Previous Page Next Page 
మహిమ పేజి 18


    ఆ సమయంలో అన్వర్ అతనికి పర్సనల్ డ్రైవర్ కమ్ అటెండెంట్ గా వినోద్ కి ఎప్పుడేం కావాలో చూసుకుంటూ అతనిని అంటిపెట్టుకునే మనిషి అయ్యాడు. అన్వర్ బతకనేర్చినవాడు. అయ్యగారి సంగతి, ఇంటి సంగతి క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి అట్టే సమయం తీసుకోలేదు. అమ్మాయిలని చూడగానే అయ్యగారి ఆకలిచూపులు అర్థం చేసుకున్నాడు. అయ్యగారి మనసు దగ్గరవడానికి, అతని ప్రాపకం సంపాదించడానికి దగ్గర దారి దొరికిపోయింది. వినోద్ మంచితనం, ఇంట్లో అతని భార్య ధోరణి చూశాక అన్వర్ కి అయ్యగారి మీద ఎనలేని జాలి, అభిమానం పొంగింది. వినోద్ పిరికితనం అర్థం అయింది. కాస్తంత చొరవ తీసుకోలేని అతనికి సహాయపడాలనుకున్నాడు. కానీ, ఎలా అన్నది అతనికి అర్థం కాలేదు ముందు.
    ఒకరోజు శిల్ప అనే అమ్మాయి స్క్రీన్ టెస్ట్ కి వచ్చి సెలెక్ట్ కాలేదు. నిరాశ, నిస్పృహ, ఏడుపు ఒక్కటే తరువాయి అన్నట్టు మొహం నల్లబడి కంటతడితో నిస్సహాయంగా చూస్తూ లిఫ్ట్ లో ఎక్కిన శిల్పని చూశాడు. అతనికి ఆ అమ్మాయిని చూస్తే సంగతి తెలిసిపోయింది. అప్పటికి ఏణ్ణర్థం అయిందేమో కంపెనీలో చేరి. ఇలా ఎంతో ఆశతో వచ్చి రిజెక్ట్ అయిన అమ్మాయిలు నిరాశ తట్టుకోలేక కళ్ళనీళ్ళతో వెళ్లడం చూశాడు అన్వర్. అందులో కాస్త లేనింటి అమ్మాయిలు, అందాన్ని నమ్ముకుని వచ్చినవాళ్లు ఆశాభంగం అస్సలు తట్టుకోలేరు. ఈ అమ్మాయి బాగానే ఉంది. పెద్ద కళ్ళు, మంచి ఫిగరు. రంగు చామనచాయ అయినా స్మార్ట్ గానే ఉంది. మరి ఏమయిందో అనిపించింది అన్వర్ కి. "ఏమిటి సెలెక్ట్ కాలేదా?" చనువుగా అడిగాడు. ఆ అమ్మాయి అన్వర్ వంక ఓ చూపు చూసి లేదన్నట్టు తల ఊపింది.
    "అరే, అదేమిటి ఇంత చక్కగా ఉన్నావు. ఎవరా రిజక్ట్ చేసింది సుధాకర్ సారా... ఆయనో తిక్కలోడు..." అంటూ ఏదో ఆలోచన తట్టినట్లు... "మా సార్ చూసుంటే రిజెక్ట్ చేసేవారు కాదు" అన్నాడు. ఆ అమ్మాయి కళ్ళలో ఆశ.
    "మీ సారా? ఎవరు...?" అంది కాస్త ఆశ్చర్యపడుతూ.
    "మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ సార్ ఆయనే కదా, ఈ సెక్షన్ కు బాస్".
    శిల్ప కళ్ళల్లో మెరుపు... "ఆయన చూస్తారా మాలాంటి వాళ్లని".
