ఆ కొద్దిసేపటిలోనే ఒకరికొకరు బాగా పరిచయం అయ్యారు.
వీరూ గురించి వార్తలు రాయటం మహిమ వృత్తి అయితే, వీరూ గురించి వివరాలు సేకరించటం విజయ్ కి ప్రవృత్తి. అదే వారిని ఆ తరువాత కాలంలో ఫ్రెండ్స్ ని చేసింది.
వర్తమానంలోకి వస్తే ఇద్దరూ ఆటో ఎక్కి సిద్ధార్ధనగర్, బుధ్ మార్గ్ లోని ఓ ఇంటిముందు దిగారు.
ఇకపై మహిమ వుండవలసింది ఆ ఇంటిలోనే, మహిమ కోర్కె మీద ఆ ఇంటిని రెండురోజుల క్రితం విజయ్ అద్దెకు తీసుకున్నాడు.
ఆటో వెళ్ళాక అన్నాడు విజయ్_ "ఇల్లెలా వుందని."
చిన్న పెంకుటిల్లు. చుట్టూ ప్రహరీగోడ....ఇంటికి ప్రహరీగోడకు మధ్య ఫ్లవర్ బోర్డర్స్, రకరకాల క్రోటన్స్, చిన్న ఐరన్ గేట్ ని తీసుకొని లోపలకు ఎంటర్ అయితే ద్వారబంధంవరకు సన్నని దారి, బండలు పరిచి వున్న ఆ దారిలో బండల మధ్యనుంచి పైకొచ్చిన గ్రాస్.
ఆ ఇల్లు ఆమెకి వచ్చిందని విజయ్ గ్రహించాడు.
ఆమె పరిసరాలకేసి చూసింది. ఆ ఇంటిని ఆనుకొని మూడువేపులా ఇళ్ళు. ఒంటరిగా వుండవలసివచ్చినా భయపడనవసరం లేదనుకుంది.
"థాంక్యూ వెరీమచ్ మైడియర్ ఫ్రెండ్" అంది మహిమ.
"వెల్ కమ్" అని ఇంటి తాళం తీశాడు విజయ్.
మహిమ గీజర్ ఆన్ చేసి స్నానంచేసి వచ్చేలోపు విజయ్ బయటకు వెళ్ళి ఫ్లాస్కునిండా టీ, బిస్కెట్స్, బ్రెడ్, జామ్ తెచ్చి సిద్ధంగా వుంచాడు.
అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటలు. సరీగ్గా అదే సమయంలో మైసూర్ సదరన్ స్టార్ హోటల్ బార్ రూమ్ లో రంజిత్ శర్మ కలుసుకున్నారు.
* * * *
సాయంత్రం నాలుగు గంటలవుతోంది.
దట్టంగా ఆకాశంలోకి పెరిగిన ఎత్తయిన వేగిశ, కంజి సిరిమాను, నల్లచేవమాను, చందనం, టేకు, మద్ది, ఇప్ప, చింత, సింధూర, చిరిమాను బండారు, భిల్లుడు, చంద్ర, సిల్వర్ ఓక్, జమ్మి, దేవదారు, బాబుల్, తునిసి, కొడిసి, యూకలిప్టస్ లాంటి వృక్షాల మూలంగా అప్పటికి చీకటిపడినట్లుగా వుంది అడవి.
చుట్టూ కొండలు, మధ్య లోయ. ఆ లోయలో వుంది దింపాగూడెం కోయవాళ్ళకోసం, గిరిజనుల కోసం కోట్లు కేటాయించబడుతుంటాయి ప్రణాళిక పుస్తకాల్లో, మరా డబ్బంతా ఏమవుతుందో, దాన్ని ఖర్చుపెట్టి అభివృద్ధి కార్యక్రమాల్ని వేగిరపర్చవలసిన ప్రభుత్వ సిబ్బంది ఎక్కడుందో ఎవరికీ తెలీదు. అప్పటికి, ఇప్పటికీ, అడవుల్లోని గూడేలు, పల్లెలు ఏ అభివృద్ధికీ నోచుకోక అలాగే వుండిపోయాయి.
