Previous Page Next Page 
ఒకే రక్తం ఒకే మనుషులు పేజి 18


    "కాదు" అని చెబుదామనుకుంది. అయితే ఎవరని చెప్పాలి?
    
    "అవును" అందామనుకుంది. అయితే ఎవరని చెప్పాలి?
    
    "నిజంగా మాలో అంత పోలికలు కనిపిస్తున్నాయా?" అనడిగింది ఏమీ చేతగాక.
    
    "అబద్దమెందుకు చెబుతానండీ? అన్నట్లు మీరీమధ్య కాలేజీలో కనబడటం మానేశారేం?"
    
    "కాలేజీ మానేశాను."
    
    "అదేమండీ?"
    
    "పెళ్ళి చేసుకొన్నాను" అంది గిరిజ నవ్వి.
    
    "పెళ్ళి చేసుకుంటే కాలేజీ మానెయ్యాలా?"
    
    "మా యింట్లో పరిస్థితులు అలా వచ్చాయిలెండి."
    
    "అవునూ? పెళ్ళి చేసుకునికూడా చక్కా శ్రీవారితో కబుర్లు కొట్టకుండా అన్నయ్యలతో తిరుగుతున్నారేమండీ?"
    
    గిరిజ మళ్ళీ సందిగ్ధంలో పడింది. ఆమె ఏమీ చెప్పకముందే ఆ అమ్మాయి ప్రక్కనున్నావిడ, చెయ్యిలాగి పిలవటంతో ఆమె అటు తిరిగింది. వాళ్ళిద్దరూ ఏవో కబుర్లలో పడ్డారు. గిరిజ ఊపిరి పీల్చుకుంది.
    
    లైట్లు ఆరి మళ్ళీ సినిమా మొదలయింది. సుందరం లోపలకు వచ్చి కూర్చున్నాడు.
    
    గిరిజ సినిమా చూడటంలేదు. తెరమీద బొమ్మలు ఆమెకళ్ళకి మసక మసగ్గా గోచరిస్తున్నాయి. తలలో భరించటానికి అలవికానంత బాధ, ఏవో శబ్దాలు.
    
    "అతను మీ అన్నయ్యా? అతను మీ అన్నయ్యా?"
    
    సుందరం చెయ్యి ఆమెకు తగిలింది. ఆమె చేతివ్రేళ్ళను అతను ప్రేమగా నిమురుతున్నాడు. ఆమెలో కొత్తరకం ఆలోచనలు వస్తున్నాయి.
    
    ఆ వ్రేళ్ళు ఆమెనేమీ కదిలించటంలేదు. ఆ వ్రేళ్ళు ఆమెకేమీ అనిపించటం లేదు.
    
    "ప్రక్కన ఎవరు కూర్చున్నారు? సుందరం బావా?"
    
    బలవంతంగా గుర్తు చేసుకోవలసి వస్తున్నది.
    
    అతన్ని చూస్తే తనకి కలిగే భావాలకి యిప్పుడే నిర్వచనం తెలుస్తున్నట్లుగా వుంది. ఏదో కనువిప్పు అవుతున్నట్లుగా వుంది. ఆమెకి భయంగా వుంది.
    
    ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
    
                                                       * * *
    
    పెళ్ళయ్యాక జరిగే తతంగమంతా యధావిధిగా జరిగిపోయింది. పదహారు రోజుల పండగకూడా దగ్గర పడుతోంది.
    
    గిరిజకు యూ మామధ్య యింట్లోని మనుషుల ముఖాలు పరిశీలించటం, వాళ్ళ మనస్తత్వాలు త్రవ్వటం అలవాటయిపోయింది.
    
    పెద్దన్నయ్య ముఖ్యప్రాణరావుతో ఆమె ఎక్కువ మాట్లాడదు. ఆమెకు తండ్రిని చూస్తే ఎంత భయమో అతన్ని చూసినా అంతే భయం. సుభద్ర వదిన సరసంగా మాట్లాడదు. ఎక్కువ గయ్ గయ్ లాడే స్వభావం.
    
    ముఖ్యప్రాణరావుకు సుభద్ర అత్తకూతురు అవుతుంది. సుభద్ర పుండరీకాక్షయ్యగారి అక్కకుమార్తె.
    
