Previous Page Next Page 
ప్లే పేజి 19


    
    "మనం చేసే ప్రామిస్సులు....జర్నలిస్టులకు తెలీదా చెప్పు....జర్నలిస్టుల్ని నేను మేనేజ్ చేస్తాను.... యూ.... డోంట్ వర్రీ....అది కాదు గానీ...అప్పుడెప్పుడో నువ్వు మీ ఊరికి ట్రాన్సఫరడిగావ్ గుర్తుందా..." నవ్వుతూ అడిగాడు హోం మినిస్టర్.
    
    స్వంత ఊరు విశాఖపట్నం, విశాఖపట్నం మెడికల్ కాలేజీలో చదువుతున్న కూతురు అర్పణ గుర్తుకొచ్చారు.
    
    అప్పుడెప్పుడో అడిగిన ట్రాన్స్ ఫర్ హోం మినిస్టర్ ఇప్పుడే ఎందుకు గుర్తుచేస్తున్నాడో ఎ.సి.పి. నిరంజనరావుకి అర్ధమైపోయింది.
    
    "నీకింకో ఆరు నెలల్లో డి.సి.పి. ప్రమోషన్ రావాలి....కదూ..." తీరుబదిగా వెనక్కి చేరబడుతూ అన్నాడు హోం మినిస్టర్.
    
    ఏం మాట్లాడలేదు ఎ.సి.పి. నిరంజనరావు.
    
    కొన్ని క్షణాలు మౌనం.
    
    "జగన్నాయకులు కేస్ ని, ఎందుకు క్లోజ్ చెయ్యాలో, ఏ పొలిటికల్ ప్రెషర్ వెనక ఉందో చెప్తారా...?"
    
    అలా ముక్కుసూటిగా, తన కళ్ళవేపే చూస్తూ అడుగుతున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎ.సి.బి. నిరంజనరావుకి వెంటనే జవాబు చెప్పలేకపోయాడు హోం మినిస్టర్.
    
    నిరంజనరావు అలా అడుగుతాడని ఊహించలేదు హోం మినిష్టర్.
    
    అలా అడిగిన నిరంజనరావు వేపు గుటకలు మింగుతూ చూసాడతను.
    
    "అన్నింటికీ కారణాలు చెప్పకూడదయ్యా..... ఆ కేస్ క్లోజ్ చెయ్యడం వల్ల నాకన్నా, నీకే ఎక్కువ ఉపయోగం....కావలిస్తే, రాత్రి మందేసుకుని కూర్చుని, తీరుబడిగా ఆలోచించు...." నవ్వుతూ అన్నాడు.
    
    "అంటే..."
    
    నిరంజనరావు మాటకి కోపం వచ్చింది హోం మినిస్టర్ కి.
    
    "ఐయామ్ ది హోంమినిష్టర్.... ఇటీజ్ యువర్ య్యూటీ టు ఒబే మై ఆర్డర్స్... దట్సాల్..." అరుస్తున్నట్టుగా అన్నాడు హోంమినిష్టర్.
    
    "వై అండ్ వాట్ ఫర్..." గొంతు పెంచుతూ అడుగుతున్న నిరంజనరావు వేపు అసహనంగా చూసాడు హోం మినిస్టర్.
    
    "విజయవాడలో నీ భార్య ఎందుకు చచ్చిపోయిందో, అలా విశాఖపట్నంలో నీ కూతురు చావకూడదు గనక...." సీట్లోంచి లేచి, సిగరెట్ ప్యాకెట్ అందుకుంటూ అన్నాడు హోంమినిస్టర్ సీరియస్ గా.
    
    ఏం మాట్లాడలేదు నిరంజనరావు - భార్య చావు జ్ఞాపకం రావడం వల్ల కలిగిన ఉద్రేకాన్ని అణచుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.
    
    "నౌ యూ కెన్ గో..." చాంబర్ లోంచి బయటికెళ్తూ అన్నాడు హోం మినిస్టర్.
    
    ఆ చాంబర్ లోంచి గబగబా బయటికొచ్చి, హోం మినిస్టర్ ఎదురుగా నిలబడ్డాడు ఎ.సి.పి. నిరంజనరావు.
    
    ఎందుకో అతని కళ్ళు ఎర్రగా అయిపోయాయి.
    
    "నాకు నా కూతురుకన్నా, నా డ్యూటీ ముఖ్యం..." స్పష్టంగా చెప్పేసి, సెల్యూట్ చేసి, స్ప్రింగ్ లా వెనక్కి తిరిగాడు.
    
    కారిడార్ మీద, టకటకమని, బూట్లు శబ్దం చేసుకుంటూ, మరమనిషిలా వెళ్ళిపోతున్న ఎ.సి.పి. నిరంజనరావు వేపు చికాగ్గా చూశాడు హోంమినిస్టర్.
    
    నిరంజనరావులాంటి వాళ్ళని, ఎలా లొంగదీసుకోవాలో హోం మినిష్టర్ కి బాగా తెలుసు. అందుకే అతను ఆ సమయంలో ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చేశాడు.
    
