"ష్ష్" అన్నాన్నేను "అదేం కాదులే మందు కొట్టేసి వచ్చాడు."
మా ఆవిడ అదిరిపడింది "అమ్మో మందే-"
తాగి ఉన్నాడితో వాదన అనవసరం అన్న విషయం మాకు పోలీస్ డిపార్ట్ మెంట్ ద్వారా బాగా అనుభవమయింది. అంచేత రాజీకొచ్చేయడానికి ప్రయత్నించాను.
"సరే బ్రదరూ! క్షమించాన్లే- ఇంక ఇంటికెళ్ళిపో-" అన్నాను, నా నిద్రప పాడయిపోతున్న విషయం గుర్తుకొచ్చి.
"నో-" గట్టిగా అరచాడు జనార్ధన్ "నేనొప్పుకోను!"
"ఆ అరుపుకి మా పిల్లలూ, పక్కింటివాళ్ళూ లేచివచ్చి నిలబడ్డారక్కడ.
"ఎందుకని వప్పుకోవు? ఆశ్చర్యంగా అడిగాను.
"నేనేం దో-దో- ద్రోహం షేషానో తెలీకుండా నన్నెలా షమిస్తావ్! అలా ఊరికే షమించేయటం నాకిష్టం లేదు- షమించే వాడెవడయినా సరే రీజన్ తెల్షుకోవాలి!"
"సరే- నాకేం ద్రోహం చేశావో చెప్పు త్వరగా!"
"నైన్ టీన్ ఎయిషీటూలో సిగరెట్ ఫామిన్ వచ్చింది గుర్తుందా!"
"సిగరెట్ ఫామినా?"
"అవును- సిగరెట్ ఫామిస్! అంటే సిగిరెష్ కరువు- అప్పుఅప్పుడూ మనదేశంలో సిగిరెష్ కరువు రాదూ?"
"అదా- వస్తుంది- వస్తుంది!"
"ఆ సిగరెష్ ఫామిన్ నైన్షీన్ ఎయిషీ షూలో వచ్చినప్పుడు- నువ్ నన్ను కోఠీ బష్ ష్టాప్ లో సిగిరెష్ అడిగావు గుర్తుందా?"
"అడిగానేమో- నాకు గుర్తులేదు-"
"గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకోవాలి!"
"సరే అడిగాను!"
"అప్పుడు నేనేం షెప్పాను?"
"ఏమో గుర్తులే.."
"నో! గుర్తు తెచ్చుకోవాలి!"
"సిగిరెట్ ఇచ్చావ్."
"అబద్ధం! నేనివ్వలేదు-"
"ఆ గుర్తుకొచ్చింది- ఇవ్వలేదు!" అన్నాను అబద్ధమాడేస్తూ.
"ఇవ్వకుండా ఏం షెప్పాను?"
"సిగిరెట్లు లేవని చెప్పి ఉంటావ్-"
"షెప్పి ఉంటావ్ కాదహ! అదే షెప్పాను!"
"అవును! అదే చెప్పావ్-"
హఠాత్తుగా జనార్ధన్ కిందకూర్చుని నెత్తిన రెండు చేతులూ పెట్టుకుని ఏడ్చేశాడు.
"అక్కడే నీకు దో-దో ద్రోహం అయిపోయింది గురువా. నా జేబులో అప్పుడు రెండు సిగిరెష్ లు ఉన్నాయ్- అయినా లేవని అబద్ధం షెప్పాను-"
"అదా- ఏం ఫర్లేదులే! అందులో పెద్ద ఇదేముంది?" నవ్వేస్తూ అన్నాను పైకి కానీ లోలోపల వాడు అలా అబద్ధం చెప్పినందుకు వళ్ళు మండిపోయింది.
జనార్ధన్ కోపంగా లేచి నిలబడ్డాడు.
"అలా మాట్లాడకు గురువా! ఏం ఫర్లేదులే అంషావేంషి? అది ద్రోహం కదూ!"
"అవును ద్రోహమే-"
"అయితే షెప్పు- ఆ రోజు నేను షేషినో దో-దో- ద్రోహానికి షమించానని షెప్పు-"
"సరే క్షమించాను!"
జనార్ధన్ మొఖంలో సంతృప్తి. హఠాత్తుగా అతని చూపు మా మిసెస్ మీద పడింది.
"నువ్ షమిస్తే షరిపోయిందేమిషి? మా వదినమ్మ షమించొద్దూ?"
మా ఆవిడ ఉలిక్కిపడింది. "నేనా? నేనెందుకు క్షమించటం?"
నువ్ కూడా క్షమించానని చెప్పెయ్యవే! గొడవెందుకు?" అన్నాను మా ఆవిడతో రహస్యంగా.
"నేనూ క్షమించాన్లెండి!" అందామె. అబ్బ! ఈ మగసన్యాసులు తాగితే ఇంత సాధు జంతువులుగా కూడా మారే అవకాశం ఉందన్నమాట" అంది నాతో రహస్యంగా.
"ఇంక వెళ్ళిరా! మా మిసెస్ కూడా క్షమించింది కదా!" అన్నాను చిరాకు కనిపించకుండా!
జనార్ధన్ వెళ్ళబోయి- ఆగి- మా వెనుక నిలబడ్డ పిల్లల వేపు చూశాడు.