    ఓరోజు ప్రొద్దుటే గిరిజ నిద్రలేచివచ్చి దగ్గరగా తలుపులు వేసివున్న వాళ్ళ గదిలోకి చప్పుడు చెయ్యకుండా వెళ్ళి ప్రక్క ప్రక్క మంచాలమీద పడుకున్న ఇద్దరిముఖాల్లోకి పరకాయించి చూస్తోంది.
    
    యిద్దరూ నడివయసు సమీపిస్తున్న వాళ్ళు అతని తల్లో వెంట్రుకలు సగం నెరిశాయి. ఆమె కళ్ళచుట్టూ నల్లచారలు ఏర్పడ్డాయి. అతని ముఖంలో కాంతి పుండీఉండనట్లుగా వుంది. ఆమెముఖంలో కాంతి ఎప్పుడో నశించింది. ప్రక్కన మంచాలమీద పిల్లలు యిరుగ్గా పడుకుని దొర్లుతున్నారు. ఆ భార్యా భర్తలిద్దరిలో ఏమన్నా చైతన్యం, అనుభూతి, రసానుభూతి వున్నాయా? గిరిజ వాళ్ళిద్దరి ముఖాల్లోకి ఒంగి పరీక్షగా చూసింది. లేశమైన తృప్తి, జీవితంలో దేన్నో పొందిన గర్వం, నిండుతనం- ఇలాంటివేమైనా కనబడతాయేమోనని ఆశ అవేమీ లేకపోగా వాటిబదులు చప్పదనం, నిస్సారత, యింతకన్నా యింకేం వుంటుందిలే అన్న నిస్పృహ, యాంత్రికత్వం కనిపించాయి. గిరిజ మనస్సు నిరాశతో నిండిపోయింది. కోరికలు కొరి అవి తీరక క్రుంగిపోయిన వారిలో కలిగే నిర్లిప్తతో, అసలు కోరికలు లేక కోరికలు తెలీక పండుతనంలో వున్నవారిలో మెసలే నిర్లిప్తత వుంది. మూర్ఖుడికి విచారం లేకపోవచ్చుగాని ఆ విచారం లేకపోవటంతో సుఖంకన్నా బండతనం వుంది. వాళ్ళనలా చూస్తోంటే ఆమెకేదో వికారం కలిగినట్లయింది. నిట్టూర్పు ఆపుకుని అక్కడ్నుంచి బయటకొచ్చేసింది.
    
    రెండో అన్నయ్య ఆదినారాయణ గదిలోకి వెళ్ళింది గిరిజ.
    
    అతను గోడవైపు తిరిగి పడుకుని వున్నాడు. అన్నపూర్ణ చెయ్యి అతని వీపుమీదుగా వేసి వుంది.
    
    ముగ్గురు పిల్లలూ నేలమీదపడి దొర్లుతున్నారు.
    
    ఆమెచెయ్యి అతన్ని చుట్టుకున్నమాట నిజమే. ఆమె ఒంటిన వున్న బట్టలు స్థానభ్రంశం పొందివున్న మాట నిజమే. ఆ దృశ్యం చూసి గిరిజకు సిగ్గని పించింది. కానీ, ఆమెకందులో శృంగారం కనిపించలేదు. ఆదినారాయణకు అన్నపూర్ణ మేనమామ కూతురు.
    
    వాళ్ళిద్దరి ముచ్చటలో, భంగిమలో అనురాగంకన్నా అలవాటు ఎక్కువగా కనబడుతోంది. మృదుత్వంకన్నా మొద్దుతనం ఎక్కువగా వుంది. లాలిత్యం కన్నా 'తప్పనిసరి' అధికంగా వుంది.
    
    గిరిజ ముఖం వివర్ణమైంది. అక్కడినుంచి నెమ్మదిగా బయటకు వచ్చింది.
    
    తాను చేస్తోన్న పనిలో సభ్యతలేదని తెలుసు. కాని ఒక్కోసారి సభ్యతను కాంక్ష దిగమ్రింగేస్తోంది.

 Previous Page Next Page