మూర్ఖత్వమే వరమా ?
"I gnorance is the blin' అని ఇంగ్లీషులో ఒక పంక్తి... మూర్ఖత్వం వరమవుతుందా? కళ్ళుంటే కాళ భయానక దృశ్యాలు చూడవలసి వస్తుందని కళ్ళు మూసుకుని కోరుకుంటారా?
ఏదో ఒక నాటికి సృష్టిలో అందాలు చూడగలిగే కష్టాన్ని క్షణిక భయానికి శాశ్వతంగా దూరం చేసుకుంటారా ?
కుమిలి కుమిలి ఏడుస్తోంది లీల - ఆవిడను చూస్తోంటే గుండె తరుక్కు పోతుంది. ఇంత అనర్ధానికీ నేనే కారణమా, అని అంతరాత్మ నన్ను అడుగడుగునా నిలదీసి అడుగుతోంది...
జ్ఞానను ఆమె మూర్ఖత్వంలో ఆమెను ఉండనిస్తే జరిగేది కాదేమో! పనికట్టుకుని చదువు చెప్పాను. అనేక పుస్తకాలు చదివించాను. సొంతంగా ఆలోచించటం అలవాటు చేసాను.
జ్ఞాన చురుకైనది! కొంచెం అందిస్తే చాలు చకచక ముందుకు సాగిపోయేది !
అయితే ఒకనాడు జ్ఞాన కన్నీళ్ళను చూసి అదిరిపోయాను. ఎప్పుడూ అమాయకంగా నవ్వే ఆ కళ్ళలో కన్నీళ్ళు! అవును! తన పరిస్థితి ఏమిటో తాను అర్ధంచేసుకో గలిగితే జ్ఞానకు కన్నీళ్ళు కాక మిగిలేదేముందీ ?
జ్ఞాన కన్నీళ్ళు చూసిన రోజునే నాలోని చికిత్స మొదలయింది. జ్ఞాన మనసు వికసింప చేయిటానికి ప్రయత్నించి నేనామెకు చేస్తున్నది ఉపకారమా, అపకారమా, అని ...
జ్ఞాన రాజుని తనతో తీసుకుని వెళ్ళిపోయింది !
ఆ మాట విన్న క్షణంలో అంతులేని ఆశ్చర్యం కలిగింది__నమ్మలేకపోయాను !
"ఛ ! జ్ఞాన అలా చెయ్యదు! ఒక్కనాటికీ చెయ్యదు" అన్నాను నమ్మకంగా...
తనను తాను తెలుసుకున్నాక జ్ఞానలో జీవితంపట్ల ఏదో కసి పెరిగిన మాట వాస్తవమే! కానీ, జ్ఞాన మంచిది! జ్ఞానలో పెరిగిన కసి జ్ఞాననే దహిస్తుంది కాని మరొకరిని నాశనం చెయ్యదు...
"వదినగారూ ! మీరొక్కసారి రావాలి! లీల తిండీ నీళ్ళూ మానేసి ఏడుస్తోంది."
బ్రతిమాలుకున్నాడు మా మరిది ! అని ముఖం చూడలేక తల తిప్పుకున్నాను. జ్ఞాన రాజును తన తీసుకుపోయిన మాట నిజమే. అయితే అందుకు ఈ మహానుభావుడి నిర్వాకమే ముఖ్య కారణం...
లీలకోసం బయలుదేరి వెంటనే మా మరిది ఇంటికి వెళ్ళాను.
లీల కొంత అమాయకురాలు! ముఖ్యంగా దేనికీ నోరు మెదపదు. కొన్నికొన్ని సందర్భాల్లో ఇది మంచి లక్షణమే అయినా కొన్ని కొన్ని సందర్భాలలో ఇదే ప్రాణంమీదికి తెస్తుంది. తన భర్త మాటలకూ చేష్టలకూ ఈవిడ నోరు కదిపి ఏమీ అనదు. ఆ చేష్టలన్నీ ఈవిడకూ అంగీకారమనుకోవాలో, లేక పూర్వకాలపు పతివ్రతల్లోంచి దిగివచ్చిందనుకోవాలో, మాత్రం ఎవరికి అర్ధంకాదు.
లీల తానై జ్ఞానకు అన్యాయం చెయ్యలేదు కానీ, భర్త చేస్తోంటే వద్దని వారించలేదు ! ఆస్తిమీద మమకారం లీలకు మాత్రం లేదని ఎలా చెప్పగలం?
నన్ను చూడగానే కౌగిలించుకుని బావురుమంది లీల!
ఒక్క రోజులోనే వెయ్యి లంఖణాలు చేసిన మనిషిలా అయిపోయింది. కళ్ళు ఏడ్చి ఏడ్చి బాగా ఉబ్బిపోయాయి!
"నిజమా !" అని ఎవరినీ అడగక్కర్లేకుండానే జ్ఞాన రాజును తీసుకుని వెళ్ళిపోయిందని అర్ధమయింది!
