏమిటే?" కుదిపిందామె. "ఏమిటి ఆలోచిస్తున్నావు?"

    వ్యంగ్యంగా అంది అనాలోచితంగా "దయాకర్ అనే ఆ పెద్దమనిషి నీకు ఎందుకు దగ్గరయ్యాడా అని."

    "అర్దం కాలేదూ..... అతడి భార్యలో దక్కనిది నాలో చూసుకోగలుగుతున్నాడు."

    "రేపు నీకన్నా అందమైనది, తెలివైనది, నీకు మించి సైకలాజికల్ గా అతడ్ని ఆకట్టుకోగలది అతడికి తారసపడితే"

    "ఆర్తీ!" ఉద్వేగంగా అరిచింది. "అలా జరగదు."

    "ఎందుకని?" అవహేళనగా నవ్వింది. "ఒకవేళ జరిగిందే అనుకో, ఆపగలవా?"

    "ఎస్!"

    "ఏ అధికారంతో?"

    తొట్రుపడిందామె.

    "జవాబు చెప్పు ధీరా! రేపు దయాకర్ నిన్ను కాదని మరో ఆడదానితో సంబంధం పెట్టుకుంటే?"

    "జరగదు.... జరగనివ్వను."

    ఆమె కళ్ళలో ఎరుపుజీరల్ని చూసి నిశ్చలంగా ఆమె తల నిమిరింది ఆర్తి.
 
    "కేవలం ఒక్క మాటకే ఇంతగా ఆందోళన పడిన నువ్వు దయాకర్ ని ఎంతగా ఆరాధిస్తున్నదీ అర్దం చేసుకున్నా ధీరా! కానీ నా భయం ఒక్కటేనే. మనం సంఘంలో బ్రతుకుతున్నాం ఆడా, మగా సంబంధాలకి ఆ సంఘం కొన్ని సాంప్రదాయాల్ని నిర్దేశించింది. ఆ సాంప్రదాయాల్ని కాదంటే సాంఘికంగానే కాక చట్టపరంగా నిరోధించటానికీ కొన్ని కట్టుబాట్లని పటిష్టంగా అమలుపరిచింది. అందుకే నిన్ను చూస్తూ బాధపడుతున్నాను ధీరా! రేపు నువ్వు అనారోగ్యంతో మంచమెక్కుతావు. లేదూ అనుకోని కారణాలతో అతడు బెడ్ రిడ్డెన్ అవుతాడు. మీరు ఒకర్నొకరు కలుసుకోవాలనుకుంటారు. ఒకరి సమక్షంలో ఒకరు సేదదీర్చుకుని, మనసు విప్పుకుని మాట్లాడాలనుకుంటారు. అప్పుడు అది సాధ్యపడే విషయమేనా? నేను ఎగ్జాగరేట్ చేయండంలేదే! కట్టుకున్న భార్యకీ, కావాలనుకున్నా నా వాడని చెప్పుకోలేని ఆడదానికీ వున్న తేడా గురించి చెబుతున్నా"

    ఆమె స్వేదంతో తడిసిపోయింది.

    ఆ తర్వాత ఆమె మాట్లాడలేదు.

    నిన్న రాత్రి ఓ  హోటలు గదిలో తెల్లవార్లూ ఎంత ఆనందంగా గడిపిందీ అన్న విషయాన్నీ మరిచిపోయింది.
 
    అమాయకంగానైనా ఆర్తి చాలా బలంగా కుదిపింది.

    ఓ అరగంట తర్వాత అందామె "మా ఊరెళతాను."

    "కోపం వచ్చిందా?"
   
    "ఛఛ...నేను శలవు పెట్టింది రెండు రోజులేనే."

    ఆమె మొహంలో కాంతిలేదు. చాలా ముభావంగా అంది.

    "మరో రెండు రోజులుండొచ్చుగా."

    "ఈసారి వచ్చినప్పుడు రెండు రోజులు కాదు - కొన్నేళ్ళు ఇక్కడే వుంటాను నీ దగ్గర కాకపోయినా, ఇదే సిటీలో.

    అర్దం కానట్టు చూసింది ఆర్తి.

    "అవునే! దయాకర్ నాకిక్కడే ఓ లెక్చరర్ జాబ్ ట్రై చేస్తున్నాడు. బహుశా ఈ నెలాఖరులోగా సెటిల్ కావచ్చు. అప్పుడు మనం తరచూ కలుసుకోవచ్చుగా."

    ఆమె వెళ్లిపోయింది.

    కాదు - ఓ ప్రమాధభూయిష్టమైన ఊబిలోనే బ్రతకటానికి నిర్ణయించుకున్నానని తెగేసి చెప్పింది.

    మరో గంటవరకూ  తేరుకోలేకపోయిన ఆర్తి నిస్త్రాణగా బెడ్ మీదికి చేరి బడలికగా కళ్లు మూసింది.
 
    మనసు పొరల్లో ఏ వాక్యాల రాపిడో ధ్వనిగా - ప్రతిధ్వనిగా మారి కలవరపెడుతూంది.

    "మొన్న నీ సమక్షంలో నేను కంటతడి పెట్టుకుంటే నువ్వేం చేశావో గుర్తుందా ప్రియా?

    నా అరచేతికి సరిగ్గా పండని గొరింటాకు గురించో, పండక్కి కొనని పరికిణీ గురించో నాన్న దగ్గర ఆశ్రుశిక్తంగా నిలబడితే నాన్న కూడా నా కళ్లు నీలానే తుడిచేవాడు."

    అందుకే....

    నువ్వు నమ్మలేవుగానీ నీలో నేను అప్పుడప్పుడూ నాన్నని  చూసుకుంటుంటాను...."

    ఉద్విగ్నంగా పైకి లేచింది ఆర్తి.

    వెనువెంటనే టేబుల్ మీదున్న 'తేజ' నవలని అందుకుంది.

    మూడో పేజీలో వున్న అతడి అడ్రసు చూసి అతడున్నది చాలా దగ్గరలో అనిపించినా అయిదు నిమిషాలలో టెలిఫోన్ డిపార్ట్ మెంటు సహకారంతో ఫోన్ నెంబరు సంపాదించగలిగింది.
 
    మనసులో అదోలాంటి అలజడి.

    మాట్లాడతాడా?

    లేక.....

    పెడసరంగా తిరస్కరిస్తాడా?

    చేతులు వణుకుతున్నాయి.

    నిగ్రహించుకోలేకపోయింది ఆర్తి.



                       *    *    *    *


       
    "హల్లో" వినిపించింది  ఆవలి వైపునుంచి.

    ఆర్తిలో సన్నటి తొట్రుపాటు "మే ఐ స్పీక్ టు మిస్టర్ తేజా!"

    "స్పీకింగ్!"

    మార్దవంగా వినిపించింది.

    ఆమె గుండె లయతప్పింది. నిశ్సబ్దంగా నినదించే ఒక సౌరభంలా, రంగుల స్వప్నాల సారాంశాలను విరజిమ్ముతూ పాఠకుల నాడిని పట్టుకుని ఆడుకునే పవనంలా తన చుట్టూ వున్న మనుషుల యోగక్షేమాలను తెలుసుకునే  పలకరింపులా, అక్షరాల చలనంలా, ప్రభాత కిరణంలా.. .ఇప్పుడు  వినిపించింది అతడి గొంతే అని తెలియగానే ముందు ఆర్తి మూగపోయింది.
 

 Previous Page Next Page