"ఆల్ రైట్...! ఇంక పడుకోండి! మీకిష్టంలేని పనులు చేయించటం నాకూ ఇష్టంలేదు... రేపు ఉదయమే మనం వెళ్ళిపోదాం."
అతను కలిసివున్న మంచాల్ని ఎడంగా లాగి తన మంచంమీద పడుకున్నాడు.
సావిత్రికి అర్ధమయిపోయింది.
బహుశా తామిద్దరూ ఇకనుంచి ఒకరికొకరు ఏమీకారు__!
మిగిలిన కొద్ది గంటలూ ఇద్దరూ నిద్రలేకుండానే గడిపారు. తెల్లారుతుండగా అతను లేచి బట్టలు సర్దుకుని రడీ అయ్యాడు. సావిత్రి కూడా రడీ అయ్యాక టాక్సీలో బయల్దేరారు.
సాయింత్రానికల్లా హైదరాబాద్ చేరుకున్నారు.
దారిలో పొడిగా అవసరమైనప్పుడు మాట్లాడుకోవటం తప్పితే__ఇద్దరిమధ్యా అదివరకటి సన్నిహితత్వమే లేదు.
ఇల్లు చేరుకోగానే మంచంమీదకు వరిగిపోయిందామె. ఉప్పెనలా పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా అణచుకుంటోంది. మర్నాడు ఉదయం పదిగంటలయినా లేవబుద్ధి కాలేదు. తను అతనితో చేయబోయే కాపురం కోసం కొన్న వస్తువులన్నీ వెక్కిరిస్తున్నట్లు కనబడుతున్నాయి.
సాయంత్రం లేచి వంట చేసుకోసాగిందామె.
అతని గదికి తాళంవేసే వుంది. ఉదయం వెళ్ళిన వ్యక్తి తిరిగిరాలేదు...మర్నాడు ఉదయం ఇంటి ఓనర్ వచ్చాడు.
"శ్రీరామ్ గారు ఇల్లు ఖాళీ చేశారు...! మరి మీ మొత్తం ఇల్లు తీసుకున్నా సరే...లేదా మరో ఇల్లు చూసుకోండి!"
సావిత్రి నిర్ఘాంత పోయింది.
"అతనింత త్వరగా తెగతెంపులు చేసుకుంటాడనుకోలేదు.
"ఎప్పుడు ఖాళీ చేశారు?"
"రాత్రి..."
సావిత్రికి కళ్ళవెంబడి నీళ్ళు తిరిగాయి.
తన మొఖం చూడకుండా వెళ్ళిపోయేంత పాపం చేసిందా తను__? లేక తనకు మొఖం చూపించలేక వెళ్ళిపోయాడా?
"సరే...నేనూ ఖాళీ చేస్తాను...ఫస్ట్ వరకూ ఉండవచ్చుకదా?"
"అవును కానీ ఫస్ట్ తర్వాత ఒక్కరోజు కూడా ఉండకూడదు. వేరేవాళ్ళు వచ్చేస్తారు."
అతను వెళ్ళిపోయాడు.
వారంరోజులపాటు ఆఫీస్ కెళ్ళలేకపోయింది.
ఆరోజు శాంత వచ్చింది ఆఫీస్ నుంచి.
సావిత్రిని చూడగానే ఆశ్చర్యపోయిందామె.
"ఏమిటే...అలా చిక్కిపోయావ్! జ్వరమా?" కలవరబాటుతో అడిగిందామె.
"అవును?" అబద్ధమాడేసింది.
"మరి నాకు ఫోన్ చేయవచ్చుగా!"
"అంత ప్రాణం మీద కేమీ రాలేదులే...వస్తే నీకు తప్పితే ఇంకెవరికి చేస్తాను?"
"డాక్టర్ దగ్గరకెళ్ళావా?"
"ఊహు! ఈలోగానే తగ్గిపోయింది."
కొద్దిసేపు ఆఫీస్ విషయాలు మాట్లాడుకున్నారిద్దరూ.
"శాంతీ! నీకు అదివరకు చెప్పావు చూడు! ఇప్పుడు ఆ అవసరం వచ్చింది నాకు" అంది సావిత్రి.
శాంతకు అర్ధం కాలేదు.
"ఏమిటది?"
"అదే మనిద్దరం కలిసి ఏదయినా ఇల్లు చూసుకుని ఉందామన్నావ్ కదా?"
శాంత ఆశ్చర్యంగా చూసింది.
"అదేమిటి? నీకు పెళ్ళయిపోతుందని."
"ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది."
"అంటే?"
"పెళ్ళి జరగటం లేదు."
ఎందుకని?"
"మా ఇద్దరి మనస్తత్వాలకూ సరిపడదు."
శాంతి కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది.
"నేను రేపు ఫస్ట్ లోగా ఈ ఇల్లు ఖాళీ చేసెయ్యాలి అంది సావిత్రి.
"సరే అదివరకు ఓ ఇల్లు చూశాను...నువ్వు అడగందే ఎందుకని వదిలేశాను...అది ఇంకా ఖాళీగా ఉంది. వెంటనే దిగిపోవచ్చు."
"అయితే రేపు ఉదయమే ఆ పని చూడు."
శాంతి మనసంతా ఆమె మీద జాలితో నిండిపోయింది...వారంరోజుల క్రితం ఆమె తీయని కలల్లో విహరించింది... ఇప్పుడు హఠాత్తుగా చిన్నాభిన్నమయి కలల ఊబిలో కూరుకుపోయింది.
"పద ఇద్దరం ఎక్కడయినా భోజనం చేసి మా రూమ్ కెళ్ళి పడుకుందాం" అందామె.
"వంటచేశాను కదా!"
"చేస్తే చేశావులే పద."
సావిత్రి డ్రస్ మార్చుకుని ఆమెతోపాటు బయలుదేరింది.
అదృష్టవశాత్తూ ఆ ఇల్లు ఖాళీగా ఉందంట. సాయంత్రం శాంతి చెప్పింది. ఆరోజు రాత్రికే ఇద్దరూ కొత్త ఇంట్లో దిగారు_ఇల్లు ఎంతో నచ్చింది ఇద్దరికీ. ఇంటిగలాయన పేరు బాలకృష్ణ. ఓ వారపత్రికలో ఎడిటర్ గా రిటైరయ్యాడు. ఆయనకు ఒకే ఒక్క అమ్మాయి. ఆమెకు పెళ్ళయ్యాక బొంబాయి వెళ్ళిపోయింది భర్తతో. బాలకృష్ణ మీద ఆ అమ్మాయి బొంబాయి వెళ్ళిపోవటం చాలా ప్రభావం చూపించింది. ఎప్పుడూ ఎవరో ఒకర్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని తను వారపత్రిక ఎడిటర్ గా ఉన్నప్పుడు చేసిన అద్భుత సాహిత్య సేవ గురించి చెప్పిందే చెబుతుంటాడు.