    అతను తీసుకున్న ఆ నిర్ణయం, వర్తమాన రాష్ట్ర రాజకీయాల్ని, ఎవరూ ఊహించని మరో మలుపు తిప్పుతుందనే విషయం అతనికి తెలీదు!
    
    సరిగ్గా అదే సమయంలో-
    
                                                    *    *    *    *    *
    
    వికారాబాద్, రైల్వేస్టేషన్ కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న, ఓ లాండ్రీ షాపులో ఉన్నాడు సూర్యవంశీ అప్పటికే అతను బాగా అలిసిపోయాడు. మార్చురీలో, తనకు దొరికిన 'ఎస్' గుర్తున్న బనీన్ విషయమై, ఊళ్ళోఉన్న పది లాండ్రీల్లో ఎంక్వయిరీ చేసాడు.
    
    ఎక్కడా తనకు అనుకూలమైన సమాచారం దొరకలేదు.
    
    ఆఖరు ప్రయత్నంగా ఆ లాండ్రీ షాపు కొచ్చాడు.
    
    హీరో హోండా పార్క్ చేసి, లోనకొస్తూ, చేతిలో ఐరెన్ బాక్స్ తో తనవేపే చూస్తున్న వ్యక్తి వేపు నడిచాడు.
    
    సూర్యవంశీ ఆకారం, నడక చూసి, ఆ వ్యక్తి ఎందుకో కంగారు పడ్డాడు.
    
    "ఓనర్ వి నువ్వేనా..." ఆ ప్రశ్నకు నోటితో జవాబు చెప్పకుండా లోపలి గదివేపు చేతితో సంజ్ఞ చేసాడు.
    
    అతని వేపు ఎగాదిగా చూసి, లోపలికి నడిచాడు సూర్యవంశీ.
    
    లోపల గదిలో వాలుకుర్చీలో, నలభై ఏళ్ళ వ్యక్తి కూర్చున్నాడు.
    
    తనెవరో, తనకేం కావాలో చెప్పాడు సూర్యవంశీ సూర్యవంశీ చెప్పిందంతా తాపీగా విన్నాడు ఆ వ్యక్తి-
    
    "మా దగ్గర బట్టలు వేసిన వాళ్ళు, ఎవరు రౌడీలో, ఎవరు ఖూనీకోర్లో ఎలా తెలుస్తుంది సార్" నెమ్మదిగా అన్నాడు ఆ లాండ్రీ షాపు ఓనర్.
    
    "ఆ వ్యక్తికి పళ్ళ మధ్య స్టీల్ రాడ్ మెరుస్తుంటుంది....గుర్తుచేసుకో..." మళ్ళీ చెప్పాడు సూర్యవంశీ.
    
    "స్టీల్ రాడ్ మెరిసినా, బంగారురాడ్ మెరిసినా.... మాకెందుకు సార్...."
    
    చాలామందిలాగే, అతనూ అదే జవాబు చెప్పాడు.
    
    "పోనీ.... బట్టల మీద.... నువ్వు ఎలాంటి గుర్తు వేస్తావ్....
    
    "అంటే..."
    
    విడమరిచి స్పష్టంగా చెప్పాడు సూర్యవంశీ.
    
    "ఎవరు పేరు బట్టి వాళ్ళదేస్తాను..."
    
    " 'ఎస్' మార్కును....ఎప్పుడైనా, ఎవరికైనా వేసావా...." సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు సూర్యవంశీ.
    
    "ఎస్...." మార్కు వేసే ఉంటాను..." ఆ జవాబుకి, సూర్యవంశీ కళ్ళు ఉత్సాహంగా మెరిసాయి.
    
    "ఎస్... అంటే... ఆ పేర్లు చెప్పగలవా..."
    
    "ఈ లాండ్రీ పెట్టిన పదేళ్ళలో ఎంతో మంది బట్టలకి 'ఎస్' మార్కు పెట్టాను.... ఎంత మంది పేర్లని చెప్పను...?"
    
    "అంత మంది పేర్లు నాకక్కర్లేదు.....గత పది, పదిహేను రోజుల్లో....నీ దగ్గర కొచ్చిన వ్యక్తులు నాక్కావాలి..."
    
    "కష్టం.... ఆ వ్యక్తుల పేర్లు చెప్తే, పోలీసులు వాళ్ళింటికెళ్తే, నా బిజినెస్ దెబ్బతింటుంది బాబూ....వదిలెయ్యండి ...." ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు లాండ్రీ ఓనర్.
    
    వాడిని ఒప్పించడానికి, రెండు మూడు రకాలుగా ట్రై చేసాడు సూర్యవంశీ. బెదిరించడమో, లాగి ఒక్కటిచ్చుకోవడమో జరగనిదే పని కాదన్న నిర్ణయానికొచ్చేసాడు సూర్యవంశీ.

 Previous Page Next Page