పుర్రెకి టేబుల్ కి కనెక్షన్ చేస్తూ వైర్లు లేవు. అసలేమీ కనెక్షన్ లేదు.
ఆమెకిది విస్మయం కలిగించింది.
తన అంచనాలన్నీ తారుమారు కావడం నిరాశ కల్గించింది.
అప్పుడొచ్చింది ఆమెకు అనుమానం.
మానవాతీత శక్తులు వున్నాయా -అని- ఆ భావంతోపాటు వచ్చిన భయాన్ని నొక్కిపట్టి చేతిలోని పుర్రెకేసి పరీక్షగా చూసింది.
చాలా పురాతనమైంది. నుదురు పక్కనుంచి దవడ భాగం పక్కగా పగులు చూసింది చేతిలో తేలిగ్గా తిరుగుతూంది అటూ ఇటూ.
దానిలో ఏ రహస్యమూ లేదని ఆమె పూర్తిగా నిశ్చయించుకొని, తిరిగి టేబిల్ మీద పెట్టబోతుంటే అప్పుడు వినిపించింది చిన్న నవ్వు.
పుర్రె లోంచి -సన్నగా చాలా సన్నగా.
గొంతులోంచి రాబోయిన కేకని అతి కష్టంమీద ఆపుకొంది. కాని వళ్ళంతా చిగురుటాకులా వణికిపోసాగింది. ఒక్కసారిగా పుర్రె చేతుల్లంచి నేలమీద పడి శబ్దం చేసింది.
నవ్వు పుర్రెలోంచే -నిశ్చయంగా పుర్రెలోంచే వచ్చింది. ఆమె స్థాణువై -కళ్ళు పెద్దవి చేసి అలాగే దానికేసి చూడసాగింది.
అల తరువాత అల వచ్చినట్టు మాటలు ఆపుర్రెలోంచి తరంగాలై ఆ గదిలో వినిపించినయ్.
"మానవులకు అతీతమయిన శక్తి ఒకటుందని నమ్ము దాన్ని ప్రచారం చెయ్యి. నేనే దెయ్యాన్ని సకల చరాచర సృష్టి స్థితి లయకారుణ్ని నేనే"
ధ్వని ప్రతిధ్వని మిశ్రమాల్తో బొంగురు గొంతులో ఆ మాటలు ఎంత ధైర్యవంతులైన వారినయినా దిగజార్చేటట్టు వున్నాయి. కాళ్ళ ముందు పుర్రె వికృతంగా వుంది.
ఆమెకి ఏడుపు వచ్చింది
ఆమె వయసెంతనీ? ఇరవై ఇంకా నిండాలేదు. అసలు అంతదూరం ధైర్యంగా వచ్చిందంటేనే గొప్ప.
ఆమె చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవ సాగింది. గదిలో వాతావరణం కొద్దికొద్దిగా చల్లబడడం ఆమె గమనించలేదు.
నెమ్మదిగా స్పృహ తప్పింది.
***********
"రండి" అన్న మాటలతో ఆమె కళ్ళు విప్పింది. కళ్ళు విప్పుతూనే చుట్టూ ఆశ్చర్యంగా చూసింది. వరుసగా కుర్చీలు వేసి వున్నాయి. సిద్దేశ్వరీ దేవిని తమ ప్రశ్నలు అడగటానికి కూర్చున్న అతిధులు ఆ కుర్చీలలో కూర్చుని వున్నారు. ఆమె ముందు కూర్చున్న వారు లోపలినుంచి వస్తున్నారు. వాళ్ళ మొహాల్లో దేవి పట్ల గౌరవం, తమ ప్రశ్నకి సమాధానం తెలుసుకున్న ఆనందం వున్నాయి. వెనక్కి తిరిగి తిరిగి నమస్కారాలు చేసుకుంటూ వెళుతున్నారు.
"మీ వంతు వచ్చింది రండి"
ఆమె తలెత్తి ఎదుటి వ్యక్తి వైపు చూసింది. ఎదురుగా చక్రవర్తి నిలబడి వున్నాడు. అతడే - తనను లోపలికి తీసుకు వెళ్ళినవాడే.
.....ఆమెకంతా అయోమయంగా ఉంది. తను మళ్ళీ యిక్కడికెలా వచ్చింది? లోపలికి వెళ్ళడం పుర్రె మాట్లాడం -అంతా భ్రమా?
ఆమె వాచీ చూసుకుంది.
ఎనిమిది ఇరవై. అంటే తను వచ్చి అరగంటపైగా గడిచిపోయిందన్న మాట కుర్చీ వెనక్కివాలి నిద్రపోయినా తను? నిద్రలో కలగన్నదా?
"సిద్ధేశ్వరీ దేవి మీ కోసం ఎదురు చూస్తున్నారు. అతిథికీ మద్య ఎక్కువ వ్యవధి వుండడం ఆమె యిష్టపదు" అంటున్నాడు చక్రవర్తి.
అదే గొంతు అదే ఆకారం. ఎలా తను కలలో ఇదే ఆకారాన్ని చూసింది? తనకి ఏమయినా మానవాతీత శ్కతులు అలవడుతున్నాయా? క్లెయిర్ వాయెన్స్?
తన ఎదురుగా చక్రవర్తి అసహనంగా కదలడం ఆమె గమనించి వూహల్లోంచి బైటకొచ్చింది. చుట్టూ వున్నవాళ్ళు తమనే గమనించి సిగ్గుపడి, చప్పున అతడిని అనుసరించింది.
అదే వరండా -అదే మసక చీకటి.
ఇద్దరూ ముందు గదిలోకి ప్రవేశించారు. అక్కడో రిజిష్టరు తన కలలో చూసిన లాటిదే వుంది.
"మీరు మీ పేరు వ్రాయండి"
ఆమె చేతిలోకి పెన్ తీసుకుంటూ తలెత్తి "కొంచెం మంచినీళ్ళు దొరుకుతాయా ప్లీజ్" అన్నది.