సరీగ్గా నాలుగు గంటలకు ఆ గూడెంలో సుమారు రెండొందల దేవదారు దివిటీలు ఎలక్ట్రిక్ స్విచ్ వేసినట్లు ఒక్కసారి వెలిగాయి.
లోయంతా కాంతిని నింపుకుంది. పెద్దసైజు పుట్టగొడుగుల్లా వున్నాయి ఇళ్ళు. రెల్లుగడ్డితో కప్పబడిన గుడిసెల్ని ఒకచోట పేర్చినట్లుగా పొందికగా వుంటుందా గూడెం. గూడెం మధ్యలో ఓ పెద్ద విగ్రహం.
పరిపూర్ణ ఆకృతిలేని ఆ విగ్రహం కొత్తవాళ్ళకి కేవలం పెద్ద శిలలాగే కనిపిస్తుంది.
దానిముందు దాదాపు మూడువందల మంది ఆడ, మగ పిల్లలు నిలబడి కోయగూడెం పెద్ద ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు.
మరోపక్క గాడిపొయ్యి భగభగమండుతోంది. వాటిపైన కుప్పి (వడ్లని నానబెట్టి కుళ్ళిపోయాక, బాయిల్ చేసి, డిస్టిల్డ్ చేస్తే కుప్పి అనే సారాయి లాంటిది తయారవుతుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ అడవుల్లోని గిరిజనులు, కోయలు దీన్ని బాగా వాడుతుంటారు) వెదురుసారా, అరటిసారా, దుప్పి, అడవిపంది మాంసం ఉడుకుతోంది.
మరోపక్క కొందరు జీలుగుకల్లు, విప్ప సారాయిని కుండల్లోనింపి సిద్ధం చేస్తున్నారు. ఇంకోపక్క రాగిముద్ద, జొన్నముద్ద, వరి అన్నం సిద్ధం అవుతున్నాయి.
ఆ కోయగూడేల్లో మగవాళ్ళు కేవలం గోచీగుడ్డలు, ఆడవాళ్ళు ముతక చీరలు ధరిస్తారు. స్త్రీలు ముక్కులకు, చెవులకు కమ్మలతో, జుత్తును కొప్పులుగా చుట్టుకొని వుంటారు. బ్లౌజులు ధరించరు. కాళ్ళకు, చేతులకు, వెండి, రాగి, ఇత్తడి కడియాలు ధరిస్తారు.
వాళ్ళు ప్రాణాలకు వెరవరు. నమ్మినవాడికి ప్రాణాలివ్వటం ఎంతిష్టమో, నమ్మనివారి ప్రాణాలు తియ్యటమూ అంతే ఇష్టం.
అడవిలో దొరికింది తిని కాయకష్టంతో, నిరంతర వేటలోపడి బలిష్టంగా తయారవుతారు.
వాళ్ళకు వీరూ మాట వేదవాక్కు. అతను నిప్పుల్లో దూకమన్నా దూకుతారు. వారిలో వారికి స్వల్ప విభేదాలున్నా వీరూ కనుసన్నతో ఒక తాటిపై నిలుస్తారు. వాళ్ళ కులదేవత అడవితల్లి. వాళ్ళు పూజించే మరో దేవుడు కొండదేవర.
అడవిలో కొంత భాగాన్ని చదును చేసుకొని పోడు వ్యవసాయం చేస్తారు. ఆపైన అడవిలో దొరికే సీకాయ, కరక్కాయ, టమోటో విత్తనాలు, జీడి ఆకులు, అడ్డాకులు, బంక, తేనె, చింతపండు, ఉసిరి, కుంకుడులాంటి అటవీ ఉత్పత్తుల్ని రకరకాల ఫలాల్ని బుంగలతో, గోతాలతో అడవిలోకి వెళ్ళి కలెక్ట్ చేసుకొని కొన్ని పదుల మైళ్ళు నడిచి, బండ్లమీద వెళ్ళి చిన్న టౌన్స్ లో అమ్ముకొని తమకు కావల్సినవి తెచ్చుకుంటుంటారు.
