ఆర్తి కళ్లు అరమోడ్పులయ్యాయి.
తను మిడిల్ ఏజ్డ్ అని అబద్దం చెప్పినా నమ్మేశాడు. పరిచయానికీ స్నేహానికీ ఏజ్ తో సంబంధం లేనట్టు సున్నితంగా, సంస్కారవంతంగా తన మనసు గెలుచుకునే....
ఛిఛి! ఏమిటిలా ఆలోచిస్తుంది?
" మౌనంగా వుండిపోయారేం?" అడిగాడు తేజ.
"అహఁ... మీ రచయితలకి రాయటం మాత్రమేకాక మాటకారి తనమూ పుష్కలంగా వుంటుందనుకుంటాను."
"ఎందుకలా అనిపించింది?"
"అభిమానుల్ని సైకిలాజికల్ గా డీల్ చేయటం మీకూ అలవాటేనని అర్దమైంది కాబట్టి."
"మీకూ అంటూ ఎంపటికల్ గా చెప్పారు.. .ఇంతకుముందు మరే రచయితతోనయినా మాట్లాడారా?"
ఆర్తి వులిక్కిపడింది. "లేదు ఏ రచయితకయినా ఫోన్ చేసి మాట్లాడటం నాకిదే తొలిసారి."
"కాకపోయినా నాకభ్యంతరం లేదు."
"మరి అసూయపడుతున్నట్టు ఇందాక అలాంటి ప్రశ్న వేశారేం?"
"మార్కెటింగ్ మెంటాలిటీ మిస్ ఆర్తీ...."
"మిసెస్ ఆర్తీ" కరెక్ట్ చేసింది.
"ఓ. కె. మిసెస్ ఆర్తీ!" ఇందాకటి వాక్యాన్నీ పొడిగిస్తూ అన్నాడు - "అలాంటి మెంటాలిటీ వున్న రచయితని కాబట్టే నా ప్రోడక్ట్ కే మార్కెట్ లో మంచి గిరాకీ వుండాలని కోరుకుంటూ వుంటాను"
"అప్పుడు స్థాయి పెంచుకుని రాయొచ్చుగా?"
"అర్దం చేసుకునే స్థాయి పాఠకులకీ వుండాలిగా!"
"పాఠకుల్ని అంత తక్కువగా అంచనా వేయకండి."
"అలా సీరియస్ అయిపోకండి ఆర్తిగారూ! నా స్థాయి తక్కువని మీకనిపిస్తే టాప్ స్థాయినీ, రస్కిన్నీ చదవండి."
క్షణమాగి "ఇక ఫోన్ పెట్టేయనా?" అన్నాడు.
"మాట్లాడటానికి బోర్ గా వుందా?"
"అదేం కాదు... కాస్త బిజీగా వున్నాను."
"అలా అనిపించడం లేదు మిస్టర్ తేజా! కావాలని నన్ను అవాయిడ్ టేస్తున్నట్టుగా వుంది."
"చూడండి మిసెస్ ఆర్తీ! మీతో గంటలతరబడి మాట్లాడతాను.. కాకపోతే ఫోన్ లో కాదు."
"మరి?"
"వీలుచూసుకుని మా ఇంటికి రండి."
"మీరే రావచ్చుగా?" అసంకల్పితంగా నోరు జారింది ఆర్తి. "మరేం లేదు.. నేను వీల్ చైర్లో నుంచి కదల్లేను."
ఇంకో అబద్దాన్ని వెంటనే చెప్పింది.
"ఓ. కె. వీలుచూసుకుని వస్తా.. .మీ ఫోన్ నెంబరివ్వండి."
"రావటానికి ఇంటి అడ్రస్ అవసరంగాని ఫోన్ నెంబరెందుకు?"
"ఫోన్ నెంబర్ తెలిస్తే మీ అడ్రస్ తెలుసుకోవడం కష్టం కాదుగా?"
చెప్పింది నోటికొచ్చిన నెంబరు.
ఫోన్ క్రెడిల్ చేసిన ఆర్తి నిశ్చలంగా కూర్చండిపోయింది.
ఏదో ఫోన్ నెంబరు చెప్పి తను తప్పు చేసిందా?
ఒక ప్రముఖ రచయితతో పరిచయం కోసం ఆలోచించి, సాహసం చేసి ఫోన్ లో మాట్లాడటందాకా వెళ్ళింది పోట్లాటకి దిగిందే తప్ప తనకు నచ్చిన నవలలోని అందమైన వాక్యాల గురించి అసలు చేర్పించలేకపోయిందేం?
ఎందుకిలా జరిగింది?
కావాలని గొడవపడినట్టు ప్రవర్తించిందేం?
ఓ అరగంట అసహనంగా గడిపిన ఆర్తి మధ్యాహ్నం కావస్తుండగా మళ్లీ తేజాకి ఫోన్ చేసింది.
"హల్లో!" తేజా కంఠమే.
"నేనే."
"ఓహ్ మిసెస్ ఆర్తీ! చెప్పండి."
"అప్పుడప్పుడు మిమ్మల్నిలా ఫోన్ తో డిస్టర్బ్ చేయడం మీకు అభ్యంతరమా?"
"డిస్టర్బ్ చేయడమే అయితే అభ్యంతరమే."
"చర్చించడమైతే?
"సంతోషంగా వుంటుంది. "
"అసలు ఉదయం మీకు ఫోన్ చేసింది పోట్లాటకి కాదు."
"అది పోట్లాటెలా అవుతుంది?"
"మరి?"
"మాట్లాట."
"అంటే?"
"పోటీగా కలియబడితే పోట్లాట. మాటలతో దాచి చేసుకుంటే మాట్లాట."
"తెలుగులో అలాంటి పదం వుందా?"
"అందాకా వుందనుకుందాం"
నవ్వేసిందామె.
"ఇప్పుడింకో విషయం తెలిసింది" అన్నాడు.
"ఏమిటీ?"
"మీ నవ్వు కూడా బాగుంటుందని."
ఆర్తి బిడియంతో కుంచించుకుపోయింది.
పరిచయమైన కొన్ని గంటలలోనే ఎందుకిలా మాట్లాడుతున్నాడు? తను కోరి అతడి వెంటపడుతున్న భావమూ లేక అతడి స్వభావమే అంతా?
"మీరంత ఫీలవ్వాల్సిన అవసరం లేదు" తేజా కంఠం వినిపించింది.
"ఫీలవడమేమిటి?"
"మీ గొంతు బాగుందన్నాను ప్రొద్దుట. ఇప్పుడు మీ నవ్వు బాగుందన్నాను. అంతమాత్రం చేత నేను చనువు తీసుకున్నానని మీరు ఫీలవనక్కర్లేదు. బాగున్నది బాగుందని చెప్పటం నాకు అలవాటు. పైగా మీరు ఏజ్డ్ లేడీ అయ్యుండి టీనేజ్ గాళ్ లా కంగారుపడాల్సిన అవసరం లేదు."