ఎలా చెయ్యగలిగింది జ్ఞాన ఇంతపని ! ఎంత ఆలోచించినా జ్ఞాన ఇంత రాక్షసంగా ఉండగలదని అనుకోలేకపోతున్నాను.
లీల భర్త విషయంలో ఎలాంటి పతివ్రతో పిల్లల విషయంలోనూ అలాంటి తల్లి.
పిల్లలు వర్షంలో తడుస్తున్నా గట్టిగా మందలించదు. అడ్డమైన గడ్డీ తింటున్నా అదేమని అడగదు. మీదపడి పీకి పేచీలు పెట్టినా శాంతంగా సహిస్తుంది. వాళ్ళ పేచీలు ఎలాంటివైనా మందలించదు, సరిగదా కొండమీది కోతి కావాలన్నా తెచ్చియ్యడానికే ప్రయత్నిస్తుంది.
అలాంటి లీల రాజును వదిలి ఒక్కరోజు ఉండలేకపోయిందంటే ఆశ్చర్యం లేదు.
"అక్కయ్యా ఇదిగో ఈ ఉత్తరం చూడండి" వెళ్ళిపోతూ జ్ఞాన వ్రాసిన ఉత్తరాన్ని నా చేతుల్లో పెట్టింది లీల.
చి|| సౌ|| లీలకు,
ఆశీర్వచనములు. నా కొడుకు రాజాను తీసుకుని నేను వెళ్ళిపోతున్నాను. మీకు చెపితే నా మీది ప్రేమచేత
________వెళ్ళనివ్వరని చెప్పకుండా వెళుతున్నాను. ఎక్కడికో ఎన్నాళ్ళో ఇంకా నిర్ణయించుకోలేదు. తర్వాత మళ్ళీ వ్రాస్తాను. మరిదిగారిని అడిగానని చెప్పు.
నీ
అక్కయ్య జ్ఞాన ..."
జ్ఞాన "నా కొడుకు" క్రింద గట్టిగా గీతగీసింది. అది కనపడగానే అంత దుఃఖంలోనూ నాకు చిన్న చిరునవ్వు వచ్చింది.
జ్ఞాన ఈ పని తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవటానికే చేసింది. "నా మీది ప్రేమచేత వెళ్ళనివ్వరని" అని పొడవటంలోనే అది స్పష్టంగా అర్ధమవుతోంది. ఇంత దారుణంగా ప్రతీకారం తీర్చుకోవటానికి సిద్ధ ఉందమయిందంటే తన మనసు ఎంతగా క్షోభించి ఉండాలో...
తలెత్తి మా మరిదివంక చూసాను. కత్తి వేటుకు నెత్తురు చుక్కలేకుండా పాలిపోయి ఉంది...
"వదిన ఇలా చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు__" అన్నాడు గొణుక్కుంటున్నట్లు. అన్యాయాలను సహించటానిక్కూడా ఒక అంతంటూ ఉంది." మనసులో అనుకున్నాను. ముఖం చూస్తూ పైకి అనలేకపోయాను...
"బావగారు కూడా వెళ్ళారా?"
మా మరిదిని అడిగాను...
"అన్నయ్యా!! వాడికొక మనసంటూ ఉందీ!! వదిన ఎంత చెప్తే అంత!"
ఈసడింపుగా అన్నాడు మరిది!
అవును! ఆయనకు మనసంటూ లేదు! ఉంటే ఈ జ్ఞాన ఇలా అవస్థపడవలసిన అవసరం వచ్చేది కాదు!
తహశీల్దారు కోదండ రామారావుగారు ఏరి కోరి జ్ఞాన ప్రసూనాంబను తన కోడలిగా చేసుకుంటానన్నారు.
జ్ఞాన పెద్ద అందగత్తె కాకపోయినా అనాకారికాదు. సంపన్నురాలు కాదు, చదువుకోలేదు.
అలాంటి జ్ఞానను అంత సంపన్నుడు కోడలిగా వరిస్తే ఒక్కరుకూడా "ఎంత అదృష్టం! అనలేదు! అంతా "అయ్యో పాపం!" అన్నారు.
కారణం జ్ఞానను చేసుకున్న శేషశాయి వట్టి అప్రయోజకుడు, వెఱ్ఱిబాగులవాడు!
"ఏదెలా ఉన్నా, కలిగినింట్లో పడింది. సుఖపడుతుంది." అని కన్నీళ్ళు తుడుచుకున్నారు తల్లిదండ్రులు.
కానీ కలిగినింట్లో పడ్డ జ్ఞాన పొందినవి సుఖాలేం కావు!
ఒక మహా సత్రంలా ఉండే ఆ యింట్లో వంటలక్క స్థానం లభించింది జ్ఞానకు.
మామూలు వంటలక్కలకు ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా కాస్త తీరిక ఉంటుంది. కానీ, జ్ఞానకు రాత్రి పదయినా పని తెరిపికాదు.