దేశవ్యాప్తంగా రూపాయి విలువని కేంద్ర ఆర్ధికశాఖ తగ్గిస్తే, ఆ అటవీ ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారులే తరుచూ తగ్గిస్తుంటారు.
డముకులు, మద్దెళ్ళు, బూరలు, బ్యాండులాంటి సంగీత వాయిద్యాలు సిద్ధమయ్యాయి. అందరిలో ఏకాగ్రత....భక్తిపారవశ్యం పరవళ్ళు తొక్కుతోంది.
అప్పటికే అక్కడికి వచ్చిన కరియా బృందం, వేలాయుధం బృందం మోడాల్లా తయారుచేసిన నల్లచేవమాను మొద్దులపై కూర్చుని సంబరం ఆరంభం కోసం ఎదురుచూస్తున్నారు.
అంతలో అక్కడ పర్చుకున్న నిశ్శబ్దాన్ని బ్రద్దలు చేస్తూ డముకు శబ్దం వినిపించింది.
మరికొద్ది క్షణాలకు మారానాయక్ తన భార్యా పిల్లలతో అక్కడకు వచ్చాడు. అతడే ఆ గూడేనికి, చుట్టుపక్కల గూడేలకు నాయకుడు.
ఆరడుగుల ఎత్తులో నల్లగా, బలిష్టంగా, మెలితిరిగిన కండలతో, పాషాణంలా వున్న మారానాయక్ వయస్సు యాభై వున్నా నలభైకి మించనట్లు కనబడతాడు. అతనంటే ఆ చుట్టుపక్కల గూడేల్లోని కోయ ప్రజలకు అపరిమితమైన భయభక్తులు. అతను శాసిస్తే ఎవరిచేత్తో వారి తలను కూడా సరిచేసుకుంటారు.
"అయ్యాదేవర రాలె....ఈ పాటికి వస్తుంటడు. రాగానే సంబరం మొదలవుద్ది" మారానాయక్ కంఠం ఆ ప్రాంతంలో ప్రతిధ్వనించింది.
స్పీకర్ లేకుండానే మారానాయక్ కంఠం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ప్రతిధ్వనిస్తుంది. అతని కంఠంలో ఎకో ఉందా అనిపిస్తుంది. అతను మామూలుగా మాట్లాడినా అందులో శాసనాధికారం తొంగిచూస్తుంది.
లోయంతా నిశ్శబ్దంగా వుంది. దేవదారు దివిటీలు భగభగమని మండుతూ చీకటిని పారద్రోలుతున్నాయి.
ప్రాణంలేని శిల్పాల్లా అన్ని వందలమంది అలాగే అంగుళమైనా కదలకుండా నిలుచుండిపోయారు.
మరికొద్ది నిమిషాలకు తూర్పు దిక్కున కుక్క అరిచిన శబ్దం అందరి చూపులు ఆవేపుకి తిరిగాయి.
భైరవి నాలుక చాస్తూ, పరిసరాల్ని గమనిస్తూ ధీమాగా వస్తోంది. మరికొంత దూరంలో తంబి బ్లాక్ క్యాట్ కమెండోలా పరిసరాల్ని గమనిస్తూ తోకాడిస్తూ వస్తోంది.
"యజమానరే....వస్తున్నారు" వీరూ అనుచరుల్లో ఒకరన్నారు ఉద్వేగంతో.
"అయ్యదేవరే వత్తన్నారు.... వహో" అంటూ మారానాయ పెద్దగా ఆ లోయంతా ప్రతిధ్వనించేలా అరిచాడు.
అందరూ అలర్ట్ అయిపోయి భక్తిశ్రద్ధలతో తూర్పువేపు చూస్తూ సాగారు.