"మరి ఆళ్ళు షమించొద్దూ?"
"వాళ్ళు కూడా క్షమించార్లే!" అన్నాన్నేను.
"ఏదీ వాళ్ళు మాట్లాడందే?"
"రాత్రిళ్ళు వాళ్ళు మాట్లాడరు."
జనార్ధన్ వాళ్ళదగ్గరకెళ్ళి కింద కూర్చున్నాడు.
"పీపీ" అన్నాడు వాళ్ళ బుగ్గల మీద చిటికె వేస్తూ.
వాళ్ళు భయంగా మావేపు చూశారు "లీలీ"...వాళ్ళు రెండడుగులు వెనక్కు వేశారు.
"కీకీ" అన్నాడు మళ్ళీ- నేను కల్పించుకోకపోతే ఆ కార్యక్రమం తెల్లారేవరకూ సాగేట్లు కనిపించింది.
"ఇంక ఇంటికెళ్ళు- టైమ్ ఒంటిగంటవుతోంది" అన్నాను విసుగ్గా.
జనార్ధన్ లేచి నిలబడ్డాడు. వెనక్కు తిరిగి రెండడుగులు వేసి మళ్ళీ తిరిగి వచ్చాడు.
"మరి రంగారెడ్డి మాటేమిటి? ఆడు షమించొద్దూ?" అదిరిపడ్డాను.
"అదేమిటి? రంగారెడ్డెందుకు క్షమించటం?"
"ఆడిక్కూడా దో- ద్రోహం చేషాను. ఆడు కూడా షమిస్తే గానీ వెళ్ళను- అన్నాడు మళ్ళీ కూర్చుంటూ. చేసేది లేక నేనే వెళ్ళి రంగారెడ్డిని నిద్రలేపుకొచ్చాను.
రంగారెడ్డిని చూస్తూనే దభేల్ మని అతని కాళ్ళమీద పడిపోయాడు జనార్ధన్.
"నీకు ద్రోహం షేషాను గురూ- దో- దో- హం దోదోహం- ద్రోహం!"
"నాకేం చేయలేదులే- పద- మీ ఇంటికెళ్దాం!" అన్నాడు రంగారెడ్డి.
హఠాత్తుగా గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడతను. దాంతో అందరిళ్ళల్లో టపటప లైట్లు వెలిగిపోయినయ్. ఆ తరువాత ఒక్కరొక్కరేవచ్చి మూగిపోయారక్కడ. మరి కాసేపట్లో పెద్దలూ, పిల్లలూ అంతా కిటకిటలాడిపోయారు.
"నేను నీకు ద్రోహం షేషాను గురూ! నీకు తెలీదది-"
"ఏమిటది?"
"నాలుగేళ్ళక్రితం రేడియోలో జనరంజనిలో శ్రోతలు కోరిన రికార్డుల్లో- ఒక బూతుపాట కోరి- అది కోరినవారు రంగారెడ్డి నిర్భయ్ నగర్ కాలనీ అని నేనే రాశాను."
"ఆ.. నువ్వా ఆ పని చేసింది?" కోపంగా అన్నాడు రెడ్డి.
"అవును గురూ! నేనే- నేను టీవీలో వేషం కోసం ఆ ప్రొడ్యూసర్ ని బార్ కి తీసుకెళ్ళటానికి రెండొందలు అప్పు అడిగితే లేదన్నావని కోపం వచ్చి ఆ పని షేషాను-"
అందుకని షమించాల్సిందే అని, మళ్ళీ భోరున ఏడ్వటం మొదలుపెట్టాడు.
అందరం రెడ్డిని బ్రతిమాలాము. "ముందు వాడిని క్షమించేసేయ్- లేకపోతే ఎవ్వరికీ నిద్ర ఉండదు- తెల్లార్లు న్యూసెన్స్ చేస్తాడు"
"సరే- క్షమించాన్లే" అన్నాడు రెడ్డి. "ఇంక మీ ఇంటికి వెళ్దువుగాని పద-"
"మరి..రాజేశ్వరి షమించొద్దూ?"
అందరం ఉలిక్కిపడ్డాము "రాజేశ్వరా?"
"అవును- రాజేశ్వరిక్కూడా ద్రోహం షేషాను."
"నాకేం ద్రోహం చేసిన గుర్తులేదే-" అంది రాజేశ్వరి ఆశ్చర్యంగా.
"నైన్షీన్ ఎయిషీ షూలో మీర్రాసిన కథ 'జ్యోతిలో' పడింది గుర్తుందా?"
"అదెందుకు గుర్తుండదు?" ఉత్సాహంగా అందామె "అందులోనే హీరో శివశంకర్ వాళ్ళ పిన్ని కూతుర్ని మర్డర్ చేస్తారెవరో! ఎవరో ఎవరికి తెలీదన్నమాట! ఆఖరికి ఆ అమ్మాయికి కూడా తెలీదు- శివశంకర్ కి ఎనిమిదిమంది మీద అనుమానం ఉంటుందన్నమాట! మొదటి అనుమానితుడు భీమ్ రాజ్! క్లూ కోసం అర్ధరాత్రి రెండింటికి భీమ్ రాజ్ ఇంటికెల్తాడతను. లోపలకు జొరబడి గోడ పక్కన నిలబడతాడు.