    "ఇదిగో నీ పేరేమిటి... శిల్ప. సరే, నీ ఫొటోలు, నీ బయోడేటా అవి ఉన్నాయి గదా, అవి నాకియ్యి. నీ ఫోన్ నెంబరుందా, నేనివాళ మా అయ్యగారికి చూపిస్తా. రేపు ఇదే టైముకి రా... సరేనంటే మిగతావి చూద్దాం. లేదంటే నీ ఫైలు తీసుకెళ్లచ్చు" ఆ మాత్రం దానికే శిల్ప సంబరపడిపోతూ "నిజంగా నువ్వు చెపుతావా? నీ మాట వింటారా?"
    "వినోద్ సార్ పర్సనల్ అసిస్టెంట్ కమ్ డ్రైవరు అన్నీ నేనే. చెప్పిచూస్తా. నీ అదృష్టం పరీక్షించుకో..." అని ఆశ చూపాడు.
    "థాంక్స్ అన్నా! నాకీ ఉద్యోగం ఎంతో అవసరం. నాన్న లేరు. అమ్మ ఒక్కర్తే. చిన్న జాబ్ చేస్తుంది. నాకీసాయం చేస్తే నీ మేలు మర్చిపోను" దండం పెడుతూ అంది.
    "చూస్తానన్నాగా... హోప్ ఉంటే ఫోన్ చేస్తా. లేదంటే వచ్చి నీ ఫైలు తీసుకెళ్లు" అని ఆమె అందించిన ఫైలు తీసుకున్నాడు. అన్వర్ దగ్గరనుంచి ఫోన్ రాగానే ఆఘమేఘాల మీద వచ్చినట్టు వాలిపోయింది శిల్ప. "ఏమన్నారు? నన్ను సెలెక్ట్ చేసుకుంటారా? నాకు ఛాన్సు ఇస్తారా?" అంది ఆరాటపడిపోతూ. "అన్నా, ఎలాగైనా పని జరిగేట్టు చూడు".
    "చూసు శిల్పా... నా ప్రయత్నం నేను చేశాను. ఇంక చెయ్యాల్సింది నువ్వే. సార్ ని ఎలా మెప్పిస్తావో నీ చేతుల్లో ఉంటుంది".    
    "అంటే నేనేం చెయ్యాలో చెప్పు... అలా చేస్తాను".
    "సార్ ని మెప్పించు. నీకు మంచి భవిష్యత్తు కావాలంటే, గుర్తింపు ఉండాలంటే సార్ చేతుల్లో ఉంటుంది. ఆయన ఇష్టమే ఫైనల్".
    సగమే అర్థమైన శిల్ప తల ఆడించింది.
    సార్ ని మెప్పించడమంటే ఏమిటో తెలియకుండానే, ఆమె ప్రమేయం లేకుండానే, కాదు లేదు అని చెప్పే వీలు లేకుండానే అన్ని ఏర్పాట్లు చేసేశాడు అన్వర్. ఓ పక్క బెరుకు, భయం, లేదంటే ఉద్యోగం రాదు. వద్దంటే పొమ్మంటారేమో... ఆమె ఏదీ నిర్ణయించుకోలేని స్థితిలో ఉండగానే సార్ ని మెప్పించేసింది. అటు వినోద్ కి ఆశ, కోరిక, ఉద్రేకం, అన్నీ ఉన్నా మొదటి మెట్టు ఎక్కడమే కష్టమయింది. ఓసారి ధైర్యం చేసి కాలుపెట్టాక, ఎలా ఎక్కాలో, ఎక్కి తనకు కావాల్సింది ఎలా పొందాలో, ఏం చేస్తే అమ్మాయిలు లొంగుతారో... అన్ని కిటుకులు, పాఠాలు అతి త్వరలోనే వంటబట్టించుకుని, ఆ రంగంలో ప్రావీణ్యం సంపాదించడానికి అన్వర్ ఇచ్చిన ప్రోత్సాహం, చేసిన సాయంతో అతని కుడిభుజం స్థాయికి ఎదిగిపోయాడు అన్వర్. ఇల్లు, సంసారం, సమాజంలో పరువు, ప్రతిష్ఠ ఏదీ భంగపడకుండా తనకు కావల్సింది