Previous Page Next Page 
కొత్తనీరు పేజి 19


                                           4
    
    అనుకున్న శుభముహూర్తానికి ఉష పెళ్ళి నిర్నిఘ్నంగా, అతి వైభవంగా చేశాడు రామం. ఒక్కగానొక్క పిల్ల. పెళ్ళికి డబ్బు నీళ్ళలా ఖర్చు చేశాడు.
    ఇదే తమ మొదటి మనవరాలి పెళ్ళి అవడంచేత పార్వతమ్మ, జగన్నాథంగారు చాలా సంబరపడ్డారు. కొడుక్కి సలహాలు యియ్యడానికి వారంరోజులు ముందుగానే ఇద్దరూ మద్రాసు చేరుకున్నారు. మనవరాలికి నూటపదహార్లు, ఓ పట్టుచీర చదివించారు. పెద్ద అన్నగారు చేస్తున్న మొదటి శుభకార్యం అని చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ పిల్లాపాపతో సహా వచ్చారు, ఓ వరం రోజులు సెలవు పెట్టుకుని ఈవిధంగా పిల్లలందరూ కన్నులపండువుగా ఒకచోట కలవడం జగన్నాథంగారికి, పార్వతమ్మకిఎంతో సంతోషం అయింది.
    ముహూర్తం అయాక, భోజనాలకు యింకావ్యవధి ఉండడంతో తెల్లవారిలేచిన జగన్నాథంగారు కాస్త నడుం వాల్చుకుందుకు తన గదిలో పరువు చుట్టకు చేరగిలపడ్డారు. దేనికోసమో గదిలోకి వచ్చిన పార్వతమ్మ, ఆయన ఒంటరిగా ఉండడం చూసి "ఏమండీ.....విన్నారా శకుంతల మళ్ళీ నెల తప్పిందిట!.....అవ్వ!.....అది సిగ్గుతో చితికిపోతూంది, పాపం, నలుగురిలో తలయెత్తుకోలేక!" అని దగ్గరగావచ్చి చెవిలో ఊదింది.
    "ఆఁ!...." అని తెల్లబోయి చూశారాయన. "నిజమేనా? యిప్పుడు.....యిన్నేళ్ళయినా యింకా కానుపులా!..... ఛీ.....ఛీ......అతనికి బుద్ది లేదు. జ్ఞానం లేదు! మూర్ఖుడు!" పళ్ళు కొరుకుతూ అన్నారు.
    "ఊరుకోండి....అది అసలే ఏడుస్తూంది, ఏమి టీ ఖర్మం అని!"
    "హుఁ.....ఇలాంటి మొగుళ్ళు వుంటే ఏడుపుకాక మరేమిటి? పెళ్ళీడుకొచ్చిన పిల్లని యింట్లో పెట్టుకుని.....నలభై రెండేళ్ళున్నాయి దానికి.....ఇప్పుడు మళ్ళీ కానుపా?! మనిషికి సిగ్గు, శరం ఉండక్కరలేదూ! పోనీ కట్టుకున్నదానిమీద కాస్త దయాదాక్షిణ్యాలయినా ఉండవద్దూ.....ఛా.....ఉత్త మూర్ఖుడు, ఏం పెట్టి పోషిస్తాడు యీపిల్ల లందరిని? ఉన్నవాళ్ళు చాలరన్నట్టు ఇంకా కంటున్నాడు!" అల్లుడి మీద కారాలు మిరియాలు నూరుతూ అన్నారాయన.
    "అదే వచ్చిన గోల! దమ్మిడీ ఆస్తి లేదు! సంపాదన అంతంత మాత్రం! పిల్ల పెళ్ళికి ఎదిగి కూర్చుంది. ఇంకా మగపిలలల చదువులు. పెద్దపెద్ద ఖర్చులు అన్నీ అలాగేఉన్నాయి. ఏధైర్యంతో యీయన పిల్లల్ని కంటున్నాడో నాకు బోధపడడంలేదని అది ఒకటే గోల! అప్పుడే ఆయనకి ఏభయి వస్తున్నాయి.....ఇంకా యిప్పుడు పిల్లల్ని కని ఎలా పెంచుదామనో అయన ఉద్దేశం అంటూ గోల పెడుతూంది...." పార్వతమ్మ విచారంగా అంది.
