అవధాని ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఊరుకున్నాడు. అతని మొహంలో చాలా వ్యాకులపాటు కనిపిస్తోంది.
"అవధానీ! జీవితంలో ప్రతివారికీ_అంటే ఆస్తిపాస్తులు సంపాదించినవారికి ఈ దశ తప్పదు. ఎంతో తెలివిగా స్ఫూర్తితో ప్రవర్తిస్తే తప్ప ఈ జటిల సమస్యనుంచి తప్పించుకోలేం. ఇంటి యజమాని హఠాత్తుగా మరణించనప్పుడు జబర్దస్తీ చేసిన ఆ కుటుంబాల్లో అంతులేని కల్లోలాలు చెలరేగుతూ ఉండటం ఎన్నో చూశాం. ఆస్తి పంపకాల విషయంలో తెలివిగా ప్రవర్తించకపోయినా ఆ కుటుంబాలు నాశనమైపోతాయి. కేవలం తెలివేకాదు. బింకంగా, మొండిగా కూడా ప్రవర్తించాలి. లేకపోతే సంవత్సరాల తరబడి రక్తం ధారబోసి కూడబెట్టిన ఆస్తి కళ్ళముందు నిర్ధాక్షిణ్యంగా హరించుకుపోతుంది..."
అవధానికి ధైర్యం కలిగించటానికన్నట్లు, మోరల్ సపోర్ట్ ఇవ్వటానికన్నట్లు నరసింహంగారు అక్కడున్నంతసేపూ ఆస్తిపాస్తులూ, పంపకాలూ అన్న అంశంమీదే మాట్లాడి చీకటి పడుతూ ఉండగా ఇంటికి బయల్దేరారు.
"అప్పుడప్పుడూ వస్తూ వుండరా. నాకు ధైర్యంగా ఉంటుంది" అన్నాడు అవధాని.
"అలాగేలేరా. కాని నా వంట్లోకూడా ఏమీ బావుండటం లేదు. నేనూ ఎప్పుడు పడిపోతానో తెలీదు" చిన్న నవ్వుతో అని లేచి వీధిలోకి వచ్చాడు.
కొద్ది కొద్దిగా చీకటి పడుతోంది.
"ఇంకా కొంచం ముందుగా బయల్దేరవలసింది" అనుకుంటూ మెల్లగా నడవసాగారు.
ఆయనకు నడక అలవాటే. కాని ఉన్నట్లుండి ఎప్పుడో ఒకసారి వొళ్ళు తూలుతున్నట్లుగా అనిపిస్తుంది.
కొంచం దూరం నడిచాక నీరసంగా ఉన్నట్లనిపించింది. ఈ వయసులో వంటరిగా బయటకు రావటం, ఎక్కువసేపు తిరగటం పొరపాటే. శరీరం స్వాధీనంలో వుండదు.
అందుకే పార్వతమ్మ ఆయన బయటకెళ్ళినప్పుడల్లా మందలిస్తూ ఉంటుంది. చాలా సందర్భాలలో మనమడ్ని తోడిచ్చి పంపిస్తూ వుంటుంది.
చిత్రం ఒకప్పుడు ఆమె తనతో మాట్లాడాలంటే హడలిపోతూండేది. తాను కళ్ళెర్రజేస్తే గజగజలాడిపోయేది. అసలామెతో ఎంతో అవసరముంటేనేగాని మాట్లాడేవాడు కాదు. ఆమె తన భావాలను బయటకు చెప్పటానికవకాసమిచ్చేవాడు కాదు.
అటువంటిది యింత సుదీర్ఘకాల సాన్నిహిత్యంవల్ల ముఖ్యంగా వయసు మళ్ళాక ఇద్దరిమధ్యా చనువు పెరిగిపోయింది. ఆమె తనతో ధైర్యంగా మాట్లాడగలగటమేకాక చాలా సందర్భాల్లో "మీకేమీ తెలీదు. మీరూరుకోండి" అని కొంత డామినేషన్ కూడా తీసుకుంటోంది. నహుశా చరిత్రలో ఇది సర్వసాధారనమై ఉంటుంది. సంవత్సరాల తరబడి అధికారం చెలాయించిన భర్త జీవిత చరమాంక వచ్చేసరికి భార్యమీద ఎనలేని మమకారం పెంచుకుని ఆధిక్యతనిస్తూ, ఆమెమీద పూర్తిగా ఆధారపడుతూ ఆమెను క్షణంకూడా విడిచి ఉండలేని పరిస్థితికి వచ్చేస్తారు. అంతేకాదు కుటుంబ సమస్య ఏదయినా వచ్చినప్పుడు భార్యపిల్లలమీద కాకుండా భర్తవైపే మొగ్గు చూపుతూ ఉంటుంది.
నరసింహంగారి విషయంలో కూడా అంతే జరిగింది. దీర్ఘకాల సంసారిక జీవితంలో ఆమెను నోరు మెదపకుండా ఆధిపత్యం వహించిన తాను ఆమె సలహా సంప్రదింపులు లేనిదే ఏ నిర్ణయమూ తీసుకోలేని స్థితికి వచ్చేశాడు. అంతేకాదు ఇంట్లో ఆమె ఓ క్షణంసేపు కనిపించకపోతే తల్లడిల్లిపోయేవాడు. ఇదివరకెన్నడూలేని వంటరితనం, మెదడు మొద్దుబారిపోయినట్లు భావన_వీటితో ఉక్కిరి బిక్కిరయిపోయేవాడు. అర్థరాత్రి ఏ రెండుగంటలకో మెలకువ వచ్చేది. కాసేపు బలవంతంగా నిద్ర పట్టించుకుందామని ప్రయత్నించేవాడు సాధ్యమయేదికాదు. పార్వతమ్మ మంచి నిద్రలో ఉండటంచూసి, లేపటానికి కాసేపు సంకోచించి తర్వాత యిహ ఉండబట్టలేక "పార్వతీ పార్వతీ" అంటూ నిద్రలేపేసేవాడు.