ఎలా అందిపుచ్చుకోవాలో, తన తృష్ణని ఎలా తీర్చుకోవాలో నేర్చేసుకున్నాక బెరుకు, భయం పోయాయి. అంతే... అతిసహజం అన్నట్టుగా, ఇంట్లో వంట బాగులేకపోతే, చక్కగా రుచిగా వండలేని అసమర్థ భార్యతో గొడవ పడేకంటే, కావల్సింది అప్పుడప్పుడు హోటలుకెళ్లి ఇష్టంగా తినిరావడంలో తప్పేమిటి అన్నంత సహజమైంది ఆ అలవాటు. దానికితోడు అమ్మాయిలందరూ అందుబాటులో ఉండే ఆఫీసు అవడం మరింత వెసులుబాటు ఇచ్చింది. బాగుందనుకున్న అమ్మాయిని ఎరవేసి పట్టడం అన్వర్ వంతు. ఏర్పాట్లు అన్వర్ వి. అనుభవం వినోద్ ది. ఇష్టపడని వాళ్లని బలవంతం ఏముంది అప్లికేషన్ రిజెక్ట్. భవిష్యత్తుని అందంగా ఊహించుకునే అమ్మాయిలు, ఇష్టపడో, దారిలేకో, ఏం పోయింది, ఎవరికి తెలుస్తుంది అని ధైర్యసాహసాలు ఉన్నవారినే ఎంచేవాడు అన్వర్. ఏడాది తిరిగేసరికి వినోద్ ఆ రంగంలో ఆరితేరాడు. ఆఫీసులో కాస్త గుసగుసలు మొదలయ్యాయి. బాస్ గారి లీలలు కొందరు అమ్మాయిలలో ఆశ నింపితే, మరికొందరు బెరుకుగా తప్పుకుంటూ వెళ్లేవారు. ఆ గుసగుసలు అవినాష్ జైన్ దగ్గరికి చేరాయి. మొదట ఆయనలో కొడుకు చేస్తున్న పని రేపు ఏం కొంపముంచుతుందో, ఏ అమ్మాయన్నా ఈ గుట్టు రట్టు చేస్తే కంపెనీ పరువు, ఇంటి ప్రతిష్ఠ దెబ్బతింటుందన్న భయం కలిగించాయి. కొడుకుతో మాట్లాడి గట్టిగ వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినా, ఓ పక్క వినోద్ ని చూస్తే ఆయనకి బాధగానే ఉండేది. పాపం జీవితంలో వాడు ఏం సుఖపడ్డాడు? ఈ కుటుంబం కోసం, కంపెనీ కోసం వాడి భవిష్యత్తు తాకట్టు పెట్టాడు. డబ్బుకోసం తన ఆనందాన్ని బలిపెట్టాడు. ఒక్కరోజైనా భార్యతో ఏం సుఖపడ్డాడు? భార్య భర్తగా ఏం గౌరవం ఇచ్చి వాణ్ణి సుఖపెట్టింది అన్న బాధ ఉంది ఆయనలో. భార్యతో ఎన్నోసార్లు తన మనసులో బాధ చెప్పేవాడు. 'అవునండి, వెర్రినాన్న... పాపం అందరికోసం వాడు బలయ్యాడు. అందం లేకపోయినా, అణుకువ అన్నా ఉంటే సుఖపడేవాడు'. తల్లిదండ్రులిద్దరూ కొడుకుని చూసి బాధపడడం మినహా ఏం చెయ్యలేకపోయారు. ఇప్పుడు వాడికి కావల్సిన ఆనందాన్ని, కోల్పోయిన సుఖాన్ని అనుభవించనీ అనుకుంది ఆయన తండ్రి మనసు. కొడుకు బదులు అన్వర్ ని పిలిచి హెచ్చరించాడు. 'ఈ విషయం బయటపడితే నిన్ను పాతరేస్తా. జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి' అన్నాడు. అన్వర్ అర్థమైనట్టు వినయంగా తల ఆడించాడు.

 Previous Page Next Page