    "చదువుకున్నవారిలో కూడా యింత మూఢత్వం ఏమిటో! ఇదివరకు కాలంలో అంటే పోనీ ఏదో అనుకోవచ్చు. ఈ రోజుల్లో రకరకాల సంతాన నిరోధక సాధనాలు ఉండగాకూడా యిలా పిల్లల్నికంటూబాధపడే మూర్ఖులుండగా దేశం బాగుపడాలంటే ఎలా బాగుపడుతుంది? కుటుంబ నియంత్రణమో అని ప్రభుత్వం గోలపెడుతున్నా చదువుకున్నవారే యిలా అశ్రద్ధచేస్తూంటే దేశం గతి ఏం కాను!.....ఆపరేషనేదో చేయించుకు ఏడవకూడదూ!"
    ఆరుగురు పిల్లలవునా?- ఆఖరి పిల్ల పుట్టినప్పటినుంచీ, అంటే ఎనిమిదేళ్ళనుంచీ, అది పోరుతూనేవుంది. అతన్ని ఆపరేషన్ చేయించుకోమని.....తను చేయించుకుంటానన్నా విన్నాడుకాదు. తరవాత రెండుమార్లు కడుపు పోయింది. ఇప్పుడు మళ్ళీ యిది. అది చూస్తే కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని ఉంది....."
    "మరెలా ఉంటుంది! అన్నీ చేరి పదికానుపు లయాయి. జవసత్వాలుడిగాక కానుపువస్తే ఎలావుంటుంది? ఏమిటో దాని జాతకం, మొదటినుంచీ వక్రంగానే నడుస్తూంది. ఏవిషయంలోనూ అది ఒక్కనాడు సుఖపడలేదు....." నిట్టూరుస్తూ అన్నారు జగన్నాథంగారు.
    "ఏమిటో అతని మూర్ఖత్వం ఎవరికీ అర్ధంగాదు. ఇది చెపితే అసలు బొత్తిగా వినడు. పెళ్ళాం, బిడ్డల సౌఖ్యం తనకక్కరలేదు- తను, తన సుఖంతప్ప! అదేమన్నా అంటే దానిమీద విరుచుకుపడతాడు....."
    "ఎన్నోనెల? దాన్ని చూసి అనుమానించాను గాని.....ఇప్పుడు యింకా కానుపేమిటి అనుకున్నాను...."
    "ఐదోనెల వెళ్ళిందిట. అసలు మొన్నమొన్నటివరకు అది యిదే అనుకోలేదుట? ఒంట్లో బాగుండక, నెలలు సరిగా అవకుండా వస్తూంటే? ఆడదానికి బహిష్టు పోయేముందు యిలాగే వుంటుందని ఎవరో అంటే కాబోలని సంతోషించిందట. తీరా క్రితం నెల అనుమానం తగిలి డాక్టరు చేత చూపించుకుంటే నెల తప్పిందన్నదిట పాపం. అప్పటినుంఛీ యింట్లో పిల్లలకి కూడా మొహం చూపించలేక సిగ్గుపడిపోతూంది. అసలు యీ పెళ్ళికి వచ్చి నలుగురి ఎదుట పడడానికి మొహం చెల్లక, అతన్ని వెళ్ళమంటే వెళ్ళనన్నాడట. అన్నయ్య చేస్తున్న మొదటి శుభకార్యానికి రాకపోతే బాధపడతాడని తప్పని సరిగా వచ్చిందిట. వచ్చిన దగ్గిరనుంచీ గదిలోనే పాతుకు పోయింది. ఆ ముహూర్తం మాత్రం ఎలాగో చూసింది. నేను అనుమానపడి పదిసార్లు అడగ్గా చెప్పింది."
    "అతను రావలసింది!.....వస్తే మొహం వాచేట్టే చివాట్లుపెట్టేవాడిని."
    "ఆ....ఇదివరకు ఒకసారి అయిందిగా భాగోతం! మీకు తన సంగతి అనవసరమన్నాడు గదా!.....అయినా ఒకరు చెపితే వినే రకమా, అతని కెంతతోస్తే అంతేగాని....."
    "ఇంకా భోజనాలకి ఎంత ఆలస్యం ఉందేమిటి? పన్నెండున్నర అయినట్టుంది!"

 Previous Page Next Page